Brahmamudi May 23rd Episode: ఇందూ మైండ్ గేమ్.. కంపెనీకి సీఈవోగా రాజ్, రేఖకి ముచ్చెమటలు
Photo Courtesy: JioHotstar
ఇంట్లో వస్తువులు పగులగొట్టి పెద్ద గొడవ చేస్తాడు రాజ్. దాంతో పరిగెత్తుకుంటూ వచ్చిన రేఖ.. ఏం జరిగింది? ఎందుకింత గొడవ చేస్తున్నావని మండిపడుతుంది. నన్ను అల్లుడిలాగా చూసుకోవడం లేదు, అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. నేను, ఇందూ స్టోర్ రూమ్‌లో ఏదో మూలన పడుకుంటున్నాం.. మాకు స్పెషల్ గది కావాలని అడుగుతాడు. దాంతో భ్రమరాంబని రూమ్ ఖాళీ చేసి ఇచ్చేయమని చెబుతుంది రేఖ. అయితే భ్రమరాంబ మాత్రం నేను రూమ్ ఖాళీ చేసి నేల మీద పడుకోలేను.. మోకాలి నొప్పులు అంటుంది. అయితే స్వాతి రూమ్ ఇవ్వమని రేఖ చెప్పగా.. దానికి ఎగ్జామ్స్ కదా? సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయని అంటుంది. దాంతో ఐశ్వర్యని రూమ్ ఖాళీ చేయమని చెబుతుంది రేఖ. నేను చేయనని ఐశ్వర్య అనగా.. అయితే ఇందూకి నువ్వేం చేశావో చెబుతానని రాజ్ బ్లాక్‌మెయిల్ చేయడంతో ఐశ్వర్య సరేనని అంటుంది.
ఆ రాజ్ గాడు ఏం అడిగితే అది ఎందుకిస్తున్నావని రేఖపై భ్రమరాంబ, భూషణ్ మండిపడతారు. వాడు సంతకం పెడితేనే ఈ కోట్ల ఆస్తి మన చేతికి వస్తుంది. అలాంటప్పుడు వాడిని మనదారిలోకి తెచ్చుకోవాలి కదా అని చెబుతుంది రేఖ. ఐశ్వర్య తన రూమ్ ఖాళీ చేస్తుండగా ఇందూ వచ్చి ఇక్కడే ఉండమని అంటుంది. నువ్వు, నీ మొగుడు నాటకాలాడి నన్ను రూమ్‌లో నుంచి గెంటేశారని నీ మీద రివేంజ్ తీర్చుకుంటానని వార్నింగ్ ఇస్తుంది ఐశ్వర్య. స్వాతి రూమ్‌లోకి వెళ్లిన ఐశ్వర్య అక్కడ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. అయినప్పటికీ స్వాతి సర్దుకుంటుంది. నందూ తీసుకొచ్చిన అమ్మాయిలు నచ్చకపోవడంతో అందరినీ రిజెక్ట్ చేస్తాడు వెంకీ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 23వ తేదీ ఎపిసోడ్ 1040లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఐశ్వర్య గదిలో బెడ్ మీద ఎగిరిదూకిన రాజ్.. ఈ బెడ్ మీద ఎంత సుఖంగా ఉందోనని ఇందూతో అంటాడు. బురదలో పంది దొర్లినట్లుగా దొరుకుతున్నావని చిరాకు పడుతుంది ఇందూ. ఇంతకుముందు ఎప్పుడు బెడ్ మీద పడుకోలేదా అని ఇందూ అడగ్గా.. పడుకున్నాను కానీ మా ఇంట్లో ఉన్న పరుపులు పేరుకి మాత్రమే. కానీ డబ్బున్న వాళ్ల పరుపులు చూడు పడుకుంటే స్వర్గంలో ఉన్నట్లే ఉంటుంది. త్వరగా వస్తే కలిసి పడుకుందామని రాజ్ అనగా.. ఇందూ చిరాకు పడుతుంది. అద్దె మొగుడిలా గుర్తుంది కదా? మరి నిజమైన మొగుడిలా ఒకే బెడ్ మీద పడుకుందామని అంటున్నావేంటీ? అని మండిపడుతుంది ఇందూ.
అద్దె మొగుడికి ఒకే మంచం పాలసీ ఉండదా? అని రాజ్ అడగ్గా.. ఇందూ సీరియస్ అవుతుంది. నువ్వు ఈ బెడ్ మీద పడుకోవడానికి వీల్లేదు.. సోఫాలో పడుకో, లేకపోతే నేల మీద పడుకోమని చెబుతుంది ఇందూ. అసలు ఈ బెడ్ ఎలా వచ్చింది? నేను చేసిన పోరాటం వల్ల వచ్చింది. చీమలు పెట్టిన పుట్టల్ని పాములు ఆక్రమించుకున్నట్లు నా రూమ్‌ని కబ్జా చేస్తావా అని మండిపడతాడు రాజ్. అసలు నీకు ఈ అద్దె మొగుడు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నేను నీకు ఈ ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వు ఉద్యమాలు చేసేవాడివా అని అడుగుతుంది ఇందూ. ఆడపిల్లగా నా జాగ్రత్తలో నేనుండాలి. అయినా స్వార్ధం అనేది నీ దగ్గరే నేర్చుకున్నాను. కిడ్నాప్ చేసినప్పుడు నన్ను బాగా చూసుకుంటానని చెప్పి, డబ్బులు రాగానే టెంపుల్‌లో నన్ను వదిలేశావు కదా అని గుర్తుచేస్తుంది ఇందూ.
నేను ఈ బెడ్ మీద పడుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటీ? అని అడుగుతాడు రాజ్. మొన్న చెప్పిన ఉరుములు, మెరుపులు స్టోరీ నిజం కాదని గ్యారెంటీ ఏంటీ? అంటూ దిండు విసిరేస్తుంది. నేను కూడా ఫ్యూచర్‌లో డబ్బులు బాగా సంపాదించి దీని బాబులాంటి బెడ్ కొంటానని విసుక్కుంటాడు రాజ్. సోఫా మీద నిద్రపట్టకపోవడంతో బెడ్ మీద స్వాతి దగ్గర పడుకుంటుంది ఐశ్వర్య. స్వాతి నిద్రలో చేతులు, కాళ్లు వేయడంతో చిరాకు పడుతుంది ఐశ్వర్య. ఉదయాన్నే లేచి చూసేసరికి స్వాతి కాలు తన ముఖంపై ఉండటంతో ఐశ్వర్య మండిపడుతుంది.
నేను నీ మీద కాలు వేయలేదు.. నువ్వే నా కాలి దగ్గరికి వచ్చావని చెబుతుంది స్వాతి. నువ్వు రాత్రి చేసిన డిస్ట్రబెన్స్ వల్ల అలా పడుకోవాల్సి వచ్చిందని అంటుంది ఐశ్వర్య. నువ్వు సోఫాలో పడుకున్నావు కదా? నా బెడ్ మీదకి ఎప్పుడొచ్చావని అడుగుతుంది స్వాతి. సోఫాలో కంఫర్ట్‌గా లేదని ఇక్కడికొచ్చి పడుకున్నానని చెబుతుంది ఐశ్వర్య. కంఫర్ట్ కావాలంటే బిల్డప్ కొట్టడం ఎందుకు? కాంప్రమైజ్ అవ్వాలని చెబుతుంది స్వాతి. నా ఇంట్లో నాకే ప్రశాంతత లేకుండా పోయిందని బాధపడుతుంది ఐశ్వర్య.
ఉదయాన్నే లేచేసరికి రాజ్ తనకు దగ్గర ఉండటంతో ఉలిక్కిపడుతుంది ఇందూ. నీ మనసులో ఏదో ఉద్దేశ్యం ఉందని మండిపడుతుంది. నేను డబ్బు మనిషిని మాత్రమే .. అంతే తప్పించి అమ్మాయి అందానికి మెల్ట్ అవ్వడం, టెంప్ట్ అవ్వడం ఉండదని చెబుతాడు రాజ్. నిన్న మనం అనుకున్న దాని గురించి ఆలోచించావా అని ఫైర్ అవుతాడు. ఇప్పుడు నేను సీఈవో పోస్ట్‌కి పోటీ చేస్తే మా రేఖ ఆంటీకి అనుమానం వస్తుంది. తనకు తెలియకుండానే తన వెనుక నేను ఏదో చేస్తున్నానని డౌట్ పడుతుంది. అందుకే నేను పోటీ చేయను, నా బదులు నువ్వు పోటీ చేస్తావని ఇందూ చెప్పడంతో రాజ్ సంబరపడిపోతాడు.
నేను సీఈవోని అయితే చెక్స్ మీద సంతకాలు పెట్టే పవర్ వస్తుందా అని అడుగుతాడు రాజ్. దానికి నువ్వే సైన్ చేయాలి, దానితో పాటు బ్యాంక్‌లో డబ్బులు తీసుకునే పవర్ కూడా వస్తుంది, అసలు కంపెనీలో ఏ ఫైల్ కదలాలన్నా, ఏ ఎంప్లాయ్ ఏ వర్క్ చేయాలన్నా నీ ఇష్టం అని చెబుతుంది ఇందూ. దాంతో సంబరపడిన రాజ్.. ఆఫీస్‌లో ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నొక్కేయొచ్చని అనుకుంటాడు. నువ్వు చెబుతున్నది బాగుంది సీఈవోగా నేను పోటీ చేస్తే నాకు ఓటు ఎవరు వేస్తారు? అని అడుగుతాడు రాజ్. బోర్డ్ మెంబర్స్‌కి కాల్ చేసి వాళ్లని నా వైపుకు తిప్పుకుంటానని అంటాడు. దాంతో అభిలాష్ అనే వ్యక్తికి ఇందూ ఫోన్ చేసి ఇస్తుంది.
మీ రేఖ మేడం సీఈవోగా సరిగా పనిచేయడం లేదు. అందుకే నేను సీఈవోగా ఎన్నికల్లో పోటీ చేస్తాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు లెక్కలేనంత డబ్బులు ఇచ్చి మీ లైఫ్ సెటిల్ చేస్తానని ఆఫర్ ఇస్తాడు రాజ్. నేను రేఖ మేడం మనిషిని అలాంటిది నువ్వు నాకే ఫోన్ చేసి మా మేడం గురించి వాగుతావా అని అభిలాష్ సీరియస్ అవుతాడు. అసలు నువ్వు సీఈవోగా పోటీ చేయడం ఏంటీ? ఈ విషయం రేఖ మేడంకి తెలియదనుకుంటా అని చెబుతుండగా రాజ్‌తో ఫోన్ కట్ చేయిస్తుంది ఇందూ. వీడు రేఖ ఆంటీకి పక్కా అభిమానిలా ఉన్నాడు.. మనం చేసింది ఆమెకు చెప్పేస్తాడేమోనని రాజ్ భయపడతాడు. తను చెప్పకముందే నేనే వెళ్లి చెప్పేస్తానని అంటుంది రేఖ.
మీ వెనుక గూడుపుఠానీ జరుగుతోంది. రాజ్ మీకు పోటీగా సీఈవోగా దిగుతున్నాడని మా రేఖ ఆంటీతో చెబుతానని అంటుంది ఇందూ. మీ ఇంటి గొడవల్లో, కంపెనీ విషయాల్లో నన్నెందుకు విసిగిస్తున్నావని రాజ్ సీరియస్ అవుతాడు. ఇదంతా నా మాస్టర్ ప్లాన్.. ఏం జరుగుతుందో నువ్వు చూస్తూ ఉండమని చెబుతుంది ఇందూ. వెంటనే రేఖ దగ్గరికి వెళ్లి మీ వెనకాల చాలా కుట్రలు జరుగుతున్నాయి. నేను ముందు నుంచి ఆ రాజ్ గురించి మీకు చెబుతూనే ఉన్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను. వాడు ఇప్పుడు అన్నంత పనిచేస్తున్నాడని ఇందూ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది.
ఎంప్లాయిస్‌కి వాడే శాలరీలు ఇస్తాడని మీరు చెప్పారు కదా? ఇప్పుడు వాడు శాలరీలు ఇచ్చేసి బోర్డ్ మెంబర్స్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి సీఈవో అవ్వాలని అనుకుంటున్నాడు. అందుకే సీఈవోగా పోటీ చేయాలని చూస్తున్నాడని చెబుతుంది ఇందూ. వాడిని ఇంట్లోంచి తరిమేస్తా, నా జీవితంలో నుంచి లేకుండా చేస్తానని చెప్పారు కదా? కానీ మీరేం చేయకుండా ఇలా సైలెంట్‌గా ఉంటున్నారు. వాడేమో మిమ్మల్ని సీఈవో పోస్ట్ నుంచి తప్పించి వాడు కూర్చోవాలని చూస్తున్నాడని అంటుంది ఇందూ. ఈ మాటలు వినగానే రేఖ నవ్వుకుంటుంది. వాడు ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ వాడికి సపోర్ట్ చేయరు.. అందరూ నాకే సపోర్ట్ చేస్తారని చెబుతుంది రేఖ.
వాడు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు.. ముందు నన్ను కిడ్నాప్ చేసి మీ దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు, తర్వాత నన్ను బెదిరించి పెళ్లి చేసుకుని ఈ ఇంట్లోకి వచ్చాడు. మళ్లీ బెదిరించి నన్ను ఆఫీస్‌కి తీసుకొచ్చాడు. ఆఫీస్ వరకు వచ్చిన వాడు.. సీఈవో పోస్ట్‌లో కూర్చోలేడని గ్యారెంటీ ఏంటీ? అని ఇందూ ప్రశ్నించడంతో రేఖ షాక్ అవుతుంది. వాడు బోర్డ్ మెంబర్స్‌ని మేనిప్యూలేట్ చేసి వాడి వైపు తిప్పుకుంటాడేమోనని అనిపిస్తుందని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications