Brahmamudi February 18th Episode : సీతారామయ్య సంచలన నిర్ణయం - రోడ్డున పడనున్న రాహుల్ - రుద్రాణి?
నందగోపాల్ దొరికిపోయినట్లుగా ఫోన్ రావడంతో సామంత్ షాక్ అవుతాడు. క్లయింట్లకు తన ప్లాన్ వివరిస్తుండగా రాజ్ వచ్చి సామంత్‌ని కొడతాడు. ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో అనామిక మాట్లాడబోతుండగా ఆమెను కావ్య లాగికొడుతుంది. కుటుంబాన్ని కాపాడినందుకు అప్పూని ఎత్తుకుని తిప్పేస్తాడు కళ్యాణ్.
కుటుంబమంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా నా కొడుకు - కోడలు వంశ గౌరవాన్ని కాపాడేందుకు ఎంతో కష్టపడ్డారని మెచ్చుకుంటుంది అపర్ణ. ఆస్తులన్నీ పంచేస్తే ఎవరి దారి వాళ్లు చూసుకుంటారని సీతారామయ్య అనడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. తన తప్పును క్షమించాలని ప్రకాశం తండ్రి కాళ్ల మీద పడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 18వ తేదీ .. ఎపిసోడ్ 648లో ఏం జరిగిందంటే..

ఇంట్లో అందరూ ఆస్తి పంపకాలు వద్దు అనడంతో తన నిర్ఱయాన్ని మార్చుకుంటాడు సీతారామయ్య. వీళ్లకి చివరి అవకాశం ఇస్తున్నానని, మళ్లీ ఆస్తి గురించి ఇంట్లో గొడవలు జరగకూడదని అంటాడు. ఏ గొడవలు రావు నాన్నా.. అంతా కలిసి మెలిసి ఉంటామని చెబుతాడు ప్రకాశం. మీరు మాత్రమే కాదు అప్పూని కోడలిగా ఒప్పుకుని , అప్పూని .. కళ్యాణ్‌ని ఇంటికి తీసుకురావాలని అంటాడు సీతారామయ్య. వాళ్లని తప్పకుండా ఇంటికి తీసుకొస్తామని ప్రకాశం, ధాన్యలక్ష్మీలు చెబుతారు.
పెద్దాయన ఆస్తి పంచుతాను అన్నప్పుడు మాకు వద్దు అనడం కంటే మా ఆస్తి మాకు కావాలని చెప్పొచ్చు కదా అని ధాన్యలక్ష్మీకి క్లాస్ తీసుకుంటుంది రుద్రాణి. అదేదో నువ్వే అడగొచ్చు కదా నీకు నోరు లేదా? అని అంటూ నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో రుద్రాణి షాక్ అవుతుంది. నా కొడుకు ఇంటికి రావాలి, వాడిని నా దారిలోకి తెచ్చుకుని తర్వాత ఆ అప్పూ సంగతి తేలుస్తానని ధాన్యలక్ష్మీ చెబుతుంది. ఆమె ఏదో పెద్ద ప్లాన్ వేసిందని రుద్రాణి కూడా షాక్ అవుతుంది.
ఉదయాన్ని బట్టలు ఆరబెడుతున్న అప్పూ, కళ్యాణ్‌ల దగ్గరికి ధాన్యలక్ష్మీ, ప్రకాశంలు వస్తారు. అప్పూ లోపలికి రమ్మని పిలవగా.. మేం మీ ఇంటికి రావడం కాదు.. మీరే మాతో పాటు మన ఇంటికి రావాలని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టి తప్పు చేశామని నన్ను క్షమించమని అంటుంది ధాన్యం. ఆస్తి పోయి, అందరూ రోడ్డున పడతారన్న టైంలో అప్పూ దేవతలా వచ్చి కుటుంబాన్ని కాపాడిందని చెబుతాడు ప్రకాశం. నేను అనుకున్నట్లు అప్పూ పోలీస్ అయ్యిందని, కానీ నేను ఇంకా సెటిల్ కాలేదని అంటాడు కళ్యాణ్. ఈ ప్రయత్నాలేవో ఇంటి దగ్గర ఉండి చేసుకో, నీకు మేం అడ్డురామని అంటుంది ధాన్యలక్ష్మీ. అప్పూ కూడా మనింటికి వెళ్దామని చెప్పడంతో కళ్యాణ్ సరేనని చెబుతాడు.
ఉదయాన్నే పాపను ఆడిస్తున్న స్వప్న దగ్గరికి రుద్రాణి వచ్చి పాప ఏడిపిస్తుందా అంటుంది. మీరు ఏడిస్తే చూడాలని ఉందని చెబుతుంది, దానికి ఇంకో జన్మ ఎత్తాలని నేను ఏడిపించే రకం కానీ .. ఏడ్చే రకం కాదని అంటుంది రుద్రాణి. ఇంతలో కళ్యాణ్ - అప్పూ రావడంతో కావ్యని పిలిచి దిష్టి తీయమంటుంది స్వప్న. దిష్టి తీసిన కావ్య మీ పేర్లు చెప్పి లోపలికి రమ్మంటుంది . సిగ్గు పడుతూ ఒకరి పేర్లు మరొకరు చెప్పి లోపలి వస్తారు అప్పూ - కళ్యాణ్. ధాన్యలక్ష్మీ - ప్రకాశంలను కూడా పేర్లు పెట్టి లోపలికి రమ్మంటుంది కావ్య. మేం మీ పెళ్లి చూడలేదు కాబట్టి మీ పేర్లు చెప్పి రమ్మని అందరూ అడగటంతో ధాన్యం - ప్రకాశం అలాగే చెప్పి లోపలికి వస్తారు.

ఇంట్లో అడుగుపెట్టగానే సీతారామయ్య - ఇందిరల ఆశీర్వాదం తీసుకుంటారు అప్పూ - కళ్యాణ్. ఇప్పుడు నాకు తృప్తిగా ఉందని సీతారామయ్య చెప్పగా.. నాకు మాత్రం లేదు అంటుంది ఇందిర. నువ్వు ఇంట్లో , హాస్పిటల్‌లో ఉన్నప్పుడు రుద్రాణి అందరి మనసుల్లోనూ విషం నింపాలని చాలా ప్రయత్నాలు చేసిందని చెబుతుంది. ఆస్తి కోసం గొడవలు పెట్టిందని.. ధాన్యలక్ష్మీతో పాటు ప్రకాశంను కూడా చెడగొట్టిందని అంటుంది. ఈ ఇంటిని ముక్కలు చేయడానికి ఎన్నో సమస్యలు సృష్టించిందని, తులసి వనం లాంటి ఈ ఇంట్లో కలుపు మొక్కని పీకి పారేద్దామని చెబుతుంది. రుద్రాణిని , రాహుల్‌లను ఈ ఇంటి నుంచి పంపేద్దామని సీతారామయ్యతో ఇందిర అనడంతో అంతా షాక్ అవుతారు.
అమ్మ ఇన్నాళ్లకు ధైర్యం చేసి ఓ మంచి నిర్ణయం తీసుకుందని సుభాష్ కూడా అంటాడు. ప్రకాశం, స్వప్న, అపర్ణ, రాజ్, కళ్యాణ్ సహా అంతా దానికి సపోర్ట్ చేస్తారు. బయటికి పంపేసి ఖర్చుల కోసం భరణం కింద నెలకి ఇంత ఇద్దామని అంటుంది అపర్ణ. ఆ మాటలతో రుద్రాణి మండిపడుతుంది. నేను దుగ్గిరాల వారి ఆడపడుచులాగే బతికానని.. నన్ను పొమ్మనే హక్కు ఎవరికీ లేదని అంటుంది. ఆ అధికారం మాకుందని మా పండంటి సంసారంలో చీలికలు మొదలయ్యే ప్రమాదాన్ని కళ్లారా చూశామని కాబట్టి ఈ ఇంట్లో నిన్ను ఉంచే ప్రసక్తే లేదని అంటుంది ఇందిర.
దీంతో వీళ్లంతా కలిసి నీ కూతురిని, మనవడిని బయటికి పంపే కుట్ర చేస్తున్నారని.. ఇదంతా పట్టించుకోవద్దని అంటుంది రుద్రాణి. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కలిసి ఉండాలంటే రుద్రాణి మన ఇంట్లో ఉండకూడదని అంటుంది ఇందిర. మీరే హాయిగా ఉండండి.. నాకు రావాల్సిన ఆస్తిని తీసుకుని వెళ్లిపోతామని చెబుతుంది రుద్రాణి. ఇంతసేపు నువ్వు ఆ మాట అంటావా? లేదా ? అని ఎదురుచూశానని సీతారామయ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
ఉమ్మడి కుటుంబాన్ని విడదీశానన్న బాధ నీలో కనిపిస్తుందేమోనని చూశానని.. కానీ మీ అమ్మ మంచి నిర్ణయమే తీసుకుందని అర్ధమైందని అంటాడు. ఇన్నాళ్లు నిన్ను, నీ కొడుకుని పోషించానని.. నీ కొడుకుని చదివించానని చెబుతాడు. ఇక మీరిద్దరూ బయల్దేరండి అంటాడు సీతారామయ్య. దీంతో పెద్దాయన కాళ్లపై పడి క్షమించమని అంటుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











