Brahmamudi weekly roundup: రాహుల్ చేతికి స్వరాజ్ కంపెనీ.. పెళ్లికూతురిలా అపర్ణ, రాజ్ కొత్త కంపెనీ
Photo Courtesy: JioHotstar
ఇంట్లో వాళ్లు వద్దు అంటున్నా రాహుల్‌కి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చే పని చెబుతాడు రాజ్, బ్యాంక్ నుంచి వస్తుండగా దొంగలు నగలు కొట్టేయడంతో రాహుల్ వాళ్లని వెంబడించి డబ్బును కాపాడతాడు. రాహుల్ ఆ డబ్బుతో జల్సా చేస్తుంటాడని రాజ్‌పై దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది. ఇంతలో సుభాష్ వచ్చి అసలు నిజం చెబుతాడు. రాహుల్‌ని నమ్మి అతని చేతిలో కంపెనీ బాధ్యతలు పెడతాడు రాజ్. ఉదయాన్నే ఆఫీసులో రాహుల్‌ని చూసిన శృతికి మైండ్ పోతుంది. మీరు ఫైల్స్ మీద సంతకాలు పెడితే చాలని చెప్పడంతో రాహుల్ ఈగో హర్ట్ అవుతుంది. దాంతో కంపెనీని తను కైవసం చేసుకోవడానికి స్వప్నని ఆఫీసుకు రప్పించి తెలివిగా తను అవమానాల పాలవుతున్నట్లు నటిస్తాడు. సుభాష్ - అపర్ణల పెళ్లి రోజు కావడంతో వారిద్దరికీ కావ్య పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తుంది. అందరూ సంతోషంగా ఉండగా స్వప్న వచ్చి రాహుల్‌ని ఆఫీసులో అందరూ పురుగులా చూస్తున్నారని మండిపడుతుంది. రాహుల్‌కి ఒక అవకాశం ఇవ్వాలని కావ్య చెప్పగా దానికి టైం ఉందని అంటాడు రాజ్. ఆర్ కంపెనీ పేరుతో రాజ్ కొత్త కంపెనీ ప్రారంభిస్తున్నట్లు రాహుల్ తెలుసుకుని ఈ విషయాన్ని స్వప్నకి చెబుతాడు రాహుల్.

Photo Courtesy: JioHotstar
బ్రహ్మముడి నవంబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు .. 880వ ఎపిసోడ్ నుంచి 885 వరకు ఏం జరిగిందంటే?
నవంబర్ 17వ తేదీ 880వ ఎపిసోడ్‌లో..
రాహుల్ కొనిచ్చిన చీర మరీ నాసిరకంగా ఉందని స్వప్నని అందరూ నానామాటలు అంటారు. నా భర్త కష్టపడి తొలిసారి సంపాదించిన డబ్బుతో కొన్న చీర కోట్లు విలువ చేస్తుందని అంటుంది స్వప్న. ఇంతలో రాజ్ వచ్చి ఈరోజు ఉదయం 11 గంటలకు టెండర్ ఉంది. ఆ టైంకల్లా బ్యాంక్‌లో 20 లక్షల రూపాయలు డ్రా చేసి టెండర్‌కి కట్టాలని చెప్పి పంపిస్తాడు. రాహుల్ గురించి తెలిసి కూడా అతనికి అలాంటి పనులు చెబుతావా? 20 లక్షల రూపాయలు ఎత్తికెళ్లిపోతాడని అందరూ నానామాటలు అంటారు. ఆ మాటలతో స్వప్న బాధపడుతుంది. దాంతో కావ్య, రాజ్‌లు అందరికీ నచ్చజెబుతారు. రాహుల్ బ్యాంక్ నుంచి డబ్బును తీసుకుని వస్తుండగా నలుగురు దొంగలు అతని బ్యాగ్ కొట్టేసి పారిపోతారు. అయితే రాహుల్ వాళ్లని వెంటాడి.. ప్రాణాలకు తెగించి మరి డబ్బు వెనక్కి తెస్తాడు. టెండర్‌కి టైం అవుతున్నా రాహుల్ రాకపోవడంతో రాజ్‌కి ఫోన్ చేసి జరిగింది చెబుతాడు ప్రకాశం. దాంతో నేను మరొకరితో డబ్బు పంపిస్తానని రాజ్ అంటాడు. ఇంతలో ఒంటి నిండా దెబ్బలతో, డబ్బుతో రాహుల్ ఇంటికొచ్చి జరిగినదంతా చెబుతాడు. కానీ దుగ్గిరాల ఫ్యామిలీ అతని మాటలు నమ్మదు. ఇంతలో సుభాష్ వచ్చి వాడు చెప్పేదంతా నిజమేనని అంటాడు
నవంబర్ 18వ తేదీ 881వ ఎపిసోడ్‌లో..
నా భర్త ప్రాణాలకు తెగించి మరీ డబ్బును కాపాడాడని దొంగ కాదని అతని నిజాయితీని గుర్తించమని మండిపడుతుంది స్వప్న. నా కొడుకును అవమానించాలి, నిందలు వేయాలని చూస్తారే గానీ వాడిలో వచ్చిన మార్పును ఎవరూ గమనించడం లేదని రుద్రాణి సీరియస్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు నేను అలా ఉన్నాను కాబట్టే ఇంట్లో వాళ్లంతా నన్ను అనుమానిస్తున్నారని, ఇందులో వాళ్ల తప్పులేదని అంటాడు రాహుల్. ఈ డబ్బును నేను తీసుకురాకపోయుంటే.. ఇంట్లో నా పరిస్ధితి ఏంటీ? అని రాహుల్ బాధపడతాడు. డబ్బు టైంకి తీసుకురాలేకపోవడంతో కాంట్రాక్ట్ పోయిందని రాహుల్ బాధపడతాడు. కాంట్రాక్ట్ ఎక్కడికి పోలేదని... మనకే వచ్చిందని, నా జాగ్రత్తలతో నేనుండి సమయానికి డబ్బు అందేలా చేశానని అంటాడు రాజ్. డబ్బు కోసం ఇంత రిస్క్ చేయొద్దని... నిన్ను నమ్ముకుని నేను, పాప ఉన్నామని అంటుంది స్వప్న. మా అక్కని చూస్తే జాలి వేస్తోంది..రాహుల్‌కి మరో ఛాన్స్ ఇవ్వాలని కావ్య బతిమలాడటంతో రాజ్ సరేనని అంటాడు. ఇంట్లో వాళ్లంతా ఈ దొంగతనంతో నన్ను నమ్మేశారని.. రాజ్‌ను కూడా నా దారికి తెచ్చుకుని కంపెనీని దక్కించుకుంటానని రుద్రాణికి చెబుతాడు రాహుల్.

Photo Courtesy: JioHotstar
నవంబర్ 19వ తేదీ 882వ ఎపిసోడ్‌లో..
భోజనాల దగ్గర తన కొడుకు చేసిన సాహసాన్ని గొప్పగా చెబుతుంది రుద్రాణి. కానీ మీరంతా నా బిడ్డను అవమానించారని, వాడికి బాధగా ఉందని అందుకే భోజనం దగ్గరకి రావడం లేదని అంటుంది. దాంతో రాహుల్‌ని పిలిపించిన రాజ్.. కావ్య కోసం నీకు మరో అవకాశాన్ని ఇస్తున్నానని చెప్పి కవర్ చేతిలో పెడతాడు. స్వరాజ్ గ్రూప్ కంపెనీకి సీఈవోగా చేస్తున్నట్లు దాంట్లో ఉండటంతో నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతాడు రాహుల్. మొత్తానికి అనుకున్నది సాధించావని రాహుల్‌ని మెచ్చుకుంటుంది రుద్రాణి. ఇన్నాళ్లు మనల్ని బానిసల్లా చూసినవారికి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెబుతుంది. ఆరు నెలలు రాజ్ సీట్‌లో ఉండటం కాదు.. పర్మినెంట్‌గా దుగ్గిరాల కంపెనీని నా చేతుల్లోకి తీసుకుని, ఎవ్వరికీ అందని రేంజ్‌కి వెళ్లిపోతానని అంటాడు రాహుల్. ఉదయాన్నే ఆఫీసుకొచ్చిన రాహుల్‌ని చూసి శృతి షాక్ అవుతుంది. అపర్ణ- సుభాష్‌ల పెళ్లి రోజు సందర్భంగా వారిద్దరికీ కొత్తబట్టలు ఆర్డర్ చేసి సర్‌ప్రైజ్ చేస్తుంది కావ్య. మీ ఇద్దరికీ పెళ్లిచూపులు జరగలేదు కాబట్టి.. మేం మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తామని అంటుంది.
నవంబర్ 20వ తేదీ 883వ ఎపిసోడ్‌లో..
కంపెనీలో అడుగుపెట్టిన రాహుల్‌కి ఫైల్స్ చూసే అవకాశం లేకుండా కేవలం సంతకాలు పెట్టే అధికారం మాత్రమే ఉందని శృతి చెబుతుంది. హాయిగా టైంపాస్ చేయండి, మేం చెప్పిన చోట సంతకాలు పెట్టండి అని అనడంతో రాహుల్ ఇగో దెబ్బ తింటుంది. మేనేజర్ దగ్గరికి వెళ్లి డిజైన్స్‌లో కొన్ని మార్పులు చెప్పాను కదా? వాటిని మార్చారా? లేదా అని అడుగుతాడు రాహుల్. కావ్య మేడం వాటికి అప్రూవల్ ఇచ్చేశారని, తయారీకి కూడా వెళ్లిపోయాయని, మీరు చెప్పిన మార్పులు అవసరం లేదని మేనేజర్ చెప్పడంతో రాహుల్ రగిలిపోతాడు. పవర్స్ లేకుండా కుర్చీ నాకెందుకు? ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని స్వప్నని పావుగా మార్చి ఓ కుట్ర చేస్తాడు. స్వప్నకి ఫోన్ చేసి భోజనాన్ని ఆఫీసుకి తెచ్చేలా చేస్తాడు. స్వప్న ముందే శృతి, మేనేజర్‌లు తనను అవమానించేలా డ్రామా ఆడతాడు రాహుల్. ఆఫీసులో తన భర్తకు జరిగిన అవమానాన్ని కళ్లారా చూసిన స్వప్న.. ఈ సంగతి రాజ్, కావ్యల దగ్గరే తేల్చుకుంటానని ఆవేశంగా ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర సుభాష్ - అపర్ణలకు పెళ్లి చూపులు జరిపిస్తుంది కావ్య.

Photo Courtesy: JioHotstar
నవంబర్ 21వ తేదీ 884వ ఎపిసోడ్‌లో..
సుభాష్ - అపర్ణల పెళ్లి రోజు కావడంతో వారిద్దరికీ పెళ్లి చూపులు నిర్వహించి దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. ఇంతలో స్వప్న కోపం వచ్చి రాజ్- కావ్యలను నానామాటలు అంటుంది. నన్ను, నా భర్తను ఉద్దరిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం ఏంటీ? ఆఫీసులో నా భర్తకు ఎవ్వరూ విలువ ఇవ్వడం లేదని మండిపడుతుంది. కేవలం పెట్టమన్న చోట సంతకాలు పెట్టే ఓ రబ్బరు స్టాంప్‌ని చేశారని రగిలిపోతుంది స్వప్న. మీరిద్దరే ఇంటి దగ్గరి నుంచి ఆఫీసును నడుపుతుంటే ఇక రాహుల్ అక్కడ ఎందుకు అని నిలదీస్తుంది. నేను, నా బిడ్డ అంటే ఈ ఇంట్లో అందరికీ లోకువే.. వాడు మారానని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని రుద్రాణి కూడా కోడలికి తోడవుతుంది. ఇంతలో రాహుల్ వచ్చి రాజ్- కావ్యలను ఒక్క మాట అన్నా తల్లివని కూడా చూడనని రుద్రాణికి వార్నింగ్ ఇస్తాడు. రాజ్- కావ్యలు నన్ను నమ్మడమే ఎక్కువే.. వాళ్లు నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందని అంటాడు. ఆ మాటలతో స్వప్న ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది.
నవంబర్ 22వ తేదీ 885వ ఎపిసోడ్‌లో..
రాజ్ సీక్రెట్‌గా ఆర్ కంపెనీ పేరుతో ఓ కంపెనీని స్థాపించే పనుల్లో ఉంటాడు. త్వరగా ఆఫీస్ రెడీ చేయాలని మేనేజర్ మీద అరుస్తుండగా కావ్య వింటుంది. మనం చేస్తున్నది తప్పని, తాతయ్యకి తెలిసినా? ఇంట్లో వాళ్లకి తెలిసినా? పెద్ద గొడవ అవుతుందని హెచ్చరిస్తుంది. రాహుల్‌కి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇద్దామని కావ్య అడగ్గా.. వాడికి ఆఫీసు గురించి పూర్తిగా అవగాహన వచ్చే వరకు వద్దని చెబుతాడు రాజ్. ఆఫీసులో మేనేజర్ రూంలో ఆర్ కంపెనీ పేరుతో సీక్రెట్ ఫైల్ దొరకడంతో దాని సంగతి ఏంటో చూడాలని నిర్ణయించుకుంటాడు రాహుల్. ఆ కంపెనీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూస్తాడు. ఆ వెంటనే చిరాకుగా ఇంటికి వచ్చి స్వప్నకు జరిగింది చెబుతాడు రాజ్- కావ్యలు సీక్రెట్‌గా కంపెనీ పెడుతున్నారని, పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం తరలిస్తున్నారని చెబుతాడు. దీనికి సంబంధించిన వివరాలు ఆఫీసులో లేవని రాహుల్ చెప్పగా.. అయితే రాజ్ పర్సనల్ ల్యాప్‌టాప్‌ని నేను తీసుకొస్తానని అంటుంది స్వప్న. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











