Brahmamudi January 17th Episode : ఆధారాలతో కావ్యని ఇరికించిన రుద్రాణి .. దుగ్గిరాల కుటుంబంలో కల్లోలం
స్వప్న కొనుక్కున్న నెక్లెస్‌ను రాజ్ కావ్యకి ఇచ్చి.. శ్రీమంతం గిఫ్ట్‌గా ఇవ్వమంటాడు. విరిగిపోయిన కుర్చీలో కూర్చొని రుద్రాణి నడుం విరగ్గొట్టుకోవడంతో కనకం పకపక నవ్వుతుంది. స్వప్నకి నెక్లెస్ ఇస్తుండగా చూసిన రుద్రాణి.. ధాన్యంతో ఈ విషయం చెప్పి గొడవ చేస్తుంది. మమ్మల్ని ఒకలా , అక్కని ఒకలా చూస్తూ పక్షపాతం చూపిస్తున్నావంటూ కావ్యని ధాన్యలక్ష్మీ నానా మాటలు అంటుంది.
ఇంతలో రాజ్ అక్కడికొచ్చి నెక్లెస్ నేనే తీసుకొచ్చి ఇవ్వమన్నానని చెబుతాడు. కావ్య అందరినీ ఒకలాగే చూస్తుందని.. ఆమెకు ఎవరి మీదా పక్షపాతం లేదని కౌంటర్ ఇస్తాడు. ఆఫీసులో ఎలాంటి ఆడిటింగ్ లేదని, తాతయ్య హాస్పిటల్ బిల్‌ను కావ్య తన నగలు తాకట్టు పెట్టి కట్టిందని రుద్రాణితో చెబుతాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక జనవరి 17వ తేదీ .. ఎపిసోడ్ 621లో ఏం జరిగిందంటే..

బంగారం తాకట్టు పెట్టిన దానికి సంబంధించి రశీదు సంపాదించాలని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి. కొడుకు ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో ఇంట్లో చిచ్చు పెట్టాలని రుద్రాణి అనుకుంటుంది. వెంటనే అపర్ణ దగ్గరికి వెళ్లి మీ కోడలు నగలు వేసుకుందా? అసలు ఆ నగలు జాగ్రత్తగా ఉన్నాయా? లేదా? అని అడుగుతుంది. ఆ మాటలతో రాజ్ - కావ్యలు షాక్ అవుతారు. నాకు ఇలాగే సింపుల్‌గా ఉండటం ఇష్టమని.. నన్ను ఇలాగే వదిలేయమని చెబుతుంది కావ్య. అంతగా అడుగుతున్నారు.. మీ కొడుకేమైనా మాయం చేశాడా అని ప్రశ్నిస్తుంది స్వప్న.
మన ఇంట్లో నగల్ని ఎవరైనా దొంగతనం చేస్తారా ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తుంది అపర్ణ. మమ్మల్ని ప్రశాంతంగా శ్రీమంతం జరుపుకోనిస్తారా లేదా అంటూ రుద్రాణిపై మండిపడుతుంది కనకం. రుద్రాణి సంగతి తర్వాత కానీ ఇంతకీ నీ నగలు ఏమయ్యాయి? అని కావ్యని అడుగుతుంది అపర్ణ. నీకు బంగారం మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ .. నా కోడలు పది మందిలో దర్జాగా కనిపించాలని చెప్పి తన మెడలోని నెక్లెస్‌ను తీసి కావ్య మెడలో వేస్తుంది. అత్తగారు తన మీద చూపుతున్న ప్రేమను చూసి కావ్య కంటతడి పెడుతుంది.
అందరూ కలిసి స్వప్న శ్రీమంతం చేస్తారు. అది చూసి కనకం సంతోషంతో కన్నీళ్లు పెడుతుంది. మనవడు పుట్టాక మన రుద్రాణి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వయసు దాచుకుని లాభం ఉండదు అంటూ సెటైర్లు వేస్తాడు ప్రకాశం. దాంతో అంతా నవ్వేస్తారు. అందరూ హారతి ఇస్తుండగా.. సీమంతం శ్రీను వచ్చి ఆపమని అంటాడు. నా వంటలన్నీ చల్లారిపోతున్నాయని.. వచ్చి తినమని చెప్పడంతో కనకం లాగి పీకుతుంది. కనకం ఇంట్లో పండగ వాతావరణం చూసి రుద్రాణి కుళ్లుకుంటూ ఉంటుంది. ఇంతలో నగలు తాకట్టు పెట్టిన రసీదుని రాహుల్ తీసుకురావడంతో రుద్రాణి సంబరపడిపోతుంది.
కృష్ణమూర్తి, కనకంలు దుగ్గిరాల కుటుంబ సభ్యులకు భోజనాలు వడ్డిస్తుంటారు. ఇంతలో రుద్రాణి అక్కడికొచ్చి .. మీ అక్కాచెల్లెళ్ల నటన చూసి ఎన్నిసార్లు చప్పట్లు కొట్టాలని అడుగుతుంది. కనకం అన్నం పెడుతోందని.. నువ్వేంటి కొత్త తలనొప్పి మోసుకొచ్చినట్లుగా ఉన్నావాని మండిపడుతుంది ఇందిర. ఇలాగే వదిలేస్తే నీ మనవరాలు దుగ్గిరాల వంశానికే తలవంపులు తెచ్చేలా ఉందని అంటుంది రుద్రాణి. ఇంతకీ కావ్య ఏం చేసిందని ఇందిర ప్రశ్నిస్తుంది. నాన్న హాస్పిటల్‌లో ఉన్నప్పుడు రూ.5 లక్షలు బిల్లు కట్టలేదు.. దీని మీద కావ్యని నిలదీస్తే రాజ్ వచ్చి ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతోందని, అకౌంట్స్ హోల్డ్‌లో పెట్టామని చెప్పాడని గుర్తు చేస్తుంది రుద్రాణి.

కానీ ఆ తర్వాత 5 లక్షల బిల్లు కట్టారని.. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారో నాకు తెలియాలని నిలదీస్తుంది రుద్రాణి. ఆమె మాటలతో కావ్య - రాజ్‌లు షాక్ అవుతారు. అదంతా నీకెందుకు వాళ్లు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తాడు సుభాష్. ఆడిటింగ్ పూర్తయ్యాక అకౌంట్స్ నుంచి పంపించి ఉంటారని చెబుతాడు. ఆ 5 లక్షల బిల్లు అకౌంట్స్ నుంచి కట్టలేదని చెబుతుంది రుద్రాణి. మరి నువ్వు ఇచ్చావా? నీ కొడుకు ఇచ్చావా అంటూ స్వప్న తగులుకుంటుంది. మీ కావ్యే ఇచ్చిందని.. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చింది అని ప్రశ్నిస్తుంది రుద్రాణి.
ఇంతకీ నువ్వేం కనిపెట్టావో చెప్పు అంటూ అపర్ణ మండిపడుతుంది. కావ్య ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినప్పుడు నువ్వు ఇచ్చిన బంగారు నగల్ని తాకట్టు పెట్టి హాస్పిటల్ బిల్లు కట్టిందని చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. 5 లక్షల కోసం ఇంటి కోడలు తన నగల్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏమొచ్చిందని ఇందరి ప్రశ్నిస్తుంది. నేను అబద్ధం చెప్పుంటే ఈ పాటికే నీ మనవరాలు నా మీద విరుచుకుపడేదని చెబుతుంది రుద్రాణి. పోనీ రాజైనా ఖండించాలి కదా..? తను ఎందుకు మౌనంగా ఉన్నాడు అని ప్రశ్నిస్తుంది. మీరంతా నా మాటలు నమ్మరని తెలుసని చెప్పి రాహుల్ ఫోన్‌లో ఉన్న రసీదుని అందరికీ చూపిస్తుంది.
ఇంతలో రాజ్ కలగజేసుకుని.. మా అత్తగారింట్లో ఫంక్షన్ జరిగినప్పుడల్లా నువ్వు ఏదో ఒక పెంట చేస్తూనే ఉన్నావని రుద్రాణిపై మండిపడతాడు. అలా చేస్తేనే గానీ నీకు సంతృప్తి ఉండదని, ఎందుకంత శాడిజం అంటూ ఫైర్ అవుతాడు. సంతోషంగా శ్రీమంతం జరుపుకుంటే ఉంటే చూసి ఓర్వలేకపోతున్నావని మండిపడతాడు. దుగ్గిరాల వంశ గౌరవాన్ని నిలబెట్టే దానివే అయితే కళావతి నగలు తాకట్టు పెట్టిన విషయాన్ని ఇంత మందిలో చెప్పేదానివే కాదని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











