Brahmamudi May 9th Episode: కట్టుకథతో రేఖని బురిడీ కొట్టించిన రాజ్.. ఇందూతో చేతులు కలిపిన భ్రమరాంబ
Photo Courtesy: JioHotstar
ఇందూని కిడ్నాప్ చేసే క్రమంలో భ్రమరాంబ ప్రతిఘటించడంతో ఆమెను కత్తితో బెదిరిస్తాడు రాజ్. దెబ్బకు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లిపోతుంది భ్రమరాంబ. మదన్‌ని పెళ్లికొడుకుని చేసి మురిసిపోతారు రేఖ, భూషణ్. అయితే మదన్ బాధగా ఉండటంతో నీకోసమే ఇదంతా చేస్తున్నాను.. రేపు ఆస్తి నా పేరు మీదకి వచ్చిన తర్వాత ఇందూని వదిలేయ్, నీ ఇష్టమొచ్చినట్లు బతకమని చెబుతుంది రేఖ. ఇంతలో స్వాతి వచ్చి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నావా బావా అని అడుగుతుంది మదన్. ఆమెపై సీరియస్ అయిన రేఖ.. ఇందూ వచ్చిందా? లేదా? అని అడుగుతుంది. ఇంకా రాలేదని స్వాతి చెప్పడంతో కిందకి వెళ్లి అపర్ణ మీద అరుస్తుంది.
ఇంతలో భ్రమరాంబ వచ్చి ఇందూని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నువ్వే నీ మనవరాలిని ప్లాన్ చేసి తప్పించావా అంటూ అపర్ణపై భగ్గుమంటుంది రేఖ. నిజం చెబుతావా? లేక కాల్చిపారేయనా అని గన్‌తో కాలుస్తుండగా ఇందూ- రాజ్‌లు పెళ్లి బట్టల్లో రావడంతో అంతా షాక్ అవుతారు. తన కొడుకు పోలికలతో ఉన్న రాజ్‌ను చూసి మురిసిపోతుంది అపర్ణ. ఇతను నీ కొడుకు కాదు.. ఈ ఇంటికి ఏమాత్రం సంబంధం లేదని అపర్ణ నోరు మూసేస్తుంది రేఖ. మీ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నేనే.. పెళ్లి చేసుకుంది నేనే అని ఇందూకి అండగా నిలబడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మే 9వ తేదీ ఎపిసోడ్ 1028లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేనే ఇందూని కిడ్నాప్ చేశానని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. 20 లక్షలు నొక్కేసి, ఇప్పుడు మా పిల్లని నొక్కేశావా అంటూ భ్రమరాంబ మండిపడుతుంది. కిడ్నాప్ చేసిన అమ్మాయిని పెళ్లి ఎలా చేసుకున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పమని అంటాడు భూషణ్. ఇందూని కిడ్నాప్ చేసి వారం రోజులు నా దగ్గర పెట్టుకున్నాను కదా? అప్పుడు తన బాగోగులన్నీ నేనే చూసుకున్నాను. ఆ టైంలో నేను తన చక్రాల్లాంటి కళ్లకి ఫ్లాట్ అయ్యాను, తన విశాలమైన మనసుకు కరిగిపోయాను, నాకే తెలియకుండా నేనే ఇష్టపడ్డాను. ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారింది.. నేను అన్ని ప్రయత్నాలు చేసినా, ఇందూ మాత్రం నన్ను ఇష్టపడలేదని చెబుతాడు రాజ్.
మా ఇందూ అంటే అది.. నీలాంటి లోఫర్ గాడిని కన్నెత్తి కూడా చూడదు అంటాడు శేషం. నువ్వు ఇందూ మెడలో తాళి కట్టడానికి ఒప్పుకోను అంటుంది రేఖ. ఇందూకి నాకు పెళ్లి జరిగింది.. ఆ దేవుడి సాక్షిగా నేను తన మెడలో తాళికట్టాను, కాకపోతే అదంతా బలవంతంగా తాళి కట్టానని చెబుతాడు రాజ్. అంత బలవంతంగా నీ మెడలో తాళి కడతానంటే నువ్వేం చేస్తున్నావు.. ఎదురుతిరిగి నాలుగు పీకాలని ఇందూపై మండిపడుతుంది రేఖ. ఎవరైనా తను చేసిన తప్పుని ఒప్పుకుంటుందా అని అంటాడు రాజ్. ఆరోజు రాత్రి జరిగిన పరిణామాలతో మా జీవితాలు ఇలా మారిపోయాయని అంటాడు రాజ్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు.
ఆరోజు రాత్రి ఇందూని అన్నం తినమని ఎంత బతిమలాడినా వినిపించుకోవడం లేదు. అప్పుడే ఆకాశంలో ఒక ఉరుము ఉరిమిందని అంటాడు రాజ్. ఆ ఉరుముతో పాటు ఒక మెరుపు కూడా మెరిసింది. అప్పుడు భయంతో ఇందూ నన్ను పట్టేసుకుంది. దాంతో నాలో విద్యుత్ ప్రవహించింది, కానీ నేను మాత్రం నిగ్రహంతో ఉన్నాను. ఆ తర్వాత మరో ఉరుము ఉరమడంతో నేను తనని గట్టిగా పట్టుకున్నాను అని చెబుతాడు రాజ్. ఆ క్షణంలో తను వద్దు వద్దు అంటున్నా నేను.. ముద్దు ముద్దు అని కోరుకున్నా. అలా మేమిద్దరం ఒక్కటైపోయామని అంటాడు రాజ్. ఇంత వివరంగా చెప్పాకా ఆ దరిద్య్రాన్ని మాకు చెప్పొద్దు.. మాకు అర్ధమైందని భ్రమరాంబ సీరియస్ అవుతుంది.
ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇందూ మీద నా ప్రేమ పీక్స్‌కి వెళ్లిపోయింది. కాకపోతే నాకున్న డబ్బు సమస్యల వల్ల మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇందూని మీతో పంపించేశాను. డబ్బుతో ఏమైనా కొనగలమని, ప్రేమను, మనసుని కొనలేమని అర్ధం చేసుకున్నా. నా మనసు నన్ను వదిలి వెళ్లిపోయింది. నా ప్రేమ విషయం తనతో చెబుదామని ప్రయత్నిస్తుంటే, తనకి మీ అబ్బాయితో పెళ్లి జరిపించబోతున్నారని తెలిసింది. ఈ టైంలో నా ప్రేమ విషయం చెబితే తను పట్టించుకోదని అర్ధమైంది, అందుకే తనను ఎత్తుకెళ్లిపోయాను, బలవంతంగా పెళ్లి చేసుకున్నానని చెబుతాడు రాజ్.
నువ్వు దొంగతనంగా తనని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటే అది నిజమైన పెళ్లికాదు, అది బొమ్మల పెళ్లితో సమానం. బొమ్మల పెళ్లి తర్వాత తాళి తీసినట్లుగానే ఇప్పుడు నేను ఇందూ మెడలో నువ్వు కట్టిన తాళి తీసేస్తానని రేఖ తాళి తీయబోతుండగా రాజ్ అడ్డుకుంటాడు. అది చూసిన సుభాష్, అపర్ణలు సంతోషిస్తారు. మాది బొమ్మల పెళ్లి కాదు.. నిజమైన పెళ్లి, అది నేనే కట్టిన తాళి అంటాడు రాజ్. ఇప్పుడు భయంతో దండ వేసింది.. రేపు ప్రేమతో మనసు ఇస్తుందని నేను అనుకుంటున్నాను అని చెబుతాడు. ఈ తాళి, దండలు అంతా నాటకం అయ్యుండొచ్చు, మీరు పెళ్లి చేసుకున్నట్లు సాక్ష్యం ఉందా అని అడుగుతుంది రేఖ. నువ్వు ఇలాంటిది అంటావని తెలిసే మా పెళ్లి రిజిస్టర్ చేయించా, ఇందూతో బలవంతంగా సంతకం పెట్టించా.. త్వరలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా వస్తుందని అంటాడు రాజ్.
ఇలాంటివన్నీ జరుగుతాయని నాకు ముందే తెలుసని పెళ్లి ఫోటోలు, వీడియోలు చూపిస్తాడు రాజ్. వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారు, మనం చేయగలిగింది ఏం లేదని అంటుంది భ్రమరాంబ. మీరంతా చచ్చినట్లుగా నన్ను ఈ ఇంటి అల్లుడిగా ఒప్పుకోవాల్సిందేనని అంటాడు రాజ్. నా పెళ్లి జరగలేదని అంటే .. నేను ఈ ఫోటోలతో వెళ్లి, ఏదో ఒక న్యూస్ ఛానెల్‌లో కూర్చొని జరిగినదంతా చెబితే చాలని రాజ్ బెదిరించడంతో రేఖ షాక్ అవుతుంది. ఇలాగే బెదిరించడంతో మనింటి పరువు పోకూడదని, తలవంచుకుని తాళి కట్టించుకున్నానని చెబుతుంది ఇందూ. వీడంటే నాకు అస్సలు ఇష్టం లేదు.. మీరు ఏం చెబితే అది చేస్తానని రేఖతో చెబుతుంది ఇందూ.
గుమ్మంలోకి రమ్మంటారా? లేక మీడియా గుమ్మం తొక్కమంటారా అని రాజ్ బెదిరించడంతో లోపలికి రమ్మని చెబుతుంది రేఖ. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు కాబట్టి హారతి ఇస్తానని అంటుంది భ్రమరాంబ. మమ్మల్ని శత్రువుల్లా చూస్తారనుకున్నా కానీ.. హారతి ఇచ్చి మరి లోపలికి తీసుకొస్తున్నావని భ్రమరాంబని మెచ్చుకుంటాడు రాజ్. రాజ్‌ని చూడగానే అపర్ణ, సుభాష్‌లు పొంగిపోతారు. నువ్వు అచ్చం నా కొడుకులాగే ఉన్నావు.. నీకు మాకు ఏదో రక్త సంబంధం ఉందని అనిపిస్తోంది. మా కొడుకు పేరే రాజేనని చెబుతుంది అపర్ణ. పేరే కాదు.. నువ్వు అచ్చం మా కొడుకులాగే ఉన్నావని అంటాడు సుభాష్. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు.. దానిని సీరియస్‌గా తీసుకోవద్దని చెబుతాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications