Gunde Ninda Gudi Gantalu January 6th Episode: మీనాకు షాక్.. ప్రభావతి ‘మాస్టర్'అవతారం..దత్తతకు రోహిణి అడ్డు..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్‌లో చింటూ పుట్టినరోజు వేడుకల మధ్య దాచిపెట్టిన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ భావోద్వేగాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి. చింటూ అత్త రాకపోవడం బాలు మనసులో అనుమానాలు రేకెత్తిస్తుంది. సుగుణను బయటకు తీసుకెళ్లి ప్రశ్నించగా, చింటూ తన అన్న కొడుకు కాదని, కన్న కొడుకేనని ఆమె నిజం చెబుతుంది. అత్త అని చెప్పమని తానే ఎప్పుడూ అనలేదని, కూతురే అలా చెప్పమందని, నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక నరకం అనుభవిస్తున్నానని సుగుణ కన్నీళ్లతో వాపోతుంది.
భర్త మరణ సమయంలో ఉన్న అప్పులు, డిగ్రీ చదువుతున్న కూతురి కోసం వేరే దారి లేక వయసులో పెద్దాయనతో పెళ్లి చేయాల్సి వచ్చిన పరిస్థితి, కొన్ని రోజులకే అల్లుడి మరణం... ఈ అన్నిటితో తన కూతురు జీవితం తానే నాశనం చేశానని ఒప్పుకుంటుంది. ఆ కోపంతోనే కూతురు చింటూని వదిలేసి దుబాయ్ వెళ్లిపోయిందని వివరిస్తుంది. మీనా కూతురికి అన్యాయం జరిగిందని అనుభూతి వ్యక్తం చేస్తే, బాలు మాత్రం చింటూకి జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తాడు. ప్రాయశ్చిత్తంగా చింటూని తానే పెంచుతున్నానని సుగుణ చెప్పినా, మీనా కూతురి స్వార్థాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.

ఇంట్లో బాలు-మీనాలు చింటూతో కేక్ కట్ చేయిస్తారు. బయట రోహిణి దూరంగా నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చివరికి బాలు-మీనాలు వెళ్లిపోయాక చింటూని హత్తుకుని తల్లి ప్రేమ చూపిస్తుంది. కానీ వెంటనే సుగుణపై కోపం చూపించి, బాలు మామూలోడు కాదని, ఇక వాళ్లు రాకూడదని ఆదేశిస్తుంది.కారులో వెళ్తూ చింటూ పరిస్థితి బాలు-మీనాలను కలచివేస్తుంది. చివరకు చింటూని దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చి, అది సరైనదేనా అని దేవుడి దగ్గర చిట్టీలు పెట్టడంతో నేటి ఎపిసోడ్ భావోద్వేగ ముగింపు పొందింది.
మంగళవారం ప్రారంభంలో చింటూ దత్తత విషయమై నిర్ణయం తీసుకునే ముందు బాలు, మీనా గుడికి వెళ్తారు. దేవుని ముందు చీటీలు వేసి దైవానుగ్రహం ప్రకారం నడుచుకోవాలని భావిస్తారు. కానీ పూజ అనంతరం తీసిన చీటీలో 'దత్తత వద్దు' అనే సమాధానం రావడంతో మీనా తీవ్రంగా కలత చెందుతుంది. ఇదే సమయంలో బాలు మాత్రం 'మనం చేసే మంచి పనికి ఎవరి అనుగ్రహం అవసరం? అనాధగా ఉన్న ఆ పిల్లవాడికి తల్లిదండ్రులం అవుదామనుకుంటున్నాం. ఇందులో తప్పేం లేదు'అంటూ ధైర్యంగా మాట్లాడతాడు. గుడికి రాకుండా నేరుగా ఇంటికి వెళ్లి నిర్ణయం చెప్పుంటే దత్తత తీసుకునేవాళ్లమే కదా అని ప్రశ్నిస్తాడు. మీనా మాత్రం దీనిని దైవ హెచ్చరికగా భావిస్తూ.. 'ఈ విషయంలో ఏదో ప్రమాదం ఉంది. లేనిపోని చిక్కుల్లో పడతామని దేవుడు ముందే సూచిస్తున్నాడు' అని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. చివరకు ఈ విషయాన్ని ఇంట్లో అందరితో మాట్లాడాలని నిర్ణయించుకుని ఇద్దరూ ఇంటికి వెళ్తారు.
ప్రభావతి డాన్స్ స్కూల్‌లో కొత్త మలుపు
మరోవైపు ప్రభావతి తన డాన్స్ స్కూల్‌లో ఫ్రీ క్యాంప్ నిర్వహించడంతో పిల్లల చేరికలు మొదలవుతాయి. అయితే ఇందులో ఒక ప్రేమజంట ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంట్లో వాళ్లు కలవనివ్వకపోవడంతో ప్లాన్ ప్రకారం స్కూల్‌లో జాయిన్ అవుతారు. ఆ యువకుడు ప్రభావతిని 'మాస్టర్' అంటూ అతివినయంగా పొగడ్తలతో ముంచెత్తుతాడు. దీంతో ప్రభావతి ఊహల్లో తేలిపోతుంది. ఈ పరిణామాలు చూస్తే ప్రభావతి త్వరలోనే 'కొత్త చిక్కుల్లో పడబోతుందన్న సంకేతాలు'స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రవి-శృతి మధ్య సరదా మాటల యుద్ధం
ఇక రవి, శ్రుతికి సారీ చెప్పి కాసేపు సరదాగా బయటికి వెళ్లుదామని అడుగుతాడు. అయితే శృతి మాత్రం గతంలో తిట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ.. మొదట నిరాకరిస్తుంది. రవి ప్రేమగా రిక్వెస్ట్ చేయడంతో కాస్త కరిగినా.. షాపింగ్, సినిమా, రెస్టారెంట్ డిన్నర్, సిటీ రౌండ్ అంటూ పెద్ద లిస్ట్ చెబుతుంది. దీంతో రవి షాక్ అవుతాడు. 'నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నావా?'అని ప్రశ్నిస్తాడు. శృతి మాత్రం ' ఖర్చంతా నేనే పెట్టుకుంటా... వస్తావా రావా?'అంటూ కౌంటర్ వేస్తుంది. దీంతో రవి సరే అంటాడు.
చింటూ ఫ్లాష్‌బ్యాక్‌తో ఇంట్లో గొడవ
ఇంతలో సత్యం ఇంటికి చేరుకుంటాడు. చింటూ బర్త్‌డేకు వెళ్లొచ్చామని బాలు చెబుతాడు. అత్తయ్య విషయం అడగగానే, సుగుణమ్మ చెప్పిన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీని బాలు వివరిస్తాడు. మీనా 'ఏ కన్నతల్లి అయినా తన కొడుకుతో 'అత్త' అని పిలిపించుకుంటుందా?'అని ప్రశ్నించగా, బాలు దుబాయ్‌లో తన సుఖం చూసుకుంటున్నట్లు ఉంది అని ఘాటుగా మాట్లాడుతాడు. మనోజ్ అయితే మరింత దారుణంగా స్పందిస్తాడు. రోహిణి మాత్రం మౌనంగా ఉంటూ.. తన గతం బయటపడితే పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతుంది. చివరకు సత్యం జోక్యం చేసుకుని.. 'మనకు సంబంధం లేని వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడొద్దు'అంటూ విషయం ముగిస్తాడు.
ప్రభావతి 'మాస్టర్' అవతారం
అంతలోనే ప్రభావతి తన స్టూడెంట్‌తో కలిసి ఇంటికి వస్తుంది. ఆ యువకుడి అతివినయాన్ని గమనించిన బాలు, 'ఇలాంటి స్టూడెంట్స్‌తో జాగ్రత్త' అంటూ హెచ్చరిస్తాడు. దానికి ప్రభావతి 'ఇకనుంచి నేను ప్రభావతి కాదు... మాస్టర్ ప్రభావతి'అంటూ వీరలెవల్లో చెబుతుంది. ఈ సందర్భంగా బాలు సరదాగా తండ్రి సత్యాన్ని అడుగుతాడు. 'నాన్నా టీ తాగుతారా, కాఫీ తాగుతారా?' సత్యం 'టీ తాగుతా'అనగానే, ప్రభావతి తల్లికి 'మాస్టర్‌కు రెండు టీలు తీసుకురండి'అని ఆదేశిస్తాడు. ఈ సీన్ చాలా కామెడీగా మారుతుంది.
ఈ విషయంలోకి మనోజ్ ఎంట్రీ ఇచ్చి.. 'అమ్మ డాన్స్ మాస్టర్ అయింది.. నేను బిజినెస్ మాన్ అయ్యాను.. నువ్వు జీవితాంతం డ్రైవింగ్ చేసుకుంటూనే ఉండాలి'అంటూ బాలుని ఎగళాలి చేసి మాట్లాడుతాడు. దీంతో రవి తీవ్రంగా స్పందిస్తూ, 'మళ్లీ ప్రొఫెషన్ గురించి మాట్లాడితే బాగుండదు'అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడితో ఆగకుండా శృతి కూడా రంగంలోకి దిగుతుంది. 'నువ్వు ఎంత బిజినెస్ మాన్వో జీఎస్టీ కోసం నాలుగు లక్షలు ఎగ్గొట్టినప్పుడే అర్థమైంది'అంటూ సెటైర్ వేస్తుంది. 'అంతేనా నాలుగు లక్షల కోసం మీనా వదిన నగలు కాజేశాడు' అని రవి మరింత ఘాటుగా అంటుంది. దానికి మనోజ్ 'ఆల్రెడీ రెండు లక్షలు ఇచ్చేశాను'అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు.
అప్పుడే రవి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.' నువ్వేమైనా కష్టపడి సంపాదించావా? రోహిణి వదిన వాళ్ల నాన్న ఇచ్చిందే కదా. నువ్వు మరోసారి బిజినెస్ మాన్ అని చెప్పుకునే అర్హత లేదు' అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంత జరుగుతున్నా మీనా సైలెంట్‌గా ఉండటం గమనించిన బాలు, 'ఏమైంది మీనా?'అని అడుగుతాడు. అప్పుడు మీనా, 'మనోజ్ లాంటి వాళ్లంటే శాపాలు కూడా తగలవు' అంటూ పంచ్ వేస్తుంది. దీంతో రోహిణి 'నీ ఉద్దేశం ఏంటి?'అని ప్రశ్నించగా, మీనా ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. 'మీ ఆయన గురించి చెప్పమంటావా? 40 లక్షల విషయం చెప్పమంటావా? నాలుగు లక్షల విషయం చెప్పమంటావా? ఉద్యోగం లేక గుడిమెట్లపై అడుక్కున్న చరిత్ర చెప్పమంటావా? మొన్నటికి మొన్న నగలు తీసుకెళ్లి అమ్ముకున్న విషయం చెప్పమంటావా?' అంటూ వరుస ప్రశ్నలతో అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. పైగా మా ఆయనను తక్కువ చేసి మాట్లాడితే నేను మాత్రం అస్సలు ఊరుకోను అంటూ స్పష్టంగా చెబుతుంది.
మీనా మాటలతో హాల్లో ఉన్నవాళ్లంతా సైలెంట్ అయిపోతారు. కానీ ప్రభావతి మాత్రం 'ఏంటే... ఎక్కువ మాట్లాడుతున్నావ్' అంటూ అరుస్తుంది. దానికి మీనా కూల్‌గా 'నేనేం ఎక్కువ మాట్లాడాను అత్తయ్య?'అంటూ సెటైర్ వేస్తుంది. ఇక రవి 'వదిన ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడింది కదా'అంటూ మీనాకు సపోర్ట్ చేస్తాడు. పరిస్థితి చేజారుతుండటంతో సత్యం మధ్యలో కలుగజేసుకుని, 'ఎవరు ఎవరిని తక్కువ చేయకూడదు. అందరూ వెళ్లి ఎవరి పనులు వాళ్లు చూసుకోండి' అంటూ గొడవకు పుల్ స్టాప్ పెడతాడు. ఈ గొడవలో పడి బాలు చింటూ దత్తత విషయం మర్చిపోతాడు. మీనా గుర్తు చేయగా, మళ్లీ తర్వాత చెబుదాం అంటూ విషయాన్ని వాయిదా వేస్తాడు.
రాబోయే ఎపిసోడ్‌లో రోహిణి తన తల్లి సుగుణకు ఫోన్ చేసి, 'ముందే చెప్పాను కదా... బాలుతో మాట్లాడొద్దని. నా కొడుకును ఎవరికి దత్తత ఇవ్వాలనే ఆలోచనే లేదు. మరోసారి దత్తత గురించి ఇంటికి వస్తే చెడమడ తిట్టి పంపించు'అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు బాలు, 'నేను ఎవరి మాటలు పట్టించుకోను'అంటూ సుగుణమ్మకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ సుగుణ ఫోన్ కట్ చేయడంతో పరిస్థితి మరింత టెన్షన్‌గా మారుతుంది. బాలు నిజంగా చింటూని దత్తత తీసుకుంటాడా? రోహిణి దాచిపెట్టిన అసలు నిజం బయటపడుతుందా? ఇంట్లో వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలతో ఎపిసోడ్ ముగిసింది. రాబోయే ఎపిసోడ్లపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications










