ACP Pradyuman రీ ఎంట్రీ!.. CID నుంచి ఆ స్టార్ నటుడు ఔట్
బుల్లితెరపై ఒక సీరియల్‌ను నడపటం ఎంతో కష్టం. వందలకొద్ది ఎపిసోడ్స్ నడిపిస్తే సాగదీస్తున్నారని జనం ఆ సీరియల్‌ను తిప్పికొట్టొచ్చు. కానీ దశాబ్ధాలుగా కొన్ని వేల ఎపిసోడ్స్ చూసినా బోర్ కొట్టని ఒక సీరియల్ ఉంది. ఇది ఏ ఫారిన్‌లోనో కాదు.. ఇండియాలోనే అదే సీఐడీ. భారతదేశంలో కేబుల్ ప్రసారాలు మొదలైన కొత్తలో వచ్చిన ఈ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సిరీస్ నేటికీ ప్రసారమవుతూ సంచలనం సృష్టించింది. 90వ దశకంలో ఈ క్రైమ్ సిరీస్ చూసిన పిల్లలు.. ఇప్పుడు తమ పిల్లలతో కలిసి సీఐడీ చూస్తున్నారు.
మూడు దశాబ్ధాల సీఐడీ ప్రస్థానం
1998లో సోనీ టీవీలో ప్రారంభమైన ఈ సీరిస్‌ను ఈశ్వర్ సింగ్, సంతోష్ శెట్టి, సచింద్ర వత్స్‌లు డైరెక్ట్ చేయగా.. బీపీ సింగ్ క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించారు. ఇందులో ఏసీపీ ప్రద్యుమ్నగా శివాజీ సతమ్, సీనియర్ ఇన్స్‌పెక్టర్ అభిజిత్‌గా ఆదిత్య శ్రీవాత్సవ, సీనియర్ ఇన్స్‌పెక్టర్ దయాగా దయానంద్ శెట్టి, ఫ్రెడ్డిగా దినేష్ ఫడ్నీస్, డాక్టర్ సలుంకేగా నరేంద్ర గుప్తాలు నటించారు. అప్పట్లో ఈ సీరియల్ చిన్నారులను విపరీతంగా ఆకట్టుకుంది. భారతదేశంలోని సూపర్‌స్టార్‌లను మించి సీఐడీలోని నటీనటులకు క్రేజ్ ఉండేదంటే అతిశయోక్తి కాదు.

ఇటీవలే సీఐడీ 2కి శ్రీకారం
తొలి ఎపిసోడ్ 1998 జనవరి 21న టెలికాస్ట్ అవ్వగా.. చివరి ఎపిసోడ్ అక్టోబర్ 27, 2018న ప్రసారమైంది. ఈ సీరియల్‌లో నటించిన ఎంతోమంది తర్వాతి కాలంలో సినీరంగంలో బిజీ అయ్యారు. ఇక సీఐడీ టీమ్‌ను లీడ్ చేసే ఏసీపీ ప్రద్యమన్‌కు వీరిలో డిఫరెంట్ ఇమేజ్ ఉండేది. అసలు సీఐడీకే ఈయన రోల్ హైలెట్. సీఐడీ అంటే ఏసీపీ ప్రద్యుమన్.. ఏసీపీ ప్రద్యుమన్ అంటే సీఐడీ అనేంతగా ఆయన పాత్ర ప్రజాదరణ పొందింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు సీఐడీ 2ని తిరిగి ప్రారంభించింది సోనీ టీవీ. గతేడాది డిసెంబర్ 21న సీఐడీ 2ని అధికారికంగా లాంఛ్ చేయగా ఆ పాత్రలన్నీ తిరిగి తెరపై సందడి చేశాయి. ఓటీటీలో యుగం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి నెల్‌ఫ్లిక్స్‌లోనూ సీఐడీ 2 స్ట్రీమింగ్ అవుతోంది.
మరణించిన ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర
సీఐడీ 2లో కొద్దిరోజుల క్రితం ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర మరణిస్తుంది. ఓ బాంబు దాడిలో ప్రద్యుమన్ మరణించడంతో ఆయన పాత్ర ముగిసింది. దాదాపు 27 ఏళ్లుగా అలరిస్తున్న ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర ఇక లేదని తెలిసి ఆయన అభిమానులు షాక్ అయ్యారు. ఆయన లేకుండా సీఐడీ చూడలేమని ప్రేక్షకులు సైతం నిరుత్సాహాపడ్డారు. దీనిపై శివాజీ సతమ్ స్పందిస్తూ షోను ఎలా ముందుకు తీసుకెళ్లాలో నిర్మాతలకు మాత్రమే బాగా తెలుసునని, ఒకవేళ నా పాత్రకు ముగింపు పలకాలని మేకర్స్ భావిస్తే దానికి తాను అంగీకరిస్తానని శివాజీ అన్నారు.
ప్రద్యుమన్ స్థానంలో పార్ధ్ సమతాన్
ఆ వెంటనే ఏసీపీ ఆయుష్మాన్‌గా పార్ధ్ సమతాన్ ఎంట్రీ ఇచ్చారు. అయితే సీఐడీలో సీనియర్స్ అయిన ఆదిత్య శ్రీవాస్తవ, దయానంద్ శెట్టిలలో ఒకరికి ఏసీపీ రోల్స్ ఇస్తే బాగుండేదని అభిమానులు కామెంట్స్ పెట్టారు. తాజాగా సీఐడీ 2 విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్ తిరిగి వస్తుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపై సీఐడీ 2 టీమ్ కానీ, సోనీ టీవీ కానీ స్పందించలేదు. తాజాగా ఈ వార్తలపై ఏసీపీ ఆయుష్మాన్‌గా నటిస్తున్న పార్ధ్ సమతాన్ స్పందించారు.
త్వరలో ఏసీపీ ప్రద్యుమన్ రీ ఎంట్రీ
ఏసీపీ ప్రద్యుమన్ తిరిగి సీఐడీలో కనిపిస్తారని, తాను ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు సమతాన్ తెలిపారు. సీఐడీ లాంటి ఐకానిక్ షోలో భాగం కావడం తనకు సంతోషంగా ఉందని.. తొలుత కొన్ని ఎపిసోడ్స్‌లో మాత్రమే తాను ఉంటానని అనుకున్నానని, కానీ దానిని పొడిగించారని ఆయన వెల్లడించారు. వేరే కమిట్‌మెంట్స్ కారణంగా తాను ఎక్కువ కాలం సీఐడీలో కొనసాగలేనని .. తనను ఆదరించిన అభిమానులకు పార్ధ్ సమతాన్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఏసీపీ ప్రద్యుమన్ అభిమానులు ఆయనను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తామా?అని ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











