Evaru Meelo Koteeswarulu: సీఎం అవడం కంటే అదే ముఖ్యం.. ఆ అమ్మాయితో ఎన్టీఆర్ సూపర్ మెసేజ్
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. దీంతో ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కోసం ఛానెళ్లన్నీ సరికొత్త ప్రయోగాత్మక కార్యక్రమాలను మొదలు పెడుతున్నాయి. ఇందులో ప్రజలను భాగస్వాములు చేసే ప్రోగ్రామ్‌గా రూపొందిన షోలలో 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఒకటి. క్విజ్ గేమ్ షోగా హిందీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమానికి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. దీంతో ఇది పలు భాషల్లో కూడా మొదలైంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం ఈ షోను 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే పేరుతో స్టార్ట్ చేశారు. దీనికి సైతం ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. దీంతో ఏకంగా ఈ షో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో దాన్ని కూడా మొదలెడుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

నాలుగు సీజన్లను ఇద్దరు స్టార్ హీరోలతో
సామాన్యులను కోటీశ్వరులుగా మార్చాలన్న లక్ష్యంతో మొదలైన షోనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. జనరల్ నాలెడ్జ్ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం మిగిలిన భాషల మాదిరిగానే తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం చిరంజీవి హోస్ట్ చేశారు. షో జరిగే తీరుకు వీళ్ల హోస్టింగ్ తోడవడంతో ఇది సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో తెలుగులో ఈ షోకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది.

వాటికి మించేలా ఐదో సీజన్.. అన్నీ కొత్తే
తెలుగు బుల్లితెర చరిత్రలోనే సూపర్ హిట్ షోగా పేరొందిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగు సీజన్లు పూర్తైనా తర్వాత ఎందుకనే దీన్ని కంటిన్యూ చేయలేదు. దీంతో ఈ షో ఇకపై ఉండదన్న టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత ఈ షోను తీసుకొస్తున్నారు. అయితే, ఈ సారి దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని పేరు మార్చారు. అంతేకాదు, ఈ సారి ఈ షోను స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేయబోతున్నారు. అలాగే, కంటెంట్‌లోనూ కొన్ని మార్పులు చేశారు. దీంతో ఈ సీజన్‌పై ఆది నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

ఎన్టీఆర్ ఎంట్రీతో షోపై పెరిగిన అంచనాలు
గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షోను ఇద్దరు సీనియర్ హీరోలు నడిపించగా.. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐదో సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే బిగ్ బాస్ షోను సక్సెస్ చేసిన అతడు.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు'ను కూడా అదే రీతిలో నడిపించేందుక రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతడికి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ పరిచయ ప్రోమోలో తన పేరు రామారావు అని చెప్పిన తారక్.. ఈ గేమ్ షోపై మరింతగా అంచనాలను పెంచేశాడు.

షూటింగ్ పూర్తి... ఒకే సారి అన్ని చేశారు
వాస్తవానికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఎప్పుడో మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. అయితే, గ్రౌండ్ వర్క్ మాత్రం చేస్తూనే ఉన్నారు నిర్వహకులు. ఇక, ఇటీవలే ఈ షోకు సంబంధించిన షూట్‌ను మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మొదటి షెడ్యూల్‌లో భాగంగా ఏకంగా 16 ఎపిసోడ్స్ కూడా చిత్రీకరణలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్‌ను జరుపుకుంటున్నాయని తెలుస్తోంది. ఇక, ప్రారంభ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ గెస్టుగా వచ్చాడని, అతడు రూ. 25 లక్షలు గెలిచాడని అంటున్నారు.

సందేశాత్మక ప్రోమోను వదిలిన యూనిట్
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఆగస్టు 15 నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహకులు ముమ్మరం చేసేశారు. ఇందులో భాగంగానే ఇప్పటికే కమింగ్ సూన్ ప్రోమోలను వదిలారు. వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇది మాత్రం సందేశాత్మకంగా, ఎమోషనల్‌గా సాగుతుంది. దీంతో ఈ ప్రోమోకు కూడా ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. ఫలితంగా ఈ వీడియో సోషల్ మీడియాలోని ఎన్టీఆర్ ఫ్యాన్ పేజీల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
సీఎం అవడం కంటే అదే ముఖ్యం అంటూ
ప్రోమోలో.. ఓ క్లాస్ రూమ్‌లో టీచర్ పిల్లలందరినీ మీరేమి అవ్వాలనుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఒక్కొక్కరు నేను సీఎం అవుతా.. నేను కలెక్టర్ అవుతా.. పైలెట్ అవుతా అని సమాధానం చెబుతారు. ఓ అమ్మాయి మాత్రం 'అమ్మ'ను అవుతా అంటుంది. ఎదిగిన తర్వాత కూడా ఫ్రెండ్‌కు ఇదే విషయం చెబుతుంది. ఇక, ఈమె 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ ఆడడానికి వస్తుంది. అప్పుడు కూడా ఎన్టీఆర్‌కు ఇదే చెబుతుంది. ఎందుకని అతడు ప్రశ్నించగా.. 'సీఎం, కలెక్టర్, పైలెట్ అవడం కంటే అమ్మ అయితేనే రేపటి తరాన్ని నడపొచ్చు' అని బదులిస్తుంది.
Recommended Video

ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్... మీసం తిప్పి
ఆ అమ్మాయి చెప్పిన మాటలకు గర్వంగా ఫీల్ అయిన ఎన్టీఆర్ ఆమెను అభినందిస్తాడు. 'ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు. ఇక్కడ కథ మీది.. కల మీది. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం. ఎవరు మీలో కోటీశ్వరులు' అని డైలాగ్ చెబుతాడు. ఇక, ఈ సీజన్ ఆగస్టులో మొదలవుతుందని ప్రోమో చివర్లో ప్రకటించారు. ఇక, ఇందులో ఆ అమ్మాయి పలికిన డైలాగులు అదిరిపోయాయి. అదే సమయంలో అమ్మ గొప్పదనాన్ని కూడా వివరించాయి. ఎమోషనల్‌గా, సందేశాత్మకంగా సాగిన ఈ ప్రోమోపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


Click it and Unblock the Notifications











