Gunde Ninda Gudi Gantalu January 20th Episode: బాలు,మీనా గొడవకు పుల్ స్టాప్..రోహిణి బాగోతం బయటపడిందిగా?
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ భావోద్వేగాలు, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే మీనా తన స్నేహితులను కలిసి ఇంట్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. భర్త బాలు మాటలు, అతని కోపం తన మనసును ఎంతగా గాయపరిచాయో చెబుతూ కంటతడి పెడుతుంది. ఈ సమయంలో స్నేహితులు ఆమెకు ధైర్యం చెబుతారు. బాలు లాంటి భర్త దొరకడం అదృష్టమని, గొడవలు పెంచుకోకుండా మాట్లాడి సర్దుకుపోవాలని సలహా ఇస్తారు. మరో స్నేహితురాలు భర్తను మన దారిలోకి తెచ్చుకోవాలంటే అతనికి ఇష్టమైన వంటకం చేయాలని చెప్పడంతో, బాలుకి చికెన్ ఇష్టమని మీనా గుర్తు చేస్తుంది. దీంతో భర్తతో సర్దుకుపోవాలనే ఆలోచన మీనా మనసులో బలపడుతుంది.
అదే సమయంలో పార్వతి నుంచి వచ్చిన ఫోన్ కాల్ మీనాను మరింత కలచివేస్తుంది. బాలు ఇంకా శివపై కోపంగా ఉన్నాడని తెలిసి, తన వల్లే అతడు ఇలా ఉన్నాడేమోనని బాధపడుతుంది. మరోవైపు ట్రిప్‌లో ఉన్న బాలు, ఓ మహిళ మాటల ద్వారా లోతైన ఆలోచనల్లో పడతాడు. పెళ్లయిన మహిళ పుట్టింటిని మర్చిపోవాలా అన్న ప్రశ్న అతని మనసును తాకుతుంది. రాజేష్ మాటలతో తన తప్పు గ్రహించిన బాలు, మీనా విషయంలో పశ్చాత్తాపపడతాడు. ఇక మనోజ్ షోరూంలో రోహిణి 'నా కొడుకు' అంటూ అనుకోకుండా మాట జారవిడవడంతో ఉత్కంఠ ఏర్పడుతుంది. వెంటనే తెలివిగా మాట మార్చి మనోజ్‌ను మాయ చేస్తుంది. చివరగా మీనా చేసిన చికెన్ ఇంట్లో అందరి ప్రశంసలు అందుకుంటే, ప్రభావతి వంకలు పెట్టడం, శృతి చురుకులు, సత్యం మాటలు ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

Courtesy: jiohotstar
మంగళవారం ఎపిసోడ్ ప్రారంభంలో మీనా చేసిన చికెన్ ఇంట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వాసనకే అందరూ టేబుల్ చుట్టూ చేరి, లొట్టలు వేసుకుంటూ తింటూ వంటను తెగ మెచ్చుకుంటారు. మీనా వంటకి వచ్చిన ప్రశంసలతో ఇంట్లో వాతావరణం కాసేపు ఆనందంగా మారుతుంది. అయితే ఎప్పటిలాగే ప్రభావతి మాత్రం వంకలు పెట్టకుండా ఉండలేకపోతుంది. ఉప్పు ఎక్కువైందని, టేస్ట్ లేదని విమర్శలు చేస్తుంది. ఇదే సమయంలో శృతి, సత్యం ఇద్దరూ చురకలు వేస్తూ పరిస్థితిని మరింత సరదాగా మార్చుతారు. ముఖ్యంగా శృతి 'అత్తయ్య మీకు బీపీ ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి' అంటూ సెటైర్ వేయడంతో ఇంట్లో నవ్వులు చిందుతాయి.
దానికి ప్రభావతి కూడా తగ్గకుండా.. తనకు ఏమీ బీపీ లేదని చెబుతూ, విడిగా తింటే కాస్త ఉప్పు ఎక్కువగా ఉందని, దోసెలతో తింటే బాగుందని సమర్థించుకుంటుంది. ఇలా తిట్టుకుంటూనే కడుపునిండా తినేస్తుంది. ఈ క్రమంలో రవి వదిన మీనా వంటను మరింత పొగడ్తలతో ముంచెత్తుతూ, తాను రెస్టారెంట్ పెడితే ఈ చికెన్‌ను కచ్చితంగా స్పెషల్ ఐటెంగా పెడతానని చెబుతాడు. రవి మాటలకు మీనా కూడా సరదాగా స్పందిస్తూ, అతడు రెస్టారెంట్ పెడితే మూడు పూటలా తానే వండి పెడతానని అంటుంది. ఈ మాటలు ప్రభావతికి మంట పుట్టిస్తాయి. 'మాకు గడ్డి పెడతావా' అంటూ వెటకారంగా మాట్లాడితే, సత్యం వెంటనే 'మేమున్నాం లే, టెన్షన్ పడకు'అంటూ కౌంటర్ ఇస్తాడు.
ఇక సత్యం కావాలనే ప్రభావతి ఈర్ష్య పడేలా, మీనా వంటను అచ్చంగా తన అమ్మ వంటలాగే ఉంటుందని చెప్పడంతో ప్రభావతి మరింత అసహనం వ్యక్తం చేస్తూ, ఈ మొగోళ్లకైనా అమ్మలను పొగడటం అలవాటేనని మండిపడుతుంది. అయినా ఆ మాటల మధ్యే చికెన్ గిన్నె మొత్తం ఖాళీ అవుతుంది. ఈ సమయంలో మనోజ్‌కు ఇంకా చికెన్ కావాలని అనిపిస్తుంది. గిన్నె ఖాళీ అయిందని తెలిసి రవి ఒక్కసారిగా ఫీలవుతూ, అన్నయ్య, వదిన గురించి ఆలోచించకుండా తానే ఎక్కువగా తిన్నానని బాధపడతాడు. వెంటనే తర్వాత అన్నయ్య కోసం ఏమైనా పెట్టారా అని అడుగుతాడు. దానికి మీనా ఎంతో ప్రశాంతంగా, మీరు తృప్తిగా తిన్నారే అదే చాలని సమాధానం చెప్పడంతో సీన్ భావోద్వేగంగా ముగుస్తుంది.
ఇక బాలు మీనా కోసం స్వీట్ తీసుకుని ఇంటికి వస్తాడు. మరోవైపు మీనా కూడా బాలు ఎప్పుడు వస్తాడా? అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంట్లోకి అడుగుపెట్టే ముందు బాలు తనలో తానే ఆలోచనలో పడతాడు. నిన్న రాత్రి జరిగిన గొడవ గుర్తొచ్చి, సారీ చెప్పడానికి వచ్చానే కానీ ఇంత మొహమాటం ఎందుకని తన మనసుతోనే ప్రశ్నించుకుంటాడు. అదే సమయంలో మీనా కూడా బాలునే ముందుగా పిలవాలా వద్దా అని అయోమయంలో పడుతుంది. చివరకు 'ఏదైతే అది అవుతుంది, తినడానికి అయితే నేనే పిలుస్తాను' అని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకేసారి ఒకరినొకరు పిలుచుకుంటారు. ఈ చిన్న సంఘటనే గత రాత్రి జరిగిన గొడవకు మొదటి బ్రేక్‌లా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న దూరం కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది.
బాలు దగ్గరకు వచ్చి మీనాకు స్వీట్ ఇస్తాడు. అదే సమయంలో ప్రభావతి అక్కడికి వచ్చి, వీరి మాటలను దొంగచాటుగా వింటూ ఉంటుంది. ఈ సందర్భంలో బాలు, 'అమ్మ చెప్పిన మాటలు విని నిన్ను అపార్థం చేసుకున్నాను'అంటూ మీనాకు క్షమాపణ చెబుతాడు. అంతేకాదు, ఆ గయ్యాలి గంగావతి తమ కాపురంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించిందని అసలు నిజాన్ని బయటపెడతాడు. ఈ మాటలు విన్న ప్రభావతి లోలోపల మండిపడుతుంది. 'వీళ్లిద్దరూ తమలో తామే మాట్లాడుకోకుండా నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు?'అని అనుకుంటూ కుళ్లుకుంటుంది. ఇదే సమయంలో మీనా బాలు కోసం స్పెషల్‌గా వండిన చికెన్ తీసుకొచ్చి టేబుల్‌పై పెడుతుంది. ఇది చూసిన బాలు మరింత ఇంప్రెస్ అవుతాడు.
ఇంతలో రవి అక్కడికి వచ్చి, "సారీ అన్నయ్య... వదిన నీకోసం స్పెషల్‌గా చికెన్ చేసింది. కానీ ఆ టేస్ట్ అంత అమోఘం... చూస్తూ చూస్తూనే గిన్నె మొత్తం ఖాళీ చేశాం. మీకోసం చికెన్ లేదు" అని చెప్పడంతో బాలు షాక్ అవుతాడు. వెంటనే "అయితే ఈ చికెన్ ఎక్కడిది?" అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మీనా ట్విస్ట్ ఇస్తూ, "ఇది మీకోసం ముందే తీసి పెట్టాను" అని చెబుతుంది. అందరూ తృప్తిగా తింటారని ముందే తెలుసుకొని తానే ప్రత్యేకంగా బాలు కోసం చికెన్ దాచిపెట్టానని మీనా చెప్పడంతో ప్రభావతి మరింత కుళ్లుకుంటుంది. ఇక బాలు 'మరి నువ్వు తినలేదా?' అని అడిగితే, 'నేను మధ్యాహ్నం ఉన్న కర్రీతో తిన్నాను. అయినా నాకు చికెన్ ఇష్టం లేదు' అంటూ మీనా సమాధానం ఇస్తుంది.
చివరగా బాలు తాను తీసుకొచ్చిన స్వీట్‌ను మీనాకు తినిపిస్తాడు. మీనా కూడా అదే స్వీట్‌ను బాలుకి తినిపిస్తుంది. ఈ మధురమైన క్షణంతో ఇద్దరి మధ్య ఉన్న గొడవకు ఫుల్‌స్టాప్ పడుతుంది. అయితే మరోవైపు ప్రభావతి మాత్రం తన ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిందని బాధపడుతూ, అసహనంతో మిగులుతుంది.
ఇక మరుసటి రోజు మీనా తన స్నేహితులను కలవడానికి వెళ్లి, ఇంట్లో జరిగిన తాజా పరిణామాలన్నింటినీ వివరంగా చెబుతుంది. బాలు తనతో ఎలా మాట్లాడాడో, ఎలా క్షమాపణ చెప్పాడో చెప్పగానే స్నేహితులు ఎంతో సంతోషపడతారు. ఎంతైనా బాలు గ్రేట్ అని, బాలు లాంటి భర్త దొరకడం మీనా అదృష్టమని, అలాగే మీనా లాంటి భార్య దొరకడం బాలు అదృష్టమని సరదాగా పొగడ్తలు కురిపిస్తారు. అంతేకాదు, మీరిద్దరూ ఇంటికి వెళ్లాక తప్పకుండా దిష్టి తీసుకోండని పంచులు వేస్తారు.
ఇదే సమయంలో మీనాకు సుమతి నుంచి ఫోన్ వస్తుంది. హాస్పిటల్‌కు వెంటనే రమ్మని చెప్పడంతో మీనా ఒక్కసారిగా కంగారుపడుతుంది. ఏమైనా జరిగిందా అని అడిగితే, ఏమీ లేదని చెబుతూ వచ్చేటప్పుడు ఒక మూర మల్లెపూలు తీసుకురమ్మని మాత్రమే అంటుంది. దీంతో మీనా హడావిడిగా తన చెల్లెలు పనిచేసే హాస్పిటల్‌కు బయలుదేరుతుంది. అక్కడికి వెళ్లిన తర్వాత సుమతి అసలు విషయం చెబుతుంది. రోజూ పూజ కోసం పూలు తెచ్చేందుకు ఈ ఆర్డర్ చెప్పడానికి ఫోన్ చేశానని వివరిస్తుంది.
అదే సమయంలో రోహిణి కూడా అదే హాస్పిటల్‌కు రావడం మీనా,సుమతిల దృష్టిని ఆకర్షిస్తుంది. రోహిణి డాక్టర్లను కన్సల్ట్ అవుతూ ఉండటాన్ని గమనించిన వారు, ఆమె రెండో ప్రెగ్నెన్సీ విషయమై వైద్యులను కలుస్తున్నట్లు అర్థం చేసుకుంటారు. రోహిణి ఎందుకు హాస్పిటల్‌కు వచ్చింది అనే అనుమానం ఇద్దరిలో మొదలవుతుంది. మీనా మాత్రం 'మనకెందుకులే'అన్నట్లుగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నిస్తుంది. కానీ సుమతి మాత్రం దీనిపై అనుమానంతో, రోహిణి ఎందుకు ఇంత రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు వస్తుందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
సుమతి రిసెప్షన్ వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోగా, షాకింగ్ నిజం బయటపడుతుంది. రోహిణి రెండో ప్రెగ్నెన్సీ కోసం డాక్టర్ కన్సల్టేషన్‌కు వస్తోందని అక్కడి సిబ్బంది చెబుతారు. ఈ విషయాన్ని సుమతి వెంటనే మీనాకు తెలియజేస్తుంది. ఇది విన్న మీనా ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. రెండో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అసలు రోహిణికి పెళ్లి కాకముందే బిడ్డ పుట్టిందా? అనే అనుమానాలు ఆమె మనసులో మెదలుతాయి. అయితే ఈ విషయం బయటికి పొక్కితే పెద్ద సమస్య అవుతుందని భావించిన మీనా, ఎవరికీ చెప్పవద్దని సుమతితో మాట తీసుకుంటుంది.
ఇక ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మీనా తీవ్ర ఆలోచనలో పడుతుంది. అదే ఆలోచనలతో ఇంటికి బయలుదేరిన ఆమె బైక్‌పై వెళ్తుంది. ఒక సందర్భంలో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంటుంది. ఆలోచనలోనే ఇల్లు దాటి ముందుకు వెళ్లిపోతుండగా బాలు గమనించి గట్టిగా అరుస్తాడు. దీంతో మీనా కంగారుగా తిరిగి బాలువద్దకు వస్తుంది. అసలేం మాట్లాడుతుందో అర్థం కాకుండా అయోమయంగా ప్రవర్తిస్తుంది. ఇంతలోనే బాలుకు ఒక ఎమర్జెన్సీ ట్రిప్ అని ఫోన్ వస్తుంది, వెంటనే హాస్పిటల్‌కు రావాలని ఫోన్ కాల్ వస్తుంది. ఆ సమయంలో కూడా మీనా పూర్తిగా గందరగోళంలో ఉండటం బాలును మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఆమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని బాలు గమనిస్తాడు.
ఇక అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో ఈ అనుమానాలు మరింత ముదురుతాయి. మీనా ను బాలు నిలదీయడంతో అసలు విషయం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో బాలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తాడని, ఈ విషయాన్ని తన తండ్రికి, రవికి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సత్యం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని ప్రభావతిని నిలదీయనున్నట్లు సమాచారం. ఇలా మొత్తానికి రోహిణి భాగవతం బయటపడినట్లేనా అనే ఉత్కంఠ నెలకొంటోంది. అయితే ఇది నిజంగానే జరిగిందా, లేక మీనా-బాలు కలిసి రోహిణి విషయాన్ని ఇంట్లో చెప్పారా అనే విషయం ఇంకా సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ రోహిణి భాగోతం పూర్తిగా బయటపడితే ఆమె జీవితం రోడ్డుపాలయ్యే పరిస్థితి వస్తుందా? లేక మీనాను తప్పుపట్టేందుకు మరో అవకాశం కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications










