కొత్త ఇంటికి అయ్యే ఖర్చుపై గంగవ్వ టెన్షన్: లైవ్‌లో అలా చెప్పడంతో బిగ్ బాస్‌పై అనుమానాలు
గంగవ్వ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఫేమస్ అయిపోయారామె. ఆరు పదుల వయసులో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఆమె.. చాలా కాలంగా తన హవా చూపిస్తోన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. హౌస్‌లో చాలా రోజులు నెగ్గుకొచ్చిన ఆమె.. అనివార్య కారణాలతో బయటకు వచ్చేశారు. ఆ సమయంలో ఇల్లు కట్టిస్తామని స్టేజ్‌పై నాగార్జున ఆమెకు హామీ కూడా ఇచ్చాడు. అయితే, తాజాగా తన ఇల్లుకు అయ్యే ఖర్చుపై గంగవ్వ షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలు మీకోసం!

మై విలేజ్ షోతో పాపులర్ అయింది
‘మై విలేజ్ షో' అనే కార్యక్రమం ద్వారా తెలుగు వారికి పరిచయం అయింది సహజ నటి గంగవ్వ. అరవై ఏళ్ల వయసులో కుర్రాళ్లతో కలిసి ఆమె చేసే సందడికి ఎంతో మంది అభిమానులుగా మారారు. ఆ షోలో అసలైన పల్లెటూరి పరిభాషను అందరికీ పరిచయం చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన గంగవ్వ.. బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతున్నారు.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ
సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్‌తో గంగవ్వ ఫుల్ బిజీ అయిపోయారు. సినిమాలు, టీవీ షోలు చేస్తూ అదరగొట్టేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడ్డారు. ఈ క్రమంలోనే కుర్ర కంటెస్టెంట్లతో కలిసి బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేశారు.

ఇంట్లో ఉండలేక బయటకొచ్చేసింది
కండ బలం చూపించి కొందరు.. బుద్ధి బలం చూపించి మరికొందరు బిగ్ బాస్ హౌస్‌లో నెగ్గుకొస్తున్న సమయంలో.. టాస్కులు సరిగా ఆడకున్నా తన ప్రేమతో ప్రేక్షకులను మాయ చేశారు గంగవ్వ. ఇలానే చాలా వారాలు షోలో కొనసాగారు. అయితే, అక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకపోయిన ఆమె.. అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.

ఇల్లు కట్టిస్తామని హామీ.. పని కూడా
తనకు ఐదుగురు అమ్మాయిలు ఉన్నారని, వాళ్లందరికీ పెళ్లి చేసేశానని గంగవ్వ చాలా సార్లు చెప్పారు. అదే సమయంలో తనకు సొంత ఇంటి కల ఉందని వెల్లడించారు. అందుకోసమే బిగ్ బాస్ షోకు వచ్చానని కూడా చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అక్కినేని నాగార్జున స్టేజ్ మీద ఉన్న సమయంలోనే ఆమెకు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గంగవ్వ సంతోషంగా వెళ్లారు.

చిరంజీవి ముందు వీడియో చూపించి
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేలో గెస్టుగా వచ్చిన చిరంజీవి.. గంగవ్వ ఇంటి గురించి నాగార్జునను ప్రశ్నించారు. దీనికి ఆయన ఓ వీడియోను చూపించారు. అందులో పాత ఇంటిని కూల్చేసి, కొత్త ఇంటి కోసం స్థలాన్ని సిద్ధం చేసేది చూపించారు. అలాగే, హౌస్ ప్లాన్‌ను కూడా మానిటర్‌లో డిస్‌ప్లే చేశారు. దీంతో ఆమె ఇల్లు త్వరలోనే పూర్తవుతుందని అంతా అనుకున్నారు.

ఇంటికి అయ్యే ఖర్చుపై గంగవ్వ టెన్షన్
తాజాగా గంగవ్వ ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఆ సమయంలో తన ఇంటి గురించి చెబుతూ ‘మొత్తం 25 - 26 లక్షల ఖర్చు అవుతుందని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక బెంగ పట్టింది. అంత ఎక్కువ డబ్బంటే నిద్ర కూడా పట్టడం లేదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఇల్లు విషయంలో బిగ్ బాస్ ఆమెకు హ్యాండిచ్చారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











