Karthika Deepam2: కార్తీకదీపం 2 ఆ సీరియల్‌కు రీమేక్.. ముందే ట్విస్ట్‌లు తెలుసుకోవచ్చా?
కార్తీక దీపం సీరియల్ గురించి అందులో వచ్చే డాక్టర్ బాబు, వంటలక్క, మోనితల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సీరియల్ టీఆర్పీలో నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఆడ, మగా అనే తేడా లేకుండా అనేక మంది ఈ సీరియల్ ను చూసేవాళ్లు. సీరియల్ వచ్చే సమయానికి టీవీల ముందు వాలిపోయేవారంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ సీరియల్ అయిపోయినప్పటి నుంచి సీరియల్స్ చూసే వారి సంఖ్య తగ్గిపోయింది.
ముఖ్యంగా కార్తీకదీపం మళ్లీ వస్తే బాగుండని కోరుకున్న వాళ్ల సంఖ్య కూడా చాలా ఎక్కువే. బుల్లితెర ప్రేక్షకుల మనుసును అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కార్తీక దీపం 2 సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈక్రమంలోనే డైరెక్టర్ మాట్లాడుతూ.. కార్తీకదీపం 2 ఒరిజినల్ కాదని.. ఓ సీరియల్ కు రీమేక్ అని చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్కల కాంబో మళ్లీ వస్తుందనడంతో అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రోమో విడుదల అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సీరియల్ వస్తుందా అని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. ముఖ్యంగా సాయంత్ర 8 గంటల కల్లా అన్ని పనులు పూర్తి చేసేసుకుని తీరిగ్గా వంటలక్క - డాక్టర్ బాబు బంధాన్ని చూసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మేకర్స్ కూడా జనాలకు తెలిసేలా మరిన్ని ప్రమోషన్లు చేస్తున్నారు.
అలాగే ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే వస్తుండగా ఈరోజు ఓ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఈ సీరియల్ నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలు, స్క్రిప్టు రైటర్ ను కూడా తీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. సీరియల్ గురించి చాలానే విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ రీమేక్ అని చెప్పి షాక్ ఇచ్చారు.

కార్తీకదీపం 2 సీరియల్ తమిళ సీరియల్ చెల్లమ్మకు రీమేక్ అని టాక్ నడుస్తోంది.. నిజమేనా అని మీడియా ప్రతినిధి అడగ్గా.. ఆయన అవునని చెప్పారు. కార్తీకదీపం 1 కూడా మలయాళ సీరియల్ కు రీమేక్ అని.. అయితే దాంట్లో చాలానే మార్పులు చేపట్టినట్లు వివరించారు. అలాగే పార్ట్ 2 కూడా అంతేనని తమిళ సీరియల్ చెల్లమ్మకు రీమేక్ అని.. కానీ ఇందులో కూడా చాలానే మార్పులు చేసినట్లు వివరించారు. అయితే మేజర్ ట్విస్ట్ లు తెలిసే అవకాశం ఉన్న.. చిన్న చిన్న మార్పులు ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications










