Brahmamudi December 4th Episode : రాజ్ విడాకుల అస్త్రం .. కావ్య జీవితాన్ని నిలబెట్టిన సీతారామయ్య
స్టెల్లా దగ్గరుండి చేయించిన ఫుడ్ తినగానే రాజ్, ప్రకాష్, రాహుల్‌కి కడుపులో తిప్పడంతో అంతా బాత్రూమ్‌కి పరిగెడతారు. కిచెన్‌లో స్టెల్లా దగ్గరికొచ్చిన రాహుల్.. తనకు మసాజ్ చేయమంటూ డబ్బులిస్తాడు. గదిలో ఆమె తలకి మసాజ్ చేస్తుండగా స్వప్న వచ్చి ఇద్దరినీ చీపురు కట్టతో చితకబాది స్టెల్లాను ఇంట్లో నుంచి తరిమేస్తుంది. ఇంతలో పోస్ట్‌మెన్ వచ్చి లెటర్ ఇస్తాడు. అది చదివిన రాజ్ షాక్ అవుతాడు.
అమ్మ నీకు విడాకుల నోటీస్ పంపిందని సుభాష్‌కు రాజ్ చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా ఉలిక్కిపడతారు. అత్తగారితోనే విషయం తేల్చుకోవాలని కంగారుగా ఇంటికెళ్లిన కావ్య .. అపర్ణను అరుస్తుంది. మీరు మా కోసం మావయ్యగారిని ఇబ్బంది పెడుతున్నారని, మీ కాపురంలో సమస్యలు తెస్తున్నారని మండిపడుతుంది. మీ లగేజ్ తీసుకుని తిరిగి మీ ఇంటికి వెళ్లిపోమ్మని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 4వ తేదీ.. ఎపిసోడ్ 584లో ఏం జరిగిందంటే..

ఈ విడాకుల నోటీసు నేనే మీ చేత ఇప్పించానని మీ అబ్బాయి అంటున్నాడని చెప్పడంతో అపర్ణ మండిపడుతుంది. నేనేం చేస్తానో నాకు తెలుసని అంటుంది. ఈ వ్యవహారం నా మెడకి చుట్టుకుంటే నీ పని అప్పుడు చెబుతానని కనకానికి కావ్య వార్నింగ్ ఇస్తుంది. తల్లిదండ్రుల ఫోటో చూస్తూ బాధపడుతున్న రాజ్.. మిమ్మల్ని విడిపోనివ్వనని అంటాడు. ఉదయాన్నే పూజ చేసి అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. ఇంతలో రాజ్ కారు దిగి ఇంట్లోకి వస్తాడు.
ఎందుకొచ్చావ్ నువ్వు అని అడుగుతుంది అపర్ణ. ఈ పేపర్స్ చదివితే అన్ని అర్ధమవుతాయని అంటాడు రాజ్. అవి ఏంటని కావ్య ప్రశ్నించగా.. మన విడాకుల పేపర్స్ అని రాజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నువ్వు వీరందరి మాటలు నమ్మి నా మీద ఏదో తిరుగులేని అస్త్రం వదిలానని అనుకున్నావా.. ఇన్ని అనర్ధాలకు కారణమైన ఈ కళావతిని వదిలించుకునేందుకే వచ్చానని రాజ్ అనడంతో కనకం కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఈ కళావతి వల్ల ఏ పాపం తెలియని నాన్నకి విడాకులు ఇద్దామని అనుకున్నావ్ .. నా భార్య కావడమే ఆమె చేసిన పాపమని అనడంతో రాజ్‌పై అపర్ణ చేయ్యెత్తుంది.
కావ్యకి నాకే గొడవ అయినప్పుడు మధ్యలో నాన్నేం చేశాడు, ఇల్లేం చేసింది, మన వంశ ప్రతిష్టలను వదిలేసి నువ్వు పరిస్ధితిని ఇంత దూరం తీసుకొచ్చావ్ అని రాజ్ నిలదీస్తాడు. నువ్వు నడిచిన బాటలోనే నేను నడుస్తానని, నువ్వు తప్పు చేయనప్పుడు నాది కూడా తప్పు కాదు అంటాడు. నువ్వు నాతో తేల్చుకోవాలి కానీ.. మధ్యలో నా కోడలేం చేసిందని అపర్ణ ప్రశ్నిస్తుంది. నువ్వు నాన్నకి పంపించిన విడాకుల నోటీసు వెనక్కి తీసుకుని ఇప్పుడే నాతో పాటే వచ్చేయాలని చెబుతాడు రాజ్. లేదంటే ఏ కోడలి కోసం ఇదంతా చేస్తున్నావో ఆ కోరిక జీవితంలో నెరవేరదని అంటాడు. నీ నిర్ణయం మార్చుకుంటే తప్ప నా నిర్ణయం మారదని తేల్చిచెబుతాడు.
కావ్య చేతుల్లో విడాకుల పేపర్స్ పెట్టి సారీ చెబుతాడు. ఇది మా అమ్మకు, నాకు మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పి.. నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నానని బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని అపర్ణకి చెబుతాడు. వెంటనే సీతారామయ్య వచ్చి రాజ్ చెంప పగులగొడతాడు. నువ్వు కడుపులో పడినప్పటి నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూసుకోవాలా అని ఎదురుచూసిన ఈ కన్నతల్లికి టైం ఇస్తున్నావా అని మండిపడతాడు. నీ కోసం, నీ కాపురం కోసం, నీ సంసారాన్ని నిలబెట్టాలని మహారాణిలా బతికిన మీ అమ్మ .. ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తుంటే ఆమెను వెనక్కి రప్పించడం కోసం ఇంత దిగజారిపోతావా అని సీతారామయ్య ప్రశ్నిస్తాడు.
నీ భార్య సహనాన్ని, సంసారాన్ని నీ అహంకారానికి బలి చేసే హక్కు ఎవరిచ్చారని నిలదీస్తాడు. ఉన్నత భావాలు, విశాలమైన ఆలోచనలు, మానవతా విలువలని నీ అహం అమాంతం మింగిసిందా అని మండిపడతాడు. నా వంశంలో నీలాంటి ఒక భ్రష్టుడు పుడతాడని నేను అస్సలు అనుకోలేదని సీతారామయ్య అనడంతో రాజ్ షాక్ అవుతాడు. అసలు కావ్యని ఎందుకు వద్దు అనుకుంటున్నావ్ ఒక కారణం చెప్పమని ఇందిర ప్రశ్నిస్తుంది. అర్ధాంతరంగా పెళ్లి ఆగిపోతుందని.. ఓ ఆడపిల్ల జీవితాన్ని కాపాడటం కోసం మేమంతా కావ్యతో నీ పెళ్లి జరిపించామని చెబుతుంది. ఒక మూర్ఖుడుకి ఇచ్చి పెళ్లి చేశామని బాధపడుతుంది.
కావ్య నాకు దేవుడిచ్చిన మనవరాలని.. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆమె దుగ్గిరాల వారింటి కోడలిగా శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంటుందని తేల్చిచెబుతాడు సీతారామయ్య. ధిక్కరించే అధికారం భర్తవైనా సరే నీకు లేదని అంటాడు. రాజ్ వెళ్లిపోగానే సీతారామయ్యకి చేతులెత్తి దండం పెడతారు కనకం, కృష్ణమూర్తి . ఈ జంటను కలపడానికి నా కోడలు ఏ అత్త చేయని సాహసం చేసిందని ఆమె ముందు మేం చేసింది ఎంత అని ప్రశ్నిస్తుంది ఇందిర. ఏ ధైర్యంతో నేను అక్కడికి రావాలి అని అడుగుతుంది కావ్య.
వాడి మనసులో నీ మీద ప్రేమ లేకుంటే మేమే నీకు మరో పెళ్లి చేసేవాళ్లమని .. కానీ చంద్రుడిని మబ్బులు కమ్మేసినట్లు వాడి ప్రేమని అహం కమ్మేసిందని అంటాడు సీతారామయ్య. మీ తాతయ్య తీసుకున్న నిర్ణయం వల్ల నీకు మంచే జరుగుతుందని అంటుంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే ఆ ఇల్లు ముక్కలైపోతుందని , నా మనవడి జీవితం తెగిన గాలిపటంలా మారుతుందని చెబుతుంది. నమ్మకంతో రా.. నీ నమ్మకాన్ని మేమంతా నిలబడేలా చేస్తామని అంటుంది. అయినప్పటికీ కావ్య వెళ్లడానికి అంగీకరించకపోవడంతో కృష్ణమూర్తి నచ్చచెబుతాడు. నువ్వొస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.. కావాలంటే వాడి తరపున నేను నీ కాళ్లు పట్టుకుంటానని సీతారామయ్య అనడంతో అంతా షాక్ అవుతారు. మీ ముందు నేనెంత, మీ మనవరాలిగానే ఉంటానని.. నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి నేను తప్పకుండా వస్తానని చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










