Brahmamudi December 31st Episode: కళావతితో రాజ్ రొమాన్స్ ..కావ్యని ఇరికించిన రుద్రాణి, ధాన్యలక్ష్మీ రాద్ధాంతం
రాజ్ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది కంపెనీలో డబ్బులు లేవా? లేక నిజంగానే ఆడిటింగ్ చేయాల్సి వచ్చిందా? అని రుద్రాణి - ధాన్యలక్ష్మీలు మాట్లాడుకుంటూ ఉంటారు. తాతయ్య హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలో తెలియక టెన్షన్ పడుతున్న రాజ్‌కి కావ్య తన నగలు ఇచ్చి తాకట్టు పెట్టమంటుంది. తనను పట్టించుకోకపోవడంతో అలిగిన అప్పూకి కళ్యాణ్ తన తాతయ్య కోమాలోకి వెళ్లినట్లు చెబుతాడు.
ఉదయాన్నే అద్దె కారుల బిల్లు రావడంతో రాజ్ షాక్ అవుతాడు. దానిని ఎలా కట్టాలో తెలియక టెన్షన్ పడుతుండగా కావ్య వచ్చి ధైర్యం చెబుతుంది. మన కార్లు మన దగ్గరే పెట్టుకుని అద్దె కార్లను పంపించేద్దామని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక డిసెంబర్ 31వ తేదీ.. ఎపిసోడ్ 607లో ఏం జరిగిందంటే..

కాఫీ గురించి పనిమనిషి శాంతో గొడవ పెట్టుకుంటుంది రుద్రాణి. నేను కాఫీ ఇస్తాను కానీ రెండోసారి అడగకూడదని అంటుంది శాంత. నా ఇష్టమొచ్చినన్ని సార్లు తాగుతాను.. ఇవ్వవా అని రుద్రాణి ప్రశ్నించగా.. ఈ ఇంట్లో ఎవరికైనా రెండుసార్లకు మించి కాఫీ ఇవ్వొద్దని కావ్య మేడం చెప్పిందని అంటుంది శాంత. ఏదో ఒకటి చావమని చెప్పి కావ్య తీసుకురమ్మంటుంది రుద్రాణి. అనంతరం బాల్కనీలో ఉండగా.. కావ్య - రాజ్‌లు ఆఫీస్‌కు బయల్దేరతారు. నేను మీ ఓనర్‌తో మాట్లాడానని.. మీ నాలుగు కార్లు మీరు తీసుకెళ్లమని ఓ డ్రైవర్‌తో చెబుతుంది. ఇదంతా పై నుంచి రుద్రాణి చూస్తుంది. కార్లన్నీ పంపించేశావ్ కదా.. ఇంట్లో వాళ్లకి ఏం చెబుతావ్ అని కావ్యని రాజ్ ప్రశ్నిస్తాడు. ఏ గొడవ జరిగినా నేను చూసుకుంటానని కావ్య చెబుతుంది.
కావ్య దొరికిపోయిందని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. కార్ల విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెప్పి గొడవ పెడతానని.. కావ్య నుంచి ఆస్తిని , అధికారాన్ని లాక్కోవాలని అంటుంది . జగదీష్ గారి కాంట్రాక్ట్ పూర్తి చేయాలంటే మనకి ఇన్వెస్ట్‌మెంట్ కింద రూ 5 కోట్ల వరకు కావాలని, ఆపైన కూడా కావాలని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని రాజ్ బాధపడతాడు. నారు పోసిన వాడే నీరు పోస్తాడని కావ్య చెప్పగా.. పనికిరాని సామెతలు ఎందుకు అంటూ రాజ్ విసుక్కుంటాడు. ఇంతలో జగదీష్ చంద్ర ప్రసాద్ రావడంతో రాజ్ షాక్ అవుతాడు.
మీ పని మీదే ఉన్నాం సార్.. మీరిచ్చిన టైం పీరియడ్ పూర్తి కాలేదు, ముందే వచ్చేశారేంటీ అని ప్రశ్నిస్తాడు రాజ్. నేను వర్క్ ఎక్కడి వరకు వచ్చిందో చూసి పోవడానికి రాలేదని.. కావ్య ఫోన్ చేస్తే వచ్చానని అంటాడు. రాజ్‌కి ఏం అర్ధం కాక.. ఏమని ఫోన్ చేసిందని అడుగుతాడు. అడ్వాన్స్ ఇవ్వమని ఫోన్ చేసిందని.. అడ్వాన్స్ కింద రూ.5 కోట్లు ఇస్తున్నాని అనడంతో రాజ్ షాక్ అవుతాడు. చెక్ తీసుకుని కావ్య వైపు చూస్తుంటాడు. జగదీష్ చంద్ర ప్రసాద్ వెళ్లిపోయాక కావ్యని ఎత్తుకుని కళావతి నువ్వు సూపర్ అంటూ గాల్లో తిప్పేస్తాడు రాజ్. ఇంతలో శృతి రావడంతో కావ్యను కిందపడేస్తాడు.
మీకు ఆనందం వస్తే ఎత్తుకుని తిప్పేస్తారు.. ఎవరైనా వస్తే కింద పడేస్తారు అంటూ రాజ్‌పై మండిపడుతుంది కావ్య. దీంతో శృతిపై రాజ్ కోప్పడతాడు. మేం ఛాంబర్‌లో ఉండగా అత్తగారింటికి వచ్చినట్లు వచ్చేస్తావా అంటూ ఫైర్ అవుతాడు. మీరు తలుపు వేసుకుని మేడంని ఎత్తుకోవాలి కానీ.. డోర్ ఓపెన్ చేస్తే మాకు ఎలా తెలుస్తుందని అంటుంది శృతి. దీంతో మండిపడిన రాజ్.. నీ ఇంక్రిమెంట్ కట్ అంటూ షాకిస్తాడు. ఎత్తుకున్న మేడం బాగానే ఉన్నారు.. కింద పడిన మేడం బాగానే ఉన్నారు, చూసిన నా ఇంక్రిమెంట్ కట్ చేయడం ఏంటనీ శృతి ప్రశ్నిస్తుంది. మొన్నేమో ఆఫీస్‌కి రానిచ్చారు.. నిన్నేమో కాంట్రాక్ట్ వచ్చినందుకు పొగిడారు, ఇప్పుడేమో ఎత్తుకుని గిరగిరా తిప్పుతున్నారంటూ శృతి అనడంతో కావ్య సిగ్గుపడుతుంది.
కావ్య కార్లు పంపించేసిన విషయాన్ని చెప్పి ఇంట్లో గొడవ పెట్టాలని రుద్రాణి స్కెచ్ వేస్తుండగా... సుభాష్ హడావుడిగా ఎక్కడికో బయల్దేరుతుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావని అతనిని అడుగుతుంది. ఏదైనా ప్రాబ్లమా , నీకు తోడుగా రాహుల్‌ని కూడా పంపిస్తానని చెప్పగా.. సుభాష్ విసుక్కుంటూ వెళ్లిపోతాడు. ఇంట్లో ఉన్న రెండు కార్లలో ఒకటి రాజ్, ఇంకోకటి అన్నయ్య తీసుకెళ్లాడని ఈ కారణంతో చిన్న సైజు సునామీ సృష్టించబోతున్నానని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. అక్కడి నుంచి నేరుగా ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి .. నా నగలు మెరుగు పెట్టించి చాలా కాలమైందని , నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది. అయితే తనకు చాలా పని ఉందని.. నేను రానని ధాన్యం చెప్పగా, నువ్వు కూడా నన్ను పరాయిదానిలా చూస్తున్నావని ఫీలవ్వడంతో ధాన్యలక్ష్మీ వస్తానని చెబుతుంది.
ఇద్దరూ కలిసి బయటికి రాగానే బయట ఒక్క కారు కూడా కనిపించకపోవడంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. ఇంతలో రాహుల్ వచ్చి... ఇందాకే డ్రైవర్లు నాలుగు కార్లు తీసుకెళ్లడం చూశానని చెప్పడంతో ధాన్యం బిత్తరపోతుంది. దాంతో కార్ డ్రైవర్‌కి ధాన్యలక్ష్మీ ఫోన్ చేసి.. ఎక్కడ చచ్చారు అంటుంది. దాంతో కొంచెం మర్యాదగా మాట్లాడాలని రుద్రాణికి, ధాన్యలక్ష్మీకి గడ్డి పెడతాడు డ్రైవర్. ఆ వెంటనే ఇంట్లో ఉన్న నాలుగు కార్లు ఏమయ్యాయి, మా పర్మిషన్ లేకుండా మీరంతా ఎక్కడికి వెళ్లారని ధాన్యం ప్రశ్నిస్తుంది. మీ పర్మిషన్ ఎవడికి కావాలి.. కావ్య మేడం ఇంట్లో రెండు కార్లు చాలని, నాలుగు కార్లు పంపించేశారని అంటాడు డ్రైవర్. ఆ మాటలతో ధాన్యం రగిలిపోతుంది. ఆ వెంటనే ఆమెను మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి.
దాంతో లోపలికి వెళ్లి అపర్ణని పిలుస్తుంది ధాన్యలక్ష్మీ. నీ కోడలు ఏం చేసిందో తెలుసా అంటూ మండిపడుతుంది. దాంతో ఏం జరిగిందంటూ ప్రశ్నిస్తాడు ప్రకాశం. 6 కార్లు ఇంటి ముందు ఉండేవని, ఇప్పుడు అవసరం లేదంటూ నాలుగు కార్లను కావ్య పంపించేసిందని చెబుతుంది ధాన్యం. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఆస్తి మొత్తం ఆవిడ ఒక్కతే అనుభవించాలని.. మనమంతా ఆమె ముందు అడుక్కోవాలని ఇలా చేస్తోందని ధాన్యం మండిపడుతుంది.
కావ్య ఉద్దేశం ఏంటో? ఏ కారణంతో కార్లు వద్దని పంపించిందో కనుక్కుంటానని అపర్ణ చెబుతుంది. తినే తిండి మీద ఆంక్షలు పెట్టింది, క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయించింది, ఇప్పుడు కార్లపై పడిందని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. వెంటనే కావ్యకి ఫోన్ చేసి నీతో ఒక విషయం మాట్లాడాలని అపర్ణ అడగ్గా.. నేను చాలా బిజీగా ఉన్నానని తర్వాత మాట్లాడతానని కావ్య చెప్పడంతో అపర్ణ ఫోన్ పెట్టేస్తుంది. మమ్మల్ని పూచీక పుల్లలా తీసి పారేసిందని.. నీకైనా సమాధానం చెప్పొచ్చు కదా అని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










