Brahmamudi January 4th Episode : ఇంట్లో కావ్యకి కొత్త శత్రువు .. రాజ్‌ను దెబ్బకొట్టేలా అనామిక స్కెచ్
కారులో నస పెడుతోన్న సావిత్రికి తాము కిడ్నాపర్లమని.. మేం నిన్ను కిడ్నాప్ చేశామని రాజ్ చెప్పడంతో భయపడి పరుగులు పెడతాడు సావిత్రి. నందగోపాల్ కోసం అతని గెస్ట్‌హౌస్ దగ్గరికి రాగా.. వాచ్‌మెన్ పంపించకపోవడంతో మరో కట్టుకథ చెబుతాడు రాజ్. ఎలాగో వారిద్దరూ లోపలికి వెళ్లగా కావ్యకి అక్కడి సెటప్ చూసి బూత్ బంగ్లా గుర్తొచ్చి రాజ్‌పై అనుమాన పడుతుంది.
అపర్ణ - ఇందిరలు హాస్పిటల్‌కి వెళ్లడానికి ఇంట్లో కార్లు లేకపోవడంతో రుద్రాణి - ధాన్యలక్ష్మీలు మరోసారి గొడవ స్టార్ట్ చేస్తారు. చివరికి చేసేదేం లేక వారిద్దరూ క్యాబ్‌లో బయటికి వెళ్తారు. గెస్ట్‌హౌస్ లోపల రాజ్ - కావ్యలను చూసిన నందగోపాల్ .. రాజ్ చేతిలో దెబ్బలు తిని ఎలాగో తప్పించుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 4వ తేదీ.. ఎపిసోడ్ 611లో ఏం జరిగిందంటే..

కావ్య - రాజ్‌ల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఎదురుచూస్తుంటుంది. ఇంతలో వారిద్దరూ ఇంట్లోకి రాగానే.. రాత్రంతా కార్లో షికారు చేసి అలసిపోయి వచ్చినట్లున్నారని అంటుంది రుద్రాణి. కారులోనే వెళ్లాం కానీ షికారుకు కాదు అంటాడు రాజ్. మీరు ఎక్కడికైనా ఊరేగండి .. మీకు ఏసీ కార్లు, ఇంట్లో వాళ్లు బయటికి వెళ్లడానికి మాత్రం ఒక్క కారు కూడా అక్కర్లేదా అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఇంటి దగ్గర మరో కారు ఉంది కాదా అంటుంది కావ్య. మిగిలిన నాలుగు కార్లను మాత్రం ఎవ్వరినీ అడక్కుండా తిప్పి పంపించేశావని ప్రశ్నిస్తుంది రుద్రాణి.. దీంతో ఎవరిని అడగాలని అంటుంది కావ్య.
నా భర్త నా పక్కనే ఉన్నారని.. ఆయనకే తెలిసే కార్లన్నీ పంపించానని అంటుంది కళావతి. ఎంత పొగరు, నీకు ఇంత అధికారం ఎవరిచ్చారు అంటూ ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. అన్ని విషయాల్లో నాకు సర్వహక్కులు తాతయ్య గారు ఇచ్చారని అంటుంది కావ్య. మీరు లక్షలకు లక్షలు తీసుకుని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతుంటే ఎందుకివ్వాలి అని ప్రశ్నిస్తుంది. కోట్లు ఉన్నాయి కదా అని ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెడితే ఏదో ఒక రోజు ఆ కోట్లన్నీ లక్షలుగా మారిపోతాయని , అప్పుడు మీరు ఎవరిని నిందిస్తారు నన్నేకదా అని అంటుంది కావ్య.
ఈ ఆస్తిని జాగ్రత్తగా కాపాడమని తాతయ్య గారు నా చేతుల్లో పెట్టారని, విచ్చలవిడితనంగా ఖర్చు పెడతానంటే నేను ఒప్పుకోనని తేల్చి చెబుతుంది. మీకు ఇష్టమున్నా లేకున్నా, నచ్చినా నచ్చకపోయినా , ఒప్పుకున్నా , ఒప్పుకోకపోయినా నేను చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని అంటుంది . కావ్య అంత ఖచ్చితంగా చెబుతున్నా నువ్వేం మాట్లాడవేంటి అంటూ రాజ్‌ను ప్రకాశం ప్రశ్నిస్తాడు. ఇప్పటి వరకు ఏంటో అనుకున్నానని.. కానీ ఇప్పుడు కావ్య మాట్లాడిన మాటలు మాత్రం నాకు నచ్చలేదని ప్రకాశం కోప్పడతాడు.
గదిలోకి వచ్చి రాజ్ బాధపడుతుంటాడు. నా ప్రవర్తన మీకు బాధ కలిగించిందా అని కావ్య ప్రశ్నించగా.. రాజ్ ఔను అంటాడు. తాతయ్య గారి హాస్పిటల్ బిల్ కట్టడానికే మీరు పడ్డ పాట్లని నేను చూశానని కావ్య చెబుతుంది. వాళ్లకు నేను మంచిదానిలా కనిపించకపోయినా పర్లేదు కానీ.. కుటుంబం ఇంకా అప్పుల పాలు కావడానికి వీల్లేదని అంటుంది కావ్య. నువ్వు కుటుంబానికి దూరమయ్యే ప్రమాదం ఉందని రాజ్ హెచ్చరించగా.. మీకు నిజం తెలుసు, నేను ఇలా ఎందుకు చేస్తున్నానో తెలుసు అది చాలని అంటుంది కళావతి.
ఇంట్లో పరిస్ధితులు రోజురోజుకు దిగజారిపోవడంతో అపర్ణ, ఇందిర, సుభాష్‌లు బాధపడుతుంటారు. కళావతి పెట్టే రూల్స్ వల్ల రుద్రాణి - ధాన్యలక్ష్మీలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని ఇందిర అంటుంది. దీని ప్రభావం ప్రకాశం మీద కూడా పడిందని, ఇలాంటి పరిస్ధితుల్లో ప్రకాశం కూడా మనకి దూరమయ్యే అవకాశం ఉందని సుభాష్ హెచ్చరిస్తాడు. అదే జరిగితే ఈ ఇల్లు ముక్కలవుతుందని ఇందిర భయపడుతుంది. ఇంట్లో పరిస్ధితులు చక్కబడాలంటే మీ ఇద్దరూ జోక్యం చేసుకోవాలని సుభాష్, అపర్ణలకు చెబుతుంది. దీంతో నేను రాజ్‌తో మాట్లాడతానని సుభాష్.. నేను కావ్యతో మాట్లాడతానని అపర్ణ చెబుతారు.
మరోవైపు.. నందగోపాల్‌ను లాగిపెట్టి కొడుతుంది అనామిక. మూడు నెలలు నిన్ను అజ్ఞాతంలో ఉండమంటే అక్కడ కూడా నీకు గర్ల్ ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా అని నిలదీస్తుంది. 100 కోట్లు వచ్చేలా చేస్తానంటే.. నీ కక్కుర్తి వల్ల రాజ్‌కి దొరికిపోయేవాడివని మండిపడుతుంది. ఇంకోసారి ఇలాగే చేస్తే నేనే పోలీసులకు ఫోన్ చేసి చెబుతానని నందగోపాల్‌ను హెచ్చరిస్తుంది అనామిక. ఇప్పుడు రాజ్ మరింత జాగ్రత్తపడతాడని ఇప్పుడేం చేద్దామని అంటాడు సామంత్. నాకు కావ్య వేసే డిజైన్లు కావాలని.. నువ్వేం చేస్తావో నాకు తెలియదని అంటుంది అనామిక.
రాజ్- కావ్యలు రాత్రంతా పడుకోకుండా పని చేస్తుంటారు. ఇంతలో భార్య కోసం రాజ్ కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో కావ్య షాక్ అవుతుంది. భర్త తనపై ప్రేమ చూపిస్తూ ఉండటంతో ఆమె మురిసిపోతుంది. పనిచేస్తూ కావ్య భుజంపై వాలి నిద్రపోతాడు రాజ్, ఆ కాసేపటికి కళావతి కూడా పడుకుంటుంది. ఉదయాన్నే అర్జెంట్‌గా ఒక మెయిల్ చేయాలని చెప్పి రాజ్ ఆగిపోగా.. కావ్య ఆఫీస్‌కి బయల్దేరుతుంది.
టిఫిన్ చేయమని శాంత పిలుస్తుండగా.. టైం లేదని చెప్పి వెళ్లిపోతుంది. అపర్ణ పిలిచినా సరే ఆగకపోయే సరికి అంతా షాక్ అవుతారు. రాజ్‌తో కూడా సుభాష్ మాట్లాడాలని అనుకోగా.. టైం లేదని వెళ్లిపోతాడు. ఆఫీసులో డిజైన్లు చూస్తూ , ఆభరణాలు చెక్ చేస్తూ పనిలో మునిగిపోతారు రాజ్ - కావ్య. రాత్రి డిన్నర్ చేసే సమయానికి వారిద్దరూ తిరిగి వస్తారు. భోజనం చేయమని అపర్ణ పిలవగా.. మేం తినేశామని మీరు కానిచ్చేయండి అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











