Brahmamudi September 16th episode: అపర్ణకి నిజం చెప్పిన రుద్రాణి.. తల్లి ముందు నేరస్తుడిలా రాజ్ !!
ఆసుపత్రిలో అపర్ణ కోమా నుంచి బయటికి వచ్చి కావ్య గురించి అడుగుతుంది. ఆమెకు షాకింగ్ న్యూస్ చెబితే మరోసారి కోమాలోకి వెళ్తుందని రాజ్ కుటుంబానికి డాక్టర్ వార్నింగ్ ఇస్తుంది. అత్తగారు కోమాలోంచి బయటపడ్డ విషయం తెలుసుకుని కావ్య చాలా సంతోషపడుతుంది. తాను ఉద్యోగం చేస్తానని తల్లిదండ్రులకు కావ్య చెప్పగా.. కనకం అందుకు అడ్డుపడుతుంది. అయితే కృష్ణమూర్తి కూతురికి సపోర్ట్ చేస్తాడు. ఇంటికొచ్చిన అపర్ణకు స్వప్న దిష్టితీయబోగా.. నా కోడలు ఎక్కడని మరోసారి అడగటంతో కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ 516లో ఏం జరిగిందంటే..
కోమాలో నుంచి బయటికి వచ్చిన అపర్ణను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొస్తారు. స్వప్న గుమ్మం వద్ద దిష్టి తీయబోగా.. అపర్ణ అడ్డుకుని ఇలాంటి పనులన్నీ నా కోడలే చేస్తుంది కదా.. కావ్య ఎక్కడని అడుగుతుంది. వెంటనే రుద్రాణి కలగజేసుకుని ఇంకెక్కడి నీ కోడలు వదిన.. ఎప్పుడో వెళ్లిపోయింది కదా అని అంటుంది. దీంతో కుటుంబం మొత్తం షాక్ అవుతుంది. మధ్యలో రాజ్ అందుకుని నీ ఆరోగ్యం కుదుటపడాలని అమ్మవారికి ఏదో మొక్కుకుందని వచ్చేస్తుందని కవర్ చేస్తాడు. హాస్పిటల్‌లో లేదు, ఇంటి దగ్గరా లేదు కావ్యకి నేను వచ్చిన విషయం చెప్పారా అని అపర్ణ బాధపడుతుంది. ఆమె లోపలికి వెళ్లగానే రుద్రాణికి ఇందిరా దేవి చీవాట్లు పెడుతుంది.

అటు కావ్య ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది. డిజైన్స్ గురించి చెబుతూ తనకో జాబ్ కావాలని సందీప్ అనే వ్యక్తిని అడుగుతుంది. మరోవైపు కోడలు వస్తుందని పదే పదే గుమ్మం వైపు చూస్తూ బాధపడుతుంది అపర్ణ.. ఇంతలో రాజ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి రాగా మరోసారి కావ్య గురించి అడుగుతుంది. అనంతరం జ్యూస్ ఇవ్వడానికి వచ్చిన ధాన్యలక్ష్మీని ఇంట్లో ఏమైనా జరిగిందా అని అపర్ణ అడుగుతుంది. తర్వాత ఇందిర వచ్చి ఆరోగ్యం ఎలా ఉందని అడగ్గా.. ఇంట్లో ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదని అపర్ణ బాధపడుతుంది. ఇంట్లో అంతా బాగానే ఉందా , నేను వచ్చి ఇంతసేపైనా నా కోడలు ఇంకా రాలేదంటని అడుగుతుంది.
ఒంటరిగా బాధపడున్న రాజ్ దగ్గరికి ఇందిర వచ్చి .. మీ అమ్మ పరిస్ధితి చూస్తే భయమెస్తుందని అంటుంది. ఏం జరిగినా నీదే రెస్పాన్సిబులిటీ అని మనవడికి చెప్పి వెళ్లిపోతుంది. రాత్రయినా కోడలు ఇంటికి రాకపోవడంతో అపర్ణ గుమ్మం దగ్గర నిలబడి వెయిట్ చేస్తుంది. ఇంతలో కుటుంబ సభ్యులంతా వచ్చేస్తారు. నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగింది.. కావ్య ఎక్కడికి వెళ్లిందని అపర్ణ కొడుకుని నిలదీస్తుంది. కావ్య ఇవాళ రాదా.. ఎప్పటికీ రాదా అని ప్రశ్నించడంతో రాజ్ షాక్ అవుతాడు. నేను ఆమెను ద్వేషించే రోజుల్లోనే తనకు సేవలు చేసిందని, ఇప్పుడు నాకు ఇలా ఉందని తెలిస్తే అస్సలు వదిలిపెట్టేది కాదని అపర్ణ అంటుంది. ఆమె మనసు విరిగైనా వెళ్లిపోవాలి.. లేదంటే మీలో ఎవరో ఒకరు బలవంతంగా పంపించేసి ఉండాలని చెబుతుంది.

నా కోడలి మీద చాడీలు చెప్పి పంపించి వేశావా అంటూ రుద్రాణిపై గద్దిస్తుంది. ఏం జరిగినా నన్ను , నా కోడుకునే అంటారు.. అసలు నీ కోడలు వెళ్లిపోవడానికి నేను కారణం కాదని.. నీ కొడుకు వల్లే వెళ్లిపోయిందని చెప్పగా అపర్ణకు కళ్లు తిరిగినంత పనవుతుంది. మీ కోడలు తప్పు చేసింది.. నిలదీసేసరికి మొహం చూపించలేక వెళ్లిపోయిందని చెబుతుంది. దాంతో స్వప్న కోపంతో ఊగిపోతుంది. నా చెల్లి అసలు ఏం తప్పు చేసిందని రుద్రాణిపై మండిపడుతుంది. అత్తవని కూడా చూడకుండా లాగిపెట్టి కొడతానని వార్నింగ్ ఇస్తుంది. మీకు నిజం చెబుతానని అపర్ణ దగ్గరికి వచ్చి అంటుంది. కావ్యని మీరు పంపిస్తేనే వెళ్లిందా.. లేక తనకు తానుగానే కంపెనీకి వెళ్లిందా అని అడుగుతుంది.
తాను పంపిస్తేనే వెళ్లిందని అపర్ణ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. అక్కడ రాహుల్ తప్పు చేస్తున్నాడని తెలిసి అది ఆపడానికి వెళ్లిందని, వెళ్లనంటే నేనే బలవంతంగా పంపించానని అపర్ణ చెబుతుంది. కావ్యని రాహుల్ చంపేశాడా అని అడగ్గా.. మా దుర్మార్గుడేం అలా చేయలేదు, మీ అబ్బాయే అంటుంది స్వప్న. ప్రాణం తీయలేదు కాని.. దాని మనసుని, వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపేశాడని చెబుతుంది. కావ్య వల్లే మీరు కోమాలోకి వెళ్లిపోయారని , అలాంటి కోడలు దుగ్గిరాల ఇంట్లో ఉండకూడదని నా అత్త గొడవ చేసిందని స్వప్న జరిగినదంతా చెబుతుంది. కావ్యని ఇష్టంతో పెళ్లి చేసుకోలేదని.. నీకు ఈ ఇంటి కోడలిగా, నా భార్యగా ఉండే అవకాశం లేదని రాజ్ చెప్పడంతో మనసు విరిగి వెళ్లిపోయిందని అంటుంది స్వప్న. దీంతో అపర్ణ కళ్లు తిరిగి కిందపడబోతుండగా అందరూ టెన్షన్ పడతారు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











