Brahmamudi March 11th Episode: యామినికి కనకం సపోర్ట్ .. రాజ్‌ని రామ్‌గా మార్చేసిన యామిని..
యాక్సిడెంట్ నుంచి కావ్య ఒక్కటే బయటపడటం .. రాజ్ కనిపించకపోవడంతో దుగ్గిరాల కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఏం జరిగిందో కనుక్కోవడానికి కళ్యాణ్, అప్పూలు ప్రమాదం జరిగిన స్పాట్‌కు వెళ్తారు. జరిగిన ప్రమాదం గుర్తుకు రావడంతో కావ్య ఉలిక్కిపడి లేస్తుంది. దీంతో డాక్టర్ .. దుగ్గిరాల ఫ్యామిలీని పిలిపిస్తాడు. స్పృహలోకి వచ్చిన కావ్య తన భర్త ఎక్కడ? ఏమయ్యాడు? ఆయనకు ఏం కాలేదు కదా? అని అడుగుతుంది. ఇంతలో అప్పూ వచ్చి అడవిలో ఎంత గాలించినా బావగారు కనిపించలేదని, ఒక చెట్టు కొమ్మకి ఆయన వేసుకున్న షర్ట్ కనిపించిందని చెప్పి ఇస్తుంది.
అది చూడగా కావ్య సహా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. బావ బాడీని అడవిలో క్రూర మృగాలు లాక్కెళ్లిపోయి ఉంటాయని అక్కడివాళ్లు అంటున్నారని అప్పూ చెప్పడంతో అంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉంటారు. అదే ఆసుపత్రిలో మరో బెడ్‌పై రాజ్ స్పృహలోకి వస్తాడు. అతని చుట్టూ యామిని, అతని తల్లిదండ్రులు ఉంటారు. ప్రమాదం వల్ల రాజ్ గతం మరిచిపోయాడని చెబుతాడు డాక్టర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 11వ తేదీ .. ఎపిసోడ్ 666లో ఏం జరిగిందంటే..

రాజ్ గతం మరిచిపోవడంతో తనకు చాలా హ్యాపీగా ఉందని అంటుంది యామిని. ఆమె మాటలతో తల్లిదండ్రులిద్దరూ షాక్ అవుతారు. నా ప్రేమను నాకు తిరిగి ఇవ్వడానికి రాజ్‌ను నాకు దగ్గర చేశాడని అంటుంది యామిని. రాజ్ ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని, నువ్వేం కంగారు పడొద్దని అంటుంది ఇందిర. యాక్సిడెంట్ స్పాట్‌కు వెళ్లొచ్చినప్పటి నుంచి కళ్యాణ్ తనలో తానే కుమిలిపోతున్నాడని.. వాళ్లిద్దరూ ఏదో దాస్తున్నారని అంటుంది ధాన్యలక్ష్మీ. ఈ ఒక్క షర్ట్ వల్ల రాజ్ చనిపోయాడని ఎలా అనుకోమంటారని అప్పూని నిలదీస్తుంది అపర్ణ.
కావ్య ప్రాణాలతోనే ఉన్నప్పుడు , మరి అల్లుడుగారు కూడా అదే కారులో ఉండాలి కదా అని కనకం అడుగుతుంది. బావ మన కుటుంబానికి దేవుడని ఆయన ఆ దేవుడు దగ్గరికే వెళ్లిపోయాడని అంటుంది అప్పూ. అందరూ నన్ను క్షమించాలని, అక్క దగ్గర పూర్తి నిజం చెప్పలేకపోయానని అంటుంది. ఆ వెంటనే రాజ్ చైన్, ఉంగరాలను ఇస్తుంది అప్పూ. నిజం తేలిస్తే కావ్య ప్రాణాలతో ఉంటుందా అని ఏడుస్తుంది కనకం. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి దూరం నుంచి చూసి వెళ్లిపోతాడు.
ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక యామిని తండ్రి టెన్షన్ పడతాడు. ఇంతలో ఆ వ్యక్తి వచ్చి రాజ్ సార్ వస్తువుల్ని పోలీసులకు దొరికేలా చేశానని, పోలీసులు , దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా రాజ్ సార్ చనిపోయాడని నమ్ముతున్నారని యామినికి చెబుతాడు. ప్రపంచం దృష్టిలో రాజ్ లేడని.. ఆ రాజ్ ఇకపై రామ్‌గా మారిపోతున్నాడని తల్లిదండ్రులతో చెబుతుంది యామిని. ఇంతలో యామిని రాజ్ దగ్గరికి వెళ్లి బావా.. నువ్వు మళ్లీ నాకు దక్కుతావని అనుకోలేదని అంటుంది. ఆ మాటలతో రాజ్ షాకై ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తాడు.
డాక్టర్‌ని, వాళ్ల అమ్మానాన్నలని పిలిచి డ్రామా ఆడుతుంది యామిని. యాక్సిడెంట్‌లో గతాన్ని మరిచిపోయాడని, పేషెంట్‌ని ఎక్కువగా డిస్ట్రబ్ చేస్తే నరాలు చిట్లిపోతాయని డాక్టర్ చెబుతాడు. అతని కుటుంబం, భార్యకు నువ్వు అన్యాయం చేస్తున్నావని యామిని తండ్రి మండిపడతాడు. పెళ్లయిన వాడిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేంటి అని అడుగుతుంది యామిని తల్లి. నేను ప్రేమించిన వాడు దక్కలేదని జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకున్నానని, ఇప్పుడు రాజ్‌ని సొంతం చేసుకునే అవకాశం వచ్చిందని.. నన్ను డిస్ట్రబ్ చేస్తే ఆ మత్తుకే బానిస అవుతానని తల్లిదండ్రుల్ని బెదిరిస్తుంది యామిని.
రాజ్ నా మేనత్త కొడుకని, చిన్నప్పుడే అతని అమ్మానాన్నలు పోవడంతో మీరే పెంచి పెద్దచేసి చదివించారని , నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారని ఇంతలోనే యాక్సిడెంట్ అయ్యిందని రాజ్‌తో చెప్పి నటించాలని తల్లిదండ్రులతో అంటుంది. నేను రాసిన స్క్రిప్ట్‌లో మీరిద్దరూ పాత్రధారులని నేను చెప్పినట్లు చేస్తే చాలని మిగిలినది నేను చూసుకుంటానని అంటుంది యామిని. ఇది నేరమని.. రాజ్‌కి పెళ్లయిందని, భర్త కనిపించక ఆమె తల్లడిల్లిపోతుందని చెబుతాడు తండ్రి. రాజ్ జీవితంలో తిరిగిరాడని, చనిపోయాడని అంతా నమ్మేశారని చెబుతుంది యామిని. రాజ్ జీవితమంతా తెల్ల కాగితంగా మారిపోయిందని చెప్పగా.. దాని మీద నేను ఏమైనా రాసుకుంటానని అంటుంది.
యామిని తీరుతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులిద్దరూ ఓ చోట కూర్చొని బాధపడతారు. వారి పక్కనే కనకం కూడా కూర్చొని ఏడుస్తుంటుంది. యామిని ఇష్టానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా మళ్లీ మొదటికొస్తుందని అంటుంది యామిని తల్లి వైదేహి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉందని , ఏదో సమస్యలో ఉన్నట్లుగా ఉన్నారని అడుగుతుంది కనకం. రెండ్రోజులుగా మేం ఇక్కడే ఉన్నామని అందుకే తెలిసినవాళ్లలా కనిపిస్తున్నామని అంటుంది వైదేహి. మాకు కాబోయే అల్లుడికి యాక్సిడెంట్ అయ్యిందని, గతం మరిచిపోయాడని అయినా మా అమ్మయి అతన్నే పెళ్లి చేసుకుంటానని అంటోందని చెబుతుంది వైదేహి.
ఎవరినైనా ఒకరిని అతనే తన భర్త అని నిర్ణయించుకున్నాక ఏ అమ్మాయి మనసు కూడా అంత సులువుగా కాదనుకోలేదని అంటుంది కనకం. ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడమే మంచిదని కనకం చెబుతుంది. ఇప్పటిదాకా మేం డైలమాలో ఉన్నామని.. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అమ్మాయి ఇష్ట ప్రకారం చేయడమే మంచిదని అనిపిస్తోందని యామిని తండ్రి అంటాడు. మీ అల్లుడు ఎక్కడున్నాడని కనకం అడగటంతో ఆమెని తీసుకుని వెళ్తుంది వైదేహి. ఇంతలో కావ్య స్పృహలోకి రావడంతో కనకం పరిగెత్తుకుంటూ వెళ్తుంది.
యాక్సిడెంట్ జరిగిన చోట సరిగా వెతికారా? బావగారు కనిపించలేదా? అని అప్పూని ప్రశ్నిస్తుంది కావ్య. ఇంతమంది ఉండి మీరంతా ఏం చేస్తున్నారని మండిపడుతుంది. నేను కదల్లేని స్థితిలో ఉన్నానని.. మీరంతా బాగానే ఉన్నారు కదా? ఆసుపత్రిలోనే ఉండకపోతే వెళ్లి వెతకొచ్చు కదా అని మండిపడుతుంది కావ్య. పోలీసులు, సెర్చ్ టీమ్ మొత్తం ఆ ప్లేస్ గాలించారని ఎక్కడా బావగారి ఆచూకీ దొరకలేదని చెబుతుంది అప్పూ.
వాడు లేడన్నది ఎలా తట్టుకుని బతకాలో నాకేం అర్ధం కావడం లేదని బాధపడుతుంది అపర్ణ. కన్న కొడుకు దూరమైనా , కోడలినైనా కాపాడుకోవాలని అంతా ఇక్కడే ఉన్నారని అంటుంది కనకం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










