Evaru Meelo Koteeswarulu Promo: ఆట నాది కోటి మీది అంటున్నో తారక్.. పేరు మార్చుకున్న నందమూరి హీరో
బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల్లో కొన్ని మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఒకటి. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం హిందీలో ప్రారంభం అయిన 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' ఆధారంగా మొదలైన ఈ షో తెలుగులో సూపర్ సక్సెస్ అయింది. ఈ కారణంగానే ఏకంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఐదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, ఈ సారి 'ఎవరు మీలో కోటీశ్వరుడు'గా రాబోతున్న ఈ షోను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నాడు. తాజాగా అతడి ప్రోమో రిలీజ్ అయింది. వివరాల్లోకి వెళ్తే...

తెలుగులో నాలుగు సీజన్లు.. ఇద్దరు స్టార్లు
దాదాపు 120 దేశాల్లో ప్రసారం అవుతూ తెలుగులో కూడా వచ్చిన షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఇది.. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని భాషల్లో మాదిరిగానే మన దగ్గర కూడా ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఇందులో మొదటి మూడింటికీ అక్కినేని నాగార్జున.. నాలుగో దానికి మెగాస్టార్ చిరంజీవి హోస్టులుగా చేశారు.

ఐదో సీజన్ కొత్తగా... చానెల్, పేరు మార్పు
'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాలుగు సీజన్లు స్టార్ మా చానెల్‌లో ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీని ద్వారా సదరు చానెల్‌కు భారీ స్థాయిలో రేటింగ్ వచ్చింది. అప్పట్లో ఇదే నెంబర్ వన్ గేమ్ షోగా ఉండేది. కానీ, అక్కడితోనే దీని ప్రస్థానం ఆగిపోయింది. ఇక, ఈ సారి ఈ గేమ్ షో జెమినీ టీవీలో ప్రసారం కాబోతుంది. దీనికి 'ఎవరు మీలో కోటీశ్వరులు' అని టైటిల్ మార్చారు.

మీ ఆశలని నిజం చేసే గేమ్ షో.. ప్రోమోతో
తాజాగా జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో ప్రోమోను విడుదల చేశారు. అందులో దీని ప్రస్థానం గురించి వివరించారు నిర్వహకులు. అంతేకాదు, 'మీ జీవితాలని మార్చే గేమ్ షో.. మీ ఆశలని నిజం చేసే గేమ్ షో ''ఎవరు మీలో కోటీశ్వరులు'' త్వరలో మీ జెమినీ టీవీలో రాబోతుంది సిద్ధంగా ఉండండి' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ప్రెస్‌మీట్‌తో వచ్చిన టీమ్... హోస్టు కూడా
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు గానూ.. తాజాగా నిర్వహకులు ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా షోను అధికారికంగా ప్రకటించారు. అనంతరం షో థీమ్‌ను వివరించారు. ఇందులోనే హోస్టుగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను పరిచయం చేశారు. అదే సమయంలో కొన్ని కీలక విషయాలనూ ప్రేక్షకులకు రివీల్ చేశారు.
ఆట నాది కోటి మీది అంటున్నో జూనియర్
తాజాగా 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో హోస్టుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కోరమీసంతో స్టైలిష్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, గంభీరమైన గొంతుతో, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక, 'ఈ ఆట గురంచి నా కంటే మీకే బాగా తెలుసు' అంటూ మొదలెట్టి 'ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది' అంటూ అదరగొట్టాడు.

తన పేరు మార్చుకున్న నందమూరి హీరో
గతంలో జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షోను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తన పేరు జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంభోదించేవాడు. కానీ, 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోమోలో మాత్రం చివరిగా 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.. ఇట్లు ప్రేమతో మీ రామారావు' అంటూ తన అసలు పేరును తొలిసారి చెప్పాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.


Click it and Unblock the Notifications











