Brahmamudi November 18th episode : కావ్య డిజైన్లు కొట్టేయాలని రాజ్ ప్లాన్ .. వేరు కుంపటి పెట్టిన ధాన్యలక్ష్మీ
ఆస్తి విషయంలో తేల్చపోవడంతో ధాన్యలక్ష్మీ భోజనానికి రాదు. దీంతో ఆమెను భోజనానికి పిలవాలని సీతారామయ్య ఇంట్లో వాళ్లకు చెప్పగా, ఎవ్వరూ ఆయన మాటలని పట్టించుకోరు. ఆఫీసులో మీటింగ్ హాల్ కోసం కొట్టుకుంటున్న రాజ్ - కావ్యలని చూసి జగదీష్ చంద్ర ప్రసాద్ కోప్పడతాడు. దీంతో తాము విడిపోలేదని, చాలా అన్యోన్యంగా ఉన్నట్లు నమ్మించడానికి కావ్య నడుము గిల్లి, ఆమెను బాగా చూసుకుంటున్నట్లుగా నటిస్తాడు రాజ్. ఆయన వెళ్లిపోగానే భర్తపై మండిపడుతుంది కావ్య.
తర్వాత ఆఫీసులో జరిగిన విషయాన్ని సీతారామయ్యకు చెబుతాడు జగదీష్ చంద్ర ప్రసాద్. నా మనవడు - మనవరాలు ఒక్కటైపోతే కంపెనీని టచ్ చేయడం ఎవరి వల్ల కాదని చెబుతాడు సీతారామయ్య. తనకు లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం వచ్చిందని అప్పూకి కళ్యాణ్ చెబుతాడు. అయితే లక్ష్మీకాంత్ బాగా కమర్షియల్ అని తేలిగ్గా ఒప్పుకునే రకం కాదని తెలిసిన అప్పూ.. నువ్వు అగ్రిమెంట్ ఏమైనా చేశావా అని ప్రశ్నిస్తుంది . ఆ మాటలతో కళ్యాణ్ షాకై ఇష్యూని డైవర్ట్ చేస్తాడు . తాతయ్య పెట్టిన పందెంలో గెలవాలనే ఉద్దేశంతో రాత్రంతా కూర్చొని డిజైన్లు వేస్తూ ఉంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 18వ తేదీ .. ఎపిసోడ్ 570లో ఏం జరిగిదంటే ..

జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ కోసం కావ్య డిజైన్లు వేస్తుంటుంది. అయితే ఉదయం ఆఫీసులో భర్త తన నడుం పట్టుకోవడం, ఇతర సంఘటనలు ఆమెకు గుర్తొస్తాయి. కృష్ణమూర్తి పాత టేప్ రికార్డర్ రిపేర్ చేసుకుంటూ ఉండగా స్క్రూ డ్రైవర్ కింద పడుతుంది. ఆ సౌండ్ విన్న కనకం .. అమ్మాయి డిజైన్లు వేసుకుంటోంది, సైలెన్స్ అంటూ మండిపడుతుంది. అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చి కూతురికి భోజనం ఇస్తుంది కనకం. నేను కూడా మీతో పాటే తింటానని, రూమ్‌లో తినను అని చెబుతుంది కావ్య. మాతో పాటు కూర్చొంటే ముచ్చట్లు ఎక్కువ అవుతాయి.. నువ్వు చేసే పని తప్పించి వేరే ధ్యాస ఉండకూడదని కనకం చెబుతుంది.
అటు స్టాఫ్ వేసిన డిజైన్లు నచ్చకపోవడంతో రాజ్ ఆలోచిస్తుంటాడు. అతనికి కూడా కావ్య నడుము గిల్లడం ఇతర సంఘటనలు గుర్తొస్తాయి. ఇంతలో ఆత్మారామ్ వచ్చి ఫ్లావర్ వాజ్‌తో రాజ్‌ను కొట్టబోతాడు. కళావతి విషయంలో నా నిర్ణయం ఎప్పటికీ మారదని.. ఈ పందెంలో కావ్యని ఓడిస్తానని అంటాడు. మెట్లపై కూర్చొని బాధపడుతున్న ధాన్యలక్ష్మీని అపర్ణ చూసి మాట్లాడుతుంది. మా అందరి మీద నీకు కోపంగా ఉందని, మేం ఏం చెప్పినా నువ్వు అర్ధం చేసుకునే పరిస్ధితుల్లో లేవని అంటుంది. తోడబుట్టకపోయినా మనం అక్కాచెల్లెళ్లలా కలిసే ఉంటున్నామని.. నువ్వు తిండి మానేస్తే నాకు బాధగా ఉండదా అని ప్రశ్నిస్తుంది.
నువ్వు బాధపడితే నా బాధ తీరదని.. నా సమస్య పరిష్కరిస్తేనే తీరుతుందని ధాన్యలక్ష్మీ చెబుతుంది. నువ్వు ఎన్నైనా చెబుతావ్.. మావయ్య గారు పెట్టిన పందెంలో గెలిస్తే రాజ్ కంపెనీకి సీఈవో అవుతాడని, నీ కోడలు గెలిస్తే తిరిగి ఇంటికొచ్చేస్తుందని దీని వల్ల నాకొచ్చిన లాభం ఏంటని ప్రశ్నిస్తుంది. రాజ్ - కావ్య ఒక్కటైపోతే కళ్యాణ్‌ని తీసుకురాకుండా ఉంటారా అని అంటుంది అపర్ణ. కళ్యాణ్ బయట అలా కష్టపడుతుంటే చూస్తుండటం మాకు మాత్రం ఇష్టమా? ఏదో ఒకటి చేసి వాడిని ఒప్పించి తిరిగి ఇంటికొచ్చేలా చేద్దామని అప్పటి వరకు కాస్త ఓపిక పట్టాలని చెబుతుంది.
వీరి మాటలను చాటుగా వింటున్న రుద్రాణి.. ధాన్యలక్ష్మీ మనసు మార్చేస్తుందేమోనని భయపడుతుంది. అపర్ణ వెళ్లిపోగానే ధాన్యలక్ష్మీ దగ్గరికి వచ్చి మా వదిన చెప్పిన మాటలకు పడిపోయావా అని అడుగుతుంది. రాజ్, కావ్యలు సంతోషంగానే ఉన్నారని.. వారిని ఇప్పుడు కలిపేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నూరిపోస్తుంది. ఇక్కడ కష్టాలు పడుతోంది కళ్యాణ్.. ముందుగా సమస్యను పరిష్కరించాల్సింది నీదేనని అంటుంది . నువ్వు కూడా వదిలేశావంటే కళ్యాణ్ జీవితాంతం ఆటో నడుపుకోవడమేనని హెచ్చరిస్తుంది రుద్రాణి. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడుతుంది.
మూర్తి అనే ఉద్యోగితో గంటల తరబడి డిజైన్ గీయిస్తాడు రాజ్. కానీ అవేవీ రాజ్‌కు నచ్చవు. కావ్య మేడమ్ వాడే కాంబినేషన్ కానీ, ఆమె వేసే డిజైన్లు కానీ మనం మ్యాచ్ చేయలేమని అంటాడు మూర్తి. ఆ మాటలతో రాజ్ మండిపడతాడు. పని చేయడం చేతకాక పక్కవాళ్లని పొగిడేస్తే సరిపోతుందా అంటాడు. డిజైన్ల విషయంలో కళావతికి టాలెంట్ ఉందని మనసులో అనుకుంటాడు రాజ్. కళావతి వేసిన డిజైన్లను నొక్కేసి మన క్లయింట్లకు చూపించి పందెంలో గెలుస్తానని అనుకుంటాడు .
వేరుగా వంట చేసుకుంటున్న ధాన్యలక్ష్మీని ఇందిర, అపర్ణ చూసి కోప్పడతారు. మీ ఇష్టాలు నా ఇష్టాలు కలవడం లేదు కాబట్టి ఇది తప్పడం లేదని చెబుతుంది ధాన్యలక్ష్మీ. నా కొడుక్కి అన్యాయం జరిగితే మాత్రం వేరు కుంపటే కాదు, ఇల్లే వదిలేసి వెళ్లిపోతానని హెచ్చరిస్తుంది. రాత్రంతా తాను నచ్చజెప్పడానికి ప్రయత్నించినా , తెల్లారి లేచేసరికి ఇలా తయారైందని అపర్ణ చెబుతుంది. కావ్య - రాజ్‌లను కలిపి కావ్యను తిరిగి ఇంటికి తీసుకురావాలనే ప్రయత్నంలోనే మీ మావయ్య ఉన్నారని అంటుంది ఇందిర.
అదే ధాన్యలక్ష్మీకి ఇంకా కోపం తెప్పిస్తోందని అపర్ణ చెబుతుంది. దానిని రుద్రాణి రెచ్చగొట్టి ఉసిగొల్పుతోందని.. ముందు దాని నోరు మూయించాలని అంటుంది ఇందిర. ఆఫీస్‌లో స్టాఫ్ మొత్తం వెళ్లిపోయాక కావ్య దగ్గర ఉన్న డిజైన్లను కొట్టేయాలని రాజ్ అనుకుంటాడు. ఛాంబర్‌లో శృతి - కావ్య మాట్లాడుకుంటూ ఉండగా వారు వెళ్లే వరకు వెయిట్ చేస్తాడు. డిజైన్లను ఇంటికి తీసుకెళ్లమంటారా అని శృతి అడగ్గా.. బయట ఉండటం మంచిది కాదనీ, ఆఫీసులో అయితేనే సేఫ్‌గా ఉంటుందని కావ్య అంటుంది.


Click it and Unblock the Notifications











