Gunde Ninda Gudi Gantalu January 19th Episode: బాలు పశ్చాత్తాపం.. రోహిణి రెండో ప్రెగ్నెన్సీ ట్విస్ట్..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు శుక్రవారం ఎపిసోడ్ పూర్తిగా భావోద్వేగాలు, అపార్థాలు, ఘర్షణలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ఆరంభంలోనే మీనా-బాలు మధ్య తీవ్ర స్థాయి గొడవ ప్రేక్షకులను కట్టిపడేసింది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన బాలు, తన మాట వినకుండా గుడికి వెళ్లిందని మీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే శివపై ప్రేమతోనే గుడికి వెళ్లానని, తండ్రి లేని పిల్లాడిని వదిలేయలేనని మీనా చెప్పడంతో బాలు మరింత రెచ్చిపోతాడు. "అంటే నాపై ప్రేమ లేదా?" అంటూ మీనా మాటలను తప్పుగా అర్థం చేసుకుని, తనను తక్కువగా చూస్తోందన్న అనుమానంతో మాటలు మితిమీరుతాయి.
ఈ గొడవను చూసిన ప్రభావతి మాత్రం లోపల సంతోషపడుతూ, మీరు ఇలా గొడవపడుతుంటేనే తనకు ఆనందమని వ్యంగ్యంగా చెప్పడం పరిస్థితిని మరింత విషమంగా మారుస్తుంది. మరుసటి రోజు ఉదయం బాలు మీనా ఇచ్చిన కాఫీని తిరస్కరించడంతో మీనా కారు తాళాలు దాచిపెట్టి అతడికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఈ వ్యవహారం సత్యం వరకు చేరడంతో బాలు తాగుడిపై హెచ్చరికలు వస్తాయి.కిచెన్‌లో మరోసారి జరిగిన గొడవలో మీనా తొలిసారి ధైర్యంగా ఎదురు తిరిగి, పెళ్లయితే ఆడపిల్ల పుట్టింటిని మర్చిపోవాలా అని ప్రశ్నిస్తుంది. ఈ మాటలు బాలు మనసును కలిచివేయగా, చివరికి పార్వతి క్షమాపణ చెప్పినా "నాకు ట్రిప్ ఉంది" అంటూ బాలు వెళ్లిపోవడం ఎపిసోడ్‌కు భావోద్వేగ ముగింపునిచ్చింది.

సోమవారం ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనా తన స్నేహితులను కలిసి ఇంట్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధను పంచుకుంటుంది. భర్త బాలు మాటలు, అతని కోపం, తన మనసుకు తాకిన అవమానాలు అన్నీ చెప్పుకుంటూ కంటతడి పెడుతుంది. ఈ సమయంలో మీనా ఫ్రెండ్స్ ఆమెకు సలహాలు ఇస్తారు. ఒక స్నేహితురాలు 'బాలు లాంటి భర్త దొరకడం అదృష్టం. నీకోసం పూలకొట్టు పెట్టించాడు, నిన్ను సమాజంలో గౌరవంగా నిలబెట్టాడు. అతని మాట కాదంటే కోపం రావడం సహజం కదా... అనవసరంగా గొడవలు పెంచుకోకుండా మాట్లాడి పరిష్కరించుకో' అంటూ హితవు చెబుతుంది. ఈ మాటలు మీనాను కాస్త ఆలోచింపజేస్తాయి.
ఇంకొక స్నేహితురాలు మాత్రం 'మగవారికి కావాల్సింది రెండే రెండు... ఒకటి కంచం, మరొకటి మంచం' అంటూ సలహా ఇస్తుంది. ఇది విని మీనా ఆశ్చర్యపోతుంది. 'ఏంటి అలా అంటున్నావు?'అని అడిగితే, 'గొడవ సమయంలో భర్తను మన దారిలోకి తెచ్చుకోవాలంటే అతనికి ఇష్టమైన వంటకం ముందు పెట్టాలి'అని చెప్పుతుంది. అప్పుడే మీనా, 'బాలుకి చికెన్ అంటే చాలా ఇష్టం. నేను చికెన్ చేస్తే ఇష్టంగా తింటాడు' అని చెబుతుంది. దీనికి ఫ్రెండ్స్ 'ఇంకేం కావాలి... పెళ్లి జీవితం అంటే అదే. ఆ పనిలో ఉండు'అంటూ నవ్వుతూ ధైర్యం చెబుతారు మీనా మనసులో భర్తతో సర్దుకుపోవాలనే ఆలోచన నాటినట్లుగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా పార్వతి నుంచి మీనాకు ఫోన్ వస్తుంది. తాను బాలు ను కలిసిన విషయాన్ని, శివ మీద అతడు ఇంకా కోపంగా ఉన్నాడని చెబుతుంది. ఇది విని మీనా మరింత బాధపడుతుంది. తన వల్లే బాలు ఇలా మానసికంగా కలత చెందుతున్నాడేమో అన్న భావన ఆమెను లోలోపల కుదిపేస్తుంది.
మరోవైపు బాలు ఒక ట్రిప్ లో ఉంటాడు. అక్కడ ఓ మహిళ తన భర్తతో గొడవపడి, చావు-బతుకుల్లో ఉన్న అన్నను చూడడానికి వెళ్తున్న సందర్భంలో బాలుతో ఆమెకు సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో ఆమె మాట్లాడిన మాటలు బాలు గుండెను తాకుతాయి. ముఖ్యంగా 'పెళ్లయిన ఆడవాళ్లు పుట్టింటిని మర్చిపోవాలా?' అన్న ప్రశ్న అతన్ని లోతైన ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. మీనా పరిస్థితి, ఆమె మనసు, తాను ఆమెకు ఇచ్చిన బాధ అన్నీ గుర్తుకొస్తాయి. ఆ ఆలోచనలతోనే బాలు తన ఫ్రెండ్ రాజేష్ దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెబుతాడు. రాజేష్ కూడా స్పష్టంగా 'మీనా లాంటి అమ్మాయి భార్యగా రావడం నీ అదృష్టం. అనవసరంగా గొడవను పెద్దది చేయకుండా వెళ్లి మాట్లాడి సర్దుకుపో' అంటూ క్లాస్ పీకుతాడు. మొదట రాజేష్ మాటలపై బాలు కోపం చూపించినా, తర్వాత మాత్రం ఆలోచనలో పడతాడు.
చివరికి తన మాటలు, తన ప్రవర్తనే మీనా మనసుకు గాయం చేశాయని అర్థమవుతుంది. మీనా విషయంలో తాను తప్పు చేశానని బాలు లోలోపల పశ్చాత్తాపడుతాడు.
ఎపిసోడ్‌లో కీలక మలుపు మనోజ్ షోరూంలో చోటు చేసుకుంటుంది. స్కూల్ కాన్వాసింగ్‌లో భాగంగా కొంతమంది షోరూంకు వచ్చి, తమ ప్రాంతంలో కొత్తగా స్కూల్ ప్రారంభించామని, పిల్లలు ఉంటే అడ్మిషన్లు చేయించాలంటూ ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా రోహిణి ఆసక్తిగా అడ్మిషన్ వివరాలు అడిగి తెలుసుకుంటుంది. ఆమె ప్రశ్నలు చాలా క్లియర్‌గా ఉండటంతో "ఎవరి కోసం అడ్మిషన్?" అని వారు అడగగా... రోహిణి ఒక్కసారిగా 'నా కొడుకు కోసం' అని చెప్పడం మనోజ్‌ను షాక్‌కు గురి చేస్తుంది.
'కొడుకా? ఎవరి కొడుకు?' అంటూ మనోజ్ నిలదీయడంతో క్షణకాలం రోహిణి దొరికిపోయినట్లే అనిపిస్తుంది. కానీ వెంటనే తెలివిగా మాట మార్చి, అది తన క్లయింట్ కొడుకు కోసం అడిగిన వివరాలని కవరింగ్ ఇస్తుంది. అక్కడితో ఆగకుండా టాపిక్ పూర్తిగా డైవర్ట్ చేయడానికి, 'ఈ షాప్ మా ఆయనదే... పెద్ద బిజినెస్ మాగ్నెట్' అంటూ మనోజ్‌ను గొప్పగా పరిచయం చేస్తుంది. దీంతో మనోజ్ కూడా ఆ మాటలకు ఫ్లాట్ అయి, తన గొప్పలు తానే చెప్పుకోవడం మొదలుపెడతాడు. కాన్వాసింగ్ టీమ్ వెళ్లిపోయిన తర్వాత కూడా రోహిణి టాపిక్ మార్చేస్తూ, 'గోవా ట్రిప్‌కు వెళ్దాం' అంటూ మనోజ్‌ను తన మాటల మాయలో పడేస్తుంది. చివరకు మనోజ్ అంతా మర్చిపోయి గోవా ట్రిప్ ఊహల్లో తేలిపోతాడు.
మరోవైపు మీనా, బాలు కోసం అతనికి ఇష్టమైన విధంగా చికెన్ వండుతుంది. వంట గదిలోంచి వచ్చే గుమగుమలతో ఇంట్లో అందరూ ఆకర్షితులవుతారు. ముఖ్యంగా శృతి మీనా చేసిన చికెన్‌కు ఫిదా అయిపోతుంది. వండుతూనే టేస్ట్ చేసి, "అద్భుతంగా ఉంది" అని మెచ్చుకుంటుంది. రవి కూడా టేస్ట్ చేసి, 'నాకంటే చాలా బాగా చేశారు వదినా' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. అయితే ఎప్పటిలాగే ప్రభావతి మాత్రం మీనాను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంది.
ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ ఆమెను విసిగిస్తుంది. ఈ సమయంలో శృతి ప్రభావతిపై వేసే చురుకులు ఎపిసోడ్‌కు కామెడీ హైలైట్‌గా నిలుస్తాయి. ఇంతలో మనోజ్-రోహిణి ఇంటికి చేరుకుంటారు. మనోజ్ అయితే 'ఎప్పుడే పెడితే, అప్పుడే తినేద్దాం?'అన్నట్టుగా ప్రవర్తిస్తూ అందరినీ నవ్విస్తాడు. భోజనం సమయంలో అందరూ చికెన్ చాలా బాగుందని మెచ్చుకుంటే, ప్రభావతి మాత్రం ఉప్పు ఎక్కువైందని వంక పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి సత్యం 'నీ వంకర బుద్ధి మరోసారి చూపించావు కదా' అంటూ ప్రభావతిపై అసహనం వ్యక్తం చేయడం మరో కీలక సీన్‌గా నిలుస్తుంది.
ఇక అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో అసలు ట్విస్ట్ బయటపడుతుంది. రోహిణి తన రెండో ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ ఆమెను చూసిన మీనా, సుమతి షాక్ అవుతారు. అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి సుమతి రిసెప్షన్ వద్ద అడగగా, 'రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తోంది, అందుకే రెగ్యులర్‌గా డాక్టర్లను కన్సల్ట్ అవుతోంది'అని చెబుతారు. ఈ మాటలు విన్న మీనా, సుమతి ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. వెంటనే మీనా ఈ విషయాన్ని బాలు దగ్గరికి వెళ్లి చెబుతుంది. దాంతో బాలు 'రెండో ప్రెగ్నెన్సీ అంటే... పెళ్లి కాకముందే గర్భవతి అయిందా?' అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు. మీనా కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేయడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.
మొత్తం మీద... సోమవారం ఎపిసోడ్‌లో రోహిణి మాటల మాయ, మనోజ్ అమాయకత్వం, మీనా ప్రయత్నాలు, ప్రభావతి కుటిలత్వం, చివర్లో రెండో ప్రెగ్నెన్సీ ట్విస్ట్ అన్నీ కలసి ఎపిసోడ్‌ను రసవత్తరంగా మార్చాయి. రాబోయే ఎపిసోడ్లలో రోహిణి రహస్యాలు ఎలా బయటపడతాయన్న ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











