Gunde Ninda Gudi Gantalu January 12th Episode: మనోజ్ డేటింగ్ బాగోతం వెలుగులోకి.. రోహిణిపై ప్రభావతికి అనుమానం..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, సస్పెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎపిసోడ్ ప్రారంభంలో మనోజ్‌కు క్రెడిట్ కార్డ్ ఆఫర్ రావడంతో అతడు ఆనందపడుతాడు. దీనిని బిజినెస్ గ్రోత్‌కు ఉపయోగించుకోవచ్చని భావించినా, రోహిణి మాత్రం గత అనుభవాల కారణంగా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అప్పుల భయంతో ఆమె కలవరపడుతుండగా, మనోజ్ మాత్రం అవసరానికి డబ్బు అందుబాటులో ఉంటుందని సమర్థించుకుంటాడు. గోవా ట్రిప్ మాటలతో ఆమెను మెప్పించాలనుకున్నా, రోహిణి ముఖంలో టెన్షన్ తగ్గదు. ఇదే సమయంలో చింటూ నుంచి వచ్చిన ఫోన్ కాల్ రోహిణిని భావోద్వేగానికి గురిచేస్తుంది. 'నీవుంటే చాలు అమ్మా' అన్న మాటలు ఆమె మనసును కదిలిస్తాయి. త్వరలో తన దగ్గరకు తీసుకువస్తానని ధైర్యం చెబుతుంది.
ఇంతలో రోహిణికి గైనకాలజిస్ట్ అపాయింట్‌మెంట్ రావడంతో దివ్య సహాయం కోరుతుంది. మరోవైపు సుమతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడంతో పార్వతి స్వీట్స్ పంచుతూ ఆనందం వ్యక్తం చేస్తుంది. సుమతి మాటల ద్వారా మీనా చదువులు మానేసి కుటుంబం కోసం చేసిన త్యాగం బయటపడటంతో బాలు షాక్ అవుతాడు. హాస్పిటల్‌లో రోహిణి తల్లి కావాలనే తన ప్లాన్‌ను దివ్యకు చెప్పడంతో వాగ్వాదం జరుగుతుంది. ఇదే చోట సుమతి జాబ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి మీనాకు ఫోన్ చేస్తుంది. అయితే హాస్పిటల్‌లో రోహిణిని చూసినట్లు చెప్పడంతో మీనాకు అనుమానం మొదలవుతుంది. ఈ ట్విస్ట్‌తో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగిసింది.

సోమవారం ఎపిసోడ్ ప్రారంభంలో సుమతి తన అక్క మీనాకు ఫోన్ చేసి, తనకు ఉద్యోగం వచ్చిన శుభవార్తను తెలియజేస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ దొరకడంతో సుమతి తెగ సంబరపడుతూ, తన కలలన్నీ నెరవేరినట్లుగా ఆనందం వ్యక్తం చేస్తుంది. అదే సంభాషణలో ఇంటర్వ్యూ సమయంలో హాస్పిటల్‌లో రోహిణిని చూసినట్టు చెప్పడం కథకు కీలక మలుపు అవుతుంది. ఇది విన్న మీనా.. అది మేటర్నిటీ హాస్పిటల్ కావడంతో రోహిణికి ఏదో శుభవార్త ఉండి ఉంటుందేమోనని అపార్థం చేసుకుంటుంది. అదే ఆనందంతో ఇంటికి వెళ్లి స్వీట్స్ తయారు చేస్తుంది. వంటింట్లోకి వచ్చిన బాలు 'ఏంటి స్పెషల్?' అని అడిగినా, మీనా మాత్రం 'శుభవార్త' అంటూ సస్పెన్స్‌లో ఉంచుతుంది. ఇంట్లో అందరూ చేరుకున్నాక స్వీట్లు పంచి 'మన ఇంట్లో శుభవార్త' అని చెప్పడంతో ఉత్కంఠ పెరుగుతుంది.
రోహిణి కూడా ఏంటీ ఆ వార్త అని ఆడుగుతుంది. దీంతో మీనా 'నీకోసమే... నువ్వు తల్లి కాబోతున్నావు కదా'అని అంటుంది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా సంబరాలు. అందరూ రోహిణికి కంగ్రాట్స్ చెబుతారు. ప్రభావతి అయితే మనోజ్ కు నానమ్మ ఆస్తి వస్తుందన్న ఆనందంలో తేలిపోతుంది. కానీ, అసలు విషయం తెలియని రోహిణి షాక్‌కు గురవుతుంది. 'నేను తల్లిని కాబోతున్నానని ఎవరు చెప్పారు?' అని మీనాను నిలదీస్తుంది. సుమతి హాస్పిటల్‌లో చూసిందన్న మాట విన్న వెంటనే రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'హాస్పిటల్‌కు వెళ్లినంత మాత్రాన అలా ఎలా అనుకుంటారు?'అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోసారి తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
దీంతో ప్రభావతి కూడా 'ఒక్క నిమిషంలో నా సంతోషాన్ని పాడు చేశావు'అంటూ మీనాను తిడుతుంది. ఒక్కొక్కరుగా అందరూ వెళ్లిపోవడంతో మీనా అపార్థంలో మిగులుతుంది. తర్వాత బాలు అడిగిన ప్రశ్నకు అసలు నిజం బయటపడుతుంది. మతికి అదే హాస్పిటల్‌లో జాబ్ వచ్చిందని. 'ఇదే అసలు శుభవార్త'అంటూ సత్యం సంతోషపడతాడు. బాలు కూడా 'ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకు' అని మీనాకు హితవు చెబుతాడు.
ఇక రోహిణి తన గదిలోకి వెళ్లి పరిస్థితిని డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తుంది. పిల్లల కోరికపై సెంటిమెంట్‌గా మనోజ్‌తో మాట్లాడుతుంది. తనకు ప్రతిరోజూ పిల్లల కలలు వస్తున్నాయని చెబుతుంది. కానీ మనోజ్ మాత్రం తన బిజినెస్ కలల గురించి అతిగా మాట్లాడడంతో రోహిణికి చిరాకు. మాటల తూటాలు పెరిగి, ఇద్దరం కలిసి హాస్పిటల్‌కు వెళ్లి చెక్‌అప్ చేసుకుందామని రోహిణి చెప్పగానే మనోజ్ చేసిన షాకింగ్ కామెంట్ పరిస్థితిని తీవ్రంగా మార్చేస్తుంది.
అక్కడి నుంచి గర్ల్‌ఫ్రెండ్, లివింగ్ రిలేషన్ వంటి సున్నిత విషయాలు తెరపైకి రావడంతో మాటలు హద్దులు దాటుతాయి. మనోజ్ మాటకు రోహిణి పూర్తిగా ఎమోషనల్ అవుతుంది. చివరకు తన తప్పు గ్రహించిన మనోజ్ క్షమాపణ అడిగినా, మనసు కలతతో బాల్కనీలో ఒంటరిగా కూర్చుంటాడు. ఈ దృశ్యాన్ని గమనించిన ప్రభావతి విషయం తెలుసుకుని, కోపంతో మనోజ్‌ను వెంటబెట్టుకుని రోహిణి దగ్గరకు వెళ్లి ఆలోచించకుండా 'నువ్వు చేసింది తప్పు, క్షమాపణ చెప్పాలి'అంటూ రోహిణిపై ఒత్తిడి తెస్తుంది.
'ఎంత ప్రేమగా చూస్తున్నాడు... అలాంటి వాడిని నువ్వు అనుమానిస్తావా?' అంటూ ప్రభావతి రోహిణిపై విరుచుకుపడుతుంది. నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు మేమెప్పుడైనా నిన్ను అనుమానించామా? నీ మీద నమ్మకం అలా ఉందంటూ గట్టిగా చెప్పి, మనోజ్‌పై నింద వేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, 'వీడు అమాయకుడు... ఎవరైనా చెప్పిన మాట నమ్మే రకం' అంటూ కొడుకును పూర్తిగా క్లీన్ చిట్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది.
అయితే రోహిణి ఈసారి వెనక్కి తగ్గదు. ప్రభావతి నోరు మూయించాలనే ఉద్దేశంతోనే ఆమె మరింత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. 'నేను అడిగినదానిలో తప్పేముంది? వాళ్లిద్దరూ కలిసి లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు కదా... అలాంటప్పుడు ఏ తప్పు జరగలేదని ఎలా నమ్మాలి? మీ అబ్బాయి అమ్మాయిని ముట్టుకోలేదా? ఆ విషయం మనోజ్‌ని చెప్పమనండి. అలా అయితే నేనిప్పుడే క్షమాపణ అడుగుతాను' అంటూ రోహిణి ఇచ్చిన జలక్‌తో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
దీంతో ప్రభావతి మరింత సీరియస్ అవుతుంది. 'నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు. హద్దులు దాటుతున్నావు. క్షమాపణ అడగమంటే ఇంత రాద్ధాంతం ఏంటి?' అంటూ రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రోహిణి కూడా తగ్గకుండా 'జరిగిందే కదా అడుగుతున్నాను. నిజం కాకపోతే ఎందుకు సైలెంట్‌గా ఉంటాడు?' అంటూ తిరిగి ప్రశ్నిస్తుంది. ఈ దశలో ప్రభావతి ఏం చెప్పాలో అర్థం కాక చివరికి 'ఇలాంటి విషయాలు మళ్లీ ప్రస్తావించకు. పిల్లల పేరిట హాస్పిటల్స్ చుట్టూ తిరిగి కుటుంబ పరువు తీయకు'అంటూ హెచ్చరించి వెళ్లిపోతుంది. మనోజ్ కూడా తల్లి వెంట బయటకు వెళ్లిపోతాడు.
ఇక్కడే కథ మరో షాకింగ్ టర్న్ తీసుకుంటుంది. బయటకు వెళ్లిన తర్వాత మనోజ్ తన తల్లితో 'నన్ను తప్పుగా చూపించావు'అంటూ బాధపడతాడు. అయితే ప్రభావతి ఒక్కసారిగా మాట మార్చి 'రోహిణి అడిగిన దాంట్లో తప్పేముంది? నువ్వు చేసిన పని అలానే ఉంది' అంటూ అనడం మనోజ్‌కు షాక్ ఇస్తుంది. 'అమ్మా నువ్వు కూడా పార్టీ మార్చేశావా?' అంటూ అతడు ఆశ్చర్యపోతాడు.
ప్రభావతి మాత్రం ఇంకా లోతుగా ఆలోచిస్తూ 'నీవల్ల ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవలు వస్తూనే ఉంటాయి. అయినా రోహిణికి ఉన్నట్టుండి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది?' అంటూ ఆరా తీస్తుంది. పిల్లల విషయం కారణమని మనోజ్ చెప్పినా, ప్రభావతి మాత్రం కొత్త అనుమానం వ్యక్తం చేస్తుంది. 'పెళ్లికి ముందు రోహిణి జీవితం ఏంటో మనకు తెలియదు'అంటూ ఆమె చెప్పిన మాటలు కథను పూర్తిగా డేంజర్ జోన్‌లోకి తీసుకెళ్తాయి. దీంతో రోహిణి ఫ్యూచర్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్‌లో మరో పెద్ద ట్విస్ట్. మీనా తన పుట్టింటికి వెళ్లడం, అక్కడ తమ్ముడు శివ పుట్టినరోజు సందర్భంగా బాలుని పిలవకూడదన్న నిర్ణయం కుటుంబంలో కొత్త కలహాలకు దారి తీస్తుంది. 'బావ వస్తే నేను పుట్టినరోజు చేసుకోను'అన్న శివ మాటలు మీనాను తీవ్రంగా బాధిస్తాయి. ఈ విషయం బాలుతో చెప్పాలని చూస్తే, బాలు 'ఇకపై నీ పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం లేదు'అంటూ షాకింగ్ కామెంట్ చేస్తాడు. దీంతో మీనా గందరగోళంలో పడిపోతుంది. రాబోయే ఎపిసోడ్‌ల్లో రోహిణి- మనోజ్ బంధం ఏ దిశగా వెళ్లబోతోంది? ప్రభావతి అనుమానాలు ఎంతవరకు పెరుగుతాయి? మీనా కుటుంబంలో కొత్త చీలికలు వస్తాయా? అన్నది ఉత్కంఠంగా మారింది.


Click it and Unblock the Notifications











