Brahmamudi October 11th episode : కనకం క్యాన్సర్ ప్లాన్ సూపర్ సక్సెస్ .. ఎమోషనలైన రాజ్
కావ్య- రాజ్‌లను ఎలా కలపాలా అన్న దానిపై గుడిలో అపర్ణ, కనకం, ఇందిరా దేవి మాట్లాడుకుంటారు. ఇంతలో తనకు క్యాన్సర్ అని తాను ఎక్కువ రోజులు బతకనని కనకం చెప్పడంతో అపర్ణ, కనకం షాక్ అవుతారు. నిన్ను పెద్దాసుపత్రిలో చేర్పిస్తామని అపర్ణ చెప్పడంతో అంతా అయిపోయింది ఇంకేం లేదని చెప్పి నవ్వుతుంది. నాకు క్యాన్సర్ లేదు, పాడూ లేదు మీరే నమ్మేశారంటే అల్లుడుగారు నమ్మేస్తారని అంటుంది. నా చివరి కోరిక కింద మా పెళ్లిరోజుకు రాజ్‌ను పిలుస్తానని చెబుతుంది కనకం. ఇంటి దగ్గర తండ్రితో మీ 25వ పెళ్లిరోజు బాగా సెలబ్రేట్ చేస్తానని కావ్య చెప్పగా కృష్ణమూర్తి వద్దంటాడు. ఇంతలో అక్కడికొచ్చిన కనకం .. కృష్ణమూర్తితోనూ తన ప్లాన్ చెబుతుంది. అక్కడ రాజ్‌కి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ప్రకాష్ సాయం తీసుకుంటారు అపర్ణ, ఇందిర. వాళ్లు చెప్పినట్లే రాజ్ దగ్గరికెళ్లి కావ్యకి ఇంత అన్యాయం జరిగిందోనని నటిస్తాడు ప్రకాశ్. కావ్యకి ఏమైనా జరిగిందేమోనని రాజ్ టెన్షన్‌లో ఉంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 11వ తేదీ .. ఎపిసోడ్ 538లో ఏం జరిగిదంటే ..
భోజనం చేస్తుండగా మరోసారి కావ్య టాపిక్ గుర్తుచేస్తూ బాధపడిపోతాడు ప్రకాశం. కావ్యకి అలా ఉంటే మనం భోజనం చేయడం కరెక్ట్ కాదని అంటుంది ఇందిర. అంతా కలిసి భోజనం మధ్యలో నుంచి బాధపడుతూ లేచి వెళ్లిపోతారు. కావ్యకి ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్న రాజ్.. అపర్ణ, ఇందిరల దగ్గరికి వెళ్లి అడుగుతాడు. తెలుసుకుని ఏం చేస్తావని వాళ్లు ప్రశ్నించగా.. మీరు చెప్పకపోతే కళ్యాణ్‌ని అడగుతానని అంటాడు రాజ్. తమ నాటకం ఎక్కడ బయటపడిపోతుందోనని భయపడ్డ అపర్ణ మేమే చెబుతామని అంటుంది.

కావ్యకి దేవుడు కష్టాల మీద కష్టాలు పెడుతున్నాడని.. మీ అత్తగారు కనకానికి క్యాన్సర్ అని చెబుతుంది అపర్ణ. ఆ మాటతో రాజ్ షాకవుతాడు.. కానీ మొన్న వినాయక చవితికి వచ్చినప్పుడు బాగానే ఉంది కదా అని అంటాడు. ఏం బాగుంది .. ఆ రోజు రుద్రాణి, ధాన్యలక్ష్మీలు బాధపెట్టినా విరుచుకుపడలేదని ఓపిక లేక నీరసంగా ఉందని అంటుంది. కనకానికి క్యాన్సర్ అన్న నిజం కావ్యకి తెలుసా అని రాజ్ అడగ్గా.. ఇప్పటికీ నీకు దూరమై పుట్టింట్లో జీవచ్ఛవంలా బతుకుతుందని అలాంటిది ఈ సంగతి తెలిస్తే ఏమైనా ఉందా అని అపర్ణ భయపెడుతుంది. భర్త ప్రేమ లేని అత్తింట్లో , అమ్మలేని పుట్టింట్లో కావ్య ఎలా బతుకుందని అడుగుతుంది. కళావతికి చెప్పొద్దని ఆమె తట్టుకోలేదని రాజ్ అంటాడు.
ఇంతలో కనకం ఆఖరి కోరిక కూడా చెబుదామా అని ఇందిర అడుగుతుంది. కళావతిని ఇంటికి తీసుకురావడమేనా ఆమె చివరి కోరిక అని అంటాడు రాజ్. అది కాదని అపర్ణ అంటుంది.. మరి ఏంటో చెప్పాలని రాజ్ అడుగుతాడు. మీరు చెప్పకపోతే ఏంటీ నేనే వెళ్లి తెలుసుకుంటానని చెప్పి రాజ్ బయల్దేరతాడు. తమ పథకం సక్సెస్ అయినందుకు అపర్ణ, ఇందిరలు నవ్వుకుంటారు. రాజ్ వచ్చేసరికి కనకం క్యాన్సర్ పేషెంట్‌లా నటిస్తూ , ఇంటి దగ్గర లాయర్‌తో సిద్ధంగా ఉంటుంది. ఈ ఇల్లు మూడు ముక్కలు చేసి మా ముగ్గురు అల్లుళ్ల పేరు మీద రాయాలని లాయర్‌తో కనకం చెబుతుండగా రాజ్ వింటాడు.

ఎవరైనా కూతుళ్ల పేరు మీద ఆస్తులు రాయాలని అనుకుంటారని, మీరేంటీ అల్లుళ్ల పేరు మీద రాయాలని అనుకుంటున్నారని లాయర్ అడుగుతాడు. దగ్గుతూ పడిపోతున్న కనకాన్ని పట్టుకుంటాడు రాజ్. అతనిని చూసి షాక్ అవుతున్నట్లుగా మీరెందుకు వచ్చారని అడుగుతుంది కనకం. ఈ ఇల్లు ముక్కలు చేయడం లేదు, వీలునామా ఏమీ అక్కర్లేదని లాయర్‌ని పంపించేస్తాడు రాజ్. మీకు క్యాన్సర్ అని ఎంతో కాలం బతకరని నాకు తెలిసిందని అంటాడు. నేను ఎవ్వరికీ చెప్పొద్దని చెబితే.. మీతో చెప్పారా అని అంటుంది కనకం. హాస్పిటల్‌కి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయిస్తానని రాజ్ చెప్పగా.. కనకం షాక్ అవుతుంది. పెద్ద డాక్టర్‌ని కలిస్తేనే తనకు క్యాన్సర్ ముదిరిపోయిందని చెబుతుంది కనకం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాననో మీలాంటి అల్లుడు దొరికాడని అంటుంది.
మీకేదో చివరి కోరిక ఉందని అమ్మ చెప్పిందని.. అదేంటో చెప్పాలని కనకాన్ని అడుగుతాడు రాజ్. రేపు మా 25వ పెళ్లిరోజని.. నా చివరి పెళ్లిరోజుని ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లతో జరుపుకోవాలని అనుకుంటున్నానని కనకం చెబుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ప్లాన్ ఎక్కడ తేడా కొడుతుందోనని రాజ్‌ని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది కనకం. మీ ఆఖరి కోరిక తీరుస్తానని, మీరు తీరని కోరికతో తనువు చాలించాల్సిన అవసరం లేదని అంటాడు రాజ్. మా మూడు జంటలే కాదు.. మా కుటుంబంలోని అందరూ వస్తారని చెబుతాడు. నాకు క్యాన్సర్ అన్న విషయం మా కూతుళ్లకి తెలియదని స్వప్న, అప్పూలు తట్టుకుంటారు కానీ కావ్య వల్ల కాదని చెబుతుంది కనకం. ఎవరికీ తెలియనివ్వనని మన నలుగురి మధ్యే ఉంటుందని రాజ్ మాటిస్తాడు.

రాజ్ కారులో వెళ్తుండగా కావ్య చూస్తుంది.. ఆయన ఎందుకొచ్చారని అడుగుతుంది. రేపు మా పెళ్లి రోజు జరిపించడానికి వస్తాడని అంటుంది కనకం. బండరాయైనా కరుగుతుంది కానీ ఆయనక కరగడని చెబుతుంది కావ్య. రాజ్ వెళ్లిన పని ఏమైందో తెలుసుకోవాలని అపర్ణ, ఇందిరలు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇంతలో కనకం వాళ్లకి ఫోన్ చేస్తుంది. ప్లాన్ బ్లాక్ బస్టర్ అయ్యిందని.. అల్లుడుగారే మీ అందరినీ తీసుకుని మా పెళ్లి రోజు జరిపిస్తానని చెప్పారని కనకం చెబుతుంది. నువ్వు ఏదైనా అనుకుంటే సాధిస్తావని ఆమెను పొగుడుతుంది ఇందిర. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











