Gunde Ninda Gudi Gantalu January 15th Episode: మీనా సంసారంలో ప్రభావతి చిచ్చు.. ఆగ్రహంతో రెచ్చిపోయిన బాలు..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ ఆరంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. గుణ తన అనుచరుడు శివతో కలిసి ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి, అతడు ఇంట్లో లేని సమయంలో అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగుతాడు. ఆ మహిళ వెంటనే తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. బాలు అదే సమయంలో కారులో అక్కడికి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఈ హడావుడిలో బాధితుడు తన బ్యాగ్‌ను కారులో మర్చిపోతాడు. మొత్తం వ్యవహారాన్ని బయట నుంచే గమనించిన బాలు, సరైన సమయంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి గుణ- శివలను నిలదీస్తాడు. 'ఇంకా మీ బుద్ధి మారలేదా?' అంటూ గట్టి క్లాస్ పీకుతూ, పోలీసులకు ఫోన్ చేయమని బాధితుడికి సూచిస్తాడు.
గుణ మాత్రం 'క్యాజువల్‌గా వచ్చాను' అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలు చాటుగా తీసిన వీడియోను చూపించి షాక్ ఇస్తూ, ఇదే నిన్ను జైలుకు పంపడానికి చాలని మాస్ వార్నింగ్ ఇస్తాడు. అంతేకాదు, శివ చేత నెలవారీ వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లిస్తామని లేఖ రాయించి, గుణతో సంతకం పెట్టించి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఈ సీన్‌లో బాలు క్యారెక్టర్‌కు వచ్చిన మాస్ ఎలివేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మరోవైపు శృతి, మీనా చెల్లెలు సుమతికి జాబ్ రావడంతో హాస్పిటల్‌కు వెళ్లి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది. అదే సమయంలో 'పిల్లలు కావాలి కానీ నేను కనను'అంటూ సరోగసీపై కీలక నిర్ణయాన్ని వెల్లడిస్తుంది. ఈ మాటలతో కథలో కొత్త మలుపు ఏర్పడుతుంది. అదే సమయంలో మీనా పుట్టింటి విషయంలో ఉద్రిక్తత నెలకొంటుంది. శివ మొండి వైఖరి, బాలు స్పష్టమైన మాటలతో మీనా అయోమయంలో పడుతుంది.

Courtesy: Jio hotstar
గురువారం ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠ, భావోద్వేగాలతో నిండిపోయింది. శివ పుట్టినరోజు సందర్భంగా దేవుడికి మొక్కు తీర్చుకోవాలని భావించిన పార్వతి, మీనాకు ఫోన్ చేసి గుడికి రావాలని కోరుతుంది. అయితే మీనా తీవ్ర అయోమయంలో పడుతుంది. గుడికి వెళ్తే బాలు మాట దాటినట్లవుతుందేమో అనే భయం ఒకవైపు, వెళ్లకపోతే పుట్టింటి వాళ్లు బాధపడతారేమో అన్న ఆందోళన మరోవైపు ఆమెను కలవరపెడుతుంది. ఇదే సమయంలో శృతి మీనా దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతుంది. అప్పుడు మీనా తన మనసులోని బాధను బయటపెడుతుంది. "ఈరోజు శివ పుట్టినరోజు. పుట్టింట్లో పూజ చేస్తున్నారు. కానీ బాలు వెళ్లడం ఇష్టం లేదు. పెళ్లయ్యాక పుట్టింటి వాళ్లను మన జీవితంలో నుంచి తీసేయాలా?" అంటూ వేదనతో ప్రశ్నిస్తుంది. తానేం చేయాలో అర్థం కావడం లేదని, పూర్తిగా అయోమయంలో ఉన్నానని చెబుతుంది.
దీంతో శృతి గట్టిగా స్పందిస్తుంది. "నీ పుట్టింట్లో జరిగే ఫంక్షన్‌కు వెళ్లొద్దని చెప్పే హక్కు ఎవరికీ లేదు. నువ్వు తప్పు చేయడం లేదు కాబట్టి నీకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. అతనికి ఇష్టం లేకపోతే అతను రావద్దని చెప్పు, కానీ నిన్ను ఆపే అధికారం అతనికి లేదు" అంటూ మీనాను ధైర్యపరుస్తుంది. అయినా మీనా "నేను ఆయన మాట కాదని వెళ్లలేకపోతున్నా" అంటూ వెనకడుగు వేస్తుంది. చివరికి "నీ ఇష్టం... పుట్టింటి వాళ్లను బాధపెట్టాలనుకుంటే ఉండిపో, లేదంటే వెళ్ళు" అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ సంభాషణలన్నింటినీ అత్త ప్రభావతి గూడచాటుగా వింటుంది. ఎలాగైనా బాలు-మీనా మధ్య గొడవ పెట్టాలనే కొత్త కుట్రను ఆమె మనసులో పెట్టుకుంటుంది. చివరికి మీనా ధైర్యం చేసి గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది.
అక్కడ శివ "అక్క రాలేదు" అంటూ ఎమోషనల్‌గా గొడవ చేస్తుండగా, మీనా ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసి శివ ఆనందంతో కరిగిపోతాడు. "నిండు నూరేళ్లు చల్లగా ఉండు... నా తమ్ముడని గర్వంగా చెప్పుకునే రోజు రావాలి" అంటూ మీనా భావోద్వేగంగా ఆశీర్వదిస్తుంది. అయితే మీనా ముఖంలో ఆందోళన గమనించిన పార్వతి అసలు విషయం అడుగుతుంది. బాలుకు చెప్పకుండా వచ్చానని మీనా చెప్పడంతో, ఇంట్లో ఉద్రిక్తత నెలకొంటుంది. అయినా "ఇప్పుడు జరుగుతున్న పూజను ఆపొద్దు" అంటూ మీనా పరిస్థితిని కంట్రోల్ చేస్తుంది.
ఇక బాలు ఇంటికి వచ్చి రాగానే ప్రభావతి తన అసలు రూపాన్ని బయటపెట్టింది. బాలు "మీన... మీనా..." అంటూ పిలవగానే, ఆమె వెంటనే చిచ్చు పెట్టే మాటలు మొదలుపెట్టింది. "నీ పెళ్లాం పుట్టింట్లో ఫంక్షన్ జరుగుతుంటే గుడికి వెళ్లింది" అంటూ విషయాన్ని అతిగా మలిచింది. బాలు నమ్మకపోయినా, మీనాకు ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయకపోవడం ప్రభావతికి ఆయుధంగా మారింది. "ఇప్పుడు నీ అవసరం ఏముంటుంది? తమ్ముడి పుట్టినరోజు సంబరాలే ముఖ్యం కదా" అంటూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
అయినా బాలు మొదట్లో మీనా బయట పూలు ఇవ్వడానికి వెళ్లి ఉండొచ్చని నమ్ముతాడు. కానీ ప్రభావతి "పెళ్లాం మీద అతి ప్రేమ ఉంటే చాడీలు కనిపించవు" అంటూ విషం చిమ్ముతుంది. చివరికి "నీ పెళ్లాం పువ్వులు ఇవ్వడానికి కాదు... నీ చెవిలో పువ్వులు పెట్టడానికి గుడికి వెళ్లింది" అంటూ హద్దులు దాటడంతో బాలు కోపంతో రగిలిపోతాడు. ముందూ వెనుక ఆలోచించకుండా గుడికి వెళ్లిపోతాడు.
అక్కడ మీనా లోపలే లోపల భయపడుతూ ఉంటుంది. బాలు విషయం తెలిసితే ఎలా రియాక్ట్ అవుతాడోనని ఆందోళన చెందుతుంది. ప్రసాదం పంచుతూ ఉండగానే బాలు ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేస్తాడు. "నేనే బాలు... పెళ్లాన్ని అతిగా నమ్మిన పిచ్చోడిని" అంటూ కఠినంగా మాట్లాడతాడు. "భర్తకంటే తమ్ముడే ముఖ్యం... పనిపాట లేని తమ్ముడిపై ఉన్న ప్రేమ భర్తపై లేకపోవడం నాకు స్పష్టమైంది" అంటూ మీనాను తీవ్రంగా గాయపరుస్తాడు. మీనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, వెటకారంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక గుడి నుంచి ఇంటికి చేరుకున్న మీనా, పరిస్థితి చక్కబడుతుందనే ఆశతో అత్త ప్రభావతికి ప్రసాదం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. దేవుడి ప్రసాదం అయినా మనసు కరిగిస్తుందేమో అనుకుంటుంది. కానీ ప్రభావతి మాత్రం ఏ మాత్రం ఆగకుండా తన విషపూరితమైన మాటలతో మీనాను గాయపరుస్తుంది. "నీ ఇంటి నుంచి వచ్చినదేదైనా నాకు విషంతో సమానం. నువ్వు దేవుడికి పెట్టావా, అందులో ఏం కలిపావో నాకు తెలియదు. మీ పుట్టింటి నుంచి వచ్చినదాన్ని నేను ముట్టుకోను, తినను, తాగను" అంటూ ఘాటుగా మాట్లాడుతుంది. ఈ మాటలు మీనా మనసును పూర్తిగా చీల్చేస్తాయి.
అంతటితో ఆగని ప్రభావతి, అసలు కుట్రను కూడా బహిరంగంగా ఒప్పుకుంటుంది. "బాలు గుడికి రావడానికి కారణం నేనే. మీ సంసారంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను" అంటూ నిర్ఘాతంగా చెప్పేస్తుంది. ఇంకా ముందుకెళ్లి, "నువ్వు ఇంట్లో ఉండి వెళ్లిపోయే వరకూ నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వాడుకుంటా. రోజులు లెక్కపెట్టుకో... ఈ ఇంటి నుంచి నువ్వు త్వరలోనే వెళ్లిపోతావు" అంటూ తన క్రూరత్వాన్ని పూర్తిగా బయటపెడుతుంది. ఈ మాటలు మీనాను పూర్తిగా స్థంభింపజేస్తాయి. అత్తగా కాకుండా శత్రువులా ప్రవర్తిస్తున్న ప్రభావతి వైఖరి కథలో కొత్త మలుపును తీసుకొస్తుంది.
ఇదిలా ఉండగా, మరోవైపు బాలు పూర్తిగా మద్యం మత్తులో ఇంటికి చేరుకుంటాడు. నిలబడలేని స్థితిలో కింద పడిపోతుంటే, మీనా అతడిని పట్టుకుని ఆదుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ బాలు ఆ క్షణంలోనే "నన్ను ముట్టుకోకు" అంటూ గట్టిగా అరుస్తాడు. భర్త నుంచి వచ్చిన ఈ మాటలు మీనాకు తీవ్ర మానసిక దెబ్బతీస్తాయి. తనను ఆదరించాల్సిన వ్యక్తే దూరం పెడుతున్నాడనే వేదన ఆమెను లోపల నుంచే కుదిపేస్తుంది.
అత్త కుట్రలు, భర్త అనుమానాలు, అవమానాల మధ్య మీనా పూర్తిగా ఒంటరిగా మారినట్టు కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్‌లో ప్రభావతి అసలు ఉద్దేశం బయటపడటంతో పాటు, బాలు-మీనా మధ్య బంధం మరింత ప్రమాదంలో పడింది. రాబోయే ఎపిసోడ్లలో మీనా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుంది? బాలు నిజాన్ని తెలుసుకుంటాడా? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.


Click it and Unblock the Notifications











