Brahmamudi November 28th Episode: అప్పూకి అండగా రాజ్... తల్లికి దొరక్కుండా కళ్యాణ్ సూపర్ స్కెచ్
Photo Courtesy: JioHotstar
ఐస్‌క్రీమ్ తినడానికి కళ్యాణ్‌ను ఊరంతా తిప్పుతుంది అప్పూ. నువ్వు ఒక్కసారి తిన్నందుకే మా అమ్మ నన్ను తిట్టిందని మళ్లీ నువ్వు ఐస్‌క్రీమ్ తిని నీకు ఏమైనా జరిగితే ఊరుకోదని భయపడతాడు కళ్యాణ్. అయినా నేను అడిగింది చిన్న ఐస్‌క్రీమే..అదే బావగారు అయితే మా అక్క బకెట్ లిస్ట్ పేరుతో ఎన్ని కోరికలు అడిగితే అన్ని కోరికలు తీర్చారని చెబుతుంది. దాంతో ఐస్‌క్రీమ్ ఇప్పిస్తాడు కళ్యాణ్. ఇంతలో అప్పూకి పోలీస్ స్టేషన్ కనిపించడంతో లోపలికి వెళ్లి చాలా రోజులైందని ఒకసారి వెళ్లొస్తానని కళ్యాణ్‌కి చెప్పి వెళ్తుంది.
ఆమె లోపలికి వెళ్తుండగా ఓ తల్లి తన బిడ్డ కోసం కానిస్టేబుల్‌తో గొడవపడుతూ కనిపిస్తుంది. ఆమె దగ్గరి నుంచి జరిగింది తెలుసుకుని తాను సీఐతో మాట్లాడతానని అంటుంది. ఆవిడ బిడ్డ చనిపోయిందని, ఎంత చెబుతున్నా వినిపించుకోవడం లేదని అప్పూకి చెబుతాడు సీఐ. మళ్లీ కేసును రీ ఓపెన్ చేద్దామని అప్పూ అనగా సీఐ సీరియస్ అవుతాడు. అప్పూ నిద్రపోతుండగా ఆ బిడ్డ చనిపోయినట్లు, ఆ తల్లి ఏడుస్తున్నట్లు కల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 28వ తేదీ ఎపిసోడ్ 890లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దుగ్గిరాల ఫ్యామిలీ భోజనాలు చేస్తుండగా నేను మళ్లీ పోలీస్ ఉద్యోగంలో చేరతానని కుటుంబ సభ్యులకు చెప్పమని కళ్యాణ్‌ను అడుగుతుంది అప్పూ. ఇది చూసిన ధాన్యలక్ష్మీ గుసగుసలు ఆపి తినమని చెబుతుంది. ఇంట్లో పెళ్లాలకి కడుపులు వచ్చిన నాటి నుంచి మొగుళ్లు పోర్లు దండాలు పెడుతున్నారు.. నానమ్మని ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతుంది ఇందిర. నీ కొత్త కంపెనీని ఇక నుంచి నువ్వే చూసుకోవాలని రాహుల్‌కు చెబుతారు ప్రకాశం, సుభాష్. నా కొడుకు 24 గంటలూ ఆ కొత్త కంపెనీకి ఎప్పుడెప్పుడు వెళ్లాలి? ఎలా డెవలప్ చేయాలా? అని ఆలోచిస్తున్నాడని చెబుతుంది రుద్రాణి. ఇక నువ్వు స్వరాజ్ కంపెనీకి రావాల్సిన పనిలేదు.. కొత్త కంపెనీ వ్యవహారాలు చూసుకోమ్మని రాహుల్‌కు చెబుతాడు సుభాష్. ఇకనైనా మన కంపెనీ పనుల్ని నువ్వు చూసుకుంటేనే మంచిదని రాజ్‌కు చెబుతాడు.
నేనే కాదు, కళావతి కూడా రోజూ నాతో పాటు ఆఫీస్‌కు వస్తుందని రాజ్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్య కడుపుతో ఉంది, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుందని అందరూ చెబుతారు. ఇంట్లో బోర్ కొడుతుందట, పనిలో పడితే బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుందట, ఏదేదో చెబుతోందని మండిపడతాడు కావ్య. అన్నయ్యని ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు.. నువ్వు వదినని తీసుకుని ఆఫీస్‌కి వెళ్లు, నేను వదినని తీసుకుని బయటికి వెళ్తానని అంటాడు. దేనికి అని ధాన్యం అడగ్గా... ఖాళీగా ఉంటే ఎలా? మన పనులు మనం చేసుకోవాలని చెబుతాడు కళ్యాణ్. నేను నా రైటింగ్ మొదలుపెడతాను, అప్పూ తన డ్యూటీ తను చూసుకుంటుందని అంటాడు. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ సీరియస్ అవుతుంది. డెలివరి అయ్యే వరకు అప్పూ ఇంట్లోనే ఉండాలని తేల్చేస్తుంది.
అన్నయ్యతో వదిన ఆఫీసుకు వెళ్తుంటే పెద్దమ్మ, పెదనాన్నలు అడ్డుపడటం లేదు కదా అని కళ్యాణ్ అడుగుతాడు. కావ్య వెళ్లేది ఆఫీసుకి, అక్కడ ఏ సమస్య ఉండదు, చిన్నచిన్న పనులు చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. కానీ అప్పూ వెళ్తానని చెబుతుంది పోలీస్ ఉద్యోగానికి.. అక్కడ ఎప్పుడు, ఎలా ఉంటుందో, ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదని అంటుంది ధాన్యం. తమ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో అప్పూ, కళ్యాణ్‌లు బాధపడతారు. నాకు ఆ పాప, ఆ తల్లే గుర్తొస్తున్నారని ఆవిడకి ఏం సాయం చేయకపోతే నాకు సిగ్గుగా ఉందని చెబుతుంది అప్పూ. అమ్మకి చెబితే కదా ప్రాబ్లమ్ చెప్పకుండా వెళ్దామని కళ్యాణ్ చెబుతుండగా.. కావ్య వచ్చి సీరియస్ అవుతుంది.
మీరు డైనింగ్ టేబుల్ దగ్గర పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చిందని అంటుంది కావ్య. ఒక తల్లికి సాయం చేయాలనుకున్న నిర్ణయం మంచిదే, కానీ మీరిద్దరూ తీసుకున్న నిర్ణయమే తప్పని అంటుంది కావ్య. చిన్న అత్తయ్యకి చెప్పకుండా అప్పూ గడప దాటితో ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయని వార్నింగ్ ఇస్తుంది కావ్య. అప్పూ ఆ పాపని గుర్తుచేసుకుని నిద్రలో కూడా ఉలిక్కిపడుతుందని చెబుతాడు కళ్యాణ్. అప్పూ చేసేది రైట్ అయినప్పుడు ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని అంటాడు రాజ్. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మనం చాలా చేశామని చెబుతాడు. నువ్వు ఖచ్చితంగా ఆ తల్లికి న్యాయం చేస్తావా? అని అప్పూని అడుగుతాడు రాజ్. నేను నా డ్యూటీ చేస్తానని అంటుంది అప్పూ. మీ ఇద్దరి వెనకాల మేం ఉన్నాం.. ఇంట్లో తెలియకుండా జాగ్రత్తగా ఉండమని అంటాడు రాజ్.
అప్పూని పోలీస్ స్టేషన్‌కి వెళ్లమని రాజ్ ఒప్పుకోవడంతో భర్తపై కావ్య సీరియస్ అవుతుంది. తనకు నచ్చని పని ఎవరు చేసినా వాళ్లని శత్రువుల్లా చూస్తుంది, అలాంటిది అప్పూ డ్యూటీకి వెళ్తానంటే ఎలా ఊరుకుంటుందని ప్రశ్నిస్తుంది కావ్య. పిన్ని కోపాన్నే కాదు, అప్పూ ఆలోచనను కూడా చూడాలని అంటాడు రాజ్. అప్పూ సాయం చేయాలని అనుకుంటోంది, పిన్నికి భయపడి సాయం చేయకుండా ఆపుతావా? అని రాజ్ ఫైర్ అవుతాడు. రేపు సమస్య వచ్చాక నా మీదకి తోసేసి నన్ను బుక్ చేస్తారని మండిపడుతుంది కావ్య.
ఉదయాన్నే రుద్రాణి ఫోన్‌లో మాట్లాడుతూ హడావుడి చేస్తుండగా ఇందిర సెటైర్లు వేస్తుంది. నేను సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవు కదా అని మండిపడుతుంది రుద్రాణి. కొడుకు కొత్త కంపెనీకి సీఈవో అయ్యాడు, ఆనందం తట్టుకోలేకపోతోందని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో రాహుల్ రెడీ అయి కిందకి రావడంతో వాడిని మెచ్చుకుంటుంది. ఫస్ట్ డే కావడంతో ఇందిర ఆశీర్వాదం తీసుకుని బయల్దేరతాడు రాహుల్. రాజ్, కావ్యలు కూడా ఆఫీసుకు బయల్దేరడంతో జాగ్రత్తలు చెప్పి పంపుతుంది అపర్ణ. మీరిద్దరూ ఆఫీసుకు వెళ్తే పనే ప్రపంచంగా బతకొద్దని వార్నింగ్ ఇస్తుంది. నాకు ఏనాడైనా ఇన్ని జాగ్రత్తలు చెప్పావా అని ఫైర్ అవుతాడు రాజ్.
ఇదే సమయంలో అప్పూ యూనిఫాంని బ్యాగ్‌లో పెట్టుకుని దిగుతాడు కళ్యాణ్. మేమిద్దరం గుడికి వెళ్తున్నామని కళ్యాణ్, అప్పూ చెబుతారు. ఈరోజు గుడికి వెళ్లడం ఏంటీ? అని అపర్ణ ప్రశ్నిస్తుంది. అప్పూ గుడికి వెళ్తానని అడిగింది.. నేను తీసుకెళ్తున్నానని అంటాడు కళ్యాణ్. ఇంతలో ధాన్యలక్ష్మీకి డౌట్ వచ్చి ఆ బ్యాగ్‌లో ఏముందని నిలదీస్తుంది. దాంతో కళ్యాణ్, అప్పూలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










