Gunde Ninda Gudi Gantalu January 2nd Episode: రవికి బ్లాక్ చెక్ ఆఫర్.. చింటూకి బాలు సర్ప్రైజ్.. రోహిణీకి షాక్
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం ఎపిసోడ్ ఆరంభంలోనే మీనా తన ఫ్రెండ్స్‌తో కట్టిన సరదా పందెం ఓడిపోవడంతో కథ మొదలవుతుంది. ఓడిపోయినందుకు రూ.500 ఇవ్వడానికి వెళ్లిన మీనాను, ఫ్రెండ్స్ మరో పందెంలోకి లాగుతారు. భర్త బాలు ఉదయం చేసిన బీట్రూట్ దోసను మెచ్చుకుంటేనే డబ్బు తిరిగి వస్తుందన్న షరతు మీనాకు కొత్త టెన్షన్ తెస్తుంది. బాలు మీద నమ్మకంతో మీనా ఫోన్ చేసినా, డ్రైవింగ్‌లో ఉన్న బాలు కోపంగా స్పందించి కాల్ కట్ చేయడంతో పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. ఈ ఒక్క నిర్లక్ష్యం మీనాను మనసును గాయపరుస్తుంది. పందెం ఓటమితో పాటు ఫ్రెండ్స్ ముందు అవమానం, ఇంట్లో ఒంటరితనం అన్నీ కలిసి ఆమెను బాధపెడతాయి.మరోవైపు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసిన బాలుకు దిమ్మతిరుగుతుంది.
మీనా తన కోసం పెషల్‌గా వంట చేస్తుందని భావించిన బాలుకి.. పచ్చిమిర్చిలు, పల్లీలు, దోస పిండి పెట్టడం చూసి షాక్ అవుతాడు. రాజేష్ ఇచ్చిన సలహా ద్వారా 'ఆడవారిని మెచ్చుకోవాలి' అన్న నిజం బాలు గ్రహిస్తాడు. రాజేష్ మాటలతో బాలు తన తప్పు గ్రహిస్తాడు.దీంతో మీనా మనసు ఎంతగా బాధపడిందో బాలు అర్థం చేసుకుంటాడు. ఇదే సమయంలో ప్రభావతి- మీనాక్షిల కొత్త బిజిసెస్ ఆలోచనలు నడుస్తాయి. డాన్స్ స్కూల్ ఫెయిల్యూర్ నుంచి బయటపడేందుకు ఫ్రీ అడ్మిషన్ ఐడియా, భవిష్యత్తు ఎపిసోడ్లకు ఆసక్తి పెంచింది. అలాగే రోహిణి - చింటూ షాపింగ్ సీన్‌లో దాచిపెట్టిన నిజాలు, ప్రభావతి అనుమానాలు మరో సస్పెన్స్‌ను క్రియేట్ చేశాయి. ఎపిసోడ్ చివర్లో బాలు సారీతో మీనాను ఇంప్రెస్ చేయడం, మీనా తన బాధను చెప్పడం, ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకోవడంతో నేటీ సీరియల్ ముగుస్తుంది.

శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలో బాలు- మీనా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఈ సమయంలో బాలు, రోహిణి కొడుకు చింటూ కోసం తాను తీసుకువచ్చిన డ్రెస్‌ను మీనాకు చూపిస్తాడు. డ్రెస్ చూసిన మీనా చాలా సంతోషిస్తుంది. "చింటూ పుట్టినరోజు దగ్గరలోనే ఉంది కదా... మనమే వెళ్లి అతడికి ఈ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సన్నివేశం ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని, చిన్న చిన్న విషయాల్లోనూ వాళ్ల ఆనందాన్ని చూపిస్తుంది.
ఇక మరోవైపు రవి పనిచేస్తున్న రెస్టారెంట్‌కు అతని అత్తగారు శోభ అనుకోకుండా వచ్చి అతడిని కలుస్తుంది. చెప్పాపెట్టకుండా వచ్చిన శోభను చూసి, ఏదో పెద్ద విషయం ఉండే ఉంటుందని రవి ముందే ఊహిస్తాడు. ఆమెను చూసి గౌరవంగా మాట్లాడుతూ "ఏంటి ఇలా వచ్చారు అత్తయ్య... ఏమైనా తీసుకుంటారా?" అని అడుగుతాడు. కానీ శోభ మాత్రం నేరుగా అసలు విషయానికి వస్తుంది. పిల్లల విషయం లేట్ చేస్తున్నారని, ఇప్పుడే జరగాల్సిన ముచ్చట్లు అప్పుడే జరగాలని, లేదంటే తర్వాత బాధ పడాల్సి వస్తుందని సూటిగా మాట్లాడుతుంది.
శోభ మాటలు రవిని అయోమయానికి గురి చేస్తాయి. 'మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు... ఏమైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్‌గా చెప్పండి'అని రవి అడుగుతాడు. అప్పుడు శోభ, రెస్టారెంట్ పెట్టిన తర్వాతే పిల్లల్ని కంటామనే ఆలోచన మీది కదా అని ప్రశ్నిస్తుంది. రెస్టారెంట్‌కు పిల్లలకు ఏంటి లింక్ అంటూ నిలదీస్తుంది. దీంతో రవి మరింత కంగారు పడతాడు. అసలు ఆమె ఏ దిశగా మాట్లాడుతుందో అర్థం కాక ఇబ్బంది పడతాడు. అంతలోనే శోభ తన బ్యాగ్ నుంచి ఒక బ్లాంక్ చెక్కును తీసి రవికి ఇస్తుంది. 'రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారు కదా... ఇదిగో తీసుకోండి' అంటూ నిర్లక్ష్యంగా చెక్ ఇచ్చేస్తుంది. ఈ ఊహించని పరిణామంతో రవి షాక్ అవుతాడు.
అక్కడే కోపపడితే పరిస్థితి మరింత చెడిపోతుందేమోనని భావించి, ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. వాస్తవానికి ఆ చెక్కును తీసుకోవడం అతడికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ తిరిగి ఇస్తే అత్తగారు గొడవ చేస్తుందేమో అన్న భయంతో ఇబ్బందిపడుతూ తీసుకుంటాడు. 'ఇంకేమైనా కావాలంటే మేమున్నాం... మేమే చూసుకుంటాం'అంటూ శోభ అహంకారంగా మాట్లాడుతుంది. ఈ మాటలతో రవికి లోపల కోపం మరిగిపోతుంది. అయినా బయటకు చూపకుండా తన భావాలను అణచుకుంటాడు. శోభ అక్కడి నుంచి వెళ్లిన వెంటనే రవి నేరుగా శృతి డబ్బింగ్ స్టూడియోకు వెళ్తాడు.
అసలు ఏం జరిగిందో వివరించకుండా, 'మన ఇంట్లో విషయాలు, మన పర్సనల్ మ్యాటర్స్ మీ అమ్మగారికి ఎందుకు చెబుతున్నావ్?' అంటూ శృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. రవి అలా మాట్లాడటంతో శృతి షాక్ అవుతుంది. అసలు విషయం ఏంటో అర్థం కాక 'మాట్లాడేది ఏంటో స్పష్టంగా చెప్పు... ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు'అంటూ రవిపై అరుస్తుంది. అప్పుడు రవి అసలు నిజాన్ని బయటపెడతాడు. ' మీ అమ్మ నాకు బ్లాంక్ చెక్ ఇచ్చింది. నేను మా నాన్న దగ్గర నుంచే ఒక్క రూపాయి కూడా తీసుకోను. అలాంటిది మీ అమ్మ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకుంటాను?'అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. దీనికి శృతి, 'నువ్వు బాగుండాలని, మనిద్దరం సంతోషంగా ఉండాలని మా అమ్మ వాళ్లు నువ్వు అడగకుండానే ఇచ్చారు'అంటూ సమర్థిస్తుంది. అంతేకాదు, పెద్దన్నయ్య మనోజ్ తన అత్తగారి డబ్బులతోనే షాప్ పెట్టుకోలేదా అంటూ ఉదాహరణగా చెబుతుంది.
ఈ మాటలు రవిలో మరింత ఆగ్రహాన్ని రేపుతాయి. తన క్యారెక్టర్, మనోజ్ క్యారెక్టర్ చాలా వేరని, తాను ఎవరి దగ్గర నుంచీ ఉచితంగా వచ్చిన ఏ వస్తువులూ తీసుకోనని కఠినంగా చెబుతాడు. 'ఈ విషయం నచ్చకపోతే మీ అమ్మ దగ్గరే మాట్లాడాలి. నా వర్క్ ప్లేస్‌కి వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టారు?' అంటూ నిలదీస్తాడు. దీనికి శృతి కూడా రివర్స్ అవుతుంది. 'నచ్చకపోతే ఆ చెక్కు చింపి పడేయి' అంటుంది. ఆ మాటలతో రవి క్షణాల్లోనే చెక్‌ను చింపి శృతి ముఖాన పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ సన్నివేశంతో పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారుతుంది.
ఇక మరోవైపు చింటూ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. చింటూ తన తల్లి రోహిణి వస్తేనే పుట్టినరోజు చేసుకుంటానని, లేకపోతే చేయనని మారం చేస్తాడు. దీంతో రోహిణి తల్లి శాంతమ్మ అతడిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో రోహిణి సడన్‌గా అక్కడికి వచ్చి చింటూకి సర్ప్రైజ్ ఇస్తుంది. తాను తీసుకొచ్చిన డ్రెస్, కేక్ చూపిస్తూ అతడిని ఎంతో సంతోషపరుస్తుంది. తల్లి రాగానే చింటూ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఈ సందర్భంలో శాంతమ్మ చింటూ భవిష్యత్తు గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది. 'వాడు అమ్మ అని పిలవడానికి నోచుకున్నాడు కానీ ప్రేమకు మాత్రం దూరమయ్యాడు'అంటూ బాధపడుతుంది.
తాను ఉన్నంతవరకు చింటూను కంటికి రెప్పలా చూసుకుంటానని, కానీ తాను వెళ్లిపోయిన తర్వాత వాడి జీవితం ఏమవుతుందో అన్న భయం తనను వేధిస్తోందని చెబుతుంది. దీనికి రోహిణి 'నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు నేనే అన్నీ చెబుతా. నేను వచ్చినప్పుడల్లా ఈ విషయాలు మాట్లాడి నన్ను విసిగించకు. నాకు ఇప్పటికే చాలా కష్టాలున్నాయి'అంటూ తన తల్లిపై సీరియస్ అవుతుంది. చివరగా 'ఈ విషయం ఎప్పటికైనా చెప్పాల్సిందే... ఆలోచించు'అంటూ శాంతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక చింటూ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బాలు- మీనా సడన్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. వారిని చూసిన చింటూ ఆనందంతో 'నా బర్త్‌డే కదా... అందుకే వచ్చారా?' అంటూ అడుగుతాడు. దీనికి బాలు నవ్వుతూ 'లేదురా... నీ బర్త్‌డే అని తెలుసుకుని కాదు, బర్త్‌డే గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చాం. అనుకోకుండా ఈరోజే నీ బర్త్‌డే అయ్యింది' అంటూ చింటూను ఎత్తుకొని ముద్దాడతాడు. ఆ సీన్‌లో చింటూ ఆనందం చూసి అందరూ కరిగిపోతారు.
అంతే కాదు, చింటూ వెంటనే తన అమ్మమ్మను పిలిచి 'ఎవరు వచ్చారో చూడు'అంటూ చూపిస్తాడు. బాలు - మీనాలను చూసిన రోహిణి తల్లి శాంతమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ విషయం వెంటనే రోహిణికి చెబుతుందీ శాంతమ్మ. ఇది వినగానే రోహిణి మరింత కంగారుపడుతుంది. 'వీళ్లకు పని పాట లేదా? నేను చింటూని చూడటానికి వచ్చినప్పుడే వీళ్లు రావాలా? ఇప్పుడు నేను బయటకు రాకపోతే చింటూ బాధపడతాడు... అలాగని వీళ్ల ముందుకు వెళ్లలేను. ఇప్పుడు నేను ఏం చేయాలి?' అంటూ రోహిణి లోపలలోపల ఆందోళనకు గురవుతుంది.
ఇక బయట శాంతమ్మ బాలు - మీనాల దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తుంది. 'ఎలా ఉన్నారు?' అని అడుగుతుంది. అయితే బాలు మాత్రం నేరుగా ప్రశ్న వేస్తాడు. 'చింటూ బర్త్‌డే అని మాకెందుకు చెప్పలేదు? అనుకోకుండా వచ్చాం కాబట్టే మాకు తెలిసింది' అంటాడు. దీనికి మీనా మధ్యలో కలగజేసుకొని 'పోనీలెండి... అనుకోకుండా వచ్చిన మనకి ఇలా కలిసి వచ్చింది అనుకుందాం'అంటూ మాట సర్దుతుంది.
ఈ క్రమంలో శాంతమ్మ నోరు జారుతుంది. 'నిజానికి మీరు మాకు ఎంతో సహాయం చేశారు. ఈ పుట్టినరోజు గురించి చెప్పాలా వద్దా అని అనుకున్నాను. తను ఒప్పుకుంటుందో లేదో అన్న సందేహం కూడా వచ్చింది' అంటూ అనుకోకుండా చెప్పేస్తుంది. దీంతో బాలు వెంటనే 'ఇంతకీ తను ఎవరు?'అని ప్రశ్నిస్తాడు. శాంతమ్మ తడబడుతుండగా చింటూ అమ్మ అని చెబుతుంది. ఒక్క క్షణం బాలు షాక్ అవుతాడు.
పరిస్థితిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో శాంతమ్మ వెంటనే కవరింగ్ మొదలుపెడుతుంది. ' మీ అమ్మగారికి మేమంటే ఇష్టం లేదు కదా... అందుకే బయటకు రాలేదు'అంటూ చెబుతుంది. దీనికి బాలు కూడా 'పోనీలెండి... మేమూ ఆమె గురించి పట్టించుకోవడం మానేశాం. అనవసరంగా ఇక్కడ మీరు ఆలోచించకండి' అంటూ మాట మార్చేస్తాడు. ఆ తర్వాత తాను తీసుకొచ్చిన డ్రెస్‌ను చింటూకి ఇస్తూ 'షాపింగ్‌కి వెళ్లినప్పుడు చింటూ గుర్తొచ్చి తీసుకున్నాను'అంటాడు బాలు.
ఇంతలో బాలు 'ఎలాగూ వచ్చాం కదా... మనమే దగ్గరుండి కేక్ కట్ చేద్దాం'అంటాడు. దీనికి మీనా కూడా 'ఇంత దూరం వచ్చి అలా ఎలా వెళ్లిపోతాం'అంటుంది. ఈ మాటలు విన్న రోహిణి మరింత షాక్ అవుతుంది. వారిని ఎలా పంపించాలి అనే ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు శాంతమ్మ కూడా వారిని ఇక్కడి నుంచి ఎలా బయటకు పంపించాలా అని మదనపడుతుంది. శాంతమ్మ కంగారు గమనించిన బాలు నేరుగా ప్రశ్నిస్తాడు. 'ఏంటి మీరు అలా ఉన్నారు? మేము రావడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందా?' అని అడుగుతాడు. శాంతమ్మ వెంటనే 'అదేం లేదమ్మా... నాకు ఎలాంటి సమస్య లేదు' అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తుంది.
కానీ అప్పటికే బాలు - మీనా ఇంట్లోకి అడుగుపెడతారు. దీంతో రోహిణి టెన్షన్ మరింత పెరుగుతుంది. 'నా కొడుకు కోసం ఇక్కడ ఉండాలా? లేక నా కాపురం కోసం ఇకనుంచి వెళ్లిపోవాలా?' అంటూ తీవ్ర ఆలోచనలో పడిపోతుంది. ఈ సమయంలో రోహిణి బ్యాగ్ బయటే ఉండటాన్ని గమనించిన శాంతమ్మ, ఎవరికీ కనిపించకుండా ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లి రోహిణి దగ్గరకు ఇస్తుంది. బ్యాగ్ చూసిన రోహిణి 'ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా ఎందుకు జరిగిందో... అంతా నా కర్మ'అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీనికి శాంతమ్మ 'ఇది నీ కర్మ కాదు... చింటూ గాడి దురదృష్టం. మన చేతిలో ఏమీ లేదు' అంటూ ఓదారుస్తుంది.
ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో బాలు - మీనా ఇద్దరూ కేక్ కట్ చేయించాలనే నిర్ణయానికి వస్తారు. ఈ సమయంలో చింటూ 'అమ్మ ఎక్కడ?' అంటూ అడుగుతాడు. దాంతో బాలు 'వాళ్ల అమ్మ వచ్చిందా?' అని ప్రశ్నిస్తాడు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా 'కళ్యాణి ఎక్కడ?'అంటూ అడుగుతారు. అప్పుడే బాలు, రోహిణి గురించి శాంతమ్మను అడిగి తెలుసుకున్నట్టు అర్థమవుతుంది.
శాంతమ్మ తన గత తప్పుల గురించి బాలు ముందు మనసు విప్పి చెబుతుంది. 'నేను చేసిన పాపాలకు ఈరోజు చింటూ బలి అవుతున్నాడు. తల్లి లేకుండా పెరుగుతున్నాడు. నేను చనిపోయాక వీడి భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు'అంటూ కన్నీళ్లతో మాట్లాడుతుంది. ఈ సమయంలోనే బాలు 'మీ కూతురితో నేను మాట్లాడతా... నంబర్ ఇవ్వండి' అని అడిగినట్టు తెలుస్తుంది.ఇక బాలు రోహిణి గతాన్ని తెలుసుకుంటాడా? చింటూ తన తల్లి గురించి నిజం బాలుకి చెబుతాడా? రోహిణి ఎదురుగా వస్తుందా? అనే ప్రశ్నలతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది.


Click it and Unblock the Notifications











