Brahmamudi November 12th episode : ఆస్తి కోసం రుద్రాణి కొత్త ప్లాన్ .. ఆఫీసులో రాజ్ టైంపాస్ , కావ్యకి షాక్
భార్యను తన కళ్ల ముందే అవమానించడంతో జీవితంలో ఇంటికి రానని చెప్పి వెళ్లిపోతాడు కళ్యాణ్. కోట్లకు వారసుడైన నా బిడ్డ పేదరికంలో మగ్గిపోకూడదని ఆస్తిని ముక్కలు చేయమని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. పనిలో పనిగా రాహుల్‌కు కూడా ఆస్తిలో వాటా ఇవ్వమని రుద్రాణి అడగటంతో ఇందిర, ప్రకాశంలు చీవాట్లు పెడతారు. తాను కోరినట్లు ఆస్తిని పంచకుంటే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని ధాన్యలక్ష్మీ హెచ్చరించడంతో సీతారామయ్య తనకు కొంచెం టైం ఇవ్వమంటాడు.
దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు జరగడంతో సామంత్- అనామికలు ఎంజాయ్ చేస్తుంటారు. అత్తారింట్లో వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కావ్య కుమిలిపోతుంటుంది. ఆటో నడపటం మానేసి రైటర్‌గా ట్రై చేయమని కళ్యాణ్‌కి సలహా ఇస్తుంది అప్పూ. నేను ఆటో నడుపుతానని, కొద్దిరోజుల్లోనే నీ ట్రైనింగ్ పూర్తవుతుందని తేల్చి చెబుతాడు కళ్యాణ్. ధాన్యలక్ష్మీని మరింత రెచ్చగొట్టి ఆస్తిని కొట్టేయాలని చూస్తుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 12వ తేదీ .. ఎపిసోడ్ 565 ఏం జరిగిదంటే ..

ఆస్తి ముక్కలు వేయకుండా కావ్య అడ్డుపడుతుందని ధాన్యలక్ష్మీని హెచ్చరిస్తుంది రుద్రాణి. కావ్యకి ఏం సంబంధం ఉంది? తనెందుకు అడ్డు పడుతుందని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. అమ్మానాన్నలను మేనేజ్ చేసి కావ్య ఆస్తి పంపకాలకు అడ్డుపడుతుందని, ఆలోపే ఆస్తి పంపకాలు జరిగిపోవాలని చెబుతుంది రుద్రాణి. తాను అలా జరగనివ్వనని.. ఎవరు అడ్డుపడ్డా నా కొడుక్కి రావాల్సిన ఆస్తి ఇవ్వాల్సిందేనని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఉదయాన్నే ఇంట్లో అందరూ కూర్చొని ఉండగా మీరు ఏం నిర్ణయం తీసుకున్నారోనని ఎదురుచూస్తున్నానని అంటుంది ధాన్యలక్ష్మీ.
ఇది ఇంటి పెద్దగా నాకొక అగ్ని పరీక్ష అంటాడు సీతారామయ్య. వందల ఏళ్ల చరిత్రను ఒక్క రోజులో ఎలా మార్చగలనని అంటాడు. కాస్త టైం కావాలని మరోసారి అడుగుతాడు. దీంతో రగిలిపోయిన ధాన్యలక్ష్మీ.. ఎంత సమయం కావాలో చెప్పమంటుంది. టైం అడిగారంటే ఏదైనా జరగొచ్చని, మీరంతా కలిసి నా నోరు మూయించొచ్చని అంటుంది. ఆ మాటలతో ఇందిర మండిపడుతుంది. నీ తండ్రి అంత నిస్సహాయంగా మాట్లాడుతుంటే.. ఆయనను అర్ధం చేసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేవా అని ప్రకాశంపై కేకలు వేస్తుంది.
కోడలి మీద చెయ్యి చేసుకున్న చరిత్ర దుగ్గిరాల వంశంలోనే లేదని చెబుతుంది ఇందిర. నీ తాతల ఆస్తి ఏమైనా పసుపు కుంకుమల కింద తీసుకొచ్చి మాకేమైనా ఇచ్చావా అని ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఇంటి పరువును బజారున పడేయాలని చూస్తావా అని ఫైర్ అవుతుంది. నిన్ను ఏమి అనలేక ఆయన కృంగిపోతున్నారని అంటుంది. నా భర్త రాజ్‌ని మేనేజర్‌ని చేసినా అపర్ణ ఇదేమిటని ప్రశ్నించలేదని గుర్తుచేస్తుంది ఇందిర. ఇలా అరిచి నోట్లో మట్టి కొడతారని నాకు ముందే తెలుసని రుద్రాణి ఏదో చెబుతుండగా స్వప్న వచ్చి అడ్డుపడుతుంది.

ఈ ఇంటిని ముక్కలు చేయమని ధాన్యలక్ష్మీ ఆంటీలో కలిగించింది నువ్వేనని నాకు బాగా తెలుసునని చెబుతుంది . ఎలా అయినా సరే నీ వాటా నువ్వు దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నావని స్వప్న అంటుంది. నువ్వు నోరు మూసుకుని ఉండు.. పెద్దవాళ్లు మాట్లాడుతున్నారు కదా అంటూ గడ్డిపెడుతుంది. ఇంతలో రాజ్ వచ్చి.. తాతయ్య కానీ, నువ్వు కానీ ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదని అంటాడు. అప్పూని కోడలిగా ఒప్పుకుంటే కళ్యాణ్ ఇంటికొస్తాడు ఎప్పటిలా అందరం కలిసి ఉండొచ్చని చెబుతాడు. నీ పిన్ని ఏం చేయాలో నువ్వు చెబుతున్నావ్, మరి నువ్వు నీ భార్యను పుట్టింటిలో పెట్టి, తమ్ముడి భార్యను క్షమించమని సలహా ఇస్తున్నావా అంటూ రాజ్‌పై కోప్పడుతుంది ఇందిర. మొత్తం జరిగిందే నీ వల్ల అంటుంది. మీ మావయ్య గారి మీద గొంతు లేచిందంటే ఏం చేస్తానో నాకే తెలియదని ధాన్యలక్ష్మీకి వార్నింగ్ ఇస్తుంది.
ఆఫీసులో కావ్య ఛాంబర్‌లో ఉండగా శృతి వచ్చి ఫైల్ ఇస్తుంది. డిజైన్లు అప్రూవ్ చేయలేదని అడగ్గా చేయను అన్నారని చెప్పగా.. నువ్వెళ్లు నేను మాట్లాడతానని అంటుంది. ఫైల్ తీసుకుని రాజ్ దగ్గరికి వచ్చేసరికి అతను వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. సంతకం ఎందుకు చేయలేదని కావ్య ప్రశ్నించగా వంకర టింకరగా సమాధానం చెబుతాడు. సుపీరియర్ ఆర్డర్ పాటించనందుకు మిమ్మల్ని డిస్మస్ చేస్తానని అంటుంది. ఆ మాటలతో మండిపడిన రాజ్ .. ఫైల్ తీసుకుని ఇంటికి వెళ్లి, నేనేంటో చూపిస్తానని అనుకుంటాడు.
గార్డెన్ బయట ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న తాతయ్యని చూసి రాజ్ కోపంగా ఆయన దగ్గరికి వెళ్తాడు. ధాన్యలక్ష్మీ పిన్నికి ఆస్తిని ముక్కలు చేయాలనే ఆలోచన రావడానికి కారణం మీరేనని అంటాడు. కావ్యని సీఈవోని చేశారని, కళ్యాణ్ ఆటో నడుపుతున్నాడని అందుకే పిన్నికి కోపం వచ్చిందని చెబుతాడు. ముందు కళావతిని సీఈవోగా తప్పించాలని అంటాడు. నీ భార్య కింద పనిచేయడానికి నీకు అవమానంగా ఉందని, అందుకే ఇలా వంకలు చూపిస్తున్నావని సీతారామయ్య కౌంటర్ వేస్తాడు. నువ్వెన్ని చెప్పినా సరే కావ్యని సీఈవో పోస్ట్ నుంచి తప్పించడం కుదరదని చెబుతాడు సీతారామయ్య. నేను సీఈవోగా ఉన్నప్పుడు ఇంట్లో ఏ గొడవలు లేవని, కానీ ఆ కళావతి సీఈవో అయినప్పటి నుంచే ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయని అంటాడు రాజ్.

తాను ఎంతో ప్లాన్ చేసి ధాన్యలక్ష్మీని రెచ్చగొడితే ముసలోడు చాలా సింపుల్‌గా తప్పించుకుంటున్నాడని కొడుకుతో చెప్పుకుని బాధపడుతుంది రుద్రాణి. కావ్యను ఇంట్లో నుంచి వెళ్లగొడితే ఏకంగా కంపెనీకే సీఈవోని చేశాడని అంటుంది. ఇంతలో స్వప్న వచ్చి వాళ్ల మాటలు వింటుంది. ఆస్తిలో వాటా ఇవ్వడానికి తాతయ్యకి రక్తం పంచుకుని పుట్టావా, ఈ ఇంటి గుమాస్తాకి పుట్టావ్ అంటూ రుద్రాణిపై మండిపడుతుంది. ఆస్తిని పంచితే నీ మొగుడికే కదా వస్తుంది, ఎందుకు అడ్డుపడుతున్నావ్ అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. మీకు ఆస్తి పంచితే మూడు రోజుల్లో లాగించేస్తారు తర్వాత నేను అడుక్కుని తినాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది. మీకు ఆస్తి రాకుండా అడ్డుపడతానని తెగేసి చెబుతుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











