Brahmamudi Weekly Roundup : రాజ్ మోసం .. కళావతి మనసు ముక్కలు , ఇల్లు వదిలి వెళ్లిపోయిన అపర్ణ
కావ్యపై పందెంలో గెలవాలని అనుకున్న రాజ్ ఆమె వేసిన డిజైన్లను దొంగతనంగా కొట్టేస్తాడు. ఆస్తి పంచకపోవడంతో ధాన్యలక్ష్మీ ఇంట్లో వేరుకుంపటి పెట్టుకుంటుంది. క్లయింట్ మీటింగ్ రోజున కావ్యని ఆఫీస్‌కి తీసుకురమ్మని ఆటోడ్రైవర్‌కి చెప్పిన రాజ్.. కళావతి వచ్చేలోగా తన డిజైన్లను జగదీష్ చంద్ర ప్రసాద్‌కి చూపిస్తాడు. కావ్య వచ్చి తన డిజైన్లను స్క్రీన్‌పై చూసి షాక్ అవుతుంది. రాజ్ టాలెంట్‌ని మెచ్చుకున్న ప్రసాద్ కాంట్రాక్ట్ అతనికే ఇస్తాడు.
పందెం ప్రకారం రాజ్ సీఈవోగా బాధ్యతలు తీసుకుని కావ్యని ఆఫీస్ నుంచి గెంటేస్తాడు. కోడలిని శాశ్వతంగా పుట్టింటికి పంపించేశానని ఇంట్లో వాళ్లకి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతలో సీతారామయ్య వచ్చి రాజ్ మోసాన్ని చెప్పడంతో అంతా తిడతారు. భోజనం చేసేటప్పుడు కళావతిని ఇంటికి తీసుకొస్తావా లేదా అని అపర్ణ ప్రశ్నించగా.. అది జరగని పని అని అంటాడు రాజ్. కూతురు కాపురం నిలబెట్టమంటూ అపర్ణకి ఫోన్ చేస్తుంది కనకం . ఉదయాన్నే సుభాష్ వచ్చి అపర్ణ కనిపించడం లేదని చెప్పడంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. లగేజీతో ఇంటికొచ్చిన అపర్ణని చూసి కనకం , కృష్ణమూర్తి, కావ్యలు కంగారు పడతారు. స్వప్నతో కనకానికి ఫోన్ చేయించిన రాజ్.. అపర్ణని ఇంటికొచ్చేయమని చెబుతాడు.

నవంబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు.. 570 ఎపిసోడ్ నుంచి 575 వరకు ఏం జరిగిందంటే?
నవంబర్ 18వ తేదీ 570వ ఎపిసోడ్‌లో డిజైన్లు వేస్తుండగా కావ్య - రాజ్‌లకు ఆఫీస్‌లో జరిగిన రొమాంటిక్ ఘటనలే గుర్తొస్తాయి. ఆస్తి పంచకపోవడంతో ఒంటరిగా బాధపడుతున్న ధాన్యలక్ష్మీని అపర్ణ ఓదార్చగా.. ఆ వెంటనే రుద్రాణి వచ్చి చిచ్చుపెడుతుంది. ఆఫీసులో స్టాఫ్ వేసే డిజైన్లు రాజ్‌కు ఏమాత్రం నచ్చవు. కావ్య మేడం మాదిరిగా మనం డిజైన్లు వేయలేమని అతను చెప్పగా రాజ్ మండిపడతాడు. అతను చెప్పింది నిజమేనని మనసులో అనుకున్న రాజ్.. ఆమె వేసిన డిజైన్లను కొట్టేయాలని అనుకుంటాడు. ఆస్తి పంచకపోవడంతో ఇంట్లో వాళ్లపై అలిగిన ధాన్యలక్ష్మీ వేరుగా వంట చేసుకుంటుంది. ఛాంబర్‌లో శృతి - కావ్య డిజైన్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ వింటాడు. డిజైన్లను ఇంటికి తీసుకెళ్లమంటారా అని శృతి అడగ్గా.. బయట ఉండటం మంచిది కాదనీ, ఆఫీసులో అయితేనే సేఫ్‌గా ఉంటుందని కావ్య అంటుంది.
నవంబర్ 19వ తేదీ 571వ ఎపిసోడ్‌లో శృతి - కావ్యలు ఆఫీస్ నుంచి బయటికి వెళ్లగానే రాజ్ సీఈవో ఛాంబర్‌లోకి దూరి దొంగతనంగా కళావతి వేసిన డిజైన్లను ఫోటోలు తీస్తాడు. బ్యాగ్ మరిచిపోవడంతో తిరిగి వస్తున్న కావ్యని చూసి టేబుల్ కింద దాక్కొంటాడు రాజ్. కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండగా ధాన్యలక్ష్మీ కిచెన్‌లోకి వెళ్లి తను వండుకున్న ఫుడ్‌ని తెచ్చుకుంటుంది. మావయ్య ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదా అని ధాన్యలక్ష్మీ ప్రశ్నించగా.. నా కోడలు వంట చేసుకోవడానికి పాత్రలు కొనివ్వమంటూ సీతారామయ్య సెటైర్లు వేస్తాడు. కావ్య వేసిన డిజైన్లను కొట్టేసిన రాజ్ వాటిని కొత్త రీ డిజైన్ చేస్తాడు. అలాగే ఆటో డ్రైవర్‌కి ఫోన్ చేసి కళావతిని లేట్‌గా తీసుకురావాలని చెబుతాడు రాజ్ .
నవంబర్ 20వ తేదీ 572వ ఎపిసోడ్‌లో జగదీష్ చంద్రప్రసాద్‌కి డెమో ఇవ్వడానికి బయల్దేరిన రాజ్‌పై ఇంట్లో వాళ్లు సెటైర్లు వేస్తారు. అటు రాజ్ చెప్పినట్లుగానే కావ్యని అటు తిప్పి, ఇటు తిప్పి ఆఫీస్‌కి లేట్‌గా తీసుకెళ్తాడు. కావ్య వచ్చేలోపు తన డిజైన్లను చూపించగా.. వాటిని చూసిన శృతి షాక్ అవుతుంది. ఇంతలో ఆఫీస్‌కొచ్చిన కావ్య కూడా స్క్రీన్‌పై ఉన్న తన డిజైన్లను చూసి అవాక్కవుతుంది. డిజైన్లను మెచ్చుకున్న జగదీశ్ చంద్ర ప్రసాద్.. కావ్యను కూడా చూపించమంటాడు. తాను ఇంకా రెడీ చేయలేదని చెప్పగా.. తనకన్నా రాజ్ సార్‌వే బాగున్నాయని చెబుతుంది కళావతి. దీంతో ఇద్దరినీ మెచ్చుకున్న ప్రసాద్.. కాంట్రాక్ట్ రాజ్‌కే ఇస్తాడు. ఆ డిజైన్లు మీవి కదా అని కావ్యతో శృతి చెప్పగా.. ఏం జరిగినా కంపెనీకే కదా లాభమని కళావతి అంటుంది. ఆఫీస్‌లో ఏం జరిగిందో తెలియక.. కావ్య - రాజ్‌ల రాక కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది.

నవంబర్ 21వ తేదీ 573వ ఎపిసోడ్‌లో సీతారామయ్య చెప్పినట్లుగా పందెంలో ఓడిపోయిన కావ్యని సీఈవో పదవికి రిజైన్ చేసి బయటికి వెళ్లిపోమని ఆర్డర్ వేస్తాడు రాజ్. స్టాఫ్ అందరినీ పిలిచి వారితో కావ్యకి బొకే ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిస్తాడు. శృతిని పిలిచి ఇకపై ఆఫీస్ నాదని చెప్పి స్టైల్‌గా సీఈవో రూమ్‌లో అడుగుపెడతాడు రాజ్. మరోవైపు కళ్యాణ్ ఇచ్చిన పాటను ప్రొడ్యూసర్‌కి ఇచ్చి లక్ష రెమ్యునరేషన్ తీసుకుంటాడు లక్ష్మీకాంత్. అంతేకాకుండా కళ్యాణ్‌తో టీ తెప్పించుకుని, కాళ్లు పట్టించుకుంటాడు. లగేజీ మొత్తం సర్దేసి కూతురి కోసం ఎదురుచూస్తున్న కనకానికి .. తాను పందెంలో ఓడిపోయానని, మీ అల్లుడు గారితో , దుగ్గిరాల కుటుంబంతో బంధం తెగిపోయినట్లు చెబుతుంది. మరోవైపు.. కావ్య రాక కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఎదురుచూస్తుండగా.. అపర్ణ, ఇందిరలు హడావుడి చేస్తుంటారు. ఇంతలో రాజ్ కారు వచ్చి ఆగుతుంది.
నవంబర్ 22వ తేదీ 574వ ఎపిసోడ్‌లో మా కోడలు ఎక్కడ, నువ్వు ఒక్కదానివే వచ్చావు అని దుగ్గిరాల ఫ్యామిలీ ప్రశ్నించగా.. ఆమెని శాశ్వతంగా పుట్టింటికి షిఫ్ట్ చేశానని చెబుతాడు రాజ్. పందెంలో నేనే గెలిచానని చెప్పగా ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. నీది ఓ గెలుపేనా అంటూ కావ్యని మోసం చేసిన విషయాన్ని చెబుతాడు సీతారామయ్య. రాజ్ మోసం గురించి తెలుసుకున్న ఇంట్లో వాళ్లు చీవాట్లు పెడతారు. కళావతిని జీవితంలో ఇంటికి తీసుకొచ్చేది లేదని దానికంటే ఆమెకు విడాకులు ఇవ్వడమే నాకిష్టమని తేల్చిచెబుతాడు రాజ్. నువ్వు పందెంలో అంత తేలికగా ఓడిపోయే రకం కాదని నిజం చెప్పమని కూతురిని నిలదీస్తుంది కనకం. ఇంతలో కావ్యకి సీతారామయ్య ఫోన్ చేస్తాడు. మా ఆయన డిజైన్లు కొట్టేసిన విషయం తనకు ముందే తెలుసునని చెప్పడంతో సీతారామయ్య షాక్ అవుతాడు. కొడుకు కాపురాన్ని ఎలా సరిదిద్దాలో తెలియక ఇందిర, అపర్ణ, సుభాష్ మాట్లాడుకుంటూ ఉండగా కనకం ఫోన్ చేస్తుంది. రెండ్రోజుల్లో కావ్యని ఇంటికి తీసుకొస్తానని ఆమెకు అపర్ణ మాటిస్తుంది.
నవంబర్ 23వ తేదీ 575వ ఎపిసోడ్‌లో కావ్య రాకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా భోజనం చేయడం మానేసి బాధపడుతుంది. మీరంతా నిరాహార దీక్ష చేస్తున్నారా అని రాజ్ ప్రశ్నించగా.. మర్యాదగా కావ్యని తీసుకొస్తావా లేదా అని కుటుంబ సభ్యులు నిలదీస్తారు. తన నిర్ణయం మారదని తెగేసి చెబుతాడు రాజ్. ఉదయాన్ని సుభాష్ వచ్చి అపర్ణ కనిపించడం లేదని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కొడుకే చెప్పిన మాట వినకుంటే ఏ తల్లికైనా బాధగానే ఉంటుందని అందుకే అక్క వెళ్లిపోయిందని ధాన్యలక్ష్మీ చెప్పగా ఇంట్లో వాళ్లు మరింత కంగారు పడతారు. ఇంతలో లగేజ్ తీసుకుని ఇంటి ముందు ప్రత్యక్షమైన అపర్ణని చూసి కనకం, కృష్ణమూర్తి, కావ్య షాక్ అవుతారు. తర్వాత స్వప్నతో కనకానికి ఫోన్ చేయిస్తాడు రాజ్.. అపర్ణ అక్కడే ఉందని తెలుసుకుని ఇంటికి వచ్చేయమంటాడు. నువ్వు కోడలిని తీసుకెళ్లడానికి వస్తే, ఆమెతో పాటు ఇంటికొస్తానని లేదంటే ఇక్కడే ఉండిపోతానని అంటుంది అపర్ణ.


Click it and Unblock the Notifications











