Brahmamudi December 27th Episode : అక్కాచెల్లెళ్ల మధ్య తెగిన బంధం .. కావ్య గుండె ముక్కలు, రుద్రాణి మాయలో స్వప్
ఆకలితో బాధపడుతున్న రుద్రాణి, ధాన్యలక్ష్మీ ముందు నెక్లెస్, ఒంటి నిండా బంగారం వేసుకుని స్వప్న ప్రత్యక్షమవుతుంది. దీనికి నీకు డబ్బు ఎక్కడిదని వాళ్లు అడగ్గా.. మా చెల్లి ఇచ్చిందని చెప్పడంతో మా కార్డ్స్ అన్ని బ్లాక్ చేసి నీకు రూ.10 లక్షలు ఇచ్చిందా అని సుభాష్ - అపర్ణల దగ్గరికి వెళ్లి గొడవ చేస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మీ.
సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన కావ్యతో రుద్రాణి - ధాన్యలక్ష్మీలు గొడవ పడతారు. మాకు డబ్బు ఇవ్వకుండా మీ అక్కకి మాత్రం రూ.10 లక్షలు ఇచ్చి నెక్లెస్ కొనిస్తావా అని అడుగుతారు. దాంతో స్వప్నపై మండిపడిన కావ్య.. నీకు డబ్బు ఎవరిచ్చారు అని అడగ్గా, నువ్వేగా చెక్ ఇచ్చావ్ అంటుంది స్వప్న. దీంతో కావ్యని రుద్రాణి- ధాన్యంలు నానా మాటలు అంటారు. అయితే రాజ్ జోక్యం చేసుకుని అసలు నిజం స్వప్నతోనే చెప్పిస్తాడు. అందరి ముందు జరిగిన అవమానంతో స్వప్న బాగా హర్టయి నగలు మొత్తం కావ్యకి ఇచ్చేసి వెళ్లిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 27వ తేదీ.. ఎపిసోడ్ 604లో ఏం జరిగిందంటే..

డబ్బు దుబారా చేయొద్దని కరాఖండీగా చెప్పేస్తుంది కావ్య. అలాగే ఈ విషయంలో మా అత్తగారిని కానీ, మీ అత్తగారిని కానీ లాగితే మర్యాదగా ఉండదని ధాన్యలక్ష్మీని హెచ్చరిస్తుంది. దీంతో మండిపడిన రుద్రాణి.. నీ భార్య ఎలా మాట్లాడుతుందో చూశావా అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది. నా భార్య ఏం చేసినా ఈ ఇంటి కోసమే చేస్తుందని.. ఎక్కువ మాట్లాడితే మీ అందరినీ ఉద్యోగాలు చేసుకుని బతకమంటుంది అని రాజ్ ఆమెను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు.
అంతమందిలో అక్క అని కూడా చూడకుండా అవమానించిందని కావ్యపై మండిపడుతుంది స్వప్న. ఇంతలో రుద్రాణి - రాహుల్ వచ్చి స్వప్నని మరింత రెచ్చగొడతారు. కావ్య చేతికి అధికారం వస్తే నిన్ను ఇలాగే అవమానిస్తుందని నేను ముందే హెచ్చరించానని నువ్వే వినలేదని.. ఇప్పటికైనా ఎవరు నీవాళ్లో, ఎవరు పరాయివాళ్లో అర్ధం చేసుకోమ్మని అంటుంది రుద్రాణి. ఆ మాటలన్నీ శ్రద్ధగా విన్న స్వప్న మిమ్మల్ని ఎలా కొడితే బుద్ధి వస్తుందా అని అనేసరికి రుద్రాణి - రాహుల్ షాక్ అవుతారు.
అది వయసులో నా కంటే చిన్నదే అయినా బాధ్యతలో నా తల్లిలాగే ప్రవర్తిస్తుందని.. నిజంగానే తను ఈ ఇంటి ఖర్చుల కోసమే ఇచ్చిందని , నేనే తొందరపడి ఆ నెక్లెస్ కొనుక్కున్నానని అంటుంది స్వప్న. ఎప్పుడు చూడు ఎవరి మధ్యలోకి దూరదామా, ఎవరిని విడగొడదామా, ఆస్తిని ఎలా కాజేద్దామా , ఇంటిని ఎలా ముక్కలు చేద్దామా ఇవి తప్పించి వేరే ఆలోచనలు రావా అంటూ మండిపడుతుంది. స్వప్న ఫస్ట్ టైం దెబ్బతిన్నది , లోపల కోపం అలాగే ఉంది.. ఈసారి దొరికినప్పుడు చెబుతానని కొడుకుతో రుద్రాణి అంటుంది.

కిచెన్‌లో వంట చేస్తున్న కావ్య దగ్గరికి వెళ్లి ఆమెపై కేకలు వేస్తుంది స్వప్న. నీ దృష్టిలో నేను కూడా పరాయి దానిలా కనిపిస్తున్నానా అని నిలదీస్తుంది. తప్పు ఎవరు చేసినా దానిని తప్పే అంటానని ఈ విషయం నీకు బాగా తెలుసని అంటుంది కావ్య. ఇందాకా నీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరని .. దుగ్గిరాల ఫ్యామిలీలో ఏ సంబంధం లేనట్లు మాట్లాడావని మండిపడుతుంది స్వప్న. ఆస్తి నీ చేతికి వచ్చేసరికి నువ్వు మారిపోయావని అనేసరికి కావ్యకి కోపం వస్తుంది.
నేను ఇంతే.. నీకు ఏమైనా కావాలంటే తాతయ్య నీకు రాసిచ్చిన ప్రాపర్టీ నుంచి ఖర్చు పెట్టుకో, లేదంటే నీ మొగుడిని అడుగు.. జాగ్రత్తగా ఉండకపోతే ఈ మాత్రం నీడ కూడా ఉండదని కావ్య రివర్స్ అవుతుంది. ఆ మాటలతో స్వప్న బాధపడుతుంది. ఆస్తులు రాగానే సొంత అక్కని కూడా పరాయిదానిలా చూస్తావా? ఇంత దారుణంగా మారిపోతావా? నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తావా? అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆమె మాటలతో కావ్య కంటతడి పెడుతుంది.
రూమ్‌లో బుక్స్ చదువుకుంటున్న ప్రకాశం దగ్గరికి కోపంగా వస్తుంది ధాన్యలక్ష్మీ. ఇన్నాళ్లు ఆస్తి కోసమే పోరాడే దాన్నని.. ఇప్పుడు తినే తిండి, కట్టే బట్ట గురించి కూడా పోరాడాల్సి వస్తోందని.. ఇవాళ నాకు, రుద్రాణికి జరిగిన అవమానం రేపు మీకు జరిగితే తెలుస్తుందని అంటుంది. డబ్బు విషయం వచ్చేసరికి సొంత అక్కనే ఎలా తిట్టిందో చూశారు కదా.. రేపు మరిదిని లెక్క చేస్తుందా అని ప్రశ్నిస్తుంది ధాన్యం. ఆమె మాటలు విన్న ప్రకాశం.. ఈ విషయం గురించి అన్నయ్యతో మాట్లాడతానని అంటాడు ప్రకాశం.

రాత్రి బెడ్ రూంలోకి వచ్చిన కావ్యతో నీ కోపం ఇంకా తగ్గలేదా అని అడుగుతాడు రాజ్. ఎవరి మీద అక్క మీదా అని అడుగుతుంది కావ్య.. నిజంగానే తను కావాలని ఏ తప్పు చేయలేదని అంటాడు రాజ్. అందరిముందు స్వప్నతో అంత కఠినంగా మాట్లాడాల్సింది కాదని నచ్చచెబుతాడు. మన ఇంట్లో ఉన్న పరిస్ధితులు నీకు , నాకు తప్పించి ఎవరికీ తెలియదు కదా అని అంటాడు రాజ్. అందరి ముందు తిడితేనే తను చేసింది తప్పు అని తెలుసుకుంటుందని.. మిగిలిన వాళ్లకి కూడా అర్ధమవుతుందని అంటుంది కావ్య. ఒకే తల్లి కడుపున పుట్టామని చిన్నప్పటి నుంచి తిట్టుకుంటూ , కొట్టుకుంటూ పెరిగామని, ఎన్నోసార్లు విడిపోయాం.. తర్వాత కలిసిపోయామని గుర్తుచేస్తుంది కావ్య.
పుట్టిల్లు వేరు మెట్టినిల్లు వేరని.. అయినా నువ్వు అంత తిట్టినప్పటికీ నిన్ను అర్ధం చేసుకుని నీతో మాట్లాడదామని వచ్చిన స్వప్నని మళ్లీ తిట్టావు.. నేను అప్పుడు అక్కడే ఉన్నానని, ఎందుకు స్వప్నని అవమానించావని ప్రశ్నిస్తాడు రాజ్. అక్క అడిగిన ప్రతి ప్రశ్నలోనూ న్యాయం ఉందని.. కానీ ఆమెకు సమాధానం చెప్పాల్సి వస్తే తాతయ్య గారి ష్యూరిటీ గురించి, 100 కోట్ల గురించి చెప్పాల్సి వస్తుందని అంటుంది కావ్య. మా అక్కకి అసలే కంగారని.. 100 కోట్లు కట్టుకుంటే మనం రోడ్డున పడతామన్న విషయం చెబితే అందరికీ చెప్పకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తుంది కళావతి. తాతయ్య మాట నిలబెట్టే వరకు ఎవరు ఏమని అనుకున్నా పర్లేదని ఎవరితోనైనా నా రియాక్షన్ ఇలాగే ఉంటుందని తేల్చిచెబుతుంది కావ్య.
ఉదయాన్నే బెడ్ రూంలో అటు ఇటు తిరుగుతున్న రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య. 5 లక్షల కోసం నా జీవితంలో ఇంత టెన్షన్ పడలేదని రాజ్ అనగా.. డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరికి పడితే వాళ్లకి అపాత్ర దానం చేయకూడదని అంటుంది కావ్య. రాత్రి మా అక్క నా ముఖాన విసిరికొట్టిన గోల్డ్ నెక్లెస్ అమ్మి హాస్పిటల్ బిల్ పే చేద్దామా అని అడగ్గా.. రాజ్ వద్దు అంటాడు. ఇంట్లో వాళ్లంతా హాల్‌లో ఉండగా.. ప్రకాశంను బలవంతంగా కిందకి తీసుకొస్తుంది ధాన్యం. రాత్రి మీ అన్నయ్యని కడిగేస్తాను, అడిగేస్తాను అన్నారు కదా వచ్చి అడగండి అంటుంది . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










