Brahmamudi May 30th Episode: ఇందూ- రాజ్‌ల శోభనానికి రేఖ అడ్డుగీత.. సమస్యల సుడిగుండంలో రాజ్ తమ్ముడు
Photo Courtesy: JioHotstar
ఇందూ మెడలో కావ్య ఇచ్చిన చైన్ లేకపోవడంతో ఏం జరిగిందని అడుగుతుంది అపర్ణ. పైన గదిలో ఉందని అబద్ధం చెప్పి వెళ్లిపోతుంది ఇందూ. ఆ చైన్.. ఇందూకి వాళ్లమ్మ జ్ఞాపకంగా మిగిలిన ఏకైక జ్ఞాపకమని అపర్ణ చెప్పడంతో రాజ్ బాధపడతాడు. తన తల్లి ఆచూకీ చెప్పమని ఆంటోనీని బతిమలాడతాడు లక్కీ. కానీ ఆంటోనీ పీకలదాకా తాగి పడిపోతాడు. ఇంతలో లక్కీకి రాజ్ ఫోన్ చేసి అర్జెంట్‌గా ఇంటికి రమ్మని చెబుతాడు. ఈ బైక్ తాకట్టు పెట్టి ఇందూ చైన్‌ని విడిపించి తీసుకొద్దామని చెబుతాడు రాజ్.
డబ్బుల కోసం రాకేష్ ఫోన్ చేయడంతో దానిని తీసుకెళ్లి ఇందూకి ఇస్తుంది ఐశ్వర్య. మీ మాట మీద గౌరవంతో ఇన్నాళ్లూ వెయిట్ చేశాను. ఇంకో రెండ్రోజుల్లో నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మీ పరువు తీసేస్తానని రాకేష్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో డబ్బులు ఇస్తానని మాటిస్తుంది ఇందూ. ఐశ్వర్య చేసిన గొడవతో బాధపడుతున్న ఇందూ దగ్గరికి రాజ్ వచ్చి నెక్లెస్ తిరిగి ఇవ్వడంతో ఆమె చాలా సంతోషిస్తుంది. ఈ చైన్ నీ సెంటిమెంట్ అని తెలియక తీసుకున్నాను.. అన్ని డబ్బులు కలిపి ఒకేసారి ఇవ్వమని చెబుతాడు రాజ్. ఇంటర్వ్యూకి వెళ్లిన వెంకీకి అన్ని చోట్ల తిరస్కరణ ఎదురుకావడంతో బాధపడుతూ ఇంటికొస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 30వ తేదీ ఎపిసోడ్ 1046లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
చలపతి ఇంటికి వచ్చిన అప్పులవాడికి వడ్డీ కడతాడు. అయితే వడ్డీ వరకు ఓకే గానీ, నాకు అసలు కూడా ఇవ్వమని అడగటంతో అంతా షాక్ అవుతారు. ప్రతినెలా వడ్డీ టైంకి కడుతున్నాను.. ఇప్పటికిప్పుడు 5 లక్షలు తెచ్చివ్వమంటే ఎక్కడి నుంచి తీసుకురాను అంటాడు చలపతి. ఇన్నాళ్లూ కట్టారు.. ఇకపై కట్టడానికి మీ వాడికి ఉద్యోగం పోయిందని అంటాడు వడ్డీ వ్యాపారి. ఉద్యోగం లేనప్పుడు మీ దగ్గర డబ్బులు ఉండటం మంచిది కాదు, నా డబ్బులు నాకు ఇస్తే వెళ్లిపోతానని చెబుతాడు. ఇన్నేళ్ల నుంచి చూస్తున్నారు, ఎవరు ఎలాంటి వారో తెలియదా అని అంటుంది లక్ష్మీ. ఇప్పుడు మా పరిస్ధితి బాలేదు కొన్నిరోజులు ఓపిక పట్టమని అడుగుతాడు చలపతి.
నీ తాహతుకు మించి వాడిని చదివించడం అవసరమా? అని నేను అప్పుడే చెప్పాను. డబ్బు వల్ల వాడి జీవితం ఆగిపోకూడదని అప్పు చేసి మరి చదివించావు, ఇప్పుడేం వెలగబెడుతున్నాడు. ఉద్యోగం పోయి ఖాళీగా కూర్చొన్నాడని నానామాటలు అంటాడు వడ్డీ వ్యాపారి. నా డబ్బులు నాకు ఇవ్వమని వడ్డీ వ్యాపారి తేల్చేయడంతో 3 లక్షల రూపాయలు తెచ్చిస్తాడు చలపతి. నాకు ఈరోజు సాయంత్రానికల్లా మొత్తం డబ్బులు కావాలని డెడ్‌లైన్ పెడతాడు వడ్డీ వ్యాపారి. అయితే చలపతి బతిమలాడటంతో కొన్నిరోజులు సమయం ఇస్తాడు. మీరు నాకు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇవ్వకుండా ఊరు వదిలి పారిపోయినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు ఎక్కడున్నా సరే పట్టుకుంటానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు వడ్డీ వ్యాపారి. ఇదంతా నా వల్లే జరిగిందని వెంకీ బాధపడతాడు. వాళ్ల దగ్గర అప్పు తీసుకోవడమే కాదు, వాళ్లు ఇచ్చిన అప్పు కట్టనప్పుడు కూడా వాళ్ల మాటల్ని తీసుకోవాలని చెబుతాడు చలపతి. ఈరోజు కాకపోతే రేపైనా నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండమని అంటాడు.
ఇందూ- రాజ్‌ల శోభనానికి ముహూర్తం పెట్టిస్తారు అపర్ణ- సుభాష్. ఇదంతా చూసిన రేఖ.. పంతులుగారు ఎందుకొచ్చారు అని అడుగుతుంది. ఇందూ- రాజ్‌లకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఫస్ట్ నైట్ ఏంటీ? అని ఇందూ అడగ్గా.. నువ్వేందుకు కంగారు పడుతున్నావని అడుగుతాడు శేషం. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ జరిపించడం అవసరమా? అని రేఖ మండిపడుతుంది. పెళ్లయి ఇన్నాళ్లు అయ్యింది, జరగాల్సిన అచ్చట ముచ్చట జరగాలి కదా అందుకే పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించాను. ఈరోజు రాత్రి వీళ్లకి మొదటి రాత్రి అని చెబుతుంది అపర్ణ. ఇదంతా విని రాజ్ సంబరపడిపోతాడు.
నీకు, ఇందూకి ఫస్ట్ నైట్ చేస్తున్నారు, ముహూర్తం కూడా పెట్టించారని శేషం చెప్పడంతో రాజ్ ఆనందిస్తాడు. దాంతో ఇందూ కాలు తొక్కుతుంది. ఇప్పుడు అంత అర్జెంట్‌గా ఫస్ట్ నైట్ చేయాల్సిన అవసరం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది రేఖ. పెళ్లయి ఇన్నిరోజులు అవుతోంది.. అబ్బాయి అత్తగారింటికి వచ్చి ఎన్ని రోజులు అవుతోందని మండిపడుతుంది అపర్ణ. అసలు నీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటీ? మొన్న కూడా ఇద్దరూ ఒకే రూమ్‌లో ఉండకూడదని చేశావట, కొత్తగా పెళ్లయిన వాళ్లని విడదీయాలని చూస్తున్నావా? వాళ్లు కలిసుండటం నీకు ఇష్టం లేదా? అని సుభాష్ మండిపడతాడు. నేనెందుకు అలా కోరుకుంటానని రేఖ ఫైర్ అవుతుంది.
తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం జరుగుతుందని తేల్చేస్తుంది అపర్ణ. రేఖ సీరియస్ అవ్వబోతుండగా ఇంతకుముందు నీ చూపులతో, మాటలతో భయపెట్టావు కానీ ఇప్పుడు అవన్నీ నడవవు అని అంటాడు రాజ్. ఇప్పుడు ఈ ఇంటికి ఈరాజ్ గాడు వచ్చాడు, వాడి మనవడు వచ్చాడు అని అనడంతో శేషం విజిల్స్ వేస్తాడు. మీరిద్దరూ వెళ్లి పూజకు రెడీ అవ్వమని ఇందూ, రాజ్‌లకు చెబుతుంది అపర్ణ. ఖచ్చితంగా రెడీ అవ్వాలా అని ఇందూ బాధపడుతుంది. స్వాతి, ఐశ్వర్యలను పూజకి ఏర్పాట్లు చేయమని అపర్ణ చెబుతుంది. తన ప్లాన్ సక్సెస్ కావడంతో భ్రమరాంబ, శేషం సంబరపడిపోతారు. ఈ రేఖ కార్యక్రమం జరగనిస్తుందా అని శేషం అడగ్గా.. అదేమైనా ప్లాన్ చేస్తే మనం తిప్పికొడదామని అంటుంది భ్రమరాంబ. వాళ్ల ఫస్ట్ నైట్ జరగకుండా ఎలా ఆపుతానో చూడమని అంటుంది రేఖ. నువ్వేం చేసినా దానిని నేను ఆపుతానని మనసులో అనుకుంటుంది భ్రమరాంబ.
చలపతి, లక్ష్మీ, వెంకీలు భోజనం చేస్తుండగా.. వడ్డీ వ్యాపారి అన్న మాటలు గుర్తొచ్చి వెంకీ బాధపడతాడు. అది గమనించిన చలపతి ఉన్న మూడు లక్షలు పోయాయి, ఆ శంకర్‌కి 2 లక్షలు ఎలా కట్టాలి? ఈఎంఐలు ఎలా కట్టాలి? ఇల్లు ఎలా గడవాలి? అని ఆలోచిస్తున్నావా? నాన్నని నేను ఉన్నాను కదా? ఏదో ఒకటి చేసి అంతా నేను చూసుకుంటానని అంటాడు చలపతి. ఇన్నాళ్లూ మీ నాన్న చూసుకున్నారు, ఇప్పుడు చూసుకోలేరా? నాన్న ఎక్కడో ఒక దగ్గర డబ్బులు సర్దుబాటు చేస్తారు. నువ్వు ఈ అప్పుల గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దని చెబుతుంది లక్ష్మీ. బాగా చదువుకున్నాను, వాళ్లు చెప్పిన పనిచేశాను, కానీ ఇప్పుడు ఏఐ అనే కొత్త టెక్నాలజీ వస్తే నేనేం చేయాలి. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు నేర్చుకోవడానికి కొంత టైం ఇవ్వాలి కదా అని అంటాడు వెంకీ. నా లాంటి ఉద్యోగులు లేకపోతే కంపెనీ ఆ స్థాయిలో ఉండదు కదా? ఏ ఉద్యోగానికి వెళ్లినా ఏఐ టెక్నాలజీ వచ్చా అని అడుగుతున్నారు. నా వల్ల మీరు అందరితో మాటలు పడుతున్నారని బాధతో భోజనం చేయకుండా వెళ్లిపోతాడు వెంకీ.
చిన్నోడు చాలా అమాయకుడు వాడు పని తప్పించి ఎవరి జోలికి వెళ్లడు. ఎవరితో ఒక్క మాట కూడా పడడు, ఈరోజు శంకర్ అన్ని మాటలు అనేసరికి వాడు తీసుకోలేకపోతున్నాడు. ఏం చేయాలో వాడే ఆలోచించుకుంటాడని అంటాడు చలపతి. మొన్నటి వరకు పిల్లల చదువుల కోసం కష్టాలు పడ్డాం. చిన్నోడు ఉద్యోగం చేస్తున్నాడు, పెద్దోడు కూడా ఏదో ఒక పనిచేస్తే పెళ్లిళ్లు చేద్దామని అనుకుంటే చిన్నోడి ఉద్యోగం పోయిందని లక్ష్మీ బాధపడుతుంది. మనం మధ్యతరగతి వాళ్లం.. కష్టాలన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటామని అనుకునేలోపే ఏదో ఒక కష్టం వస్తుందని అంటాడు చలపతి. నందూ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వెంకీ కట్ చేస్తుండటంతో ఆమెకు అనుమానం వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications