Brahmamudi December 12th Episode : షాకిచ్చిన సీతారామయ్య.. ధాన్యం- రుద్రాణి ప్లాన్ ఫెయిల్, ఆస్తి కావ్య చేతికి
రుద్రాణి, రాహుల్‌లు రెచ్చగొట్టడంతో ధాన్యలక్ష్మీ చెక్ తీసుకుని రాజ్ దగ్గరికి వెళ్లి రూ.2 కోట్లు అడుగుతుంది. వాళ్లకి ఇవ్వలేదని నిన్ను వెంటబెట్టుకుని వచ్చారా అని సుభాష్ మండిపడతాడు. ఒకప్పుడు అనామిక తండ్రికి రూ.2 కోట్లు ఇచ్చావ్ కదా అని ధాన్యలక్ష్మీ ప్రశ్నించగా.. తమ్ముడి పెళ్లి జరగడం కోసం ఇచ్చానని రాజ్ చెబుతాడు. రుద్రాణికి ఇస్తారో ఇవ్వరో నాకు అనవసరమని.. నాకు మాత్రం ఆస్తి పంచాల్సిందేనని ధాన్యలక్ష్మీ పట్టుబడుతుంది.
నాన్న తిరిగి వచ్చాక చూసుకుందామని సుభాష్ చెబుతుండగా.. నాన్న తిరిగి రాకపోతే అని రుద్రాణి అంటుంది. దీంతో ఇందిర వచ్చి ఆమె చెంప పగులగొడుతుంది. ఈ మాటలతో సుభాష్ ఓపిక నశించి మీలాంటి వాళ్లతో కలిసి ఉండలేనని రేపే లాయర్‌ని పిలిపించి మొత్తం ఆస్తిని పంచేస్తానని అంటాడు. మావయ్యని నిర్ణయం మార్చుకోమని కావ్య అడుగుతుంది కానీ దానిని సుభాష్ పట్టించుకోడు. ఆస్తి పంపకాలను ఆపమని రాజ్‌ను కోరుతుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 12వ తేదీ.. ఎపిసోడ్ 591 ఏం జరిగిందంటే..

తాతయ్య తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకున్నాడని.. ఆ రోజు నన్ను అడిగాడా , ఈరోజు ఆస్తి కోసం ఇంట్లో అంతా గొడవ చేస్తున్నారని ఒక్కరైనా నన్ను అడిగారా అని రాజ్ ప్రశ్నిస్తాడు. ఇంట్లో అందరూ నన్ను ప్రేక్షకుడిని చేసేశారని.. ఇంట్లో పరిస్థితులన్నీ నా చేయి దాటి వెళ్లిపోయాయని నేను చేయగలిగింది ఏమీ లేదని రాజ్ తేల్చి చెబుతాడు. తమ పథకం సక్సెస్‌ఫుల్‌గా అమలు కావడంతో ధాన్యలక్ష్మీని రుద్రాణి అభినందిస్తుంది. ఇంతలో ప్రకాష్ వచ్చి.. రోజు రోజుకు దీని మాయలో పడి మృగంలా మారిపోతున్నావని మండిపడతాడు.
ఆస్తి పంపకాల పేరుతో నువ్వు ఏదో సాధించానని అనుకుంటున్నావ్, కానీ ఏం కోల్పోతున్నావో అర్ధం కావడం లేదని ఫైర్ అవుతాడు. ఏదో ఒక రోజున చేసిన తప్పుకు బాధపడతావని.. నువ్వు సంపాదించిన ఆస్తిని వాళ్ల కాళ్ల ముందు పడేసినా వాళ్లు నీవైపు కూడా చూడరని హెచ్చరిస్తాడు. ఏదో ఒక రోజున రుద్రాణియే నిన్ను నిలువునా ముంచేస్తుందని వార్నింగ్ ఇస్తాడు. ఉదయాన్నే ఇంట్లో అంతా హాల్‌లో కూర్చొని వుండగా రాజ్ ఆఫీస్‌కి బయల్దేరతాడు. అతనిని ధాన్యలక్ష్మీ పిలిచి లాయర్ వస్తున్నాడని అంటుంది.. వచ్చి ఏం చేస్తాడు బంధాలు, బంధుత్వాలు అన్ని ముక్కలు చేసుకున్నాకా ఎవరికి వాళ్లే బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేసి పోతాడని మండిపడతాడు. ఆస్తులు ఒక్కటే ముక్కలు కావు పిన్ని.. అనుబంధాలు ముక్కలైపోతాయని, మనం అన్న స్థాయి నుంచి నేను , నా పిల్లలు అనే స్థాయికి పడిపోవటానికి కావాల్సిన పత్రాలు సిద్ధం చేసి పోతాడని ఆ శిథిలాలు ఏరుకోవడానికి నేను సిద్ధంగా లేనని చెబుతాడు రాజ్.
ఇందులో నీక్కూడా వాటా వస్తుందని రుద్రాణి చెప్పగా.. ఒక మహా వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించి కొమ్మలు, రెమ్మలు పంచుకోవడానికి నేను సిద్ధంగా లేనని అంటాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదని నువ్వు ఆస్తుల కోసం బంధాలను దూరం చేసుకుంటున్నావని హెచ్చరిస్తాడు ప్రకాష్. నేను ఆఫీసుకి వెళ్తానని రాజ్ బయల్దేరబోతుండగా కావ్య, అపర్ణలు ఆపుతారు. ఈ లోగా లాయర్ రావడంతో .. పిల్లల పేరు మీద ఆస్తి పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, దాని ప్రకారం ఆస్తిని సమానంగా పంచాలని చెబుతాడు సుభాష్.
దీంతో ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారని లాయర్ అడగ్గా.. నేనే తీసుకున్నానని చెబుతాడు సుభాష్. పెద్దాయనని కాదని మీరేలా నిర్ణయం తీసుకుంటారని లాయర్ ప్రశ్నిస్తాడు. ఆస్తిని ముక్కలు చేసి వాటాలు పంచమని చెప్పే హక్కు మీకు లేదని లాయర్ చెబుతాడు. మీకే కాదు ఈ ఇంట్లో ఎవరికీ లేదని అంటాడు. దీంతో రుద్రాణి లాయర్‌పై మండిపడి.. ఆ మాట చెప్పడానికి మీరెవరు, మేం చెప్పింది చేయడమే మీ పని అంటుంది. నా దగ్గర ఆధారాలు ఉండబట్టే మాట్లాడుతున్నానని.. లాయర్ ఆన్సర్ ఇస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
మీ నాన్నగారు మీతో ఏం చెప్పలేదా .. ఆయన వారం క్రితమే ఒక వీలునామా రాశారని లాయర్ చెప్పడంతో మాకెవ్వరికీ చెప్పలేదని రుద్రాణి అంటుంది. ఆ వీలునామా మీ దగ్గర ఉందా అని ఇందిర అడగ్గా ఉందని అంటారు లాయర్ . సీతారామయ్య గారు కోలుకుని ఇంటికి తిరిగొచ్చాక రావాలని అనుకున్నానని ఆయన చెబుతాడు. ఈలోపే పిలిపించడంతో సీతారామయ్య గారు మీకు చెప్పి ఉంటారని అనుకున్నానని అంటాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు దానిని తీసుకొచ్చానని చెబుతాడు. సీతారామయ్య గారు అనారోగ్యంతో మంచాన పడినా, లేక జరగరానిది జరిగినా ఈ వీలునామాను బయటపెట్టమని చెప్పినట్లు లాయర్ వెల్లడిస్తారు.
ఇంట్లో వాళ్లంతా ఫోర్స్ చేయడంతో లాయర్ వీలునామాను చదివి వినిపిస్తాడు. ఆస్తిని ముక్కలు చేయదలచుకోలేదని.. ఎవరికీ వాటాలు పంచదలచుకోలేదని సీతారామయ్య అన్నట్లుగా చెబుతాడు. ఇది ఉమ్మడి ఆస్తి అని .. నా పూర్తి స్వార్జితమని , ఉమ్మడిగానే ఉండాలని.. అందుకు పూర్తిగా సమర్ధురాలైన ఈ ఇంటి కోడలు, నా మనవరాలైన కావ్య పేరు మీద నా యావదాస్తిని రాస్తున్నానని వీలునామాలో సీతారామయ్య ప్రస్తావిస్తాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ షాక్ అవుతారు. ఇంత ఆస్తిని బయటి నుంచి వచ్చిన కావ్య పేరు మీద రాస్తారా అంటూ ధాన్యలక్ష్మీ మండిపడుతుంది.
అయితే వీలునామాను పూర్తిగా చదవనివ్వమని ప్రకాష్ అడ్డుపడతాడు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సర్వహక్కులు నా మనవరాలు కావ్యకే ఉన్నాయని సీతారామయ్య అందులో రాస్తాడు. ఈ స్థిర , చర ఆస్తులు ఎవరూ అమ్ముకోవడానికి గానీ.. వాటాలు పంచుకోవడానికి గానీ వీల్లేకుండా లీగల్‌గా ఆస్తులన్నీ కావ్య పేరు మీదకి మార్చడం జరిగిందని వీలునామాలో ఉంటుంది. భర్త పెద్ద మనసు, దూరాలోచనను ఇందిర మెచ్చుకుంటుంది. నన్ను ఓ పెద్ద సమస్య నుంచి కాపాడారని లాయర్‌కు సుభాష్, అపర్ణలు లాయర్‌కి థ్యాంక్స్ చెబుతారు.
లాయర్ వెళ్లిపోగానే ధాన్యలక్ష్మీ గొడవ చేస్తుంది. నా పేరిట రాయకపోయినా పర్లేదు కానీ.. బావ గారు కానీ , రాజ్ పేరు మీద కానీ మావయ్య గారు ఆస్తి ఎందుకు రాయలేదని ప్రశ్నిస్తుంది . ఈ ఇల్లు ముక్కలు కాకూడదన్నదే మావయ్య గారి ఉద్దేశమని అపర్ణ అంటుంది. నా భర్త ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఎంతో పరమార్ధం ఉంటుందని ఇందిర చెబుతుంది. ఈ వీలునామాను నేను ఆమోదించనని , కోర్టుకెక్కుతానని వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మీ. ఇంట్లో గొడవతో దేవుడి దగ్గర మొర పెట్టుకుంటుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










