Brahmamudi March 12th Episode: యామిని ప్లాన్ ఫెయిల్.. రాజ్‌కి కావ్య గురించి చెప్పేసిన తల్లి
రాజ్ గతం మరిచిపోయి తన కోసం మళ్లీ పుట్టాడని తల్లిదండ్రులతో అంటుంది యామిని. అతని పేరును రామ్‌గా మారుస్తున్నానని.. ఇందుకోసం మీరు నాకు హెల్ప్ చేయాలని చెబుతుంది. అప్పూ - కళ్యాణ్‌లు ఏదో దాస్తున్నారని ధాన్యలక్ష్మీ అనుమానం వ్యక్తం చేయడంతో అసలు నిజం చెప్పమని అడుగుతుంది అపర్ణ. దీంతో యాక్సిడెంట్ స్పాట్‌లో దొరికిన రాజ్ నగలు, వస్తువులను చూపిస్తుంది అప్పూ. దాంతో అంతా కన్నీటి పర్యంతమవుతారు.
దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్ చనిపోయినట్లుగా నమ్ముతోందని ఓ వ్యక్తి వచ్చి యామినితో చెబుతాడు. కూతురు చేసేది తప్పని తెలిసినా ఏం చేయలేక యామిని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. అదే సమయంలో పక్కనే ఉన్న కనకంతో తమ బాధను చెప్పుకుంటారు. మీ కూతురికి ఇష్టమైనట్లే చేయమని కనకం చెప్పడంతో వారు కూడా సరేనని చెబుతారు. రాజ్ కనిపించపోవడంతో అప్పూపై అరుస్తుంది కావ్య . ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 12వ తేదీ .. ఎపిసోడ్ 667లో ఏం జరిగిందంటే..

షర్ట్ దొరికిందంటే మనిషి లేకుండా పోతాడా అని కుటుంబ సభ్యులపై మండిపడుతుంది కావ్య . మనందరం కలిసి వెతికితే తప్పకుండా ఆయన దొరుకుతాడని అరుస్తుంది . ఆ అడవిలో దారి తెలియక తప్పిపోయారేమో, ఆయనకు ఆకలిగా ఉంటుందేమో అని బాధపడటంతో అంతా కంటతడి పెడతారు. ఈ పరిస్ధితుల్లో నువ్వు ఎక్కడికి కదలకూడదని , విశ్రాంతి తీసుకోమని చెబుతారు అపర్ణ, ఇందిర. నన్ను వద్దు పో అన్నప్పుడే నేను ఆయనను వదిలిపెట్టి పోలేదని.. ఇప్పుడు ఆయనను వదిలి ఎలా ఉండగలనని ప్రశ్నిస్తుంది.
ఎవరొచ్చినా రాకపోయినా నేను వెళ్లి ఆయనని తీసుకొస్తానని చెబుతుంది. కావ్య గోలతో డాక్టర్ వచ్చి మీ వల్ల మిగిలిన పేషెంట్స్‌కి ఇబ్బందిగా ఉందని మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తానని మండిపడతారు. అల్లుడుగారు క్షేమంగా ఉంటే నీకోసమైనా వస్తారని , నువ్వు ధైర్యంగా ఉండాలని అంటుంది కనకం. రాజ్‌ని తీసుకుని యామిని తల్లిదండ్రులు, కావ్యని తీసుకుని దుగ్గిరాల కుటుంబసభ్యులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోతారు.
రాజ్‌ని తన ఇంటికి తీసుకొచ్చిన యామిని ఇది మన ఇల్లని , చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని, ఇక్కడే ఆడుకున్నామని చెబుతుంది. రాజ్‌తో దిగిన ఫోటోలని కూడా ఇల్లంతా పెట్టిస్తుంది యామిని. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని.. కానీ ఇంతలో ఈ దారుణం జరిగిపోయిందని కథ చెబుతుంది. దీంతో ఆ ఫోటోలను చూస్తూ ఉండిపోతాడు రాజ్. చిన్నప్పటి నుంచి నువ్వే తన భర్తవని యామిని ఎన్నో కలలు కన్నదని రాజ్‌తో చెబుతుంది వైదేహి. దాని ఇష్ట ప్రకారమే అన్ని జరిగాయని, నిశ్చితార్ధం కూడా జరిపించామని .. కొద్దిరోజుల్లో పెళ్లి అనగా ఇలా జరిగిందని అంటుంది.
ఇంతలో యామిని వచ్చి.. ఇప్పుడే కదా వచ్చాడు రాగానే పాత విషయాలన్నీ గుర్తుచేయాలా అని తల్లిపై యామిని మండిపడుతుంది. నీ కూతురు చాలా తెలివిమీరి పోయిందని అంటాడు యామిని తండ్రి. తర్వాత రాజ్‌ని గదిలోకి తీసుకెళ్తుంది యామిని. ఆల్బమ్‌లో పాత ఫోటోలను చూసేలా రాజ్ పక్కనే పెడుతుంది యామిని. రాజ్ వాటిని చూస్తుండగా ఆల్బమ్ లాక్కుంటుంది. మరోవైపు.. ఇంటికొచ్చిన కావ్యని ఆ పరిస్దితుల్లో చూసి స్వప్న కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. రాజ్ ఫోటోను చూసి కంటతడి పెడుతుంది కావ్య.
ఒక్కోసారి ఆ దేవుడు మనుషులతో ఎందుకింత కఠినంగా ఉంటాడో తెలియడం లేదని బాధపడుతుంది కావ్య. జీవితాన్ని ఒక అందమైన కలగా చూపిస్తూ మరుక్షణం అది ఒక నీటి బుడుగ లాంటిదని మాయం చేస్తాడని అంటుంది ఇందిర. మీ తాతయ్య ఆసుపత్రిలో ఉన్నాడంటేనే ఇంత వయసున్న నేనే తట్టుకోలేకపోయానని చెబుతుంది . ఇంత చిన్న వయసులోనే ఆ దేవుడు నీకు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదని బాధపడుతుంది. నీకు న్యాయం చేసేంత శక్తి ఆ దేవుడు మాకు ఇవ్వలేదని, కోట్ల ఆస్తి ఉన్నా ఏం చేయలేని నిరుపేదలుగా ఉన్నామని .. ఈ కుటుంబం ఎప్పుడూ నీకు తోడుగా నిలబడుతుందని చెబుతుంది.
నాకేం జరిగిందని మీరంతా ఇలా బాధపడుతున్నారని అడుగుతుంది కావ్య. ఆయన ఎక్కడున్నాడో తెలియక నేను కుమిలిపోతున్నానని, లోయలో పడిపోయాక ఏమైనా గాయాలు అయ్యాయేమోనని కంగారు పడుతున్నానని చెబుతుంది . అపర్ణ దగ్గరికి వెళ్లి ఆసుపత్రిలో జరిగిన విషయాలన్నీ చూసి అదే నిజమని నమ్మి ఇలా బాధపడొద్దని అంటుంది. ఆయన ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నారని నా మనసు గట్టిగా చెబుతోందని అంటుంది. నేనేం చేసినా ఈ ఇంటి మంచి కోసమే చేస్తానని మీరే అంటారు కదా.. ఎక్కడున్నా సరే ఆయన ఇంటికి తిరిగి వస్తారని ధైర్యంగా ఉండమని అంటుంది కావ్య.
ఏం మాట్లాడుతున్నావ్ అక్కా.. నేను చెప్పేది విను అని అప్పూ ఏదో చెప్పబోతుండగా కావ్య అడ్డుకుంటుంది. నువ్వొక పోలీస్ ఆఫీసర్‌గా సాక్ష్యాలను నమ్మి మాట్లాడుతున్నావని, కానీ నేనొక భార్యగా ప్రేమను నమ్మి మాట్లాడుతున్నానని అంటుంది. ఆయన తప్పకుండా వస్తారని నేనెందుకు ఇంత గట్టిగా చెబుతున్నానో మీకు తర్వాత అర్ధమవుతుందని అంటుంది. దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. కావ్యని అలా చూస్తుంటే చాలా బాధగా ఉందని స్వప్న బాధపడుతుంది. రాజ్ తిరిగొస్తాడని గుడ్డిగా నమ్ముతోందని .. ఇలాగే వదిలేస్తే తన ఆరోగ్యం ఏమవుతుందోనని భయంగా ఉందని అంటుంది.
ఏమవుతుంది పూర్తిగా పిచ్చిది అయిపోతుందని , నా మాటలు మీ అందరికీ కష్టంగా అనిపించొచ్చు కానీ అదే నిజమని అంటుంది రుద్రాణి. రాజ్ చనిపోయాడు, ఇక ఎప్పటికీ తిరిగి రాడని చెప్పడంతో ఇందరి వచ్చి రుద్రాణి చెంప పగలగొడుతుంది. రాజ్ చనిపోయాడన్న విషయం అర్ధమయ్యేలా చెప్పకుంటే .. తన భర్త బతికే ఉన్నాడని ప్రపంచమంతా చెప్పుకుంటూ తిరుగుతుందని రుద్రాణి అంటుంది. అప్పుడు అంతా కలిసి మనల్ని నానామాటలు అంటారని, కొడుకు చనిపోగానే కోడల్ని గాలికొదిలేశారని అంటారని హెచ్చరిస్తుంది. ఇన్ని సాక్ష్యాలు చూపించినా కావ్య నమ్మేలా లేకపోవడంతో కనీసం మన సంప్రదాయాల ప్రకారమైనా పసుపు, కుంకుమలు తీసేసి, తాళిబొట్టుని దూరం చేస్తే అప్పుడైనా ఈ పిచ్చి మాటలు మానేసి నిజంలో బతుకుతుందని అంటుంది రుద్రాణి.
రాజ్ దూరమై ఇంట్లో వాళ్లంతా ఏడుస్తుంటే ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని ఫైర్ అవుతుంది ఇందిర. నువ్వు నా కడుపున పుట్టకపోయినా కన్న కూతురిలాగే పెంచానని.. కానీ మానవత్వంతో ఆలోచించే ఒక్క గుణం కూడా ఎందుకు రాలేదని మండిపడుతుంది. నువ్వు నన్ను కొట్టి తిట్టినంత మాత్రాన కావ్య చెప్పేదంతా నిజమైపోతుందా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. చనిపోయిన రాజ్ తిరిగొచ్చేస్తాడా? కావ్యతో పాటు మీరంతా కలలోనే బతకాలని అనుకుంటున్నారా? కాళ్లు తెరిచి నిజం చూడండని చెబుతుంది . రాజ్ మనకి ఇక లేడని పదే పదే అంటుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











