Brahmamudi November 30th Episode : రాజ్ - కావ్యల మధ్యలోకి మరో అమ్మాయి.. దుగ్గిరాల ఫ్యామిలీలో కొత్త కల్లోలం
కావ్య తాను తీసుకొచ్చిన భోజనాన్ని ఇందిర - సీతారామయ్యలకి వడ్డిస్తుంది. రాజ్ అందరినీ భోజనానికి పిలిచి బిర్యానీ పెడతాడు. అది ముద్ద నోట్లో పెట్టుకోగానే కారం దెబ్బకు తినలేకపోతారు. స్వప్న, రాహుల్, సుభాష్, ప్రకాష్‌లు తమ వల్ల కావడం లేదని చెప్పడంతో వాళ్లకి కావ్య తాను తీసుకొచ్చిన భోజనం పెడుతుంది. కారం తినలేక రాజ్, రుద్రాణిలు వంటగదిలోకి పరుగులు తీస్తారు.
భోజనం తీసుకొచ్చి అందరినీ నీ వైపు తిప్పుకున్నది చాలని.. ఇక బయల్దేరమని కావ్యతో చెబుతాడు. నేను ఇప్పుడే కాదు రోజూ వస్తానని తేల్చిచెబుతుంది కళావతి. ఇంతలో ఇందిరకి అపర్ణ ఫోన్ చేసి.. కావ్య తీసుకొచ్చిన భోజనం తిన్నారే కానీ మీ మనవరాలి కాపురాన్ని నిలబెట్టరా అంటూ మండిపడుతుంది. కావ్య ఇంటికి వెళ్లిపోతుండగా రాజ్ ఆమెను పిలిచి భోజనం తీసుకొచ్చినందుకు డబ్బులు ఇస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 30వ తేదీ.. ఎపిసోడ్ 581లో ఏం జరిగిందంటే..

మీ తలతిక్క నిర్ణయాలతో మీ కన్నతల్లే మా ఇంటికి వచ్చి ఉంటున్నారని.. అయినా మీకు తెలియడం లేదా అంటూ రాజ్‌పై కావ్య మండిపడుతుంది. కావ్య ఈ ఇంటికొచ్చిన రోజు నుంచి నేటి వరకు ఆమెను సంతోషంగా ఉంచలేదని సుభాష్ ఫైర్ అవుతాడు. కుటుంబమంతా కావ్య వైపు నిలబడుతుండటంతో రుద్రాణి జోక్యం చేసుకుంటుంది. ఈవిడ వల్ల మా అపర్ణ వదిన ప్రాణాలు పోయే పరిస్ధితి వచ్చిందని గుర్తుచేస్తుంది. ఈ నాటకాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఓ కొత్త వంట మనిషిని మాట్లాడానని చెబుతాడు రాజ్. స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉందని అంటాడు.
ఇంతకీ తన పేరెంటీ అని అడుగుతాడు రాహుల్. స్టెల్లా అని చెబుతాడు రాజ్. నెలకి శాలరీ ఎంత అని రుద్రాణి అడగ్గా.. నెలకి లక్ష రూపాయలు అని చెబుతాడు. ఇక నువ్వేమీ క్యారేజ్ తీసుసుకురావాల్సిన అవసరం లేదని చెప్పగా.. నీకు అవసరం లేదేమో కానీ మాకు కావాలని చెబుతుంది ఇందిర . నువ్వు చెప్పిన వంట మనిషి సత్తా ఏంటో మేం కూడా చూస్తామని అంటుంది. ఇంతలో కళ్యాణ్ - అప్పూ భోజనం చేస్తుండగా.. నన్ను నమ్మి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతాడు కళ్యాణ్. నేను సక్సెస్ కొడతానని నా కంటే నువ్వు ఎక్కువగా నమ్మావని అంటాడు. ఇది జీవితమని మనకు నచ్చినట్లుగా ఉండదని, మనమే దానిని తీర్చిదిద్దుకోవాలని అంటుంది అప్పూ.
కావ్యని ఎన్ని రకాలుగా అవమానించినా, ఇంటి నుంచి వెళ్లగొట్టినా మళ్లీ మళ్లీ తిరిగి వస్తూనే ఉందని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. రాజ్ చెప్పిన పనిమనిషి వచ్చేస్తే కావ్య ఇక ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు కదా అని అంటాడు రాహుల్. ఇంతలో స్వప్న వచ్చి.. నా చెల్లెలు తప్పకుండా తిరిగొస్తుందని అంటుంది. కావ్య ఇంటికొస్తే ఆస్తి పంపకాలు జరపకుండా ఆపేస్తుందనే కదా మీ భయం అని ప్రశ్నిస్తుంది. అందుకే కదా కావ్య రాకూడదు అనుకుంటున్నారు అని అడుగుతుంది.
కావ్య వస్తానన్నా రాజ్ రానివ్వడని అంటుంది రుద్రాణి. అయితే రాజ్ తెలివైనవాడేనని, కానీ కావ్య మొండిది అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టదని చెబుతుంది స్వప్న. ఇంటర్‌లో నా చెయ్యి పట్టుకున్నాడని కాలేజ్ మొత్తాన్ని బయట నిలబెట్టిందని.. ఇక తన జీవితమంటే ఎలా పోరాడుతుందో అర్ధం చేసుకోమని అంటుంది స్వప్న. మరోవైపు.. సీతారామయ్య, ఇందిర భోజనం చేస్తుంటారు. రాజ్ ఆకలితో బాధపడుతుండటం చూసిన ఇందిర వచ్చి తినమంటుంది. నా కోసం పిజ్జా ఆర్డర్ చేసుకున్నానని.. అదే తింటానని రాజ్ చెబుతాడు.
పిజ్జా ముక్క నోట్లో పెట్టుకోగానే అది చల్లగా ఉండటంతో రాజ్ తినలేకపోతాడు. ఆకలికి తట్టుకోలేక బాధపడతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో కావ్య వండిన భోజనం తినాలని అనుకుంటాడు. దొంగచాటుగా ప్లేట్‌లో భోజనం పెట్టుకుని తింటుండగా వెక్కిల్లు వస్తాయి.. దీంతో ఇందిర , సీతారామయ్య వచ్చి వాటర్ ఇస్తారు. ఏం పర్లేదు తినమని అంటారు వారిద్దరూ. రాజ్ తినబోతుండగా.. కళావతికి తెలిస్తే నేను చులకన అయిపోతానని అంటాడు. భర్త కడుపు నిండితే ఏ భార్య అయినా సంతోషిస్తుందని చెబుతాడు సీతారామయ్య.
నీకెందుకు ఈ కర్మ.. కావ్యను భార్యగా ఒప్పుకుని ఇంటికి తీసుకొస్తే హాయిగా కాలు మీద కాలు వేసుకుని తినొచ్చని అంటుంది ఇందిర. కావ్య నీ కోసమే భోజనం తీసుకొచ్చి.. మా అందరికీ తెచ్చానని అబద్ధం చెప్పిందని అంటుంది. ఆ నాటకాలు మీరు నమ్ముతారేమో కానీ నేను మాత్రం నమ్మనని అంటాడు రాజ్. రేపు నేను అపాయింట్ చేసిన చెఫ్ వస్తే ఇలా దొంగచాటుగా తినాల్సిన కర్మ ఉండదని చెప్పి లేచి వెళ్లిపోతాడు. ఉదయాన్నే రాజ్ నిద్రలేచి వచ్చేసరికి కావ్య ఇంట్లో అందరికీ కబుర్లు చెబుతూ కనిపిస్తుంది.
వారి మాటల్ని దొంగచాటుగా వింటున్న రాజ్‌ని చూసి ఇందిర కిందకి రమ్మని చెబుతుంది. రాత్రి చేసిన దొంగతనం బయటపడుతుందని అనుకుంటున్నావా అని సీతారామయ్య అడగ్గా.. రాజ్ ఉలిక్కిపడతాడు. పాల ప్యాకెట్ల కన్నా ముందే వచ్చేశావని కావ్యపై మండిపడతాడు రాజ్. ఇది నా ఇల్లు అని .. మా ఇంటికి వచ్చేవాళ్లని అవమానిస్తే ఊరుకునేది లేదని సీతారామయ్య వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో రాహుల్ వచ్చి.. కొత్త కుక్ ఇంకా ఇంటికి రాలేదని అడుగుతాడు.
దీనిని గమనించిన స్వప్న.. వంటని చూడాలనుకుంటున్నావా, వంట మనిషిని చూడాలనుకుంటున్నావా అని మండిపడుతుంది. ధాన్యలక్ష్మీకి బుద్ధి చెప్పాలని అనుకున్న ప్రకాశం.. ఇంకా స్టెల్లా రాలేదంటని అడుగుతాడు. ఇది చూసిన ఆమె.. మీ వాలకం చూస్తుంటే హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చేలా ఉన్నారని అంటుంది. ఇంతలో కొత్త చెఫ్ స్టైల్‌గా కారు దిగుతుంది. దీంతో రాహుల్, ప్రకాశంలు ఆమెను అలాగే చూస్తుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











