Gunde Ninda Gudi Gantalu January 16th Episode: తాగుడికి బానిసగా బాలు.. ప్రభావతి నిజస్వరూపం.. పార్వతి క్షమాపణ
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను ఉత్కంఠతో పాటు తీవ్ర భావోద్వేగాల్లోకి నెట్టేసింది. శివ పుట్టినరోజు సందర్భంగా దేవుడికి మొక్కు తీర్చాలనే ఉద్దేశంతో పార్వతి, మీనాకు గుడికి రావాలని ఫోన్ చేయడంతో కథ కీలక మలుపు తిరిగింది. ఒకవైపు భర్త బాలు మాట దాటినట్లవుతుందేమో అన్న భయం, మరోవైపు పుట్టింటి వాళ్లను బాధపెట్టకూడదన్న ఆందోళనతో మీనా తీవ్ర అయోమయంలో పడుతుంది. ఈ సందర్భంలో శృతి మీనాకు ధైర్యం చెప్పి, పుట్టింటి ఫంక్షన్‌కు వెళ్లడం తప్పు కాదని స్పష్టంగా చెబుతుంది. అయినా భర్తను కాదనలేని మీనా చివరకు ధైర్యం చేసి గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. గుడిలో శివ భావోద్వేగంతో స్పందించగా, మీనా ఆశీర్వచనాలతో ఆ క్షణాన్ని మరింత హృదయాన్ని తాకేలా చేస్తుంది. అయితే బాలుకు చెప్పకుండా వచ్చిన విషయం బయటపడటంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంటుంది.
ఇదిలా ఉండగా, ఇంట్లో ప్రభావతి తన అసలు కుట్రను అమలు చేస్తుంది. మీనా గుడికి వెళ్లిందని బాలు మనసులో అనుమానాలు నాటుతూ, పరిస్థితిని అతిగా మలిచింది. ఫోన్ లిఫ్ట్ కాకపోవడం ఆమెకు ఆయుధంగా మారింది. చివరికి కోపంతో బాలు గుడికి వెళ్లి, అందరి ముందు మీనాను అవమానించేలా మాట్లాడటం కథను తీవ్రంగా మలుపుతిప్పింది. ఇంటికి వచ్చిన మీనాను ప్రభావతి మరింతగా గాయపరుస్తుంది. ప్రసాదాన్ని కూడా తిరస్కరించి, సంసారంలో చిచ్చు పెట్టినట్లు బహిరంగంగా ఒప్పుకోవడం సంచలనం సృష్టించింది. మరోవైపు మద్యం మత్తులో ఉన్న బాలు 'నన్ను ముట్టుకోకు' అని మీనాను తోసిపుచ్చడం ఆమెను పూర్తిగా ఒంటరిగా మిగిల్చింది. ఈ ఎపిసోడ్‌తో బాలు-మీనా బంధం ప్రమాదంలో పడగా, ప్రభావతి క్రూరత్వం కథను కొత్త దిశలో నడిపిస్తోంది.

శుక్రవారం ప్రసారమైన తాజా ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాల తుఫానులోకి నెట్టింది. కథ మొత్తం బాలు- మీనా మధ్య జరిగిన ఘర్షణ చుట్టూనే తిరుగుతుంది. బాలు ఫుల్లుగా తాగేసి ఇంటికి వచ్చిన తీరుతో మీనా ఆందోళన చెందుతుంది. 'మందు తాగి వచ్చారా?'అని జాగ్రత్తగా అడిగిన మీనా మాటలు, బాలు కోపానికి నిప్పు పోసినట్లయ్యాయి. భర్త గౌరవాన్ని పుట్టింట్లో వదిలేసినవాళ్లూ భార్యలేనా అంటూ బాలు చేసిన అవమానకర వ్యాఖ్యలు చేస్తాడు.
తాను ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని మీనా ఎంత రిక్వెస్ట్ చేసినా, బాలు మాత్రం వినడానికి సిద్ధపడలేదు. 'నాకు అర్థం చేసుకునే అంత గొప్ప మనసు లేదు' అంటూ మీనాను మరింత బాధపెట్టాడు. అంతేకాదు, 'నీ మెడలో మంగళసూత్రం కట్టిన మొగుణ్ణి మాత్రమే నేనే'అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇంట్లో వాళ్లంతా నిద్రపోతున్నారని, దయచేసి అరవద్దని మీనా వేడుకున్నా, 'నాకు బాధ చెప్పుకునే అవకాశం కూడా లేదా?'అంటూ బాలు వెటకారంగా స్పందించాడు. గతంలో ఎప్పుడైనా మీ మాట జవదాటానా అని మీనా ప్రశ్నించగా, తన అమ్మ మాటను ఎందుకు వినలేదో అర్థం చేసుకోవాలని బాలు తిరిగి ప్రశ్నించాడు. దీంతో మీనా భావోద్వేగం పరాకాష్టకు చేరింది. 'నువ్వు దాటి వెళ్లింది ఈ గడపను కాదు... నా గుండెను' అంటూ బాలు షాకింగ్ కామెంట్స్ చేస్తాడు. గుడికి వెళ్లినప్పుడు మీనా ముఖంలో బాధ కనిపించలేదని, పైగా సంతోషంగా ప్రసాదాలు పంచిందని ఆరోపిస్తూ, ఆమెపై నిందలు గుప్పించాడు. దీంతో మీనా తన తప్పు ఒప్పుకుంటూ, తమ్ముడిపై ప్రేమతోనే అలా జరిగిందని, తప్పుగా అర్థం చేసుకోకండని క్షమాపణ కోరింది.
కానీ బాలు మాత్రం 'ప్రేమ అంతా నీ తమ్ముడి మీదేనా? నాపై లేదా?'అంటూ ఆమెను మరింత అవమానించాడు. బాలు అంతటితో ఆగకుండా.. 'ఇన్ని రోజులు నీ మాట గౌరవించి తాగకుండా ఉన్నాను. ఈ రోజు నుంచి ప్రతిరోజూ తాగి ఇంటికి వస్తాను' అంటూ బాలు ప్రకటించడంతో, మీనా మనసు పూర్తిగా విరిగిపోయింది. ఆ ఉద్రిక్తత ఇంకా తగ్గకముందే, ప్రభావతి రంగప్రవేశం చేయడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. బాలు, మీనా మధ్య జరుగుతున్న గొడవను ప్రభావతి కళ్లారా చూసి, తన వెటకారపు మాటలతో మీనాను మరింత గాయపరిచింది.
'నీ కళ్లైనా చల్లబడ్డాయా?" అంటూ ప్రభావతిని మీనా ప్రశ్నించగా, ఆమె సమాధానం మరింత క్రూరంగా మారింది. 'ఈ గొడవ ఇంత చప్పగా ఉంటుందని ఊహించలేదు. వాడు ఇల్లు పీకి పందిరి వేస్తాడనుకున్నా... కానీ అప్పుడే నిద్రపోయాడు. అయినా సరే, ఇప్పటికైనా వాడి అసలు రూపం నీకు అర్థమైంది కదా?' అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. ఇన్ని రోజులు తాగకుండా, భార్యతో గొడవ పడకుండా ఉన్నాడని తాను ఎంతో బాధపడ్డానని, ఇప్పుడు మళ్లీ అదే మొదలుపెట్టాడని, అది కూడా మీనా వల్లేనని చెప్పుతూ... 'నాకు సంతోషంగా ఉంది' అంటూ ప్రభావతి వెటకారం చేసింది.
దీంతో మీనా ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకుని, 'కొడుకు తాగి వస్తే మందలించే తల్లులను చూశాను... కానీ మీరు మాత్రం తెగ సంతోషపడుతున్నారు' అని నిలదీసింది. అయితే ప్రభావతి మరింత దారుణంగా స్పందిస్తూ, 'ఇలాంటి మాటలు నాకు వినిపించవు. నాకు వినిపించేది ఒక్కటే... నీ ఏడుపు. ఇక రాత్రి మొత్తం ఏడుస్తూనే ఉండు' అంటూ తన క్రూరమైన మనస్తత్వాన్ని బయటపెట్టింది.
ఇక మరుసటి రోజు ఉదయం... బాలు ప్రవర్తనలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతో మీనా ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కారు తాళాలను దాచిపెడుతుంది. ఆ విషయం తెలియని బాలు, తాళాల కోసం ఇల్లు మొత్తం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో వంటగదిలోకి వెళ్లగా, మీనా "కాఫీ కావాలా?" అని అడుగుతుంది. కానీ బాలు మాత్రం మొండి పట్టుదలతో, 'నీ చేత్తో ఇచ్చేది ఏదీ తాగను' అంటూ కఠినంగా మాట్లాడతాడు. దీంతో మీనా మళ్లీ బాధకు లోనవుతుంది.
బాలు ప్రవర్తనలో మార్పు గమనించిన తండ్రి సత్యం, "ఏమైందిరా?" అని అడుగుతాడు. కారు కీస్ కనిపించడం లేదని బాలు చెప్పగా, "రాత్రి తాగి వచ్చావా?" అని సత్యం ప్రశ్నిస్తాడు. బాలు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోతాడు. అయితే ప్రభావతి మాత్రం నేరుగా, "తాగి వచ్చాడు... ఇంట్లో రచ్చ చేశాడు" అంటూ నిజాన్ని బయటపెడుతుంది. దీంతో ఆగ్రహానికి గురైన సత్యం, 'నువ్వు అందరి ముందు తలెత్తుకుని జీవించాలి అని కోరుకున్నాను. కానీ ఇలా తలదించుకుని ఉండకూడదు' అంటూ బాలును హెచ్చరిస్తాడు. తండ్రి మాటలతో బాలు పూర్తిగా సైలెంట్ అయిపోతాడు.
ఇంతలో మీనా కారు తాళాలను తీసుకొచ్చి టేబుల్‌పై పెడుతుంది. తాళాలు తీసుకున్న బాలు మళ్లీ వంటగదిలోకి వెళ్లి, నేరుగా కాఫీ కావాలని ఆదేశిస్తాడు. అయితే ఈసారి మీనా కూడా కొంచెం బెట్టు చూపిస్తుంది. 'మొగునికి గౌరవం లేని చోట నేను ఉండదు'అంటూ బాలు ఇన్‌డైరెక్ట్‌గా మీనా పై అసహనం వ్యక్తం చేస్తాడు. ఈ మాటలతో మీనా మరోసారి కన్నీళ్ల పర్యంతం అవుతుంది. ఒకవైపు భర్త అవమానాలు, మరోవైపు అత్త వెటకారాలు... మధ్యలో మీనా పడుతున్న వేదన ప్రేక్షకుల హృదయాలను తాకేలా చేసింది.
ఇంట్లో జరిగిన తీవ్ర గొడవ తర్వాత బాలు కారు స్టాండ్‌కు వెళ్లి ఒంటరిగా కూర్చొని, తన జీవితంలో జరిగిన పరిణామాల గురించి ఆలోచిస్తూ కనిపించాడు. మీనా మాటలు, ప్రభావతి వెటకారం, తండ్రి హెచ్చరికలు అన్నీ అతని మనసులో తిరుగుతుండగా, అక్కడికి అనూహ్యంగా మీనా తల్లి పార్వతి, చెల్లి సుమతి వచ్చారు. వచ్చిన వెంటనే పార్వతి బాలు వద్దకు వెళ్లి, వినయంగా క్షమాపణ చెబుతూ అసలు నిజాన్ని బయటపెట్టింది. 'కేవలం నా ఒత్తిడి వల్లనే మీనా గుడికి వచ్చింది. అందులో మీనా తప్పు ఏమీ లేదు' అంటూ మరోసారి క్షమించమని వేడుకుంది.
అయితే బాలు మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. 'నేను పుట్టింటికి వెళ్లినందుకు బాధపడటం లేదు'అంటూ తన బాధ అంతా శివపై మీనా చూపిస్తున్న అతి ప్రేమ గురించేనని, 'వాడు దేశముదురు లాంటి రౌడీలతో సావాసం చేస్తున్నాడు. అదే నా అసలు ఆందోళన. నా బాధ ముందు వాడి భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచించండి' అంటూ పార్వతిని ఉద్దేశించి ఘాటుగా మాట్లాడాడు. అనవసరంగా మా కుటుంబం గురించి కాకుండా, సమస్యను సరిగా అర్థం చేసుకోవాలని చెప్పి, అక్కడి నుంచి బాలు వెళ్లిపోతాడు.
బాలు మాటలతో పార్వతి పూర్తిగా కుంగిపోతుంది. తన కూతురు మీనా సంసారం ఏమవుతుందోనన్న భయం ఆమెను కలచివేస్తుంది. 'అసలు ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో' అంటూ లోలోపల ఆందోళన చెందుతుంది. ఒక తల్లి గా కూతురి భవిష్యత్తు గురించి పడుతున్న ఆవేదన ఈ సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు... మీనా తన మనసులోని బాధను దాచుకోలేక తన స్నేహితుల వద్దకు వెళ్లి, బాలు ప్రవర్తన గురించి వివరంగా చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. భర్త మాటలు, అవమానాలు, తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న భావన ఆమెను పూర్తిగా విరిచేస్తుంది. మీనా బాధ విన్న స్నేహితులు ఆమెకు కొంత ధైర్యం చెబుతారు.
'అనవసరంగా గొడవను ఇంకా పెద్దది చేయొద్దు' అంటూ స్నేహితులు సలహా ఇస్తారు. ఈ పరిస్థితిలో బాలు మనసు మారేలా చేయాలంటే, ముందుగా నువ్వే అడుగు వేసి క్షమాపణ చెప్పాలని సూచిస్తారు. అంతేకాదు, బాలు ఇష్టపడేలా ఒక మంచి వంటకం చేసి, అతని మనసును కరిగించే ప్రయత్నం చేయమని మీనాకు సలహా ఇస్తారు. ఈ సంఘటనల తర్వాత కథ ఎటు మలుపు తిరుగుతుందో, బాలు మారుతాడా లేదా అన్న ఉత్కంఠతో వచ్చే ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.


Click it and Unblock the Notifications











