Brahmamudi February 27th Episode : చక్రవ్యూహంలో రాజ్.. 24 గంటలు డెడ్‌లైన్, అప్పూ - కావ్య సాహసం
బావగారిని హత్య కేసులో నుంచి విడిపించే బాధ్యత నాదేనని అందరికీ చెప్పి బాగా ఆలోచిస్తుంది అప్పూ. ఇంతలో పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావడంతో ఈ విషయం కావ్యకి చెబుతుంది. అప్పూ చేతితోనే రాజ్‌ని అరెస్ట్ చేయించడం అస్సలు అనుకోలేదని అనామిక తెలివితేటల్ని మెచ్చుకుంటుంది రుద్రాణి. పగ కోసం కాబోయే భర్తనైనా బలిస్తానని అంటుంది అనామిక.
ఉదయాన్నే అప్పూ, కావ్యలు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి ఆధారాల కోసం వెతుకుతారు. ఇంతలో వారికి ఓ చోట రక్తపు మరకలతో ఉన్న ఐరన్ రాడ్ కనిపిస్తుంది.. దానిని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తుంది అప్పూ. బావని విడిపించడానికి కావాల్సిన ఆధారం దొరికిందని అపర్ణలో చెబుతుంది అప్పూ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఫిబ్రవరి 27వ తేదీ .. ఎపిసోడ్ 656లో ఏం జరిగిందంటే..

రాజ్‌కు భోజనం తినిపిస్తుంది కావ్య. మిమ్మల్ని విడిపించడానికి నేను, అప్పూ సాక్ష్యాల కోసం వెతుకుతున్నామని చెబుతుంది కావ్య. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని జాగ్రత్త అని రాజ్ అంటాడు. భర్తని హత్తుకుని ఏడుస్తూ వెళ్లిపోతుంది కావ్య. రాజ్‌ను మరోసారి కోర్టులో హాజరుపరుస్తుంది అప్పూ. ఈ నేరం నువ్వే చేసినట్లు ఎవరైనా బలవంత పెడుతున్నారా? సమయానికి భోజనం పెడుతున్నారా? అని రాజ్‌ని అడుగుతారు న్యాయమూర్తి. దర్యాప్తులో భాగంగా హత్యకు హంతకుడు ఉపయోగించిన ఆయుధాన్ని కనుగొన్నారని రాజ్ తరపు లాయర్ చెబుతాడు.
తలకి బలమైన గాయం కావడం వల్లే సామంత్ మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా చెబుతోందని అంటాడు. అప్పూకి చెప్పి ఆ ఆయుధాన్ని తీసుకురమ్మని చెబుతాడు లాయర్. ఫోరెన్సిక్ రిపోర్ట్, ఆయుధాన్ని కోర్టుకు సమర్పిస్తుంది అప్పూ. ఆ ఐరన్ రాడ్‌ని చూడగానే రాజ్ షాక్ అవుతాడు. లాయర్‌తో ఏదో చెప్పబోతూ రాజ్ కంగారు పడతాడు. హత్యకు ఉపయోగించిన ఆయుధంపై ఉన్న వేలిముద్రలు, రాజ్ వేలిముద్రలు సరిపోయాయని న్యాయమూర్తి చెప్పడంతో అప్పూ సహా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది.
దీనికి మీరు కోర్టుకు జవాబు చెప్పాల్సి ఉంటుందని రాజ్‌తో అంటారు న్యాయమూర్తి. ఆ రోజు ఇంటి దగ్గర పార్టీలో ఉన్న తనకు మా ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసి కొంతమంది గుండాలు తనను కొట్టి ఫ్యాక్టరీని తగలబెడుతున్నట్లు చెప్పాడని అంటాడు. దాంతో తాను హుటాహుటిన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లానని రాజ్ చెబుతాడు. నిజంగానే కొంతమంది దుండగులు ఫ్యాక్టరీని తగలబెడుతున్నారని.. వాళ్లని ఆపే ప్రయత్నంలో నాకు ఈ ఇనుప కడ్డీ కనిపించడంతో దానిని తీసుకుని వాళ్లని వెంబడించానని అంటాడు.
ఇంతలో అనామిక లాయర్ లేచి.. సామంత్‌ను చంపేస్తానని బెదిరించారని దీనికి మీ భార్యే సాక్ష్యమని, మీరే సామంత్‌ని చంపారు అనడానికి ఈ ఆయుధమే సాక్ష్యమని అంటాడు. ఆ రాత్రి సామంత్‌ని ఫ్యాక్టరీకి తీసుకొచ్చి అక్కడే ఆ ఇనుప రాడ్‌తో ప్రాణాలు తీశారని వాదిస్తాడు లాయర్. ఆ తర్వాత సామంత్ డెడ్‌బాడీని మీ కారు ఢిక్కీలో వేసుకుని వెళ్లిపోయారని మీరే హంతకుడని అంటాడు. దాంతో రాజ్ తరపు లాయర్ లేచి .. పీపీ గారు బలవంతంగా నా క్లయంట్‌తో నేరం ఒప్పించేలా చేస్తున్నాడని మండిపడతాడు.
ఆ వెంటనే పెన్నుని కిందపడేసి నా భార్య దెబ్బకి నడుం పనిచేయడం లేదని కొంచెం పెన్ను ఇవ్వమని అనామిక లాయర్‌తో చెబుతాడు రాజ్ లాయర్. ఆ పెన్నుని అనామిక లాయర్ ఇవ్వగానే.. దీని మీద నా వేలిముద్రలు ఉన్నట్లా? పీపీగారి వేలిముద్రలు ఉన్నట్లా? అని ప్రశ్నిస్తాడు. అలాగే ఎవరో సామంత్‌ని చంపేసి దాని మీద నా క్లయంట్ వేలిముద్రలు పడేలా చేశారని వాదిస్తాడు రాజ్ లాయర్. శవాన్ని మాయం చేయాలని కారు ఢిక్కీలో వేసుకుని వెళ్లినవాడు హత్య చేసిన ఆయుధాన్ని సంఘటనా స్థలంలోనే పడేస్తాడా అని ప్రశ్నిస్తాడు రాజ్ లాయర్.
నా క్లయంట్‌ని నిరపరాధి అని నిరూపించడానికి నాకు, పోలీస్ శాఖకు కొంత గడువు ఇవ్వాల్సిందిగా కోర్టును అడుగుతాడు లాయర్. ఆ వెంటనే ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటిస్తాడు. నిన్ను ఈ పరిస్ధితుల్లో చూడలేకపోతున్నానని బాధపడుతుంది అపర్ణ. నువ్వే హంతకుడు అనడానికి బలమైన సాక్ష్యాధారాలు దొరకడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదని సుభాష్ అంటాడు. మీ వేలిముద్రలే రాడ్ మీద ఉంటాయని అనుకోలేదని రాజ్‌తో చెబుతుంది అప్పూ.
ఇంతలో అనామిక వచ్చి.. ఏదో చేద్దామని , ఇంకేదో చేశావని అప్పూపై సెటైర్లు వేస్తుంది. సాక్ష్యాలు లేక ఎక్కడ కేసును కొట్టేస్తారోనని భయపడ్డానని, ఇంతలోనే నువ్వు కీలకమైన ఆధారాన్ని తీసుకుని వచ్చావని అంటుంది . చచ్చికూడా నా మీద సామంత్ ప్రేమ చూపిస్తున్నాడని అంటుంది. ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదని కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వగా.. ఇదంతా కోపమేనా అంటూ సెటైర్లు వేస్తుంది అనామిక. రేపటిలోగా అన్ని బయటికి వస్తాయని.. అప్పుడు పోలీసులు నీ నట్లు , బోల్టులు అన్ని సరిచేస్తారని అంటుంది అప్పూ.
రాజ్ బయటికి వస్తాడు.. నేను లోపలికి వెళ్తానని మీరంతా అనుకుంటున్నారు కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాజ్‌కు ఫేవర్‌గా మీకు ఏ ఆధారం దొరకదని అంటుంది అనామిక. రాజే హంతకుడని రేపు తీర్పు వస్తుంది.. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని చెబుతుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇదే కోర్టులో దోషిగా నువ్వు, నిర్దోషిగా నా కొడుకు నిలడతారని అంటాడు సుభాష్. ఇంట్లో అప్పూని రౌండప్ చేసి నానా మాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. రాజ్‌ను బయటికి తీసుకొస్తానని చెప్పి, వాడిని మరింత ఇరికించేశావని మండిపడుతుంది.
రాజ్ ఈ ఇంటికి వారసుడని, నేకు చేతకాకపోతే తప్పుకోమని అంటుంది ధాన్యలక్ష్మీ. మీ అత్తకి మా ఆయనంటే ఎంత ప్రేమో చూశావా అంటూ స్వప్పతో అంటుంది కావ్య. ఈ విషయాన్ని నేను కాపురానికి వచ్చిన ఇన్ని రోజులకు తెలుసుకున్నానని చెబుతుంది స్వప్న. మా అప్పూ ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ధాన్యలక్ష్మీ ఆంటీ , నువ్వు దానిని ప్రతి విషయానికి టార్గెట్ చేస్తున్నారని మండిపడుతుంది. బావగారిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాదేనని చెబుతుంది అప్పూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











