Brahmamudi November 9th episode : కళ్యాణ్ బతుకు బయటపెట్టిన రుద్రాణి .. ధాన్యలక్ష్మీ ఉగ్రస్వరూపం
నా చేతుల మీదుగా బోనస్‌లు ఇవ్వనని కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఆమెకు నచ్చజెప్పి ఉద్యోగులకి చెక్కులు ఇప్పిస్తుంది. చివరిలో మేనేజర్ పేరిట ఉన్న కవర్‌ని రాజ్‌కి ఇస్తుంది కావ్య.. దీనికి రివర్స్‌లో తానే సీఈవోకి ఛైర్మన్ మనవడి హోదాలో ఇస్తున్నానని అంటాడు. ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉండటంతో రుద్రాణి తట్టుకోలేకపోతుంది. వెంటనే అనామికకు ఫోన్ చేసి డాక్యుమెంటరీ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారని మండిపడుతుంది.
వచ్చిన పని అయిపోయింది కదా ఇక ఇంటికి బయల్దేరమని కావ్యకి క్లాస్ పీకుతాడు రాజ్. భార్య కనిపించకపోవడంతో ఆమె కోసం ఇళ్లంతా వెతుకుతాడు. దీంతో వెనుక నుంచి వచ్చి రాజ్‌ని పట్టుకుంటుంది కావ్య. ముగ్గురు కోడళ్లకి దీపావళి సందర్భంగా ఇవ్వాలని అనుకున్న కానుకల్ని ఇచ్చే పంపిస్తానని అంటుంది ఇందిర. ఒక్కొక్కరికి బాక్స్ ఇచ్చి ఎవరి భార్య మెడలో వాళ్లు వేయాలని చెబుతుంది. రాజ్ వేయనని మొండికేసే సరికి , భర్తను పక్కకి తీసుకెళ్లి బొద్దింకి భయపడిన సంగతిని చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 9వ తేదీ .. ఎపిసోడ్ 563లో ఏం జరిగిదంటే ..

తాను బొద్దింకకు భయపడిన వీడియోను చూసిన రాజ్ కావ్యపై మండిపడతాడు. వీడియో తీసినవాళ్లు నాకు పంపించారని, దీనిని సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతుందని కావ్య బెదిరిస్తుంది. నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని రాజ్ ప్రశ్నించగా అవును అని కావ్య ఆన్సర్ ఇస్తుంది. మర్యాదగా వచ్చి నా మెడలో హారం వేస్తే నీకే మంచిదని చెబుతుంది. కావ్య అన్నంత పని చేస్తుందేమోనని భయపడ్డ రాజ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. ఏదో సాధించానని బిల్డప్ ఇచ్చావ్, మా రాజ్ నీ మెడలో హారం వేయడని రుద్రాణి అంటుంది. నన్ను పక్కకి తీసుకెళ్లి బాగా బతిమలాడటంతో ఒప్పుకున్నానని రాజ్ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. అందరి ముందే కావ్య మెడలో హారం వేస్తాడు రాజ్. రాహుల్, కళ్యాణ్‌లు కూడా వారి భార్యల మెడలో హారం వేస్తారు.
ఇంతలో కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఓ గిఫ్ట్ ఇస్తుంది కావ్య. దానిని ఓపెన్ చేసి చూడగా.. అది ఒక పెన్ను. ఓల్డేజ్ హోమ్ డొనేషన్ కోసం వేలం వేస్తే నేను కొన్నానని, ఇది మీరు ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్న మీ ఫేవరేట్ రైటర్ పెన్ను అని చెబుతుంది కావ్య. ఆ మాటలతో కళ్యాణ్ సహా ఇంట్లో వాళ్లంతా సంతోషిస్తారు. మీరు రాసే పాటలన్నీ చాలా బాగుంటున్నాయని, ఇంకా గొప్ప గొప్ప పాటలు రాయాలని చెబుతుంది కావ్య. కళ్యాణ్ పాటలు రాస్తున్నాడా అని స్వప్న అడగ్గా.. అప్పూ అవునని చెబుతుంది. సినిమాల్లో కళ్యాణ్ పాటలు రాస్తున్న విషయం తెలుసుకున్న ఇంట్లో వాళ్లు చాలా సంతోషిస్తారు. ఇంకా తన పేరుతో రాయడం లేదని , ప్రస్తుతానికి లక్ష్మీకాంత్‌కి రాసి ఇస్తున్నానని చెబుతాడు కళ్యాణ్.
ఏది ఏమైనా నువ్వు అనుకున్నది సాధించడానికి ప్రయత్నం చేస్తున్నావని రాజ్ మెచ్చుకుంటాడు. నువ్వు రాసిన పాట ఏదైనా ఉంటే వినిపించమని ఇందిర అడగ్గా.. అమ్మ మీద రాసిన పాట గురించి చెబుతుంది అప్పూ. అందరూ బతిమలాడేసరికి తన ఫోన్‌లో ఉన్న పాటను వినిపిస్తాడు. ఆ పాటతో అంతా ఎమోషనల్ అవుతారు. ధాన్యలక్ష్మీ ఏడుస్తూ కొడుకుని మెచ్చుకుంటుంది. తల్లికి కొడుకంటే ఎంత ప్రేమ అన్నది నువ్వు కూడా తెలుసుకుంటే మంచిదని ప్రకాశం చెబుతాడు.
ఇంతలో టాపిక్ డైవర్ట్ అవుతుండగా స్వప్న కల్పించుకుని అందరం కలిసి క్రాకర్స్ కాలుద్దామని అంటుంది. క్రాకర్సా నేను రాను అని రాజ్ భయపడిపోతాడు. దీంతో అందరూ కలిసి రాజ్‌ని బయటికి లాక్కెళతారు. అందరూ కలిసి క్రాకర్స్ కలుస్తుండగా రాజ్ భయంతో కావ్యని గట్టిగా పట్టుకుంటాడు. ఇంతలో రుద్రాణికి అనామిక ఫోన్ చేసి డాక్యుమెంటరీ టెలికాస్ట్ చేస్తున్న విషయం గురించి చెబుతుంది. బయట బాంబులేం కలుస్తారులే కానీ , టీవీలో ఇంతకన్నా పెద్ద బాంబు పేలుతోందని అనామిక చెప్పగా అంతా లోపలికి వెళ్తారు.
రోడ్డునపడ్డ దుగ్గిరాల వంశ ప్రతిష్ట అంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అందులో రాజ్ ఆటో నడుపుతూ కనిపిస్తాడు. దుగ్గిరాల ఇంటి వారసుడు , కోట్లకు వారసుడైన కళ్యాణ్ బతుకుదెరువు కోసం సాధారణ జీవితం గడుపుతున్నాడని టీవీలో వస్తుంది. అది చూసి ధాన్యలక్ష్మీ మహాకాళీలా రెచ్చిపోతుంది. కొడుకుని పట్టుకుని, ఇదా నువ్వు బతికే బ్రతుకు అని నిలదీస్తుంది. దీన్ని పెళ్లి చేసుకుని పోషించడానికి నువ్వ ఆటో నడుపుతున్నావా అని మండిపడుతుంది. నీ కాళ్ల మీద నువ్వు బతుకుతున్నానని చెప్పి ఇంత దరిద్య్రాన్ని అనుభవిస్తున్నావా అని ప్రశ్నిస్తుంది.
నేనేం తప్పు చేయడం లేదని, నిజాయితీగానే బతుకుతున్నానని అంటాడు కళ్యాణ్. నిజాయితీగా బతకడమంటే ఏంటో నువ్వు నాకు చెబుతున్నావా అని ప్రశ్నిస్తుంది. ఇంట్లో ఎంతో ఖరీదైన కార్లు పెట్టుకుని, వాటిని నడపటానికి డ్రైవర్లను పెట్టుకుని, నువ్వెళ్లి ఒక డ్రైవర్‌గా ఆటో నడుపుతున్నావా అని నిలదీస్తుంది. నీకేం గతి లేక అగ్గిపెట్టే లాంటి ఇంట్లో ఎంత పేదరికం అనుభవిస్తున్నావో తెలుసా అని ప్రశ్నిస్తుంది. దరిద్ర్యంలా పట్టుకుందని అప్పూని నానా మాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. దీంతో స్వప్న మండిపడుతుంది. వాళ్లిద్దరూ ఒకొరినొకరు ఇష్టపడి చేసుకున్నారని, మా అప్పూ మీ అబ్బాయిని చేసుకుంటానని ఏం చెప్పలేదని తనే ఆవేశంలో తాళి కట్టాడని అంటుంది స్వప్న .
మీ అక్కాచెల్లెళ్ల గురించి నాకు చెబుతున్నావా, మీ ముగ్గురు ఈ వంశానికి చెదలు పట్టినట్లు పట్టుకున్నారని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. మీ అబ్బాయి ఏం నేరం చేశాడని మండిపడుతున్నారు, తన కాళ్ల మీద తను నిలబడటానికి కష్టపడ్డాడని అప్పూ అంటుంది. నీకు నాతో మాట్లాడేంత ధైర్యం కూడా వచ్చిందా.. నువ్వెంత నీ బ్రతుకెంత అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో కావ్య జోక్యం చేసుకుంటుంది. ఏమైంది దాని బతుక్కి.. కోట్లు కావాలని కోరుకోలేదని, మీ అబ్బాయి చెట్టు కింద ఉందామని చెప్పినా ఉంటానని చెప్పిందని అంటుంది. దాని బతుకుని తక్కువ చేసి మాట్లాడే అధికార మీంకు లేదని తేల్చి చెబుతుంది.
ఇది నాకు , నా కొడుక్కి సంబంధించిన విషయమని.. నీ సంగతి నీ వాళ్ల సంగతి ఎవరికి తెలియదు అని కావ్యపై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. ఈ గయ్యాళితనం చూసే మీ కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని , మా ముగ్గురు అక్కాచెల్లెళ్లని మధ్యలోకి లాగొద్దని వార్నింగ్ ఇస్తుంది స్వప్న. దీంతో రాజ్ కల్పించుకుని తమ్ముడితో మాట్లాడతాడు. పెళ్లిలో ఇంటికి రమ్మంటే రాలేదు, నేను డబ్బు పంపిస్తే తీసుకోలేదు, నేను ఇంటికి రమ్మన్నా రాలేదు.. ఇప్పుడేమో ఆటో నడుపుతున్నావ్ అని అడుగుతాడు. ఆటో నడపటం తప్పని తాను అనడం లేదని, నీకేం తక్కువా .. నువ్వు కూడా ఈ ఇంటి వారసుడివి ఇదంతా అవసరమా అని నచ్చచెబుతాడు. అప్పూని తీసుకుని ఇంటికి వచ్చేయమని అంటాడు.
దేనికి రావాలి అన్నయ్య అని కళ్యాణ్ నిలదీస్తాడు. కోడలిని పట్టుకుని నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడుతోందని , ఈ ఇంటికొస్తే ఏం జరుగుతుందో రెండోసారి రుజువైందని .. జీవితాంతం నా భార్య అత్త చేతుల్లో మాట పడాల్సిందేనా అని కళ్యాణ్ అడుగుతాడు. వాడు రాను అంటున్నాడని మీరేం మాట్లాడరా అని ఇందిరని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. నువ్వెందుకు నిప్పులు తొక్కినట్లు ఇంతగా చిందులు వేస్తున్నావని ఇందిర ప్రశ్నిస్తుంది. కళ్యాణ్ ఏ నేరం చేశాడు? భార్యను పోషించడానికి ఒక దారి ఎంచుకున్నాడని అదేం నేరం కాదని అంటుంది. అనామిక ఈ ఇంట్లో ఉన్నప్పుడు.. నాకేం చేతకాదని చీప్‌గా చూసిందని ఇప్పుడు అప్పూ చేత కూడా ఆ మాట అనిపించుకోవాలా అని కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. అప్పూ మొహన ఎంతో కొంత పడేస్తాను, వదిలేసి ఇంట్లోనే ఉండు అంటుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నేను చచ్చేదాకా దానిని కోడలిగా ఒప్పుకోనని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










