Brahmamudi September 26th episode: బయటపడ్డ రాహుల్ మోసం .. కొడుకుని శిక్షించిన రుద్రాణి, ఎండీగా రాజ్
వినాయక చవితి పూజ ముగియగానే ఇంట్లో కనకాన్ని చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. నువ్వెందుకొచ్చావ్ అని ఆమెను రుద్రాణి నిలదీయగా.. ఇంట్లో వాళ్లు మండిపడతారు. ఎంత సైలెంట్‌గా ఉందామన్నా రెచ్చగొట్టడంతో రుద్రాణిని కడిగి పారేస్తుంది.. అలాగే కావ్య చేసిన వినాయకుడి విగ్రహమే ఇంటికొచ్చిందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అనామిక ప్లాన్ ప్రకారం మేనేజర్ .. కావ్యకి సామంత్ కంపెనీలో డిజైనర్‌గా ఉద్యోగం ఇస్తాడు. రాహుల్ వల్ల పెద్ద కాంట్రాక్ట్ ఆ సామంత్ కంపెనీ దక్కించుకుందని దుగ్గిరాల ఫ్యామిలీకి తెలుస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 26వ తేదీ.. ఎపిసోడ్ 525లో ఏం జరిగిందంటే ..
నా మనవడు నీ కంపెనీకి వస్తే రాహుల్ అవమానించి పంపించాడని సీతారామయ్య స్నేహితుడు రాజ్‌కి చెబుతాడు. దీంతో సుభాష్ మండిపడతాడు.. కస్టమర్స్ డిజైన్స్ బాలేదంటే వాటిని సరిచేసుకోవాలి, ఇలా అవమానించి పంపిస్తారా.. తాతయ్య గారికి క్షమాపణలు చెప్పమని క్లాస్ పీకుతాడు. నాకు క్షమాపణలు అక్కర్లేదని, నా మనవడు తీసుకున్న నిర్ణయాన్ని చెప్పడానికే ఇక్కడికి వచ్చానని పెద్దాయన అంటాడు. మాకు తెలియకుండా మా వెనుకాల ఎన్ని తప్పులు జరుగుతున్నాయో తెలిసేలా చేశావని సీతారామయ్య చెబుతాడు. నిన్ను నమ్మి కంపెనీని అప్పగిస్తే నువ్వు ఇలాగేనా చేసేదని కొడుకుపై రుద్రాణి కోప్పడుతుంది. మీ డ్రామాలు ఆపాలని.. నీ కొడుకు చేసిన పనికి మేం ఎక్కడ తీడతామోనని ముందే నువ్వు తిట్టేస్తున్నావా అని ఇందిర అంటుంది. అయితే ఏ శిక్ష వేయాలో మీరే డిసైడ్ చేయాలని రుద్రాణి చెబుతుంది.

కావ్య వద్దు అంటున్నా వినిపించుకోకుండా రాజ్‌ని కంపెనీ బాధ్యతల నుంచి తప్పించి తప్పు చేశానని సీతారామయ్య బాధపడతాడు. ఇల్లు ఎక్కడ ముక్కలవుతుందోనని భయపడి, ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నానని అంటాడు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు.. తిరిగి రాజ్‌కే కంపెనీ బాధ్యతల్ని అప్పగిస్తున్నానని సీతారామయ్య చెబుతాడు. కానీ నాకు ఇష్టం లేదని.. పిన్నికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, ఆమె మనస్పూర్తిగా ఒప్పుకుంటేనే వెళ్తానని రాజ్ అంటాడు. నా కొడుకు ఇంటికి రావాలన్నదే నా కోరికని.. రాజ్ ఆఫీస్‌కి వెళ్లడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే కళ్యాణ్‌ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని ధాన్యలక్ష్మీ చెబుతుంది. అందరూ ఒప్పుకున్నారని రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్లాడని సుభాష్ అనగానే.. రాహుల్ లోపలికి వెళ్లిపోతాడు.
రాజ్ కంపెనీ బాధ్యతల్ని తీసుకున్న విషయం తెలుసుకున్న కనకం చాలా సంతోషపడుతుంది. ఈ విషయం కూతురికి చెప్పబోగా.. ఆయన గురించి నాకేం చెప్పొద్దని మండిపడుతుంది. దీంతో కృష్ణమూర్తికి ఆ మాట చెప్పగా.. కావ్య చాలా సంతోషిస్తుంది. రాహుల్ మోసం చేస్తాడని కావ్య ముందే చెప్పిందని కనకం అనగా.. ఆయనికి మంచి చెప్పేవాళ్లు నచ్చరంటూ కళావతి కౌంటర్ వేస్తుంది. తనకు తానే మేధావిని అనుకుంటాడని, అప్పుడు నేనేందుకు చెప్పానో ఇప్పుడు ఆయనకి అర్ధమై ఉంటుందని అంటుంది. ఆఫీసుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నవాడు.. రేపు భార్యని బ్రతిమలాడి ఇంటికి తీసుకెళ్లకుండా ఉంటాడా అని కనకం చెబుతుంది. కొంతమంది ఆడవాళ్లని డామినేట్ చేయాలని అనుకుంటారని, ఆఫీస్ మీద అస్సలు చూపించరని కావ్య అంటుంది.

అక్కడ రాహుల్ ఒంటరిగా కూర్చొని రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో రుద్రాణి కొడుకు దగ్గరికి రాగా.. రాహుల్ లేచి వెళ్లిపోతాడు. దీంతో ఆమె సారీ చెబుతుంది. నీ స్వార్ధం కోసం కొడుకుని కూడా బలి చేసేస్తావా అనడంతో రుద్రాణి అతని చెంప చెళ్లుమనిపిస్తుంది. నేను కనుక అరవకపోయుంటే.. ఇంట్లోవాళ్లు నీకు చీవాట్లు పెట్టేవాళ్లని అంటుంది. అయినా క్లయింట్లతో అలా మాట్లాడతారా అని రుద్రాణి అడగ్గా.. రాహుల్ ఓ బాంబు పేలుస్తాడు. ఆ శ్రీకాంత్‌ని తాను రూ.10 లక్షలు లంచం ఇవ్వమన్నానని.. అప్పుడు ఎన్నిసార్లయినా డిజైన్లు మారుస్తానని చెప్పినట్లు రుద్రాణికి వివరిస్తాడు. వాడు ఆ డబ్బులు ఇవ్వడానికి కక్కుర్తిపడి ఇలా వచ్చి అందరికీ అబద్ధం చెబుతున్నాడని రాహుల్ చెబుతాడు.

ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి చప్పట్లు కొడుతుంది. సొంత కంపెనీలోనే లంచం అడిగినవాడిని నిన్నే చూస్తున్నానని.. నిన్న కంపెనీకి ఎండీని చేసినా లంచం అడిగావా అంటూ రాహుల్‌పై మండిపడుతుంది. నా కొడుకుని కుక్కతో పోలుస్తావా అంటూ రుద్రాణి ఫైర్ అవుతుంది. దయ చేసి నువ్వు లంచం అడిగినట్లుగా ఇంట్లోవాళ్లకు చెప్పొద్దని రాహుల్‌కు చెబుతుంది. లంచాలకు కక్కుర్తిపడటం మానేసి మరోలా ట్రై చేయమంటూ రుద్రాణి కూడా కొడుకుకు చీవాట్లు పెడుతుంది. అక్కడ అప్పూ ప్రీపేర్ అవుతుండగా.. కళ్యాణ్ టిఫిన్ తినిపిస్తాడు. ఓ లెక్క చెప్పమని అప్పూ అడగ్గా.. నాకు మ్యాథ్స్ అంటే భయమని అందుకే తెలుగులో ఎంఏ చేశానని చెబుతాడు. కోచింగ్ సెంటర్‌కి వెళితే నీకు ఈ కష్టాలు ఉండవు కదా అని కళ్యాణ్ అనగా.. అది డబ్బుతో కూడుకున్న వ్యవహారమని, ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది కష్టమని అప్పూ అంటుంది. దీంతో ఆమెను కోచింగ్ సెంటర్‌కి పంపాలని కళ్యాణ్ ఆలోచిస్తుంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











