Brahmamudi March 15th Episode: యామిని మైకంలో రాజ్.. పిచ్చిదానిలా కావ్య , తీగ లాగుతోన్న అప్పూ
రాజ్ కనిపించకపోయేసరికి అందరూ తనను పిచ్చిదానిలా చూస్తున్నారంటూ కృష్ణుడి ముందు కూర్చొని బాధపడుతుంది కావ్య. కళావతి పరిస్ధితి తలచుకుని స్వప్న, అప్పూ బాధపడతారు. కానీ అక్క అంత బలంగా చెబుతోందంటే యాక్సిడెంట్ స్పాట్‌లో ఏదో జరిగిందని అప్పూకి అనుమానం వస్తుంది. రాజ్ భోజనం చేస్తుండగా బాగా ఎక్కిళ్లు రావడంతో ఎవరో బాగా తలచుకుంటున్నారని యామిని తండ్రి చెబుతాడు. ఇంకెవరు ఆయన భార్యేనని వైదేహి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు.
తనని వెనుక నుంచి వెళ్లి హగ్ చేసుకున్న యామిని వదిలించుకుంటాడు రాజ్. నేనే ఎవరో అనుకున్నానని యామినికి సారీ చెబుతాడు. రాజ్ తన దారిలోకి రావాలంటే డోస్ ఇంకా పెంచాలని అనుకుంటాడు. రాజ్ చనిపోవడం, కావ్య పరిస్ధితి బాలేకపోవడంతో ఇదే అదనుగా కంపెనీకి రాహుల్‌ని సీఈవోగా చేయాలని ప్లాన్ చేస్తుంది రుద్రాణి. యామిని తన తల్లిదండ్రులతో కలిసి కాఫీ తాగుతూ రాజ్‌ని తన దారిలోకి తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నట్లు చెబుతుంది. వారి మాటలను రాజ్ దూరం నుంచి వింటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 15వ తేదీ .. ఎపిసోడ్ 670లో ఏం జరిగిందంటే..

ఉదయాన్నే ఏడుస్తున్న కావ్యకి పాలు తీసుకొచ్చి ఇస్తుంది స్వప్న. ఆమె మాత్రం వద్దు అని అంటుంది.. కనీసం మీరైనా చెప్పమని అపర్ణని అడగ్గా ఇంటికి పెద్ద దిక్కులాంటి కొడుకు కనిపించకుండా పోయాడని మాకేమీ వద్దు అని చెబుతుంది అపర్ణ. ఇంతలో పోలీస్ కానిస్టేబుల్ వచ్చి అప్పూకి రిపోర్ట్స్ ఇస్తాడు. అవేంటని అడుగుతాడు సుభాష్.. అక్క చెప్పడంతో నాకు కొంచెం అనుమానం రావడంతో బావ బట్టలపై ఉన్న రక్తపు మరకల్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించానని చెబుతుంది అప్పూ. పోలీస్ అయ్యాక నీకు అనుమానాలు బాగా ఎక్కువయ్యాయని అంటుంది రుద్రాణి.
ఆ రిపోర్ట్స్ చదివిన అప్పూ షాక్ అవ్వగా.. ఏముందని ప్రకాశం వచ్చి అడుగుతాడు. ఆ రక్తపు మరకలు బావగారివే అని అప్పూ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇంతలో కావ్య వచ్చి ఆ రిపోర్ట్స్‌ని చించేస్తుంది. ఆయన బతికే ఉన్నారని.. మీరు ఎవ్వరు నమ్మినా , నమ్మకపోయినా నేను నమ్ముతున్నానని అంటుంది కావ్య. నువ్వు చెప్పినట్లుగానే రాజ్ బతికే ఉన్నాడని అనుకుందాం.. మరి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. రాజ్‌ని చూపించవు కానీ బ్రతికే ఉన్నాడని అంటున్నావ్.. ఎవరి మాటలు నమ్మాలని అడుగుతుంది.
ఆయన బతికే ఉన్నాడని మీ అందరి ముందు నిల్చోబెడతానని చెబుతుంది కావ్య. ఈ కథ ఎక్కడ ఆగిపోయిందో, మళ్లీ అక్కడే మొదలుపెడతానని అంటుంది. ఆయన ఎక్కడున్నా నేను తీసుకొస్తానని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. రాజ్ కనిపించడం లేదన్న బాధ కంటే కావ్య పిచ్చి ఎక్కువైపోతుందనే బాధగా ఉందని అంటుంది రుద్రాణి. పోయినవాళ్లెవరూ తిరిగిరారు, కనీసం ఉన్నవాళ్లనైనా కాపాడుకోవాలి కదా అని చెబుతుంది. లేనివాడి కోసం పిచ్చిదానిలా వెతుక్కుంటూ వెళ్లిపోయిందని అంటుంది. ఇలాగే ఉంటే మన కంపెనీ ఎక్కడ నాశనం అయిపోతుందోననే బాధగా ఉందని.. నువ్వు వెంటనే వెళ్లి ఈరోజు నుంచి కంపెనీ బాధ్యతలన్నీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి.
పెద్ద మావయ్య నేను ఆఫీస్‌కి వెళ్లొస్తానని రాహుల్ చెప్పగా.. అక్కర్లేదని అంటాడు సుభాష్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. అక్కడ కంపెనీని ఎవరు చూసుకుంటారని ప్రశ్నిస్తుంది రుద్రాణి. నువ్వు ఒక్కడివే అంత పెద్ద కంపెనీని హ్యాండిల్ చేసేంత శక్తి నీకుందా అని ప్రకాశం ప్రశ్నిస్తాడు. అన్నయ్య వెళ్తాడని ప్రకాశం అనగా.. నేను మాత్రమే కాదు, నేను ప్రకాశం ఇద్దరం వెళ్లి కంపెనీ వ్యవహారాలు చూసుకుంటామని చెబుతాడు సుభాష్. ఇంకెప్పుడూ మా వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకోవాలని చూడొద్దని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు.
అందరూ బాధలో ఉన్నారు కంపెనీకి చేదోడు వాదోడుగా ఉందామని అనుకున్నామని రుద్రాణి అంటుంది. రాజ్ కనిపించక అంతా ఇంత బాధపడుతుంటే నీకు కంపెనీ గుర్తొచ్చిందా అని మండిపడుతుంది స్వప్న. అప్పూ రాహుల్, రుద్రాణిలను డౌట్‌గా చూస్తుంటే మమ్మల్ని అలా చూడొద్దు.. మేం ఏ నేరం చేయలేదు, ఆఫీస్‌కి వెళ్లొద్దంటే వెళ్లనులే అని అంటాడు రాహుల్. ఫోటోలను మార్ఫింగ్ చేసినవాడితో మాట్లాడుతుంది యామిని. ఇంతలో రాజ్ రావడం చూసి మాట మార్చేస్తుంది.
జరిగిన దానికి సారీ చెబుతాడు రాజ్. నాకు తెలియకుండా నిన్ను చాలా బాధపెట్టానని, నీతో పెళ్లి వరకు వచ్చినట్లు నాకు గుర్తు రావడం లేదని యామినితో అంటాడు. నేను అబద్ధం చెప్పడం లేదని దానిని అర్ధం చేసుకోమని అంటుంది యామిని. నువ్వు నువ్వులాగే ఉన్నావని.. నాకిప్పుడే భూమ్మీద కళ్లు తెరిచినట్లుగా ఉందని అంటాడు రాజ్. ఈ ఇల్లు, నువ్వు అంతా కొత్తగా ఉందని.. నీతో పెళ్లి వరకు వెళ్లినట్లు సాక్ష్యాలు కనిపిస్తున్నాయని చెబుతాడు. నేను నీ బావలా మారేందుకైనా మానసికంగా సిద్ధపడాలి కాబట్టి దానికి కొంచెం గడువు కావాలని అడుగుతాడు రాజ్.
నిన్ను ఫోర్స్ చేయనని, నీ ఇష్టం వచ్చినట్లు ఉండమని యామిని వెళ్లబోతుండగా రాజ్ ఆమె చేయి పట్టుకుని ఆపుతాడు. మనిద్దరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడుతాడు . కనీసం బయటికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతాడు రాజ్. నీ కోసం కాకపోయినా నా కోసమైనా తీసుకెళ్లమని అడుగుతాడు. నువ్వు అడిగితే ఏదైనా సరే కాదంటానా అని అంటుంది యామిని. తర్వాత రాజ్ - యామిని కలిసి కారులో వెళ్తుంటారు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని అంటుంది యామిని.. నాక్కూడా ఏదో జైలు నుంచి విడుదల అయినట్లుగా ఉందని అంటాడు రాజ్.
అంటే మనిల్లు జైలులా ఉందా? నేను జైలర్‌లా కనిపిస్తున్నానా? అని మండిపడుతుంది యామిని. అప్పుడు కూడా నన్ను ఇలాగే ఏడిపించేదానివా? అని అడుగుతాడు రాజ్. నాకు అంత అవకాశం ఇచ్చేవాడివి కాదని అంటుంది యామిని. అనంతరం రాజ్ చేతిని పట్టుకుని ముద్దు పెట్టుకుంది యామిని. ఇంతలో కారులో వెళ్తున్న రాజ్‌ను కావ్య చూసి షాక్ అవుతుంది. వెంటనే కారును ఆపి రాజ్ కారు వెంట పరుగులు తీస్తుంది కావ్య. ఇక్కడ దగ్గరిలో నా డ్రెస్ ఇచ్చాను తీసుకొని వచ్చేస్తానని అంటుంది యామిని. రాజ్ కారు ఆగడం చూసిన కావ్య.. వెంటనే కారు దగ్గరికి వెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











