Emmanuel Buzz: అలా చేసి నన్ను తప్పించారు.. ఆ కుట్ర 10 వారాలకు తెలిసింది.. సంజనపై ఇమ్మూ షాకింగ్ కామెంట్స్
Emmanuel Bigg Boss Buzz Interview: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9)లో మొదటి రోజు నుంచే ఇటు ఎంటర్టైన్‌మెంట్ పరంగా, అటు టాస్కుల పరంగా ప్రాణం పెట్టి ఆడిన కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్. ఎవ్వరినీ నొప్పించకుండా, తాను నొచ్చుకోకుండా హౌస్‌లో తన ఆటను కొనసాగించిన ఇమ్మూ... దాదాపు 10 వారాల పాటు నామినేషన్‌లోకి రాకుండా నిలిచిన కంటెస్టెంట్‌గా అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు, మూడుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించి తన లీడర్‌షిప్‌ను నిరూపించాడు. సంజన(మమ్మా) చేసిన తప్పులకు కూడా తానే బాధ్యత తీసుకుంటూ తలవంచిన సందర్భాలు ప్రేక్షకులను ఎమోషనల్ చేశాయి. అయినా సరే, ఈ సీజన్‌లో కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌కు టైటిల్ మాత్రం దక్కలేదు.
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం, హీరో శివాజీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ (Bigg Boss Buzzz)లోకి ఇమ్మూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా శివాజీ... 'థర్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచ్చి, ఫోర్త్ ఫైనలిస్ట్‌గా బయటికి వచ్చిన మన ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ ఇతడే'అంటూ ఘనంగా పరిచయం చేశాడు. అలాగే 'ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్ 9' అని ప్రకటించి ఓ స్పెషల్ గిఫ్ట్‌ను ఇమ్మూకు అందజేశాడు.

ఇక శివాజీ తన ఇంటర్వ్యూ ప్రారంభించారు. 'విన్నర్ అయిపోతావ్ అనుకుంటే ఇలా బయటికి రావడమేంటి?'అని ప్రశ్నించగా, ఇమ్మూ కూడా తాను అదే అనుకున్నానని చెప్పుతూ.. బిగ్ బాస్‌లో జరిగిన అనూహ్య ట్విస్టులు,పరిణామాలను బయటపెట్టాడు. 'నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్... కానీ వాళ్లే నిన్ను వీక్ చేశారు. నామినేషన్‌కు వస్తే 'ఇతను ఎంటర్టైనర్' అని ఓటేయాలని అందరూ అనుకున్నారు. నేను కూడా అలానే భావించా' అని శివాజీ అన్న మాటలకు ఇమ్మూ భావోద్వేగానికి గురయ్యాడు. 'ఇది గేమ్... ప్రతి చిన్న విషయాన్ని తప్పులా చూడాలి అని అర్థం చేసుకోవడానికి నాకు 10 వారాలు పట్టింది'అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక సంజన విషయాన్ని ప్రస్తావిస్తూ శివాజీ ప్రశ్నించగా, ఇమ్మాన్యుయేల్ స్పష్టంగా... 'మమ్మాతో ఉండటం నాకు ప్లస్ కాదు, మైనస్ అయ్యింది. నేను నామినేషన్‌లోకి రాకపోవడంతో, నా అభిమానులు ఆమెకు ఓట్లు వేశారని నా అభిప్రాయం'అని చెప్పాడు. ఇలా ఎమోషనల్‌గా సాగుతున్న ఇంటర్వ్యూకు కాస్త ఫన్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతో హోస్ట్ శివాజీ ఒక్కసారిగా టోన్ మార్చాడు. 'ఇంతకీ ఆ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు రా?'అంటూ సరదాగా ప్రశ్నించడంతో, అప్పటివరకు సీరియస్‌గా ఉన్న ఇమ్మాన్యుయేల్ ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు.
నవ్వుతూ "చెప్పాను కదా అన్న...'అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, శివాజీ వదిలిపెట్టకుండా 'అయితే ఇప్పుడు మాట్లాడతావా? ఫోన్ ఇస్తా'అంటూ మరింతగా ఆటపట్టించాడు. దానికి ఇమ్మూ 'అన్న వద్దు... వద్దు'అంటూ చేతులు జోడించి మరీ సిగ్గుపడుతూ స్పందించడం ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. ఈ చిన్న ఫన్ మోమెంట్, అంతకుముందు ఉన్న ఎమోషనల్ మూమెంట్ ను కాస్త లైట్ చేసింది.
ఆ తర్వాత శివాజీ మరోసారి సీరియస్ అయ్యి ఇమ్మాన్యుయేల్ ఆటను విశ్లేషించాడు. 'ఒకే సీజన్‌లో ఒక వ్యక్తి మూడుసార్లు కెప్టెన్ అవడం... ఈ తొమ్మిది సీజన్ల చరిత్రలోనే జరగలేదు'అంటూ ఇమ్మూకు భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఇది కేవలం గణాంకం కాదు, ఇమ్మాన్యుయేల్ ఆటలో ఉన్న క్రమశిక్షణ, నమ్మకం, హౌస్‌మేట్స్ నుంచి వచ్చిన విశ్వాసానికి నిదర్శనమని చెప్పాడు. కెప్టెన్‌గా ఉన్న ప్రతి సారి తనపై వచ్చే ఒత్తిడిని, విమర్శలను తట్టుకుంటూ బ్యాలెన్స్‌గా వ్యవహరించాడని ప్రశంసించాడు.
ఫైనల్‌గా ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ తన ఆటపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 'గెలిచినా.. ఓడినా.. వీడు గెలిచాడా అనేంత పని చేయాలి అని నేను ముందే ఫిక్స్ అయ్యాను' అంటూ తన మైండ్‌సెట్‌ను చెప్పాడు. టైటిల్ రాకపోయినా, ప్రేక్షకుల మనసుల్లో నిలిచేలా ఆడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఆ తర్వాత బిగ్ బాస్‌లో తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించాడు. 'బిగ్ బాస్‌లో ఎంటర్టైన్ చేయడం అంత ఈజీ కాదు' అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీనిపై హోస్ట్ శివాజీ కూడా ఆశ్చర్యపోతూ.. 'ఏంట్రా అంత మాట అన్నావ్?'అంటూ ప్రశ్నించాడు.
ఇమ్మాన్యుయేల్ స్పందిస్తూ..'ఒకడు నామినేట్ అయి కోపంలో ఉంటాడు. మరొకడు 'నన్ను నామినేట్ చేశాడు' అనే కోపంలో ఉంటాడు. ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క మూడ్‌లో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అందరితో బ్యాలెన్స్ చేస్తూ, వారందరినీ ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం' అంటూ బిగ్ బాస్ హౌస్‌లోని రియాలిటీని బయటపెట్టాడు. ఈ మాటలు వింటున్న క్షణాల్లో ఇమ్మూ ఆట ఎంత మానసిక ఒత్తిడితో సాగిందో స్పష్టంగా అర్థమయ్యింది. దీంతో శివాజీ 'నిజంగా నువ్వు గ్రేట్ రా... ఇవన్నీ దాటుకుంటూ వచ్చావంటే చాలా చాలా గ్రేట్ రా'అంటూ ఇమ్మూ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
టైటిల్ దక్కకపోయినా, ఆటలో నిజాయితీ, ఎంటర్టైన్‌మెంట్, మానవ సంబంధాలను కాపాడుకున్న విధానం వల్ల ఇమ్మాన్యుయేల్ ఈ సీజన్‌లో ప్రత్యేకమైన కంటెస్టెంట్‌గా నిలిచాడని శివాజీ స్పష్టం చేశాడు. బిగ్ బాస్ టైటిల్ ను ఇమ్మాన్యుయేల్ గెలిచాడా ఓడాడా అన్న దానికన్నా... అతను ఎలా ఆడాడు అన్నదే అతన్ని 'ఎంటర్టైనర్ ఆఫ్ సీజన్'గా నిలబెట్టిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











