Brahmamudi December 25th Episode : కావ్యని ముంచేసిన స్వప్న .. కష్టాల్లో రాజ్ - కళావతి, రుద్రాణి ఆకలి కేకలు
ఇకపై ఇంట్లో తాను చెప్పినట్లే నడవాలని కావ్య ఆర్డర్స్ వేసే సరికి రుద్రాణి, ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. రాజ్ కూడా కళావతికే సపోర్ట్ చేయడంతో వాళ్లిద్దరూ సైలెంట్ అవుతారు. కంపెనీని, కుటుంబాన్ని కాపాడినందుకు భార్యకు థ్యాంక్స్ చెబుతాడు రాజ్. వెళ్లిపోయిన పనిమనిషి శాంత తిరిగి రావడంతో రుద్రాణి ఆమెపై మండిపడుతుంది. ఇంతలో కావ్య వచ్చి శాంతను పొమ్మనే అధికారం ఎవరికీ లేదని చెబుతుంది. ఆసుపత్రిలో కోమాలో ఉన్న సీతారామయ్య ఎప్పుడు కోలుకుంటాడని ఇందిర డాక్టర్‌ను నిలదీస్తుంది.
ఉదయాన్నే టిఫిన్‌లో ఇడ్లీలు తప్పించి మరో వెరైటీ ఉండకపోవడంతో శాంతపై రుద్రాణి, ధాన్యలక్ష్మీలు మండిపడతారు. దీంతో కావ్య వచ్చి ఇకపై రోజుకొక వెరైటీ మాత్రమే ఉంటుందని తేల్చిచెబుతుంది. అయితే కావ్యలో ఎప్పుడూ లేని మార్పు చూసి అపర్ణలో కొత్త అనుమానాలు మొదలవుతాయి. ప్రకాశం బిజీగా ఉండగా ధాన్యలక్ష్మీ వచ్చి ఇడ్లీల పంచాయితీ తీసుకురావడంతో అతను మండిపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 25వ తేదీ.. ఎపిసోడ్ 602లో ఏం జరిగిందంటే..

కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు అధికారం మొత్తం ఆ కావ్య చేతికి ఇవ్వడంతో అది ఇష్టమొచ్చినట్లుగా ఎగురుతుందని ప్రకాశంతో చెబుతుంది ధాన్యలక్ష్మీ. కోట్ల ఆస్తి పెట్టుకుని రోజుకొక టిఫిన్ మాత్రమే చేస్తానని అదే తినాలని అంటే మీకు అనుమానంగా లేదా అని ప్రశ్నిస్తుంది. కోట్ల ఆస్తి ఉంది కదా అని వృథా ఖర్చులు చేయకూడదు కదా.. అలాంటప్పుడు నేనేందుకు తప్పుబడతానని ప్రకాశం నిలదీస్తాడు. అది అన్ని మాటలు అన్నాక నేనేందుకు తింటాను, నాకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకుంటానని చెబుతుంది ధాన్యలక్ష్మీ.
గార్డెన్‌లో ఒంటరిగా ఆలోచిస్తున్న అపర్ణ దగ్గరికి కావ్య వచ్చి మీక్కూడా నా మీద కోపం వచ్చిందా అని అడుగుతుంది. నువ్వేం చేసినా దాని వెనుక ఏదో ఉంటుందని నాకు తెలుసని.. ఒకవేళ నువ్వు చేసేది తప్పు అనిపిస్తే నువ్వే చేయవు కదా అని అంటుంది. మనిషిని అర్ధం చేసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని అనగా.. కావ్య అత్తగారికి థ్యాంక్స్ చెబుతుంది. ఆకలి అంటే చాలు వెనుకా ముందు ఆలోచించకుండా అన్నం పెట్టే నువ్వు.. నీ సొంతింట్లోనే ఇలా చేస్తున్నావంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నానని చెబుతుంది అపర్ణ.
కుటుంబ గౌరవం కాపాడటమంటే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టడం కాదని.. పస్తులు ఉండైనా సరే పది మందిలో ఇంటి పరువు రచ్చకెక్కకుండా చూసుకోవడమే అని అంటుంది. నీ దగ్గర అది కావాల్సినంత ఉందని , నీకు నచ్చినట్లుగా చేయ్యమని కావ్యకి చెబుతుంది అపర్ణ. చాలా బలమైన కారణం వల్లే ఇలా ఉండాల్సి వస్తోందని.. అది ఇప్పుడు చెప్పలేనని, చెప్పే టైం వచ్చాక ముందు మీకే చెబుతానని అంటుంది కావ్య.
చెప్పినట్లుగానే ఆర్డర్ పెట్టుకుని టిఫిన్ తెప్పించుకుంటారు ధాన్యలక్ష్మీ - రుద్రాణి. కావ్య చూస్తుండగా ఆర్డర్ చేసిన వెరైటీల గురించి చెబుతుంది రుద్రాణి. మిగిలితే చెత్త బుట్టలో పడేస్తామని అంటుంది. వాళ్ల తిండి చూసి స్వప్న పకపక నవ్వడంతో రుద్రాణి ఎందుకిలా నవ్వుతున్నావని అడుగుతుంది. మీరు ఆకలితో తింటున్నట్లుగా లేదు.. కావ్య మీద కడుపు మంటతో తింటున్నట్లుగా ఉందని స్వప్న అంటుంది. తినాలని అనిపిస్తే తినాలంటూ కావ్యను ఉద్దేశించి అంటుంది ధాన్యలక్ష్మీ. అవసరానికి మించింది ఏదైనా విషమని కౌంటర్ ఇస్తుంది కావ్య. వీళ్లను కంట్రోల్ చేద్దామని ప్రయత్నిస్తుంటే ఇంకా రెచ్చిపోతున్నారని , బయటి నుంచి ఆర్డర్ చేసి డబ్బులు వేస్ట్ చేస్తున్నారని బాధపడుతుంది.
ఆసుపత్రిలో భర్త బెడ్ పక్కన కూర్చొని ఏడుస్తుంది ఇందిర. ఇంతలో రాజ్, కావ్యలు అక్కడికి వస్తారు. జీవితాంతం మా బావ నా తోడుగా ఉంటారని మాట ఇచ్చారని , కానీ ఇప్పుడిలా పడి వున్నాడని బాధపడుతుంది ఇందిర. హాస్పిటల్ వాళ్లకి కట్టాల్సిన 5 లక్షల బిల్‌కు సంబంధించి చెక్‌ని కళ్యాణ్‌కిచ్చి దానిని కట్టేయమంటాడు రాజ్. ఇంతలో మధ్యాహ్నం వంట ఏం చేశావని శాంతను అడుగుతుంది రుద్రాణి. తోటకూర పప్పు, మజ్జిగ పులుసు చేశానని అంటుంది శాంత. హాస్పిటల్‌లో అన్నదానం చేసేవాళ్లు కూడా రెండు మూడు కర్రీలు వేస్తారని , ఆ కావ్యకి ఇంత చేదస్తం ఏంటో అని ధాన్యం మండిపడుతుంది.
కావ్య బయటికి వెళ్తుంది కాబట్టి నచ్చింది తింటుందని, ఇంట్లో వాళ్లు మాత్రం ఒక కర్రీనే తినాలని రూల్ పెట్టిందని ఫైర్ అవుతుంది. ఆ రూల్స్‌తో మనకి పనిలేదని ఆన్‌లైన్‌లో మనకి నచ్చింది ఆర్డర్ పెట్టుకుందామని రుద్రాణి అంటుంది. కానీ వాళ్ల కార్డ్‌లు బ్లాక్ అవుతాయి. ఇద్దరి కార్డ్‌లు ఒకేసారి ఎందుకు బ్లాక్ అయ్యాయని ధాన్యలక్ష్మీ ప్రశ్నించగా.. అవి అవ్వలేదని ఆ కావ్యే బ్లాక్ చేసిందని రుద్రాణి ఫైర్ అవుతుంది. దీనిని ఇలాగే వదిలేస్తే రేపు మన నగల్ని కూడా తాకట్టు పెట్టి నేను ఇచ్చినప్పుడే వేసుకోమ్మని అంటుందని ధాన్యం భయపడుతుంది.

దీని గురించి తేల్చుకోవాల్సిందేనని వాళ్లిద్దరూ సుభాష్ దగ్గరికి వెళ్తారు. మీ కోడలు అధికారం నెత్తికొచ్చిందని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తోందని ధాన్యలక్ష్మీ చెబుతుంది. మేం తృప్తిగా ఫుడ్ తిందామంటే మా కార్డ్స్‌ని బ్లాక్ చేసిందని రుద్రాణి చెప్పడంతో సుభాష్ బ్యాంక్ వాళ్లకి ఫోన్ చేయడంతో కావ్య మేడం వాటిని బ్లాక్ చేయాల్సిందిగా చెప్పారని బ్యాంక్ అఫీసర్ చెబుతాడు. కావ్య ఏం చేసినా దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని, అదేంటో నేను కనుక్కుంటానని అంటాడు సుభాష్.
కావ్య- రాజ్‌లు కారులో వెళ్తుండగా బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి వచ్చిన చెక్ క్లియర్ చేయడానికి కావాల్సిన అమౌంట్ లేదని చెప్పడంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. వెంటనే ఆఫీస్‌కి ఫోన్ చేసి అడగ్గా.. మీరు 20 లక్షలు వాడుకోమంటే అందులో రూ.15 లక్షలే ఉన్నాయని మేనేజర్ చెబుతాడు. దీంతో ఆ 10 లక్షలు ఏమయ్యాయో తెలియక.. స్వప్నకి ఇచ్చిన ఖాళీ చెక్ గుర్తొచ్చి ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయదు. మరోవైపు.. రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఆకలికి తట్టుకోలేక శాంత వండిన భోజనాన్ని తినడానికి వెళ్లగా మీరు తినరేమోనని ముష్టివాళ్లకి వేశానని అంటుంది శాంత. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










