Gunde Ninda Gudi Gantalu January 8th Episode: రోహిణి కీలక నిర్ణయం.. సుమతి శుభవార్త.. మరో ప్రమాదంలో మనోజ్..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ ఉత్కంఠభరితమైన పరిణామాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే చింటు తల్లి గురించి ఇంట్లో నిజం చెప్పాలని బాలు నిర్ణయించుకుంటాడు. తాను ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నానని ప్రభావతితో చెప్పి ఇంట్లో అందరినీ పిలుస్తాడు. చింటు బర్త్‌డే సందర్భంగా అతని తల్లి గురించి ఓ నిజం తెలిసిందని చెప్పడంతో, బయట నుంచే అది విన్న రోహిణి ఒక్కసారిగా భయపడిపోతుంది. నిజం బయటపడుతుందేమోనన్న టెన్షన్‌తో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది.
అయితే బాలు చెప్పిన నిజం కేవలం చింటు తల్లి దుబాయ్‌లో ఉంటుందని, తనను అమ్మ కాకుండా అత్త అని పిలవమని చెప్పిందనే విషయానికే పరిమితం కావడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఈ మాటలపై ఇంట్లో వాళ్లు తీవ్రంగా స్పందిస్తారు. ప్రభావతి, మనోజ్ పరోక్షంగా రోహిణిని అవమానిస్తూ చింటు తల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తారు. ఈ మాటలు విన్న రోహిణి లోపలే కుంగిపోతుంది. ఇదే సమయంలో బాలు, మీనా చింటును దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించడంతో ప్రభావతి రచ్చ చేస్తుంది. ఎవడికో పుట్టిన పిల్లాడిని ఇంట్లోకి తీసుకురానని తేల్చి చెబుతుంది.

మనోజ్ కూడా వ్యతిరేకించగా, సత్యం, రవి మాత్రం దత్తతకు మద్దతు ఇస్తారు. మరోవైపు, భయపడిన రోహిణి తల్లి సుగుణకు ఫోన్ చేసి బాలు-మీనాలతో సంబంధం తెంచుకోవాలని ఆదేశిస్తుంది. క్లైమాక్స్‌లో రోహిణి రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుని ఫ్రెండ్ విద్యతో కలిసి మెటర్నిటీ హాస్పిటల్‌కు వెళ్లడం కీలకంగా మారింది. అదే హాస్పిటల్‌కు మీనా రావడంతో రోహిణి మరోసారి దొరికిపోయే ప్రమాదంలో పడింది. సుమతి ఆమెను చూసి మీనాకు ఫోన్ చేయడంతో, ఇక ముందు ఎపిసోడ్‌ల్లో పెద్ద ట్విస్ట్ ఖాయమని ఈ ఎపిసోడ్ స్పష్టం చేసింది.
రోహిణి మాస్టర్ ప్లాన్..
గురువారం ఎపిసోడ్ ప్రారంభంలో రోహిణి తన స్నేహితురాలిని కలుసుకుని ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ వివరంగా చెబుతుంది. బాలు, మీనా చింటూని దత్తత తీసుకోవాలని భావిస్తున్నారని, కానీ తన అత్తయ్య మనోజ్ ఇందుకు ఒప్పుకోవడం లేదని చెప్పింది. రోహిణి ఫ్రెండ్ మాత్రం ఇది చాలా మంచి నిర్ణయమని, చింటూ భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని సూచిస్తుంది. అయితే రోహిణి మాత్రం తాను బతికుండగా చింటూ దత్తతకు ఒప్పుకోనని స్పష్టంగా చెబుతుంది. ముందుగా తానే పిల్లలను కనాలని, తొందరగా కన్సీవ్ అయితే మనోజ్‌ను ఒప్పించి చింటూని ఇంటికి తీసుకురావాలని తన ప్లాన్‌ను వెల్లడిస్తుంది. రోహిణి మాటలతో అసంతృప్తి చెందిన ఫ్రెండ్ అక్కడినుంచి వెళ్లిపోతుంది.
మీనా ఇంట్లో శుభవార్త
ఇక మరోవైపు మీనాకు ఆమె చెల్లి సుమతి ఫోన్ చేస్తుంది. డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి, కాలేజ్ ఫస్ట్ వచ్చానని చెప్పడంతో మీనా ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనవుతుంది. ఈ విషయం తెలియని బాలు, మీనా ఏడుస్తుందని భావించి కారణం అడుగుతాడు. నిజం తెలుసుకున్న తర్వాత బాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు. ' నీకు ఏం కావాలంటే ఈ సంతోషంలో చేసి పెడతాను'అని మాట ఇస్తాడు. కానీ సుమతి మాత్రం ఏమీ వద్దని, అక్క బావ ఇద్దరూ ఇంటికి రావాలని కోరుతుంది.
ప్రభావతి వ్యంగ్య వ్యాఖ్యలు
ఈ శుభవార్తను బాలు తన తండ్రి సత్యానికి చెప్పడంతో ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తాడు. అయితే అక్కడికి వచ్చిన ప్రభావతి మాత్రం వెటకారంగా మాట్లాడి వాతావరణాన్ని చెడగొడుతుంది. 'మామయ్య పెన్షన్ పెరిగిందా?'అంటూ ఎద్దేవా చేయడంతో బాలు ఘాటుగా స్పందిస్తాడు. డబ్బే అన్నింటికీ కారణం కాదని చురక అంటిస్తాడు. సుమతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిందని మీనా చెప్పినా, ప్రభావతి మాత్రం 'అదేమైనా గొప్ప విషయమా? మనోజ్ నాలుగు డిగ్రీలు సంపాదించాడు'అంటూ అవమానకరంగా మాట్లాడుతుంది.
మీనా కన్నీళ్లు - సత్యం మాటలు
ఈ మాటలతో మీనా తన తల్లి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటుంది. తండ్రి లేకున్నా కుటుంబాన్ని నడిపిస్తూ, పిల్లలను చదివించిన తల్లి త్యాగాన్ని వివరించి భావోద్వేగానికి లోనవుతుంది. చివరికి సత్యం జోక్యం చేసుకుని, మీనా తల్లి నిజంగా గర్వపడాల్సిన మహిళ అని, సుమతి సాధన ప్రశంసనీయమని చెబుతాడు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటాన్ని గమనించిన మనోజ్, రోహిణి హాల్లోకి వచ్చి విషయం ఏంటని ప్రశ్నిస్తారు. సుమతి డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయి కాలేజ్ టాపర్‌గా నిలిచిందని చెప్పడంతో రోహిణి ఆనందంగా స్పందిస్తుంది. 'నిజంగా చాలా మంచి శుభవార్త... నా తరఫున శుభాకాంక్షలు చెప్పు'అంటూ సానుకూలంగా మాట్లాడుతుంది. కానీ మనోజ్ మాత్రం 'ఇది అంతా దేవుడి సంకల్పం... ఆయన చేయాలనుకుంటే అదే జరుగుతుంది'అంటూ వింతగా స్పందిస్తాడు. అతడి మాటలకు ప్రభావతి షాక్ అవుతూ... 'ఏంటి వీడి తీరు?' అన్నట్టుగా చూస్తుంది.
శృతి - రవి ఎంట్రీ... ప్రభావతికి గట్టి కౌంటర్
ఇంతలో శృతి, రవి ఇంటికి వచ్చి సుమతికి కంగ్రాట్స్ చెబుతారు. "ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు" అని శృతి అంటుంది. అయితే ప్రభావతి మళ్లీ తన అలవాటు ప్రకారం వెటకారంగా, "డిగ్రీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు... మనోజ్‌కి నాలుగు డిగ్రీలు ఉన్నాయి" అంటుంది. దీంతో శృతి ' అత్తయ్య... మీరు ఎన్ని డిగ్రీలు చదివారు? అసలు మీరు ఏం చదివారు?'అని అడగడంతో ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. అక్కడితో ఆగకుండా బాలు కూడా సెటైర్ వేస్తూ... 'మనసులోంచి వచ్చే మాటలు ఇలాగే ఉంటాయి. మీ తల్లి కొడుకులు ఉన్నారు... ఇంట్లో ఉన్నవన్నీ డైనోసార్లు మింగినట్లు మింగేస్తారు. మంచీ చెడూ తేడా తెలియదు'అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తాడు.
సెలబ్రేషన్ ప్లాన్స్
ఈ ఆనందాన్ని మరింత పంచుకోవాలని రవి ముందుకొచ్చి, 'ఈరోజు బిర్యానీ నేను చేస్తాను... సుమతికి పంపిద్దాం'అంటాడు. శృతి కూడా 'సుమతికి మంచి గిఫ్ట్ ఇస్తాను'అని చెబుతుంది. ఇంతలో మీనా తన తల్లి పార్వతికి ఫోన్ చేసి సుమతి విజయం గురించి చెబుతుంది. తన కష్టానికి ఇది నిజమైన ప్రతిఫలం అని భావోద్వేగంతో మాట్లాడిన పార్వతి, 'ఈ సంతోషంలో గుడికి వెళ్లుదాం... అల్లుడ్ని కూడా తీసుకురా'అని మీనాకు చెబుతుంది. దీంతో మీనా సంతోషంగా ఒప్పుకుంటుంది.
ఆఫీస్‌లో మరో డ్రామా - మనోజ్ ఖర్చుల షాక్
మరోవైపు ఆఫీస్‌లో రోహిణి లెక్కలు చూసే సమయంలో ప్రతి నెలా రూ.30 వేల తేడా కనిపిస్తుంది. కారణం అడిగితే మనోజ్...'టిఫిన్ తీసుకెళ్లడం లేదు... బయటే తింటున్నాను'అంటాడు.నెలకు రూ.30 వేల భోజనానికి ఖర్చు పెడుతున్నానని చెప్పడంతో రోహిణి షాక్ అవుతుంది. దానికి మనోజ్, 'ఇప్పుడు నేను బిజినెస్ మాన్... ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఉండాలి. ఫైవ్ స్టార్ హోటల్‌లో తింటున్నా, తప్పేం?' అంటూ ఓవర్‌గా మాట్లాడతాడు. రోహిణి మాత్రం భవిష్యత్తు గుర్తు చేస్తూ 'ఇలా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడితే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. పైగా బాలుకి నెలకు రూ.50 వేలు ఇవ్వాలి'అంటూ హెచ్చరిస్తుంది. కానీ మనోజ్, 'డబ్బులు సంపాదిస్తాను... టెన్షన్ వద్దు'అంటూ ఆమె మాటలను తేలిగ్గా తీసుకుంటాడు.
క్రెడిట్ కార్డు క్లైమాక్స్
ఇంతలో బ్యాంక్ ఉద్యోగి వచ్చి, రూ.10 లక్షల ట్రాన్సాక్షన్ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు సాంక్షన్ అయిందని చెబుతాడు. దీంతో మనోజ్ తెగ సంబరపడతాడు. కానీ రోహిణి అతడిని పక్కకు తీసుకెళ్లి, 'ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు ఎందుకు? ఈ డబ్బులు అనవసర ఖర్చులకు దారితీస్తాయి' అంటూ హెచ్చరిస్తుంది. అయినా మనోజ్ మాత్రం, 'ఇది కూడా లక్ష్మీదేవి వచ్చినట్లే... బిజినెస్ బాగా జరుగుతుంది'అంటూ క్రెడిట్ కార్డు తీసుకోవడానికే మొగ్గు చూపుతాడు.


Click it and Unblock the Notifications










