Brahmamudi October 19th episode : తిరుగులేని ప్లాన్ వేసిన అపర్ణ .. కంపెనీ సీఈవోగా కావ్య , షాక్‌లో రాజ్
కనకం క్యాన్సర్ డ్రామాని అందరి ముందు బయటపెడుతుంది రుద్రాణి. దాంతో రాజ్ సహా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కుటుంబానికి లేనిపోని తలవంపులు తీసుకొచ్చావని భార్యపై కృష్ణమూర్తి మండిపడతాడు, ఇదంతా ఎందుకు చేశావని కావ్య కూడా నిలదీస్తుంది. మీ సంతోషంగా కోసం తాను ఇంత ఘనంగా ఏర్పాట్లు చేస్తే నన్ను ఫూల్‌ని చేశారంటూ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఇంతలో ఇందిర, అపర్ణ కలగజేసుకుని.. కనకాన్ని ఎవరూ ఏమొద్దని ఆమె మేం వేసిన డ్రామాలో పాత్రధారి మాత్రమేనని అంటారు. ఆ మాటలతో అంతా నోరెళ్లబెట్టి చూస్తారు. ఆఖరికి మీరు కూడా నన్ను మోసం చేస్తారా అంటూ రాజ్ ప్రశ్నించగా.. వేరే దారి లేదని అపర్ణ అంటుంది.
కళావతి తల్లితో కలిసి అద్భుతంగా నటించిందని , ఇక జీవితంలో ఈ కుటుంబాన్ని నమ్మనని రాజ్ వెళ్లిపోతాడు. ఆ వెంటనే రుద్రాణి చెంప పగులగొడుతుంది ఇందిర. భార్యాభర్తల మధ్య ఆరని చిచ్చు పెట్టావంటూ మండిపడుతుంది. మీ అమ్మని అపార్ధం చేసుకోవద్దని కావ్యకి చెప్పి ఇందిర, అపర్ణలు ఇంటికి వెళ్తారు. కోపంతో రగిలిపోతున్న రాజ్‌కు వారిద్దరూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 19వ తేదీ .. ఎపిసోడ్ 545లో ఏం జరిగిదంటే ..

మీ ఇద్దరూ నాకు చెప్పే హక్కు కోల్పోయారని.. ఇకపై ఎవరేం చెప్పినా నేను నమ్మనని అంటాడు రాజ్. నేను ఇక ఒంటరిగానే బతకాలని అనుకుంటున్నానని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేనని మమ్మల్ని కలపాలని ఇకపై ఎలాంటి ప్రయత్నం చేయొద్దని రాజ్ తెగేసి చెబుతాడు. ఆ వెంటనే సీతారామయ్య జోక్యం చేసుకుని.. కలపాలని అనుకున్నప్పుడు నిజాయితీగానే ప్రయత్నించాలని, ఈ నాటకాలు వద్దని సూచిస్తాడు. జరిగినది తలచుకుంటూ కనకం, కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటారు. ఇంతలో కావ్య వచ్చి.. మనం 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసినా ఆ వంద మరిచిపోయే రకం నా భర్త అంటుంది. అలాంటి మనిషి ముందు ఇంత పెద్ద అబద్ధం ఆడి మమ్మల్ని కలపడం ఎందుకని ప్రశ్నిస్తుంది. ఒక్క మాట నాతో చెప్పినా నేను చూసుకునేదాన్ని అని చెబుతుంది కావ్య.
మీ అమ్మని ఏం అనొద్దని తను సరైన పనే చేసిందని కృష్ణమూర్తి అంటాడు. మీరిద్దరూ విడిపోయి మేమంతా చూస్తూనే ఉన్నాం కానీ, మిమ్మల్ని కలపడానికి ఏ ప్రయత్నం చేయలేదని కానీ మీ అమ్మ ఆ పని చేసింది భార్యను మెచ్చుకుంటాడు కృష్ణమూర్తి. మిమ్మల్ని కలపడానికి అందరి ముందు దోషిగా నిలబడిందని, తల్లిగా గెలిచిందని .. తను వెళ్లే దారే తప్పు కావొచ్చు కానీ, తన ప్రయత్నం మాత్రం సరైనదేనని అంటాడు. కానీ అందరి ముందు అవమానాలు పడిందని , మా ఆయన ఆలోచించే రకం కాదని కావ్య బాధపడుతుంది. మేం కలుస్తామన్న నమ్మకం నాకు లేదని ఇకపై ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని అంటుంది. నేను చనిపోతేనే వీళ్లు కలుస్తారు అనుకుంటే నిజంగానే ఆ క్యాన్సర్ వస్తే బాగుండేదని భర్తతో చెప్పి బాధపడుతుంది కనకం.
తన ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా అమలు కావడంతో కొడుకుతో కలిసి రుద్రాణి సంబరాలు చేసుకుంటుంది. కనకం మామూలు మనిషి కాదని, రాజ్ లాంటి మనిషిని క్యాన్సర్ అని చెప్పి మార్చాలని చూసిందని అంటుంది. కానీ నా దెబ్బకి పర్మినెంట్‌గా రాజ్ - కావ్యలు విడిపోయారని అంటుంది. నువ్వు అనుకున్నది సాధించావ్.. కానీ అమ్మమ్మ నిన్ను లాగిపెట్టి కొట్టిందని రాహుల్ ప్రశ్నిస్తాడు. ఆ మాటలను విన్న స్వప్న చప్పట్లు కొడుతుంది. నీ తెలివితేటలకు సెల్యూట్ అని , మీదొక కొత్తరకం జాతి అంటూ నానా మాటలు అంటుంది. మేం నాటకాలు ఆడినా ఎవరికి నష్టం ఉండదని, కానీ నీ వల్ల కుటుంబాలే కూలిపోతాయని, జీవితాలే నాశనమైపోతాయని మండిపడుతుంది. రేపు నా బిడ్డను కూడా మా అమ్మ చేతుల్లోనే పెడతానని , మీలాంటి వాళ్ల నీడ కూడా పడనివ్వనని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న.
కనకం, ఇందిర, అపర్ణలు ఓ చోట కలుసుకుని జరిగిన దాని గురించి చర్చించుకుంటారు. ఇంత జరిగాక అల్లుడుగారు నా కూతురిని క్షమిస్తారా అని కనకం అడుగుతుంది. మీరిద్దరూ పర్మిషన్ ఇస్తానంటే రుద్రాణిని మర్డర్ చేస్తానంటూ కనకం కోప్పడుతుంది. ఆ మాటలకు అపర్ణ, ఇందిరలు షాక్ అవుతారు. రాజ్‌ని అజ్ఞానం ఆవరించిందని అహంకారం వల్ల జ్ఞానం నశిస్తుందని ఇందిర అంటుంది. కావ్యపై వాడికి ప్రేమ అలాగే ఉందని ఇద్దరిని ఒకచోట చేరిస్తేనే మళ్లీ కలుస్తారని చెబుతుంది. నాకొక ఐడియా వచ్చిందని దానిని ఈసారి నాటకంలా కాకుండా నిజాయితీగా చేద్దామని అంటుంది అపర్ణ. ఇంట్లో కుదరదని, ఆఫీసులోనే ఆ ఏర్పాట్లు చేయాలని చెబితే.. అదంతా జరుగుతుందా అని కనకం ప్రశ్నిస్తుంది. కావ్యతోనే ఇది మాట్లాడదామని అపర్ణ చెబుతుంది.
ఆఫీస్‌కి రాజ్ రాగానే స్టాఫ్ అంతా వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతారు. బాస్ రాగానే విష్ చేయడం కాదని, టైం లోగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అంటాడు. అదంతా చూసి శృతి భయపడుతుంది.. ఇంతలో ఆమెను పిలిచి వేసిన డిజైన్లు చాలని వెళ్లి తీసుకురమ్మంటాడు. ఇప్పుడు డిజైన్లు వేయలేదంటే ఏం అంటాడోనని ఆమె భయపడుతుంది. ఆవిడ ఖాళీ పేపర్స్ తీసుకెళ్లి ఇచ్చేసరికి రాజ్ కోప్పడతాడు. ఈయనను ఎవరో హర్ట్ చేశారని ఆ కోపమంతా నాపై చూపిస్తున్నాడని శృతి మనసులో తిట్టుకుంటుంది.
ఇంటి దగ్గర బొమ్మలకు రంగులు వేస్తూ ఉంటుంది శృతి. .. ఇంతలో అక్కడికి కనకం, ఇందిర, అపర్ణ వస్తారు. వారిని చూసి మళ్లీ ఏదైనా జగన్నాటకం మొదలుపెట్టారా అని ప్రశ్నిస్తుంది. మేం ఇంకొ కొత్త నిర్ణయం తీసుకున్నాం అని ఇందిర చెప్పేసరికి.. అయితే అది ఖచ్చితంగా నా మెడకు చుట్టుకుంటుందని కావ్య అంటుంది. మీ నిర్ణయాలన్నీ మీరే మీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని వెళ్లిపోవాలని చెబుతుంది. అందరూ కలిసి నన్ను వెర్రి దాన్ని చేశారని .. మీకంటే రుద్రాణియే బెటర్ అంటుంది. ఆ మాటతో ఇందిర, అపర్ణ వెళ్లిపోవాలని అనుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్ట్స్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో కంపెనీ సీఈవోగా కావ్యని అపాయింట్ చేస్తున్నట్లు అపర్ణ చెబుతుంది.


Click it and Unblock the Notifications











