twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గిన్నీస్ రికార్డ్ కి ఎక్కిన మన టీవీ సీరియల్

    By Srikanya
    |

    హైదరాబాద్ సీరియల్స్ మీద ఎన్నో జోక్స్ ఉన్నాయి. అవి జీడిపాకంలా సాగ తీస్తారని,మరొకటి అని, అయితే జనాదారణ లేనిదే ఎవరూ సీరియల్ ని కొనసాగించలేరనేది నిజం. పదహారు సంవత్సరాల పాటు ఒకే సీరియల్ జనాలకు బోర్ కొట్టకుండా ప్రసారమవటం ఉత్సాహం కలిగించే విషయమే. అదీ గిన్నిస్ బుక్ కి ఎక్కడం అంటే మాటలు కాదు. జనవరి 21, 1998... సోనీ ఛానెల్‌... రాత్రి 9.30 గంటలు... అరగంట నిడివున్న 'సి.ఐ.డి' (క్రైమ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ డిపార్ట్‌మెంట్‌) సీరియల్‌ మొదటి ఎపిసోడ్‌ ప్రసారమైంది. 'మామూలు సీరియలే... కాకుంటే కాస్త థ్రిల్లర్‌ జోడించారు... ఎన్ని రోజులు వస్తుంది మహా అయితే ఏడాది' అనుకున్నారందరూ. చూసిన వాళ్లూ పెదవి విరిచారు. 'సీఐడీ' ఏమాత్రం దీన్ని పట్టించుకోలేదు. పదహారేళ్లుగా అలుపు లేకుండా అలా సాగిపోతూనే ఉంది... గిన్నీస్‌ రికార్డుల్లో స్థానాన్ని పదిలపరచుకుంది.

    ఈ ధారావాహికలోని 'ఇన్‌హెరిటెన్స్‌' ఎపిసోడ్‌ గిన్నీస్‌లోకి ఎక్కింది. ఏకధాటిగా ఒక హోటల్‌లో దీన్ని 111 నిమిషాల పాటు ఏమాత్రం కట్‌ లేకుండా సింగిల్‌ షాట్‌లో చిత్రీకరించారు. 2004 నవంబరు 7న ఇది ప్రసారమై 'లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు', 'గిన్నీస్‌' రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ఎపిసోడ్‌ కథా రచన కూడా గమ్మత్తే. సీఐడీకి ఓ శాశ్వత గుర్తింపు ఉండాలని భావించిన బీపీ సింగ్‌, సింగిల్‌ షాట్‌లో ఒక ఎపిసోడ్‌ చిత్రీకరించాలనుకున్నారు. ఇందుకోసం నాలుగేళ్లపాటు ఎన్నో ఆలోచనలూ కథలూ అనుకున్నా వీలు కాలేదు. 'ఒక హాలు.. సోఫాలో కూర్చొన్న వ్యక్తికి దూరంగా తుపాకీ శబ్దం వినిపిస్తుంది'.. ఓ రోజు తనకు తట్టిన ఈ చిన్న దృశ్యాన్ని రచయితల ముందుంచి దీన్నుంచే కథ అల్లమన్నారు. అలా తయారైందే ఈ ఎపిసోడ్‌. ఈ సీరియల్‌లో ఈ ఎపిసోడ్‌ తనకో పెద్ద సవాల్‌ అంటారు బీపీ సింగ్‌. కథ లేకుండా అల్లుకున్న ఎపిసోడ్‌ కదా మరి.

    CID

    ఈ సీరియల్‌ పాపులారిటీ ఎంతగా పెరిగిందంటే చివరకు బాలీవుడ్‌ బడా హీరోలు కూడా తమ సినిమా ప్రచారాలకు ఈ సీరియల్‌ను వేదికగా ఎంచుకునేంతగా. సల్మాన్‌ఖాన్‌ తన సినిమా 'వాంటెడ్‌' ప్రచారం కోసం సీఐడీ సీరియల్‌లో పైరసీ ముఠా ఆట కట్టించే 'ఖూనీ పైరసీ రాకెట్‌'లో నటించారు. అమీర్‌ఖాన్‌ తన 'తలాష్‌' ప్రచారం కోసం 'రెడ్‌ సూట్‌కేస్‌ మర్డర్‌' ఎపిసోడ్‌లో ఇన్‌స్పెక్టర్‌ 'షెకావత్‌'గా దర్శనమిచ్చారు. అక్షయ్‌కన్నా, సోనాక్షి సిన్హాలూ ఈ సీరియల్‌ను ప్రచారాస్త్రంగా ఎంచుకున్నారు.

    30 ఏళ్ల క్రితం దూరదర్శన్‌లో కెమెరామెన్‌గా కెమెరామెన్‌ బీపీ సింగ్‌ (బిజేంద్రపాల్‌ సింగ్‌) చేరారు. చిన్నప్పటినుంచి ఆయన ఆశా ఆశయం వేరు. నేర వార్తలంటే అమితాసక్తి. డిటెక్టివ్‌ కథలు వెర్రిగా చదివేవారు. వాటిని మనసులోనే దృశ్యాలుగా వూహించుకునేవారు. టీవీలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలు నిర్మించాలనేది ఆయన చిరకాల స్వప్నం. చివరకు దూరదర్శన్‌లో ఓ అధికారి అవకాశమిచ్చారు. అలా తొలిసారి 'సిర్ఫ్‌ చార్‌దిన్‌' టీవీ ఫిల్మూ, 'ఏక్‌ శూన్య్‌, శూన్య్‌'లు చిత్రీకరించారు. ఇవి విజయవంతం కావడంతో తొలిసారి 1994లో 40 ఎపిసోడ్లున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ధారావాహిక 'ఆహత్‌'ను రూపొందించారు.

    ఇందుకోసం ఆయన ముంబయి క్రైం బ్రాంచి కార్యాలయానికి రోజూ వెళ్లి, అక్కడి అధికారులూ డిటెక్టివ్‌లతో గంటలకొద్దీ మాట్లాడేవారు. ఈ అనుభవంతో 'సీఐడీ' సీరియల్‌ రూపొందించాలనుకున్నారు. దీనికి సోనీ టీవీ ముందుకు వచ్చింది. వకీలు హత్య ఘటనతో మొదటి ఎపిసోడ్‌ ప్రసారమై... ఇప్పటికీ అలా సాగిపోతోంది. క్రైం బ్రాంచిలోని అధికారుల పనివిధానాన్నే సీఐడీ పాత్రల్లో చూపిస్తున్నానని బీపీ సింగ్‌ అంటారు. ఈ సీరియల్‌ ఇంతగా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణం కథ, దాన్ని నడిపించే తీరే.

    ఇక శివాజీ సటమ్‌ అంటే ఎవరికీ తెలీక పోవచ్చు కానీ 'సీఐడీ ఏసీపీ ప్రద్యుమ్న' అంటే బుల్లితెర వీక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు. బట్టతలతో పది మంది సీఐడీ బృందాన్ని నడిపించే ఆజానుబాహుడి పాత్ర ఇది. దీనికి ఎంత పేరు వచ్చిందంటే చివరకు ఈ సెంట్రల్‌ బ్యాంకు మాజీ ఉద్యోగి తన అసలు పేరు మరచిపోయేంతలా. శుక్ర, శనివారాల్లో రాత్రి పదిగంటలైతే (సమయం మార్చారు) చాలా ఇళ్లలో జనం టీవీలకు అతుక్కుపోతారు. నరాలు తెగే ఉత్కంఠతో సీఐడీ బృందం నేరాల గుట్టు విప్పుతున్న వైనాన్ని కళ్లప్పగించి చూసి ఆనందిస్తుంటారు. ఇది ఒక రోజు వింతా వినోదం కాదు. పదహారేళ్లపాటు అంతరాయం లేకుండా అలరిస్తున్న వినోద వీచిక. ఇటీవలే వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ విజయం ఓ సమష్టి కృషి.

    ఈ సీరియల్‌ విజయం కథా రచయితలదేనంటారు నిర్మాతా, దర్శకుడు బీపీ సింగ్‌. మొత్తం తొమ్మిది మంది రచయితలు నిరంతరం ఈ సీరియల్‌ కోసం వందలు, వేల కథలు రాస్తుంటారు. ఒక్కో ఎపిసోడ్‌కు 30-40 కథల కంటే ఎక్కువే ఎంచుకుని వాటిని వడపోసి ఓ మంచి కథతో చిత్రీకరణకు వెళతారు. ఈ ధారావాహికలో కొన్ని విషయాలు చాలా తమాషాగా అనిపిస్తాయి. సీఐడీలో పోలీసులే ఉండరు. నేరం జరిగిన వెంటనే సీఐడీ అధికారులు రంగ ప్రవేశం చేస్తుంటారు. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఇన్‌స్పెక్టర్‌ 'దయా' ఒక్క తలుపునైనా బద్దలు కొడుతుంటారు. ఆయన చేత దెబ్బలు తిన్న తరువాతే నేరస్థులు నిజం చెబుతుంటారు. 28 అంతస్తుల సీఐడీ కార్యాలయంలో 10 మంది మాత్రమే పనిచేస్తుంటారు.

    English summary
    The most popular crime detective serial ‘CID” has already completed 16 years on Sony Entertainment Television Asia. Magzmumbai through its own survey have found that the serial is watched by people from all age groups.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X