Brahmamudi May 2nd Episode : కావ్య యాక్షన్ మొదలు.. యామినికి షాక్.. లగేజ్‌తో బయటికొచ్చేసిన రాజ్
నువ్వేం చేసినా సరే రాజ్‌ను నా సొంతం చేసుకుంటానని యామిని సవాల్ విసరగా.. చూసుకుందామంటూ కావ్య కూడా ఛాలెంజ్ చేస్తుంది. కళ్యాణ్ బైక్‌పై వెళ్తుండగా ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో అతను కిందపడిపోతాడు. జాగ్రత్త బ్రదర్ చూసుకో అని కారులోంచి ఓ గొంతు వినపడటంతో కళ్యాణ్ సారీ చెబుతూ అటు వైపు చూడగా డ్రైవింగ్ సీట్‌లో రాజ్ కనిపిస్తాడు. దాంతో షాకైన కళ్యాణ్ అన్నయ్యని పిలుస్తూ పరిగెడుతుండగా కానిస్టేబుల్ ఆపుతాడు. డాక్యుమెంట్స్ చూపించే సరికి ఆలస్యం కావడంతో కళ్యాణ్ బాధపడతాడు.
అన్నయ్య బతికే ఉన్నాడని దుగ్గిరాల కుటుంబానికి చెప్పగా అందరూ షాక్ అవుతారు. ఆ విషయం మాకెప్పుడో తెలుసని అపర్ణ, సుభాష్, అప్పూలు చెప్పడంతో అందరూ బాధపడతారు. ఇంతలో కావ్య రావడంతో ఆమెతోనూ ఈ విషయం చెబుతాడు కళ్యాణ్. నేనెప్పుడో చెప్పానని, కానీ మీరే నమ్మలేదని అంటుంది కావ్య. ఆయనకి గతం గుర్తులేదని.. అది గుర్తుచేయాలని చూస్తే ఆయన ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. త్వరలోనే ఆయనని క్షేమంగా తీసుకొస్తానని , కానీ ఈ విషయం రుద్రాణి - రాహుల్‌కి చెప్పొద్దని అంటుంది కావ్య. ఇంతలో తల్లీకొడుకులిద్దరూ రావడంతో అంతా ఉలిక్కిపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 2వ తేదీ ఎపిసోడ్ 711లో ఏం జరిగిందంటే?

అర్ధరాత్రి ఓ సంచితో వచ్చిన యామినిని చూసి రాజ్ చిరాకు పడతాడు. నీ చేతిలో ఉన్నది ఏంటీ అని అడగ్గా.. మన పెళ్లి పత్రికలు అని చెబుతుంది యామిని. ఆ మాట వినగానే రాజ్ షాక్ అవుతాడు. వెడ్డింగ్ కార్డ్ తీసి చూపిస్తుంది యామిని . కార్డు చాలా అందంగా ఉంది కదా? మన ఫ్యూచర్ కూడా ఈ పెళ్లి పత్రిక లాగా అందంగా, ఆనందంగా ఉంటుంది అని చెబుతుంది యామిని. ఆ మాటలతో రాజ్ షాక్‌లో ఉండి ఏం మాట్లాడలేకపోతాడు. కొన్ని రోజులుగా నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందని, నాతో మాట్లాడటం లేదు.. నాతో కలిసి తిరగడం కూడా మానేశావని అంటుంది . నాతో చెప్పకుండానే ఒంటరిగా వెళ్లిపోతున్నావ్.. మన పెళ్లికి ముహూర్తం పెట్టే సమయంలో పంతులు గారు వస్తే వెళ్లిపోయావని చెబుతుంది.
పెళ్లి పత్రికలు తీసుకొద్దామని అడిగితే పని ఉందని చెప్పావని అంటుంది. ఇప్పుడు ఆ పెళ్లి పత్రికను చూడగానే నీ ముఖంలో ఆనందం కూడా మాయమైపోయిందని అంటుంది. ఇలానే ఉంటే రేపు పెళ్లి పీటలపై కూర్చోవడానికి కూడా టైం లేదని అంటావేమోనని భయం వేస్తోందని చెబుతుంది యామిని. నీ మనసులో ఏముందో, మన పెళ్లి గురించి నువ్వు ఏమనుకుంటున్నావో నాకు తెలియదని అంటుంది. కానీ నువ్వే నా జీవితం.. నువ్వు లేకుంటే ఈ జీవితమే నాకు అక్కర్లేదని చెప్పి వెళ్లిపోతుంది యామిని.
అప్పూ, కళ్యాణ్, స్వప్న, కావ్యలతో అపర్ణ మాట్లాడుతుంటుంది. ఇంట్లో వాళ్లకి రాజ్ గురించి చెప్పి వాళ్లని ఆపగలిగావని మెచ్చుకుంటుంది. రుద్రాణి గారికి ఈ విషయం తెలిస్తే ఏం గొడవ చేస్తుందా అని టెన్షన్‌గా ఉందని అంటుంది అప్పూ. ఇలా ఎన్ని రోజులని రాజ్ గురించి ఎదురుచూస్తాం.. వాడికి ఎప్పుడు గతం గుర్తొస్తుంది, మనం ఊరుకున్నామని , ఆ యామిని ఊరుకుంటుందా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. అన్నయ్యకి గతం గుర్తొచ్చేలా మనం ఏదైనా ప్రయత్నం చేయడం మంచిదని అనిపిస్తోందని అంటాడు కళ్యాణ్.
ఎప్పుడు ఆయనకి గతం గుర్తొస్తుందా? ఎప్పుడు ఆయన్ని ఇంటికి తీసుకొద్దామా? అని ఎదురుచూస్తున్నానని అంటుంది కావ్య. కానీ ఏం చేసినా ఆయన ప్రాణానికి ప్రమాదం రాకూడదనే ఆగిపోతున్నానని బాధపడుతుంది. వాడంతటే వాడే గతం గుర్తు చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కానీ వాడి చుట్టూ అలాంటి పరిస్ధితులే మనం తీసుకొస్తే వాడికి గతం గుర్తొస్తుందని అంటుంది అపర్ణ. గతంలో మీ మధ్య జరిగిన సంఘటనలను వాడి కళ్ల ముందు కనిపించేలా చేస్తే వాడికి ఏదైనా గుర్తొచ్చే అవకాశం ఉంది కదా అని చెబుతుంది అపర్ణ.
అత్తయ్య చెప్పిన ఐడియా చాలా బాగుందని స్వప్న కూడా సరేనంటుంది. నువ్వు చెప్పినట్లు ఇంకా ఆలోచిస్తే ఈలోపు రాజ్‌ని యామిని పెళ్లి పీటల మీద కూర్చొబెడుతుందని అంటుంది స్వప్న. ఒకవేళ ఆపితే రాజ్ ముందు నువ్వు నిజం చెప్పగలవా అని ప్రశ్నిస్తుంది. అలాంటప్పుడు ఆంటీ చెప్పిన ఐడియాని ఫాలో అవ్వమని చెబుతుంది. పెద్ద సంఘటన ఏదైనా రాజ్‌కి గుర్తొచ్చేలా చేయాలని అనుకుంటారు. ఆయనని యామిని ఫ్యామిలీకి దూరం చేసి ఎక్కువ సమయం మనతో గడిపేలా చేయాలని కావ్య చెబుతుంది.
ఆయన ఫ్రెండ్ సందీప్ వివాహ వార్షికోత్సవం ఉందని రిసార్ట్‌లో పార్టీ ఇస్తున్నారని రెండు రోజులు మనం అక్కడే ఉంటామని చెబుతుంది కావ్య. ఆయనని అక్కడికి తీసుకురాగలిగితే మనకు కావాల్సినంత సమయం దొరుకుతుందని అంటుంది. రాజ్ రాను అని చెప్పినా సరే నువ్వు బలవంతంగా ఒప్పించమని కావ్యతో అంటుంది అపర్ణ. పెళ్లి పత్రిక చూసుకుంటూ బాధపడుతుంటాడు రాజ్. కళావతితో గడిపినప్పుడు ఉన్న ఆనందం .. యామిని దగ్గర దొరకడం లేదని అనుకుంటాడు. కావ్య మనసులోనూ అదే ఉద్దేశం ఉందేమో తెలుసుకుని వెంటనే పెళ్లి ఆపేయాలని అనుకుంటాడు.
రాజ్‌కి ఫోన్ చేయడానికి కావ్య భయపడుతుండగా.. సరిగ్గా అప్పుడే రాజ్ ఫోన్ చేస్తాడు. మా ఫ్రెండ్ సందీప్ పెళ్లికి ఫ్రెండ్స్ అంతా గెట్ టూ గెదర్ అవుతున్నామని చాలా బిజీగా ఉన్నానని చెబుతుంది కావ్య. మీరు ముఖ్యమైన ఫ్రెండ్‌ని మరిచిపోయారని రాజ్ చెప్పగా.. అంత ముఖ్యమైన ఫ్రెండ్ ఎవరని అడుగుతుంది కావ్య. నేనే ఆ ఫ్రెండ్‌నని అంటాడు రాజ్. మీరు పెద్దొళ్లు మా లాంటి చిన్నవాళ్ల పార్టీలకు ఎందుకొస్తారని అంటుంది. నా పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని గెట్ టూ గెదర్‌కి వస్తానని చెబుతాడు రాజ్. ప్లాన్ వర్కవుట్ కావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఉదయాన్నే పెళ్లి పనుల గురించి తల్లిదండ్రులతో మాట్లాడుతుంటుంది యామిని. ఇంతలో రాజ్ లగేజీ తీసుకుని రావడంతో యామిని షాకై ప్రశ్నిస్తుంది. మనిద్దరం వెళ్లి పెళ్లి పత్రికలు పంచాలని నీతో ముందే చెప్పాను కదా అని అంటుంది. మా ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ ఉందని దానికి వెళ్తున్నాని రాజ్ చెప్పడంతో నాకు తెలియకుండా నీ ఫ్రెండ్స్ ఎవరని యామిని ప్రశ్నిస్తుంది. మన పెళ్లి కంటే నీకు అదే ఇంపార్టెంటా? అని యామిని ప్రశ్నించగా .. నువ్వు నన్ను అర్ధం చేసుకుంటావని అనుకుంటున్నానని అంటుంది.
రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ ఫ్రెండ్ ఎవరు? అని వైదేహి అడగ్గా దీనంతటికి కారణం కావ్యేనని చెబుతుంది యామిని. తన భర్తను దక్కించుకోవాలని కావ్య ఈ ప్లాన్ వేసిందని అంటుంది. కావ్య ఇంత త్వరగా గేమ్ మొదలుపెడుతుందని అనుకోలేదని దానికి గట్టిగా ఇస్తానని కావ్యకి ఫోన్ చేస్తుంది యామిని. నేను ప్రేమించినవాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అని మండిపడుతుంది . నిన్ను చీ కొట్టి ఆయనే నన్ను పెళ్లి చేసుకున్నాడని చెబుతుంది కావ్య. రాజ్‌ని దక్కించుకోవడానికి ఏమైనా చేస్తానని సవాల్ చేస్తుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











