Evaru Meelo Koteeswarulu: కోటి గెలిచి చరిత్ర సృష్టించిన ఎస్సై.. ఆయనది ఏ జిల్లా? పూర్తి వివరాలివే!
కొంత కాలంగా వెండితెరే కాదు.. బుల్లితెర కూడా వినూత్నమైన కార్యక్రమాలతో కొత్త పుంతలు తొక్కుతోంది. మరీ ముఖ్యంగా ఎన్నో రకాల కాన్సెప్టులతో ఈ మధ్య కాలంలో చాలా షోలు వచ్చాయి. అయితే, అందులో కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల మద్దతు లభిస్తోంది. అందులో క్విజ్ ఆధారంగా నడిచే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. దాదాపు 100కు పైగా దేశాల్లో ప్రసారం అవుతోన్న ఈ కార్యక్రమం చాలా కాలం క్రితమే 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' అనే పేరుతో ఇండియాలోకి వచ్చింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఐదోది కూడా ప్రసారం అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలిచారు. ఆ వివరాలు మీకోసం!

తెలుగులోకి పరిచయం.. స్టార్ హీరోలు
'కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా తెలుగులోకి వచ్చిన షోనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. జనరల్ నాలెడ్జ్ ఆధారంగా నడిచే ఈ షో మన దగ్గర కూడా విజయవంతం అయింది. ఫలితంగా ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో మొదటి మూడింటినీ కింగ్ అక్కినేని నాగార్జున.. నాలుగో దాన్ని మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు.

ఐదో సీజన్ కొత్తగా.. రామారావు ఎంటర్
నాలుగు సీజన్లు ముగిసిన తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో నిర్వహకులు గ్యాప్ తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్‌తో ఐదో సీజన్ మొదలెట్టారు. దీన్ని స్టార్ మాలో కాకుండా జెమినీ టీవీలో ప్రసారం చేస్తున్నారు. ఈ సీజన్‌ను టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ రామారావు హోస్ట్ చేస్తున్నాడు.

ఫస్ట్ ఎపిసోడ్‌తో బద్దలైపోయిన రికార్డ్స్
ఎన్టీఆర్ హోస్టింగ్‌తో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోను ఆగస్టు 22న అంగరంగ వైభవంగా ప్రారంభించారు. భారీ అంచనాలతో మొదలైన ఈ సీజన్ కర్టన్ రైజర్ ఎపిసోడ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో 11.40 రేటింగ్ సొంతం అయింది. దీంతో ఈ షో చరిత్రలో సరికొత్త రికార్డు కూడా నమోదైంది.

షోకు క్రమంగా పెరుగుతోన్న రెస్పాన్స్
'ఎవరు మీలో కోటీశ్వరులు' మొదటి వారం రేటింగ్ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత నుంచి దీనికి ప్రేక్షకుల స్పందన క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ అద్భుతమైన హోస్టింగ్‌తో ఇది ప్రేక్షకులను మరింత ఆకర్షిస్తోంది. దీంతో ఐపీఎల్ సమయంలోనూ మంచి రేటింగ్‌ను అందుకుంది. మధ్యలో కొంచెం స్లో అయినా.. ఆ తర్వాత మళ్లీ పుంజుకుని సత్తా చాటుతూనే ఉంది.

కోటీ రూపాయలు గెలుచుకున్న ఎస్సై
'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రస్తుతం ఐదో సీజన్‌ను నడుపుకుంటోంది. అయినప్పటికీ ఇప్పటి వరకూ ఇందులో యాభై లక్షల రూపాయలు కూడా గెలుచుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజా సీజన్‌లో ఓ కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ విషయాన్ని జెమినీ టీవీ నిర్వహకులే వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రోమోను కూడా ఇటీవలే విడుదల చేశారు.

ఆయనది ఆ జిల్లానే.. పూర్తి వివరాలివే!
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో కోటి రూపాయలు గెలుచుకున్న కంటెస్టెంట్ పేరు బీ రాజా రవీంద్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సుజాతనగర్ గ్రామ వాస్తవ్యుడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్‌ఎస్ రాజు-శేషుకుమారి కుమారుడే రాజా రవీంద్ర. ఆయన వివాహితుడు.

తెలుగు బుల్లితెరపై సంచలన రికార్డు
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో రాజా రవీంద్ర పాల్గొన్న ఎపిసోడ్స్ నవంబర్ 15, 16 తేదీల్లో ప్రసారం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా జెమినీ టీవీ విడుదల చేసింది. ఇక, రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకుని తెలుగు బుల్లితెరపై చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఏ గేమ్ షోలోనూ ఎవరూ రూ. కోటి ప్రైజ్‌మనీని గెలవకపోవడం విశేషం.
Recommended Video

ఆ జిల్లాలో సంబరాలు చేసుకుంటూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌కు చెందిన రాజా రవీంద్ర.. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో కోటి రూపాయలు గెలుచుకున్నాడన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. దీంతో ఆయన స్వగ్రామంలోని బంధువులు, సన్నిహితులు సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్లు కూడా ఆయనను అభినందిస్తున్నారట.


Click it and Unblock the Notifications











