Brahmamudi September 23rd episode: కావ్యపై రాజ్ హత్యాయత్నం... నడిరోడ్డుమీద కడిగిపారేసిన కళావతి !!
ఇంట్లో వాళ్లు ఎంత వద్దని చెబుతున్నా వినకుండా పనిమనిషి శాంతతో వంట చేయిస్తాడు రాజ్. ఆ వంట తినడానికి అందరూ భయపడగా.. రాజ్ మాత్రం తింటాడు. ముద్ద నోట్లో పెట్టుకోగానే ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడు అంత బాగా వంట చేసి ఇప్పుడెందుకు ఇంత చెండాలంగా చేశావని శాంతని ప్రశ్నిస్తాడు. ఆరోజున కావ్య వంట చేసిందని అపర్ణ అసలు నిజం చెబుతుంది. ఇక అనామికను తీసుకుని నేరుగా ఆఫీస్‌కి వెళ్తాడు సామంత్. దుగ్గిరాల వారి స్వరాజ్ కంపెనీని ఎలా దెబ్బకొట్టాలా అని అనామిక స్కెచ్ గీస్తుంది. సందీప్ ద్వారా కావ్యని తనవైపుకు తిప్పుకోవాలని కుట్ర పన్నుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ 522లో ఏం జరిగిందంటే..
నిద్రపోకుండా వినాయకుడి విగ్రహాలకు రంగులు వేస్తున్న కూతురి దగ్గరికి కృష్ణమూర్తి వచ్చి పడుకోమని చెబుతాడు. మధ్యలో పని ఆపకూడదని, పూర్తి చేశాకే పడుకుంటానని కావ్య చెబుతుంది. అలాగే వినాయకుడి తొండం, ఆయన గొప్పతనం గురించి తండ్రికి వివరిస్తుంది. ఈ వినాయకుడే మీ ఇద్దరిని కలుపుతాడని కృష్ణమూర్తి చెబుతాడు. దీంతో భర్తతో కలిసి ఇంట్లో వినాయకుడి పూజ జరుపుకున్న రోజులను గుర్తుచేసుకుంటుంది కావ్య. అక్కడ దుగ్గిరాల వారింట్లో వినాయకుడి పూజ గురించి ఏర్పాట్లు కనిపించకపోవడంతో సీతారామయ్య కుటుంబ సభ్యులందరినీ నిలదీస్తాడు. కావ్య ఇంట్లో లేదు, అపర్ణ ఆరోగ్యం బాలేదు.. ఎలా పండుగ జరుపుకుంటామని సుభాష్ ప్రశ్నిస్తాడు.

ఐశ్వర్యం ఇచ్చినప్పుడే కాదు, కష్టాలలో ఉన్నప్పుడే దేవుడి అండ మనకి కావాలని చెబుతాడు . వినాయకుడి పూజ చేస్తేనే కావ్యపై పడ్డ నీలాపనిందలు తొలగిపోతాయని పెద్దాయన సూచిస్తాడు. ఈసారి వినాయకుడి పూజ రాజ్ చేతుల మీదుగా చేయించాలని ఇందిర, సీతారామయ్య చెబుతారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత కొడుక్కి క్లాస్ తీసుకుంటుంది అపర్ణ. వినాయక చవితి పూజ చేస్తే నీ భార్య తనంతట తానుగా వచ్చేస్తుందని భయపడుతున్నావా అని ప్రశ్నిస్తుంది. నీలాంటి చెప్పుడు మాటలు వినేవాళ్ల కోసం ఆత్మాభిమానం చంపుకుని నా కోడలు రాదని.. నువ్వు పూజ చేయ్ మిగతాది దేవుడు చూసుకుంటాడని అపర్ణ చెబుతుంది.
అక్కడ కళ్యాణ్ వినాయక చవితి కోసం విగ్రహాన్ని తీసుకొస్తానని బయల్దేరుతుండగా.. అప్పూ ఆపి నేనే తయారు చేస్తానని చెబుతుంది. మట్టితో విగ్రహాన్ని తయారు చేయబోగా ఎంత ట్రై చేసినా అప్పూ వల్ల కాదు. ఇంతలో బంటి వచ్చి అప్పూపై సెటైర్లు వేస్తాడు. నువ్వేం కష్టపడొద్దని పెదనాన్న వినాయకుడి విగ్రహాన్ని పంపించాడని చెప్పగా అప్పూ, కళ్యాణ్ సంతోషపడతారు. విగ్రహం వచ్చింది కానీ.. ఇద్దరికీ పూజ చేయడం రాదు. దీంతో బంటి పకపక్క నవ్వి.. నాకు వచ్చు అని చెబుతాడు. తండ్రితో కలిసి తయారు చేసిన విగ్రహాలను కావ్య డెలివరీ ఇస్తుంటుంది. తొండం కుడివైపుకు తిప్పానని ఏమి అనుకోవద్దని.. నువ్వు వెళ్లే ఇంట్లో వాళ్లని చల్లగా కాపాడాలని వినాయకుడితో చెబుతుంది కావ్య. వినాయకుడి విగ్రహం బాగుందని షాప్ అతను ఆమెను మెచ్చుకుంటాడు.
కావ్య సైకిల్ తొక్కుకుంటూ వస్తుండగా.. ఓ కారు ఆమెను వచ్చి గుద్దుతుంది. ఇంతలో కారులోంచి రాజ్ దిగుతాడు. దీంతో తనకు ఆయనతో జరిగిన తొలి పరిచయాన్ని కావ్య గుర్తుచేసుకుంటుంది. చూసుకుని కారు నడపాలని తెలియదా అని కావ్య.. చూసుకుని సైకిల్ తొక్కాలని తెలియదా అంటూ ఇద్దరూ గొడవ పడతారు. మీరు చూసే నన్ను గుద్దారని , ఇది హత్యాయత్నమని కావ్య అంటుంది. చెక్ రాసిస్తే రాను అన్నానని, ఈ రకంగా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారా అంటూ ఫైర్ అవుతుంది. ఇలాగే అరువు .. జనం పొగవుతారు, నా పరువు తీసి.. నా పర్సులోంచి డబ్బులు తీసే వరకు అరువు అంటాడు రాజ్. ఇంతలో జనం గుమిగూడగా.. నేను నీకు ఎంత ఇస్తే వీళ్లంతా వెళ్తారని ప్రశ్నిస్తాడు. డబ్బున్న పొగరు చూపించినందుకే ఆనాడు అంత గొడవ అయ్యిందని కావ్య కౌంటర్ ఇస్తుంది. మీ దగ్గర డబ్బుంటే బ్యాంక్‌లో దాచుకోండి.. లేదంటే మీ ఇంట్లో పడి తింటున్న రుద్రాణి, ఆవిడ కొడుకుకి పడేయండి అంటుంది.
నేను కట్టుబట్టలతో బయటకి వస్తుంటే.. మీవాళ్లు చోద్యం చూస్తూ నిలబడ్డారని కావ్య కడిగిపారేస్తుంది. ఈ గొడవ చూసి అక్కడున్న జనం భార్యాభర్తల మధ్య మనమెందుకు అని వెళ్లిపోబోతుండగా.. ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ తేల్చిచెబుతాడు. నేను మీకు ఏం కానా.. మరి ఈ తాళికట్టింది ఏ పుడింగి అంటూ రాజ్‌ను రెచ్చగొడుతుంది కావ్య. ఎప్పుడో జరిగిన గొడవని తవ్వకుంటున్నారంటే అలాంటివాళ్లు భార్యాభర్తలేనని జనం చెవులు కొరుక్కుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
నా మొగుడు మారిపోయాడు.. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడని సంబరపడిపోయానని కావ్య చెబుతుంది . మళ్లీ మా ఇంటికి రావొద్దు.. ఆ గడపలో కాలు పెట్టొద్దని రాజ్ సీరియస్‌గా అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ప్రోమోలో.. వినాయక చవితికి అన్ని సిద్ధం చేశానని రాజ్ అందరికీ చెబుతాడు. అయితే కావ్యకి ఫోన్ చేయాలని ఇందిర మనవడితో అంటుంది. ఈ పూజలో మీ దంపతులే కూర్చోవాలని అపర్ణ చెబుతుంది. తర్వాత కావ్యతో కలిసి రాజ్ వినాయక చవితి పూజ చేస్తుంటాడు.


Click it and Unblock the Notifications











