Brahmamudi October 16th episode : రాజ్ మనసు విరిచేసిన కావ్య.. షాక్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ, కనకం కొత్త డ్రామా
ఆఫీస్‌కు హడావుడిగా వచ్చిన రాజ్.. మేనేజర్ దగ్గరికెళ్లి ఆ కొంపలు మునిగిపోయే విషయం ఏంటో చెప్పు అంటాడు. నేను మీకు ఫోన్ చేయలేదని, ఎవరో మీకు రాంగ్ కాల్ చేశారని మేనేజర్ అనడంతో రాజ్ షాకవుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శృతిని పిలిచి కంపెనీలో అంతా ఓకేనా కాదా అని అడుగుతాడు. ఆమె ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో రాజ్ తిరిగి అత్తగారి ఇంటికి వచ్చేస్తాడు. కొడుక్కి అడ్డుపడిన అపర్ణ.. నీకు ఏ ఫోన్ కాల్ రాలేదు కదా అని అనడంతో రాజ్ షాక్ అవుతాడు.
నీకు ఫోన్ చేయించింది నేనే అని.. ఆ రోజు కావ్య కూడా అలాగే కంపెనీ కోసం వెళ్లిందని గుర్తు చేస్తుంది. తల్లి మాటలతో తప్పు తెలుసుకున్న రాజ్ .. గుమ్మానికి పూలదండ కట్టలేక ఇబ్బంది పడుతున్న కావ్యని ఎత్తుకుంటాడు. అది చూసి అపర్ణ, కనకం, ఇందిర సంతోషపడతారు. కావ్య- రాజ్‌లు క్లోజ్‌గా ఉండటం చూసి రుద్రాణి తట్టుకోలేకపోతుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక తల పట్టుకుంటుంది. అనంతరం కనకం - కృష్ణమూర్తిలు దండలు మార్చుకుని కేక్ కట్ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 16వ తేదీ .. ఎపిసోడ్ 542లో ఏం జరిగిదంటే ..

కృష్ణమూర్తి - కనకం కేక్ కట్ చేసిన తర్వాత వారికి కేక్ పెట్టడానికి రాజ్, కావ్యలు కొట్టుకుంటూ ఉంటారు. కృష్ణమూర్తి కలగజేసుకుని మీరే నాకు కేక్ పెట్టాలని చెప్పడంతో రాజ్ అలాగే చేస్తాడు. ఆ తర్వాత దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వారికి కేక్ తినిపిస్తారు. తర్వాత పెళ్లి గొప్పతనం గురించి ఇందిర అందరికీ వివరిస్తుంది. మహాలక్ష్మీ అలిగి వచ్చేస్తే మహా విష్ణువైనా ఒంటరి అయిపోతాడని, వైకుంఠం కూడా చీకటి అయిపోతుందని అనడంతో రాజ్ - కావ్యలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల గొడవలు వస్తాయని.. దీనికి వైకుంఠమే ఉదాహరణ అని ఇందిర చెబుతుంది. భార్య కోసం భర్త ఒక మెట్టు దిగడంలో తప్పేమీ లేదని అంటుంది.
అపర్ణని పెళ్లి గురించి, భార్యాభర్తల సంబంధం గురించి చెప్పమనగా ఆమె సుభాష్ వైపు కోపంగా చూస్తుంది. క్షమించారని తప్పులు జరిగినా తాను అత్తగారిల్లు దాటలేదని.. పుట్టింటికి అత్తింటికి మచ్చ తీసుకోచ్చేలా ప్రవర్తించలేదని అపర్ణ అంటుంది. తర్వాత కనకాన్ని పెళ్లి గురించి చెప్పమని ఇందిర అడుగుతుంది. తన ముగ్గురు కూతుళ్లు పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని, పిల్లలు చివరిదాకా ఉండరని.. చివరి వరకు మేమిద్దరమే తోడుగా ఉంటామని చెబుతుంది. ఈ క్రమంలోనే తన బాబుకు జబ్బు చేసిందని, ఖరీదైన వైద్యం చేయించాలని, తన భర్తకు అంత స్తోమత లేదని దాంతో తన బిడ్డ నా చేతుల్లోనే విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడని గుర్తుచేసుకుంటుంది కనకం.
ఆ పరిస్ధితికి మా పేదరికమే కారణమని.. నాలాగే నా కూతుళ్లు కూడా అదే పేదరికంలో బతకకూడదని కోరుకున్నానని చెబుతుంది. అబద్ధాలు చెప్పి, మోసం చేసి గొప్పింటి కోడళ్లుగా చేశానని .. అయినా నా భర్త తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టలేదని కనకం అంటుంది. ఘనంగా పెళ్లిళ్లు చేయాలని ఇల్లు తాకట్టు పెట్టి లక్షలు అప్పు చేశానని, ఆ రోజు కూడా రోడ్డు మీదకి రావడానికే సిద్ధపడ్డాడు తప్పించి తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టలేదని చెబుతుంది కనకం. ఇప్పుడు నేను చెబుతానని ప్రకాష్ చేయ్యెత్తుతాడు. నాకు మతిమరుపనే విషయం నా భార్యకి పెళ్లయిన మొదటి రోజే గుర్తొచ్చిందని, కానీ ఈ రోజు వరకు అడ్జెస్ట్ అవుతూనే ఉందని గొప్పగా చెబుతాడు .
భార్యాభర్తల గురించి స్వప్న చెబుతూ.. రాహుల్ తనను మోసం చేయాలని అనుకున్నాడని, కానీ పెళ్లి జరిగితే అతనితోనే జరగాలని అనుకున్నానని అంటుంది. ఇప్పటికీ ఇద్దరం గొడవపడుతూనే ఉన్నామని కానీ రాహుల్ తనను ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మనలేదని, నేనూ అతనిని వదిలి వెళ్లాలని అనుకోలేదని చచ్చేవరకు భరించాల్సిందేనని అంటుంది. నాకు భార్యాభర్తల సంబంధం ఏంటో తెలియదని, ఇప్పుడో బిడ్డకు తండ్రిని కూడా కాబోతున్నాడని .. ఆ బంధంలో ఏదో మేజిక్ ఉందని అనిపిస్తోందని రాహుల్ అంటాడు. అప్పూ మాట్లాడుతూ.. ఎవరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లుగా బిందాస్‌గా బతికేదాన్నని చెబుతుంది. నేను మగరాయుడిలా ఉంటానని, ఎప్పుడైతే కళ్యాణ్‌తో పెళ్లయి బయటికొచ్చేశానో.. అప్పటి నుంచి నా పద్ధతే మారిపోయిందని అంటుంది. కళ్యాణ్ కోసం నన్ను నేను మార్చుకుంటున్నానని అప్పూ చెబుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడమే అసలైన పేదరికమని కళ్యాణ్ అంటాడు.
రాజ్‌ను మాట్లాడాలని ఇందిర చెప్పగా.. నా వల్ల కాదంటాడు. మీ ఇద్దరి కోసమే అందరూ ఇలా మాట్లాడారని చెబుతుంది అపర్ణ. భార్యాభర్తలు సర్దుకుపోవాలని అర్ధం చేసుకున్నానని రాజ్ అంటాడు. మనసుల మధ్య బంధం ఉంటే ఇక్కడి దాకా లాక్కొచ్చి పడేస్తుందని చెబుతాడు. కావ్య మాట్లాడుతూ.. కానీ నాకు అనుభవం నేర్పిన పాఠం ఒక్కటే .. నా ఇల్లు, నా భర్త, నా కాపురం ఇవన్నీ ఒక భ్రమ, ఒక మాయ అంటుంది. భార్యాభర్తల మధ్య బంధం చివరిదాకా కొనసాగాలంటే నమ్మకం, ప్రేమ ఉండాలని ఇవేవీ నా భర్తలో లేవని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. పెళ్లి, బంధం గురించి చెప్పే అర్హత తనకు లేదని అంటుంది. మనసు లేని చోట భార్య కూడా వస్తువు లాగే కనిపిస్తుందని అనడంతో కావ్యపై కనకం కోప్పడుతుంది. నీ వల్ల ఎన్ని తప్పులు జరిగినా నేను నీతోనే ఉన్నానని రాజ్ అంటాడు.. అంటే నేను తప్పు చేయనని మీరు ఇప్పటికీ నమ్మడం లేదని అంటుంది కావ్య.
ఇంతలో పంతులుగారొచ్చి దాంపత్య వ్రతానికి ఇంకా ఏర్పాట్లు చేయలేదా అని అడుగుతాడు. త్వరగా కార్యక్రమం మొదలుపెట్టాలని, వ్రతంలో ఎవరెవరు కూర్చుంటారో వాళ్లు రావాలని పిలుస్తాడు. ఈ మూడు జంటలు కూర్చుంటాయని అపర్ణ చెబుతుంది. దాంతో కావ్య లేచి ఇక్కడ దాంపత్యమే సరిగా లేదని నాకు సంబంధం లేదని లేచి వెళ్లిపోతుంది. కనకం దగ్గుతూ , బాధపడుతూ ఉండటాన్ని చూసిన రాజ్ కంగారుగా అక్కడికొస్తాడు. నా గురించి ఆలోచించొద్దని, మీ గురించి , మీ కుటుంబం గురించి ఆలోచించాలని అంటుంది. అనామిక, రుద్రాణిలు విడాకులు తీసుకున్నారని.. ఈ దాంపత్య వ్రతం చేస్తే మీ కుటుంబంలో మరొకరు విడాకుల జోలికి వెళ్లరని చెబుతుంది కనకం. కొండ మీద నుంచి మీ అమ్మాయిని తీసుకురావడం నా వల్ల కాదని అంటాడు రాజ్. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











