Gunde Ninda Gudi Gantalu January 5th Episode: బాలు మీనా సంచలన నిర్ణయం.. చింటూ దత్తతకు ప్రయత్నం..

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం ఎపిసోడ్‌ ప్రేక్షకులను భావోద్వేగాలు, ఉత్కంఠతో కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలో బాలు-మీనా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ చింటూ కోసం బాలు తెచ్చిన డ్రెస్‌ను చూస్తారు. డ్రెస్ చూసిన మీనా భావోద్వేగానికి లోనై, చింటూ పుట్టినరోజు దగ్గరలో ఉందని గుర్తుచేస్తూ, మనమే వెళ్లి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని సూచిస్తుంది. చింటూ విషయంలో బాలు-మీనా మధ్య ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఈ సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రవి పనిచేస్తున్న రెస్టారెంట్‌కు అతని అత్త శోభ అకస్మాత్తుగా రావడం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పిల్లల విషయంలో ఆలస్యం చేస్తున్నారని, జీవితంలో కొన్ని విషయాలు సమయానికి జరగాలని ఆమె సూటిగా మాట్లాడటం రవిని అయోమయంలో పడేస్తుంది.

ఆపై బ్లాంక్ చెక్ ఇవ్వడం అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది. ఈ విషయం శృతితో గొడవకు దారి తీసి, చివరికి రవి చెక్‌ను చింపివేసి ఆగ్రహంతో వెళ్లిపోతాడు. మరోవైపు చింటూ బర్త్‌డే సన్నివేశాలు పూర్తిగా ఎమోషనల్‌గా సాగుతాయి. తల్లి రోహిణి వస్తేనే పుట్టినరోజు చేసుకుంటానని చింటూ మారం చేయడం, ఆమె సడన్ ఎంట్రీతో అతడి ఆనందం రెట్టింపు కావడం హృదయాన్ని తాకుతుంది. అయితే బాలు-మీనా అక్కడికి రావడంతో రోహిణి, శాంతమ్మ ఇద్దరూ ఆందోళనకు గురవుతారు. చింటూ అమ్మ ఎవరు అన్న ప్రశ్నతో పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుంది. చివరికి 'నా కొడుకు కోసం ఉండాలా? లేక నా కాపురం కోసం వెళ్లాలా?' అనే ఆలోచనతో రోహిణి ఎమోషనల్ కావడం ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచింది.

Gunde Ninda Gudi Gantalu serial episode 590 January 5th 2025 here is full story

Courtesy: jiohotstar

సోమవారం ఎపిసోడ్ లో చింటూ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో ఆనందంగా మొదలవుతాయి. బాలు, మీనాలు చింటూ కోసం వచ్చిన రోహిణి తల్లి శాంతమ్మ ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. పరిస్థితి చేజారుతుందనే భావనతో.. 'బాలు... మీనాలతో కొంచెం మాట్లాడాలి'అంటూ శాంతమ్మ వారిని బయటకు తీసుకెళ్తుంది. చింటూ అత్త ఎందుకు రాలేదని బాలు ప్రశ్నించగా.. ' ఇక్కడికి రావడం చింటూ అత్తకి ఇష్టం లేదు. అయినా... చింటూ అన్న కొడుకు కాదు, కన్న కొడుకు'అని చెప్పడంతో బాలు, మీనా ఇద్దరూ షాక్‌కు గురవుతారు. ఇన్ని రోజులు 'అత్త' అని ఎందుకు చెప్పారని బాలు నిలదీయగా, 'అది వాళ్ల అమ్మ చెప్పింది. నిజం చెప్పలేక, అబద్ధం చెప్పలేక నేను నరకం అనుభవిస్తున్నాను'అంటూ శాంతమ్మ ఒప్పుకుంటుంది.

మీనాకు కోపం ఆగదు. 'ఇలా ఎందుకు చేసింది?'అని ప్రశ్నించగానే.. శాంతమ్మ తన జీవితపు చీకటి అధ్యాయాన్ని విప్పి చెబుతుంది. భర్త మరణం తర్వాత భారీ అప్పులు, డిగ్రీ చదువుతున్న కూతురు ఆ కష్టకాలంలో ఒక ధనవంతుడు అప్పులు తీర్చుతానని, బదులుగా పెళ్లి చేయమని అడిగాడని చెబుతుంది. వేరే దారి లేక కూతురిని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసింది. కానీ విధి దెబ్బకు కొన్ని రోజులకే ఆ వ్యక్తి మరణించడంతో, తన జీవితాన్ని నాశనం చేశారన్న కోపంతో కూతురు తల్లి మీద దూరమైంది. చదువు పేరుతో వెళ్లిపోయి, చదువు పూర్తయ్యాక చింటూని శాంతమ్మ దగ్గర వదిలేసి దుబాయ్‌కి వెళ్లిపోయిందని వివరంగా చెబుతుంది. అందుకే ఇక్కడికి రావడం ఆమెకు ఇష్టం లేదని క్లారిటీ ఇస్తుంది.

ఈ కథ విన్న మీనా బాధతో 'నిజంగా మీ అమ్మాయికి అన్యాయం జరిగింది'అంటుంది. కానీ వెంటనే బాలు ఆగ్రహంగా 'అయితే చింటూకి అన్యాయం జరగలేదా?'అని నిలదీయగా, శాంతమ్మ తన తప్పు ఎంత ఉందో తెలుసని, ప్రాయశ్చిత్తంగా చింటూని తానే పెంచుతున్నానని చెబుతుంది. మీనాకు ఇది కూడా నచ్చదు. 'మీ వల్ల మీ కూతురికి అన్యాయం అయి ఉండొచ్చు. కానీ చింటూని ఇలా దూరం పెట్టడం సరి కాదా?' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శాంతమ్మ మరో నిజం చెబుతుంది. ఈ విషయం వాళ్లింట్లో తెలిస్తే కూతురికి ఆమె కోరుకున్న జీవితం దక్కదని భయంతోనే, కొడుకు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పుకోవడం లేదని అంటుంది.

దీంతో బాలు 'అప్పులు చేసి మీరు తప్పు చేస్తే, శిక్ష అనుభవించేది ఏ తప్పూ చేయని చింటూ. అమ్మ ఉండీ లేనట్టుగా పెరగడం ఎంత కష్టమో మీకు తెలుసా?'అంటూ ఘాటుగా మాట్లాడుతాడు. మీనాకైతే కోపం మరింత పెరుగుతుంది. 'ప్రపంచంలో ఏ తల్లి అయినా నా కొడుకు బాగుంటే చాలు అనుకుంటుంది. తన సుఖాన్ని ఎప్పుడూ కోరుకోదు. మీ కూతురికి ఈ స్వార్థం పనికిరాదు. పసివాడిని అనాధను చేసిన పాపం ఊరికే పోదు-భగవంతుడు శిక్షిస్తాడు'అంటూ శాపనార్థాలు పెడుతుంది. బాలు కూడా 'మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. నంబర్ ఇవ్వండి'అని అడుగుతాడు. కానీ శాంతమ్మ ఆపేస్తుంది 'వద్దు బాబు. ఇప్పుడిప్పుడే ఆ తల్లి మనసు మెత్తబడుతోంది. చింటూని దూరం చేసుకున్నందుకు బాధపడుతోంది. ఏదో ఒక రోజు మనసు మార్చుకుని చింటూనే తన దగ్గరికి తీసుకెళ్లవచ్చు'అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

శాంతమ్మ చెప్పిన నిజాలు విన్న తర్వాత కూడా బాలు మనసు కుదుటపడదు. లోపల పేరుకుపోయిన ఆవేశం బయటకు వస్తూ చింటూ తల్లి నిజంగా మారుతుందా అనే సందేహం అతన్ని కుదిపేస్తుంది. 'మీరు ఆశపడుతున్నట్టు అనిపిస్తోంది... కానీ ఈ పరిస్థితులు చూస్తే ఆమె మనసు మారుతుందని నాకు అనిపించడం లేదు. అసలు ఆమె ఏమనుకుంటుందో తెలుసుకోవాలి. నాలాంటి వాళ్లు గట్టి మాటలు చెప్పితే గానీ ఆమెకు బుద్ధి రాకపోవచ్చు'అంటూ బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. చింటూ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే భావన అతని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ సమయంలో మీనా వెంటనే అడ్డుపడుతుంది. బాలు ఆవేశం చింటూకే నష్టం చేయవచ్చని గ్రహించిన ఆమె,' మీ మాటలతో అనవసరంగా ఆమెను బాధ పెట్టొద్దు. మీరు చింటూకి మంచి చేయాలనుకుంటే అదే చెడుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడైతే ఈ విషయాన్ని వదిలేయండి' అంటూ బాలుని శాంతింపజేస్తుంది. శాంతమ్మ కూడా 'ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. మీరు చింటూని నిజంగా ప్రేమిస్తున్నారు కాబట్టే నేను ఈ నిజం చెప్పాను' అని వేడుకుంటుంది. 'ఇక పదండి... కేక్ కట్ చేద్దాం' అంటూ మీనాను, బాలును లోపలికి తీసుకెళ్తుంది. బయట జరిగిన తీవ్ర భావోద్వేగాల్ని లోపల చింటూ ముందు చూపించకూడదనే ఆమె ఆలోచన.

లోపల చింటూ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. బాలు, మీనా దగ్గరుండి చింటూతో కలిసి కేక్ కట్ చేయడానికి సిద్ధమవుతారు. కానీ మరోవైపు రోహిణి మనసు మాత్రం ముక్కలవుతోంది. 'వాడి అదృష్టమో... నా అదృష్టమో అర్థం కావడం లేదు. అబద్ధం చెప్పి వాడి కోరిక తీర్చాలని ఇంత దూరం వచ్చాను. కానీ పక్కనుండి కేక్ కట్ చేయించలేకపోతున్నాను' అంటూ ఆమె లోలోపల కుంగిపోతుంది. తల్లిగా ఉండి కూడా కొడుకు దగ్గర ఉండలేని పరిస్థితి అంటూ బాధపడుతుంది. చింటూ కూడా తల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. తల్లి రాకపోవడంతో అతని ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రోహిణి మాత్రం సైలెంట్‌గా ఉండమని చెప్పడంతో, తల్లి మాటకు విలువ ఇచ్చి చింటూ తన భావాలను దాచుకుంటాడు.

కేక్ కట్ సమయంలో బాలు అనుకోకుండా తన మనసులోని కోరికను బయటపెడతాడు.'మనకి ఒక కొడుకు ఉంటే... మనం కూడా ఇలానే బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసేవాళ్లం కదా' అని అంటాడు. దీనికి మీనా కూడా భావోద్వేగంగా 'నాకూ అలాగే ఉంది... మన కొడుకు బర్త్‌డే చేసినట్టే అనిపిస్తోంది' అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే చింటూ డల్‌గా ఉండటం బాలు గమనిస్తాడు. 'ఏంట్రా రా... వచ్చినప్పుడు ఉన్న సంతోషం ఇప్పుడు లేదు. ఏం జరిగింది?'అని అడుగుతాడు. చింటూ మాత్రం'ఏమీ లేదు' అంటూ తప్పించుకుంటాడు. అప్పుడు బాలు,' మీ అత్త రాలేదని బాధపడుతున్నావా? త్వరలోనే వస్తుందిరా'అంటూ ఓదార్పు చెబుతాడు. మీనా కూడా 'ఈరోజు నీ బర్త్‌డే. సంతోషంగా ఉండాలి. ఇలాంటి విషయాలు పట్టించుకోకు'అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయినా చింటూ ముఖంలో ఆనందం తిరిగి రావడం లేదు. దీంతో బాలు చింటూను నవ్వించే ప్రయత్నం చేస్తాడు.

ఇదిలా ఉండగా, మరోవైపు రోహిణి అక్కడ ఉండలేక ఇంట్లోనుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది గమనించిన శాంతమ్మ వెంటనే ఫోన్ చేస్తుంది. 'ఎక్కడ ఉన్నావ్?'అని అడగగానే, రోహిణి ఆగ్రహంతో 'నువ్వు చేసే పనుల వల్ల నడిరోడ్డు మీద నిలబడ్డాను. నీ వల్ల నా జీవితం నాశనం అయింది. వెంటనే వాళ్లను పంపించు' అంటూ కేకలు వేస్తుంది. శాంతమ్మ మాత్రం, వాడిపై అంత ప్రేమ చూపించే వాళ్లను ఎలా పంపించాలి?'అని ప్రశ్నిస్తుంది.

అప్పుడు రోహిణి మరింత ఘాటుగా స్పందిస్తుంది. 'అయితే నన్నే పంపించమంటావా? నాకు ఏ సమస్య లేదు. నేను ఇప్పుడే వెళ్లిపోతా' అంటుంది. శాంతమ్మ ఒక్కసారిగా కంగారు పడుతూ,,' వద్దు... నువ్వు వెళ్లిపోతే చింటూ ఇంకా బాధపడతాడు'అని ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ రోహిణి తగ్గదు.'ఏదో ఒకటి చెప్పి వాళ్లను వెంటనే పంపించు. నేను వాడితో కొద్దిసేపు గడిపి అత్తగారింటికి టైమ్‌కి వెళ్లాలి. లేకపోతే నాపై అనుమానాలు మొదలవుతాయి'అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చివరికి శాంతమ్మ,'సరే... పరిస్థితి ఏంటో చూసి మళ్లీ ఫోన్ చేస్తా' అంటుంది. ఎలాగైనా సరే పరిస్థితి కంట్రోల్ చేసి బాలు మీనాలను బయటికి పంపాలని శాంతమ్మ ప్రయత్నిస్తుంది. ఇందులోనే బాలు మీనాలు 'ఇక మాకు టైం అవుతుంది. మేం వెళ్తాం'అని అంటారు. చింటూ బాగోగుల గురించి ఇలాంటి ఇబ్బంది పడకండి. మీకు మేము ఉన్నం' అంటూ భరోసా ఇచ్చి వెళ్లిపోతారు.

బాలు-మీనాలు వెళ్లిపోయిన వెంటనే, ఇన్నాళ్లుగా అదుపు చేసుకున్న భావోద్వేగాలు ఒక్కసారిగా రోహిణిలో ఉప్పొంగిపోతాయి. ఆమె చింటూ దగ్గరికి పరుగెత్తుకుని వెళ్లి వాడిని గట్టిగా హాగ్ చేసుకుంటుంది. కన్నీళ్లతోనే కేక్ తినిపిస్తూ, తల్లి ప్రేమను చూపిస్తుంది. అప్పుడు చింటూ అమాయకంగా 'నువ్వు ఇక్కడే ఉండి నా దగ్గరికి ఎందుకు రాలేదమ్మా?'అని అడుగుతాడు. 'నన్ను క్షమించరా'అంటూ బాధపడుతుంది. ఆ బాధను దాచుకుంటూ, చింటూని ఫ్రెండ్స్‌తో ఆడుకోమని బయటకు పంపిస్తుంది. చింటూ బయటకు వెళ్లగానే, రోహిణి లోపల దాచుకున్న కోపం ఒక్కసారిగా ఊగిపోతుంది. తల్లి శాంతమ్మపై రెచ్చిపోతూ, 'ఏం చేద్దాం అనుకుంటున్నావ్ నన్ను? నా జీవితాన్ని ఇంకా ఏం నాశనం చేద్దాం అనుకుంటున్నావ్? నా కాపురాన్ని రోడ్డుమీద పడేయాలనుకుంటున్నావా? వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్లను ఎవరు రమ్మన్నారు? వాళ్ల దృష్టిలో నువ్వు ఎవరు?'అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.

దీనికి శాంతమ్మ మాత్రం గట్టిగా, తడబడకుండా సమాధానం ఇస్తుంది. 'నేను ఒక తల్లిని... వాళ్ల దృష్టిలో ఒక మనిషిని. నీ బిడ్డను నువ్వు వదిలేసి వెళ్లిపోతే, అష్టకష్టాలు పడి పెంచుతున్న ఓ అనాధను'అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది. ఈ మాటలు రోహిణిని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రోహిణి వెంటనే మరోసారి రెచ్చిపోతూ, 'నా గతం మొత్తం వాళ్లకు చెప్పేస్తావా? నన్ను ఓ స్వార్థపరురాలిగా మార్చేస్తావా? నా భవిష్యత్తును పాడు చేద్దామని చూస్తున్నావా?' అంటూ ఆరోపణలు చేస్తుంది. అందుకు శాంతమ్మ 'నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే లేదు. అబద్ధపు పునాదుల మీద నీ జీవితం ఉంది. ఇప్పుడు అవి కూలిపోతాయేమో అన్న భయంతోనే నువ్వు వణుకుతున్నావ్. పుట్టినరోజుకు నువ్వు రావాలని వాడు ఎన్నో రోజులు ఎదురుచూశాడు. నువ్వు మాత్రం వచ్చి హాజరు వేసుకుని వెళ్లిపోయినట్టే చేశావ్' అంటూ బాధపడుతుంది.

దీంతో రోహిణి కాస్త తగ్గి, 'వాళ్లు వస్తారని నాకు ఏం తెలుసు?'అంటుంది. శాంతమ్మ కూడా వెనక్కి తగ్గకుండా, 'వాళ్లు వస్తారని నేనూ ఊహించలేదు. కానీ వాళ్లు వెళ్లాక నన్ను తిట్టడానికి వచ్చావు గానీ, కాసేపైనా నీ కొడుకుతో సంతోషంగా గడపాలని ప్రయత్నించావా?' అంటూ నిలదీస్తుంది. అయినా రోహిణి అసంతృప్తిగా, 'మన ఇంటి విషయాలు వాళ్లకు ఎందుకు చెప్పాలి? నా గతం నువ్వెందుకు చెప్పాలి?'అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు శాంతమ్మ కీలకమైన విషయం బయటపెడుతుంది. 'వాళ్లు చింటూ గురించి ఆలోచించినంతలో ఒక్క శాతం కూడా నువ్వు ఆలోచించడం లేదు. వాళ్లు నన్ను పదే పదే సంప్రదించాలనుకుంటున్నారు. నంబర్ అడుగుతున్నారు. ఇవ్వాలా?' అని ప్రశ్నిస్తుంది.

దీంతో రోహిణి అసహనంతో 'నీ కూతురు పేరు కళ్యాణి కాదు... రోహిణి అని చెప్పకపోయావా? భర్త లేని నువ్వూ, భర్త ఉన్న నేనూ ఇద్దరం అడుక్కు తినే పరిస్థితి వస్తుంది'అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. అందుకు శాంతమ్మ క్లారిటీగా 'వాళ్లు నిన్ను అడగడం మానేయాలని నేను అసలు విషయం చెప్పాను. వాళ్లకు తెలిసినంతవరకు ఇది ఒక అమ్మ కథ. వాడి అమ్మ నువ్వని నేను ఎప్పటికీ చెప్పను'అని భరోసా ఇస్తుంది. కానీ రోహిణి మాత్రం బాలు గురించి హెచ్చరిస్తుంది.

'బాలు గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. వెంట్రుక దొరికితే చాలు, కొండలు లాగుతాడు. తవ్వుకుంటూ వెళ్లి నా జీవితాన్ని ఎండగడతాడు. అందుకే వాళ్లు ఇకపై ఇక్కడికి రాకూడదు. నిన్ను కలవకూడదు' అంటూ వార్నింగ్ ఇస్తుంది. శాంతమ్మ మాత్రం, 'ఆ విషయం నా చేతిలో లేదు. అది వాళ్ల ఇష్టం. నేను మాత్రం కావాలని వాళ్లను కలవను' అంటూ మాట ఇస్తుంది. చివరగా మరోసారి బాలు-మీనాలు ఇంట్లో అడుగు పెట్టకుండా హెచ్చరించి రోహిణి వెళ్లిపోతుంది.

ఇక మరోవైపు, బాలు-మీనాలు కారులో ఇంటికి వెళ్తూ చింటూ పరిస్థితి గురించి ఆలోచిస్తారు. మీనా మనసు కలచి, 'మనము చింటూని దత్తత తీసుకుందాం'అంటుంది. వెంటనే బాలు కూడా, 'నాకూ అదే అనిపిస్తోంది. మన ఇద్దరి ఆలోచనలు ఒకటే. వెంటనే ఆ పని మొదలుపెడదాం'అంటాడు. అయితే మీనా ఇది త్వరగా అయ్యే పని కాదని, రెండు కుటుంబాల అంగీకారం అవసరమని చెబుతుంది. దీంతో బాలు, 'మా నాన్న ఒప్పుకుంటాడు. మా అమ్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. కానీ మన ఇంట్లో మాత్రం అడ్డంకులు వస్తాయి' అంటాడు. చివరికి ఇద్దరూ ముందుగా గుడికి వెళ్లి ఆలోచిద్దామని నిర్ణయించుకుంటారు. గుడిలో మీనా చీటీలు రాసి దేవుడి దగ్గర పెడుతుంది. ఇది జీవితంలో తీసుకునే అత్యంత కీలక నిర్ణయం కాబట్టి దేవుని అనుగ్రహం కూడా ఉండాలని మీనా చెబుతుంటే, బాలు మాత్రం 'మంచి పని చేస్తే ఎవరి అనుమతీ అవసరం లేదు'అంటాడు.

అప్కమింగ్ ఎపిసోడ్‌లో బాలు-మీనాలు ఈ విషయం ఇంట్లో చెప్పడం, చింటూ అసలు తల్లి గురించి నిజం బయటపడటం, దత్తత నిర్ణయంపై కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు, ప్రభావతివ్యతిరేకత ఇవన్నీ రోహిణి చాటుగా వింటుండటంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. రోహిణి జీవితంలో భయంతో కూడిన కొత్త మలుపు ఏం తీసుకురానుందో అన్నదే రాబోయే ఎపిసోడ్లలో ప్రధాన ఆసక్తిగా నిలవనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X