Brahmamudi December 26th Episode : నిజం నిరూపించిన రాజ్.. దోషిలా స్వప్న , కావ్యకి కొత్త శత్రువు
ఇంట్లో రోజురోజుకి కావ్య పెత్తనం పెరిగిపోవడంతో ప్రకాశంపై మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. కావ్య ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక అర్ధం ఉంటుందని ప్రకాశం అనడంతో ధాన్యలక్ష్మీ కోప్పడుతుంది. గార్డెన్‌లో అత్తగారి దగ్గరికి వెళ్లిన కావ్యకి ధైర్యం చెబుతుంది అపర్ణ. నేను ఇంత కఠినంగా ఉండటానికి కారణం ఏంటన్నది తర్వాత చెబుతానని అంటుంది కావ్య.
ఇంట్లో ఇడ్లీలు తినేది లేదని చెప్పిన రుద్రాణి - ధాన్యలక్ష్మీలు బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటారు. వీళ్లని ఎలాగైనా కంట్రోల్ చేయాలని భావించిన కావ్య వాళ్ల క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ చేస్తుంది. ఆసుపత్రిలో భర్త ఎప్పుడు కోలుకుంటాడా అని బాధపడుతుంది ఇందిర. తాతయ్య హాస్పిటల్ బిల్ కోసం ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పాటు ఆఫీసు అకౌంట్‌లోనూ డబ్బు మాయం కావడంతో కావ్య - రాజ్‌లు షాక్ అవుతారు. ఆకలికి తట్టుకోలేక శాంత వండిన భోజనాన్ని తినడానికి వెళ్తారు ధాన్యం - రుద్రాణి.. అయితే మీరు తినరని చెప్పడంతో దానిని ముష్టివాళ్లకి వేసినట్లు చెబుతుంది శాంత. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 26వ తేదీ.. ఎపిసోడ్ 603లో ఏం జరిగిందంటే..

వేడి వేడిగా వంట చేసి తీసుకురా అని శాంతపై రుద్రాణి, ధాన్యలక్ష్మీ మండిపడతారు. మళ్లీ వంట అంటే కావ్య మేడంని అడగాలని , మీరు ఆమెను అడిగి ఒక మాట చెబితే నేను వండేస్తానని అంటుంది శాంత. ప్రతిసారి కావ్య గోల ఏంటి అంటూ వారిద్దరూ రగిలిపోతున్న టైంలో స్వప్న ఎంట్రీ ఇస్తుంది. నన్ను చూస్తే మీకు కొత్తగా ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా అని అడుగుతుంది. నా మెడలో మెరిసిపోతున్న నెక్లెస్ ఎలా ఉంది అని అడుగుతుంది స్వప్న. రోల్డ్ గోల్డ్ అయి ఉంటుందని రుద్రాణి చెప్పగా.. కాదు ఇది 916 ప్యూర్ గోల్డ్ అంటుంది స్వప్న. ఆ మాటలతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ షాక్ అవుతారు.
వీటి కాస్ట్ ఎంతో తెలుసా 10 లక్షలు , మా చెల్లి ఇచ్చింది అనగానే ఇద్దరూ తెల్లబోతారు. తన చేతులతో చెక్ ఇచ్చింది.. నా చేతులతో తెచ్చుకున్నానని అంటుంది స్వప్న. మేం వృథా ఖర్చులు చేస్తున్నామని సింగిల్ కర్రీ వండిస్తున్న కావ్య.. నీకు మాత్రం 10 లక్షలు ఇచ్చిందా అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీలు మండిపడతారు. కొన్ని ముఖాలు చూస్తే పెట్టబుద్ధి అవుతుందని.. ఆయన మా చెల్లి బంగారమని, నెక్లెస్ కొనుక్కోమని డబ్బులిచ్చిందని గాల్లో తేలిపోతుంది స్వప్న. ఆ వెంటనే గార్డెన్‌లో టీ తాగుతున్న అపర్ణ - సుభాష్‌ల దగ్గరికి కోపంగా వెళ్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ.
సమన్యాయం అని మాట్లాడే కావ్య.. సొంత అక్కకి ఒక్కలా, మాకోక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తోందని ధాన్యం మండిపడుతుంది. ఇంట్లో ఖర్చులు అదుపులో పెట్టాలని సింగిల్ టిఫిన్, సింగిల్ కర్రీ చేయిస్తున్న కావ్య.. తన అక్కకి మాత్రం రూ.10 లక్షలు పెట్టి బంగారం తీసుకొచ్చిందని చెబుతుంది రుద్రాణి. మాకు తెలిసింది కాబట్టి స్వప్నకు కావ్య 10 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది .. తెలియకుండా వాళ్ల పుట్టింటికి ఎంతెంత పంపిస్తుందో ఎవరికి తెలుసని అంటుంది రుద్రాణి. ఆ మాటలతో సుభాష్ మండిపడతాడు. నిజంగా స్వప్నకు కావ్య ఇచ్చిందో తెలియకుండా నిందలు వేయడం తప్పు అని అంటాడు . మేం అన్ని కనుక్కోనే వచ్చామ్.. కావ్యే 10 లక్షలు ఇచ్చిందని స్వప్నే స్వయంగా ఇచ్చిందని చెబుతుంది ధాన్యలక్ష్మీ.
అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదని డబ్బులు లేవంటూనే స్వప్నకు ఎందుకు 10 లక్షలు పెట్టి నెక్లెస్ కొనిచ్చిందని కావ్యపై మండిపడతాడు సుభాష్. దీంతో అపర్ణ అతనికి నచ్చచెబుతుంది. ఆఫీస్ నుంచి వచ్చిన కావ్యపై రుద్రాణి, ధాన్యలక్ష్మీలు అంతెత్తున లేస్తారు. నీ గురించి తెలియక మావయ్య గారు ఆస్తి మొత్తం రాశారని.. ఆయనే ఉండి ఉంటే మొత్తం వెనక్కి లాక్కునేవారని మండిపడుతుంది ధాన్యం. మా కార్డ్స్ బ్లాక్ చేశావా అని రుద్రాణి ప్రశ్నించగా ఔనని అంటుంది కావ్య. మీ ఇంటికి ఎన్ని లక్షలు వెళ్తున్నాయ్, ఎన్ని అకౌంట్లు ఓపెన్ అయ్యాయ్, ఎన్ని కార్డ్స్ పుట్టుకొచ్చాయ్ అని ప్రశ్నిస్తుంది రుద్రాణి.
అత్తింటి డబ్బును పుట్టింటికి పంపించే చీప్ క్యారెక్టర్ కాదని కావ్య ఆన్సర్ ఇస్తుంది. అయితే అత్తింటి వాళ్ల కార్డ్స్ బ్లాక్ చేసి మీ అక్కకి గోల్డ్ నెక్లెస్ కొనివ్వొచ్చా అని ప్రశ్నిస్తుంది ధాన్యం. దాంతో షాకైన కావ్య.. వెంటనే స్వప్నను కిందకి పిలుస్తుంది. గోల్డ్ నెక్లెస్ గురించి మా అత్త, మీ చిన్నత్త పంచాయతీ పెట్టారా అని స్వప్న ప్రశ్నిస్తుంది. ఈ నెక్లెస్‌ని ఎవరిని అడిగి కొన్నావ్.. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది కావ్య. నువ్వే కదా చెక్ ఇచ్చావ్ అని స్వప్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
నేను చెక్ ఇచ్చి గోల్డ్ నెక్లెస్ కొనుక్కోమని చెప్పానా అని స్వప్నని ప్రశ్నిస్తుంది కావ్య. నాటకాలు ఆపాలంటూ ధాన్యం మండిపడుతుంది. నీ మనవరాలు తన అక్కకి 10 లక్షలు రాసివ్వొచ్చు కానీ, 10 రకాల టిఫిన్లు పెట్టకూడదా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇలాంటి గొడవలు జరుగుతాయనే ఆస్తి పత్రాలు, తాళాలు అత్తయ్యకి.. మా ఆయనికి ఇచ్చేశానని కానీ వాళ్లంతా కలిసి నా నెత్తి మీద ముళ్ల కిరీటం పెట్టారని బాధపడుతుంది కావ్య. ఎందుకీ మాటలు పడాలి, ఎందుకీ నిందలు మోయాలి అని ప్రశ్నిస్తుంది .
ఆస్తులు నా పేరిట ఉండటం, తాళాలు నా చేతుల్లో ఉండటం మీకెవ్వరికి నచ్చడం లేదు .. అందుకే అవకాశం దొరికింది కదా అని ఇలా మాట్లాడుతున్నారని మండిపడుతుంది కావ్య. అందరి కార్డ్స్ బ్లాక్ చేయించి , నువ్వు స్వప్నకి చెక్ ఇచ్చావ్ అంటున్నారు , ఈ విషయంలో వాళ్లు ప్రశ్నించడం న్యాయమే నువ్వు సమాధానం చెప్పాలని అంటాడు సుభాష్. ఎవరికీ కావ్య సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రాజ్ చెబుతాడు. స్వప్న దగ్గరికి వెళ్లి.. కళావతి నీకు చెక్ ఇచ్చినప్పుడు ఏమని చెప్పింది అని ఆమెను ప్రశ్నిస్తాడు.
ఇంట్లో ఎవరికైనా అవసరమైతే ఇవ్వమని చెప్పి చెక్ ఇచ్చింది.. కానీ ఎవ్వరూ నన్ను అడగలేదు, ఏ అవసరం రాలేదని అందుకే ఈ నెక్లెస్ కొన్నానని అంటుంది స్వప్న. ఇప్పుడైనా అర్ధమైందా, నా భార్య పుట్టింటికి రూపాయి కూడా దోచి పెట్టడం లేదని రాజ్ చెబుతాడు. ఇంట్లో ఇంత జరుగుతుంటే నీకు ఇంత ఖరీదైన నెక్లెస్ కొనుక్కోవడం కరెక్టేనా అని స్వప్నని ప్రశ్నిస్తుంది కావ్య. నీకు తాతయ్య ప్రాపర్టీ రాసిచ్చారు కదా దానిలో నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని అంటూ క్లాస్ తీసుకుంటుంది కావ్య. ఈ నెక్లెస్ కోసమే కదా నన్ను ఇంత మంది ముందు అవమానించావ్ అంటూ స్వప్న నగలను కావ్యకి ఇచ్చేసి కోపంగా వెళ్లిపోతుంది.
ఇదంతా పెద్ద నాటకమని.. ముందే కావ్య ఇలా ప్లాన్ చేసిందని ధాన్యలక్ష్మీ అనడంతో అపర్ణ మండిపడుతుంది. నా కొడుకే సాక్ష్యం చెప్పాడని అయినా మీ డౌట్స్ క్లారిఫై కాలేదా అని అంటుంది. మా కార్డ్స్, తిండి మీద ఆంక్షలు ఎందుకు పెట్టినట్లని ధాన్యం ప్రశ్నించగా.. నేను ఇంతేనని తేల్చిచెబుతుంది కావ్య. ఇక నుంచి నేను ఎవ్వరికీ సమాధానం చెప్పనని, ఎవరికీ సంజాయిషీ ఇవ్వనని అంటుంది . మాకు ఖర్చు పెట్టుకునే స్వాతంత్య్రం లేదా, ఆస్తి గురించి అడిగే హక్కు లేదా అని ధాన్యం ప్రశ్నించగా.. లేదు అని తేల్చిచెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










