Gunde Ninda Gudi Gantalu January 14th Episode: శివ రౌడీయిజం.. గుణకు బాలు వార్నింగ్.. మీనా సంసారంలో చిచ్చు..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో కథ ఒక్కసారిగా ఉద్రిక్తతలతో మలుపు తిరిగింది. ఎపిసోడ్ ప్రారంభంలో ప్రభావతి, మనోజ్‌ను పక్కకు తీసుకెళ్లి పర్సనల్‌గా మాట్లాడుతుంది. రోహిణి గతం గురించి తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పి, పెళ్లికి ముందు ఆమె జీవితం మనకు పూర్తిగా తెలియదని, ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మడం మంచిది కాదని హెచ్చరిస్తుంది. రోహిణి గతం ఏంటో తెలుసుకోవాలని సూచించినప్పటికీ, మనోజ్ మాత్రం ఆమె మాటలను పెద్దగా పట్టించుకోడు. రోహిణి నిజాయితీగా అన్నీ చెప్పిందని, ఆమె చాలా మంచిదని సమర్థిస్తాడు. అయితే ప్రభావతి మాత్రం లోకం తీరు తెలుసుకుని, విచక్షణతో ఆలోచించాలని గట్టిగా చెప్పడంతో మనోజ్ మనసులో సందేహాలు మొదలవుతాయి.
ఇక మరోవైపు బాలు దాబాపై కూర్చుని ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, రూమ్ నిర్మాణం కోసం డబ్బులు లెక్కపెడుతూ ఒత్తిడిలో కనిపిస్తాడు. మీనా అతడి దగ్గరకు వచ్చి ప్రేమగా దగ్గరవ్వాలని ప్రయత్నించినా, మొదట బాలు పట్టించుకోడు. చివరికి మీనా తన చీర కొంగుతో అతడిని టెంప్ట్ చేయడంతో బాలు మనసు మారుతుంది. పిల్లలు కావాలన్న మీనా కోరికను బాలు అప్పుల కారణంగా తిరస్కరించినా, ఇద్దరూ చివరికి రొమాన్స్‌లో మునిగిపోతారు. మరుసటి రోజు మనోజ్ ఖరీదైన గిఫ్టులతో ఇంటికి వచ్చి రోహిణి, ప్రభావతిని సర్ప్రైజ్ చేస్తాడు.

అయితే అతడి అహంకార ప్రవర్తన, బాలు-సత్యల పట్ల అవమానకర మాటలు ఇంట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తాయి. గదిలోకి వెళ్లాక క్రెడిట్ కార్డు మీదే ఈ ఖర్చులన్నీ చేశానని మనోజ్ చెప్పడంతో రోహిణి లోపల ఆందోళనకు గురవుతుంది. చివరికి గోవా ట్రిప్ సర్ప్రైజ్‌తో ఎపిసోడ్ ముగియగా, రాబోయే రోజుల్లో మరిన్ని సమస్యలు తప్పవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
బుధవారం ఎపిసోడ్ ప్రారంభంలో గుణ తన అనుచరుడు శివతో కలిసి ఓ వ్యక్తి ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ వ్యక్తి లేకపోయినా అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగుతారు. వెంటనే ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. అతడు బాలు కారులోనే అక్కడికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఆ గందరగోళంలో బాధితుడు తన బ్యాగ్‌ను కారులో మర్చిపోతాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని బయట నుంచే గమనించిన బాలు, అసలు టైమ్‌లో హీరో ఎంట్రీ ఇచ్చి గుణ, శివలను నిలదీస్తాడు. "ఇంకా మీ బుద్ధి మారలేదా?" అంటూ గట్టి క్లాస్ పీకుతాడు. భాదిత కుటుంబానికి అండగా నిలబడి, పోలీసులకు ఫోన్ చేయమని బాధితుడికి సలహా ఇస్తాడు. గుణ మాత్రం 'క్యాజువల్‌గా వచ్చాను' అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.
అయితే బాలు చాటుగా తీసిన వీడియో చూపించి షాక్ ఇస్తాడు.'ఇదొక్కటే నిన్ను కటకటాల్లో పెట్టడానికి చాలు' అంటూ మాస్ వార్నింగ్ ఇస్తూ, మరోసారి ఇలాంటి వేషాలు వేస్తే శాల్తీలు లేచిపోతాయని హెచ్చరిస్తాడు.అంతేకాదు, శివ చేత నెలవారీ వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లిస్తామని లెటర్ రాయించి, గుణతో సంతకం పెట్టించి బాధితుడికి అండగా నిలుస్తాడు. ఈ సీన్‌లో బాలు క్యారెక్టర్‌కు వచ్చిన మాస్ ఎలివేషన్‌కు హైలెట్ గా మారింది.
శృతి సర్ప్రైజ్.. సరోగసీపై కీలక నిర్ణయం
ఇదిలా ఉండగా, మీనా చెల్లెలు సుమతికి జాబ్ రావడంతో శృతి హాస్పిటల్‌కు వెళ్లి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది. బయటకు పిలిచి వాచ్ గిఫ్ట్ ఇవ్వడంతో సుమతి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆ తర్వాత శృతి తన మనసులోని అనుమానాలను క్లియర్ చేసుకునేందుకు పేషెంట్ల అనుభవాల గురించి అడుగుతుంది. ఈ సంభాషణలో శృతి "పిల్లలు కావాలి కానీ నేను కనను" అంటూ సంచలన వ్యాఖ్య చేస్తుంది. తాను సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను కనాలని భావిస్తున్నానని వెల్లడించి, ఆ విధానం గురించి వివరాలు తెలుసుకొని చెప్పమని సుమతిని కోరుతుంది. శృతి తీసుకున్న ఈ నిర్ణయం కథలో కొత్త మలుపు తీసుకొచ్చి, రాబోయే ఎపిసోడ్లపై ఆసక్తిని పెంచింది.
మీనాకు పుట్టింటి మధ్య విభేదాలు
ఇక మరోవైపు.. మీనా తన తమ్ముడు శివ పుట్టినరోజు సందర్భంగా పుట్టింటికి వెళ్లాలని భావిస్తుంది. అయితే అంతకుముందే పార్వతి, శివ మధ్య బాలు-మీనా అంశంపై చర్చ జరుగుతుంది. "బాలు బావను పిలవను... మీనాను మాత్రమే పిలుస్తాను" అంటూ శివ మొండి వైఖరి ప్రదర్శిస్తాడు. అదే విషయాన్ని పార్వతి మీనాకు చెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. "అల్లుడు లేకుండా పండుగ ఎలా చేస్తారు? ఆయన లేకుండా నేను రావడం నాకు ఇష్టం లేదు" అంటూ మీనా ఆవేశంతో పుట్టింటి నుంచి తిరిగి వస్తుంది.
బాలు మాటలతో మీనా అయోమయం
ఇంటికి వచ్చిన మీనా, బాలు తో మాట్లాడుతూ "ఈరోజు శివ పుట్టినరోజు... వాడికి శుభాకాంక్షలు చెప్పండి" అని కోరుతుంది. అయితే బాలు మాత్రం గుణతో తిరుగుతున్న శివపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గుణకు దూరంగా ఉంటేనే.. వాడు మంచి దారిలోకి వస్తేనే జీవితం బాగుపడుతుంది" అని అంటాడు.ఇంతలో మీనా "నాతో అసలు ఏం జరిగింది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు?" అని ప్రశ్నిస్తుంది. బాలు మాత్రం జరిగిన అసలు విషయాన్ని చెప్పకుండా, గుణ-శివ తనకు నచ్చరని, తనకు విలువ లేని చోటకు వెళ్లడం కూడా ఇష్టం లేదని, ఇకపై మీ పుట్టింటికి వెళ్లవద్దని స్పష్టంగా చెబుతాడు. దీంతో మీనా ఏం చేయాలో తెలియక అయోమయంలో పడుతుంది.
గుడిలో రచ్చ.. ప్రభావతి కొత్త కుట్ర
రాబోయే ఎపిసోడ్‌లో పార్వతి తన పిల్లలతో కలిసి దేవుడికి నైవేద్యం పెట్టేందుకు గుడికి వెళ్తుంది. మీనా కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ సమయంలో మీనా గుడికి వెళ్లాలా వద్దా అనే సందిగ్ధంలో ఉంటుంది. అప్పుడు శృతి వచ్చి, "అనవసరంగా మీ పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకు... జరిగే కార్యక్రమంలో నువ్వూ ఉండాలి" అని సలహా ఇస్తుంది. దాంతో మీనా గుడికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి, మీనా సంసారంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో బాలు దగ్గర లేనిపోని మాటలు చెబుతుంది.
దీంతో కోపంగా బాలు గుడికి చేరుకుంటాడు. అక్కడ మీనా తన తండ్రి కుటుంబంతో కలిసి కనిపించడంతో పరిస్థితి మరింత చేదుగా మారుతుంది. "మొగుడికి గౌరవం లేని చోటికి రావద్దని చెప్పాను... అయినా ఇలా రావడం నాకు నచ్చలేదు. నా పరువు తీసేశావు" అంటూ బాలు కఠినంగా మాట్లాడుతాడు. రాబోయే ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications










