Brahmamudi February 11th Episode : 100 కోట్ల బాంబు పేల్చిన అనామిక .. దోషుల్లా కావ్య - రాజ్
నేను రాసిన స్క్రీన్ ప్లే ప్రకారమే రాజ్ - కావ్యలు నడుచుకుంటున్నారని వాళ్లని లాక్ చేసేశాని రుద్రాణితో అంటుంది అనామిక. ఉదయాన్నే పాప బారసాలకు డెకరేషన్ చేస్తున్న కావ్య, అప్పూలను చూసి రుద్రాణి - ధాన్యలక్ష్మీలు కుళ్లుకుంటారు. ఫంక్షన్‌కు వచ్చిన కనకంను రుద్రాణి అవమానించాలని చూడగా.. రివర్స్‌లో కౌంటర్లు వేస్తుంది కనకం.
పాపను ఇందిర చేతుల మీదుగా ఊయలలో వేసి ఆడిస్తుండగా అనామిక ఇంట్లోకి వస్తుంది. నిన్ను ఎవరు పిలిచారు? మర్యాదగా వెళ్లిపోతావా ? లేదా అంటూ దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది. కావ్య - రాజ్‌లు మీకు చేస్తున్న అన్యాయం గురించి చెప్పడానికే వచ్చానని అంటుంది అనామిక. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 11వ తేదీ .. ఎపిసోడ్ 642లో ఏం జరిగిందంటే..

కావ్య - రాజ్‌లు రూ.100 కోట్ల అప్పు చేశారని అనామిక చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. అంత అవసరం వాళ్లకేముంది అని సుభాష్ ప్రశ్నించగా.. అది మీరే అడిగి తెలుసుకోండి అని అంటుంది అనామిక. ఆ 100 కోట్ల అప్పు తీర్చడానికి మీ ఆస్తుల్ని కూడా తాకట్టు పెడుతున్నారని చెబుతుంది. ఒక అనామకురాలు వచ్చి ఏదో చెబితే నువ్వు రాద్థాంతం చేయొద్దని అంటుంది ఇందిర. అది అబద్ధమైతే రాజ్ , కావ్యలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నిస్తాడు రాహుల్.
ఇంట్లో అనవసర ఖర్చు తగ్గించడానికి కావ్య చేస్తున్న ప్రయత్నాలను తప్పు పట్టొద్దని ఇందిర చెప్పడంతో .. బ్యాంక్ వాళ్లు ఇచ్చిన నోటీసును చూపిస్తుంది అనామిక. అది చదివిన సుభాష్ .. రూ.100 కోట్లు బ్యాంక్‌కి కట్టాలని చెప్పడంతో అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇన్నాళ్లకు దుగ్గిరాల వారి ముఖ చిత్రం మారిపోయిందని నాకు చాలా సంతోషంగా ఉందని అనామిక సెటైర్లు వేస్తుంది. ఆ అప్పు కట్టడానికి ఆస్తుల్ని అమ్మాలని అనుకుంటే మాత్రం నాకొక మెసేజ్ పెడితే మా కంపెనీ కొంటుందని చెబుతుంది. మీరంతా నడిరోడ్డుపైకి వచ్చిన రోజున ఆ దృశ్యాన్ని చూడటానికి మళ్లీ వస్తానని అంటుంది.
100 కోట్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని రాజ్‌ను నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. 100 కోట్లు అప్పు చేసి ఆ డబ్బు ఎక్కడ దాచి పెట్టారో అడుగు అంటుంది రుద్రాణి. అంత డబ్బుతో బినామీ పేర్లతో ఆస్తుల్ని కొన్నారా? లేక విదేశాల్లో ఖాతాలను ఓపెన్ చేశారా అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. నేను ఆస్తుల్ని పంచమని అడగటంతో ఎక్కడ పంచాల్సి వస్తుందోనని ఈ పథకం వేశారా అని నిలదీస్తుంది. 100 కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? అని రాజ్- కావ్యలను ప్రశ్నిస్తుంది అపర్ణ. ఆస్తులు నాకు అక్కర్లేదని, కానీ అందరికీ నిజం తెలియాలని అంటాడు కళ్యాణ్. ఏదో బలమైన కారణం లేకపోతే మీరిద్దరూ ఆ నిర్ణయం తీసుకోరని నాకు తెలుసు అని చెబుతాడు.
వీళ్లకి ఎంత ధైర్యం ఉంటే అంత అప్పు చేస్తారు అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఆస్తుల్ని పంచకపోయినా ఉమ్మడి ఆస్తి భద్రంగానే ఉందని ఆశతో ఉన్నానని.. ఇప్పుడు ఆశలన్నీంటినీ కూకటి వేళ్లతో కూల్చివేశారని అంటుంది. ఆస్తులు కరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకున్నానని.. కానీ ఆస్తులన్నీ అప్పుల్లో కూరుకుపోయాయంటే మింగుడు పడటం లేదని సుభాష్ బాధపడతాడు. కావ్య ఏదో చెప్పబోతుండగా.. ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదని, కారణం నేనే చెప్పాలని అంటాడు రాజ్.
ఏం జరిగింది? ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? అని ఇందిర ప్రశ్నించగా.. కంపెనీ దివాళా తీయలేదు, మన ఆస్తులు ఎక్కడికీ పోవు అని చెబుతాడు రాజ్. కానీ అప్పు ఉన్న మాట నిజమని చెబుతాడు. ఆ అప్పు వల్లే ఇంట్లో ఆంక్షలు మొదలయ్యాయని , ఖర్చుల నియంత్రణ వచ్చిందని అంటాడు. అసలేం జరిగిందో చెప్పినా ఇప్పుడు మీరు వినే పరిస్ధితుల్లో లేరని, చెప్పే ఉద్దేశం నాకు కూడా లేదని అంటాడు రాజ్.
కానీ ఇంట్లో ఎప్పటికీ ఆ పరిస్ధితులు ఉండవని .. నేను , కళావతి రాత్రింబవళ్లు కష్టపడి రూ.25 కోట్ల అప్పు తీర్చగలిగామని చెబుతాడు . మిగిలిన రూ.75 కోట్ల అప్పు కూడా తొందరలోనే తీర్చేస్తామని అంటాడు రాజ్. ఆ 100 కోట్ల అప్పులో ఒక్క రూపాయి కూడా మా ఖర్చుల కోసం వాడుకోలేదని అదొక్కటి నమ్మండి అని అంటాడు. ఇందులో ఎవరూ కళావతిని దోషిని చేయాల్సిన పని లేదని చెప్పి ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు. మా అమ్మ, అన్నయ్య, వదినలకు తెలియకుండానే ఇంత జరిగిందా అని రుద్రాణి ప్రశ్నించగా.. ఇందిర మండిపడుతుంది. ఈ సమస్య ఎందుకు మొదలైందో బయటపెట్టకుంటే నా విశ్వరూపం చూస్తారని ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది.
బుజ్జితల్లి రాకతో ఇంట్లో మళ్లీ శుభాలు మొదలయ్యాయని అనుకుంటున్న వేళ రూ.100 కోట్ల అప్పు సంగతి బయటపడిందని అంటుంది అపర్ణ. కావ్య అంటే ఏమాత్రం నచ్చని రాజ్ ఆమెతోనే ఉంటున్నాడని , వాళ్లిద్దరూ కలిసిపోయారని సంతోషపడ్డానని చెబుతుంది. కావ్య- రాజ్‌లు ఈ ఇంటికి తలవంపులు తెచ్చే పనులు చేయరని మరి 100 కోట్లు అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఏదైనా సమస్య ఉంటే చెప్పు.. నాకు తెలిసిన పరిష్కారం చెబుతానని రాజ్‌ను రెండు, మూడు సార్లు అడిగానని సుభాష్ గుర్తుచేస్తాడు.
కావ్య కూడా ఇంట్లో లేనిపోని కండీషన్లు పెడుతుంటే నాకు డౌట్ వచ్చిందని.. కానీ పరిస్ధితులు ఇక్కడి వరకు వస్తాయని అనుకోలేదని అంటుంది అపర్ణ. వాళ్లిద్దరూ తప్పు చేసే మనుషులు కాదని, అప్పు చేసే రకం కూడా కాదని .. కానీ ఏదో బలమైన కారణం ఉండబట్టే నిజం చెప్పలేకపోతున్నారని అంటాడు సుభాష్. వాళ్లు నోరు తెరిచి సమాధానం చెప్పేవరకు రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఆగేలా లేరని అంటుంది అపర్ణ. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని చెబుతాడు సుభాష్.
ఇలాంటిది జరుగుతుందని నేను ఊహించలేదని రాజ్‌తో అంటుంది కావ్య. అసలు రూ.100 కోట్ల విషయం అనామికకు ఎలా తెలిసింది? తన మనుషుల్ని ఆఫీసు నుంచి తీసేశామని అంటుంది. అనామిక నిజం బయటపెట్టినా మనకు మంచే జరిగిందని అంటాడు. ఇన్నాళ్లూ మనం కఠినంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో అందిరికీ అర్ధమైందని చెబుతాడు. అప్పు తీర్చేస్తే తాతయ్య విషయం ఎప్పటికీ బయటకు రాదని అంటాడు. మీరు చెప్పినంత ఈజీగా ఇంట్లో వాళ్లు తీసుకుంటారని అనుకోవడం లేదని అంటుంది కావ్య. రుద్రాణి, ధాన్యలక్ష్మీలు ఎన్ని గొడవలు చేసినా అప్పు తీర్చే వరకు ఓపిక పట్టాల్సిందేనని అంటాడు రాజ్.
రాజ్ వాడి ఫ్యామిలీ నాకు చేసిన అవమానానికి ఈ డోస్ సరిపోదని సామంత్‌తో అంటుంది అనామిక. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక ఆ ఫ్యామిలీ ఉక్కిరి అవ్వాలని చెబుతుంది. ఇంట్లో నిప్పు రాజేశాం కదా అది మంటగా మారి ఆ ఇంటిని దహనం చేయాలి కదా అని అంటుంది . బ్యాంకు వాళ్లతో మాట్లాడానని.. వాళ్లు కట్టాల్సిన అప్పు కట్టలేదు కాబట్టి ఆస్తి మొత్తాన్ని జప్తు చేసి వాళ్లని పద్ధతిగా మెడపట్టి బయటికి గెంటేస్తారని అంటుంది . దుగ్గిరాల నిలయం కూలిపోయి, ఆ కుటుంబం అవమానపు మంటల్లో కాలిపోతుందని చెబుతుంది.
ఆ తర్వాత బ్యాంక్ వాళ్లతో మాట్లాడి తక్కువ రేటుకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ని తక్కువ రేటుకి నీ పేరు మీద రిజిస్టర్ చేసుకుందామని అంటుంది. నీ థింకింగ్‌కి, నీ ప్లానింగ్‌కి హ్యాట్సాఫ్ అని అనామికను మెచ్చుకుంటాడు సామంత్. బెడ్‌రూంలో బాధపడుతున్న కళ్యాణ్ , ప్రకాశంల దగ్గరికి ధాన్యలక్ష్మీ వచ్చి మండిపడుతుంది. అప్పు ఎలా కట్టాలోనని అన్నయ్య, వదిన అంత కష్టపడుతుంటే ఆస్తుల గురించి అడుగుతావేంటి అని కళ్యాణ్ మండిపడతాడు. 100 కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పకుండా వాళ్లిద్దరూ నాటకాలు ఆడుతున్నారని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










