Gunde Ninda Gudi Gantalu January 23th Episode: రోహిణి కొత్త డ్రామా.. మీనాపై ప్రభావతి నింద.. రంగంలోకి బాలు..
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు గురువారం ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, అనుమానాలు, షాకింగ్ సంభాషణలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే ఊర్లో పిల్లలు పుడుతుంటే తమ ఇంట్లో మాత్రం పిల్లల మాటే లేదంటూ ప్రభావతి వ్యక్తం చేసిన నిరాశ ఇంటి వాతావరణాన్ని ఉద్విగ్నంగా మార్చింది. దీనికి సత్యం, రవి స్పందిస్తూ ప్రతి ఒక్కరి జీవితం ఒకే టైమ్‌లైన్‌లో జరగదని, బాలు చేసిన పుణ్యం వృథా కాదని ధైర్యం చెప్పినా, ప్రభావతి మాత్రం ఇంట్లో పెద్దవాడు మనోజ్ కాబట్టి ముందుగా అతడికే పిల్లలు పుట్టాలని, ఆస్తి వారసత్వం కూడా అతని పిల్లలకే చెందాలని పట్టుబడింది. ఆమె మాటలతో బాలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడు.మరోవైపు రోహిణి గతం బయటపడితే ఏమవుతుందోనన్న భయంతో మీనా ఆందోళన చెందుతుంది.
శృతి ఫోన్‌లో మాట్లాడుతున్న సీరియల్ కథలో పెళ్లికాకముందే తల్లి అయ్యే క్యారెక్టర్ ప్రస్తావన మీనాకు షాక్ ఇచ్చి, ఆమె చేతిలోని గిన్నె జారిపడేలా చేస్తుంది. చివరకు మీనా తన అనుమానాన్ని శృతికి చెప్పడంతో విషయం రవికి, అక్కడి నుంచి బాలుకు చేరుతుంది. రోహిణికి పెళ్లికి ముందే పిల్లాడు ఉన్నాడన్న అనుమానం బాలు మనసును కుదిపేస్తుంది. ఈ రహస్యాన్ని దాచుకోలేక బాలు నేరుగా తండ్రి సత్యం వద్దకు వెళ్లి నిజం చెబుతాడు. మొదట సత్యం ఆగ్రహించినా, బాలు మాటల్లోని నిజాయితీని గ్రహించి లోతైన ఆలోచనలో పడతాడు. ఇది నిజమా? లేక అపార్థమా? ప్రభావతికి ఇప్పటికే ఈ విషయం తెలిసి ఉందా? అన్న ప్రశ్నలతో కథ మరింత ఉత్కంఠను పెంచింది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఈ రహస్యమే కీలక మలుపుగా మారనుంది.

Photo Courtesy: jiohotstar
శుక్రవారం ఎపిసోడ్ పూర్తిగా ఉత్కంఠతో నిండిపోయింది. రోహిణి విషయం సత్యానికి తెలియడంతో కథ ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. ప్రభావతిని నేరుగా ప్రశ్నించిన సత్యం, 'కోడలు గర్భం దాల్చడం సంతోషమే కానీ... అది రెండోసారి అయితే ఆలోచించాల్సిందే. నిజం చెప్పు ప్రభావతి, నీకు ఇది ముందే తెలుసు కదా?' అంటూ గట్టిగానే నిలదీశాడు. ఈ ప్రశ్నలతో ప్రభావతి షాక్‌కు గురైంది. అయినా తేరుకుని, ఇది ఎవరో కావాలని కల్పించిన కథ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ సత్యం వెనక్కి తగ్గలేదు. 'రోహిణి మీద నీకు ప్రత్యేక అభిమానం ఉంది. ఈ విషయాన్ని కూడా దాచివుంటావేమో'అంటూ ప్రభావతిపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ప్రభావతి ఒక్కసారిగా నిర్ఘాంతపోయి, తనపై అనుమానమా అంటూ తిరిగి ప్రశ్నించింది. తన క్యారెక్టర్‌ను నిరూపించుకోవాలనే ఆవేశంతో ప్రభావతి మనోజ్ గదికి వెళ్లి రోహిణిని గట్టిగా నిలదీసింది. దీంతో రోహిణి గుండెల్లో గుబులు మొదలైంది.
కిందికి వచ్చేసరికి కుటుంబ సభ్యులంతా హాల్లో ఉండటం చూసి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 'ఎవరు నువ్వు? నీ గతమేంటి?'అంటూ ప్రభావతి ప్రశ్నల వర్షం కురిపించింది. శాంతించమని సత్యం చెప్పినా, ప్రభావతి వినలేదు. 'ఈ ఇంటికే కళంకం తెస్తావని అనుకోలేదు. ఈరోజు నిజం బయటకు రావాలి'అంటూ తీవ్రంగా మండిపడింది. రోహిణి పరిస్థితిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా, ప్రభావతి కోపం తగ్గలేదు. మనోజ్ అడ్డుపడితే, అతడినీ హెచ్చరిస్తూ మరింత రాద్ధాంతం చేసింది.
'నువ్వు ఎప్పుడు బిడ్డను కన్నావు? ఎవరి వల్ల గర్భం వచ్చింది? నీ తల్లిదండ్రులు ఎక్కడ? ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు?'అంటూ వరుస ప్రశ్నలతో రోహిణిని ఉక్కిరిబిక్కిరి చేసింది. 'నీ బిడ్డ విషయం వారికి తెలుసా? అందుకే నిన్ను దూరం పెట్టారా? నాలాగా నిన్ను కూడా నిలదీసి బయటకి నెట్టేశారా?'అంటూ ప్రభావతి చేసిన ఆరోపణలు ఇంటి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి.
'ఏరి కోరి నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను. అందరికంటే ఎక్కువ విలువ ఇచ్చాను. కానీ నీ బతుకే రహస్యాల పుట్టలా ఉంది'అంటూ ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేయడంతో, రోహిణి ఒక్క మాట కూడా మాట్లాడలేక సైలెంట్ అయింది. ఏం చెప్పాలో అర్థం కాక కంగారుపడుతూ తల వంచుకుంది. ఈ మౌనం ప్రభావతిని మరింత రెచ్చగొట్టింది. అందరి ముందు ఇలా ప్రశ్నించడం ఏంటి అని రోహిణి అడిగినా, 'ఇది అందరి ముందు తెలుసుకోవాల్సిన విషయమే'అంటూ ప్రభావతి తేల్చి చెప్పింది. 'నువ్వు హాస్పిటల్‌కి వెళ్లావా లేదా?'అన్న ప్రశ్నకు రోహిణి 'వెళ్లాను' అని సమాధానం చెప్పడంతో పరిస్థితి మరింత ముదిరింది. 'అంటే రెండోసారి బిడ్డను కనడానికి చెకప్ చేయించుకున్నావా?' అంటూ ప్రభావతి ఘాటుగా ప్రశ్నిస్తుంది.
ఈ క్రమంలో సత్యం జోక్యం చేసుకుని, 'ఇలాంటి విషయాలు కోడలితో వ్యక్తిగతంగా మాట్లాడాలి. నలుగురిలో ఇలా మాట్లాడటం సరికాదు'అంటూ ప్రభావతికి హితవు చెప్పాడు. కానీ ప్రభావతి మాత్రం తగ్గలేదు. 'నా కుటుంబంలో, నా వంశంలో ఎలాంటి మచ్చ ఉండకూడదు. ఈ నిజం బయటపడాలి' అంటూ మరోసారి రోహిణిని గట్టిగా నిలదీసింది. ఇక తప్పదన్నట్టుగా రోహిణి కొత్త నాటకం మొదలుపెట్టింది. సోఫాలో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఏం చెప్పి తప్పించుకోవాలి, ఎలా తనను తాను కాపాడుకోవాలి అని మదిలో పలు ఆలోచనలు చేస్తుంది. ఈ ఏడుపు చూసిన మనోజ్ కూడా రోహిణిపై అనుమానం వ్యక్తం చేయడం కథను మరింత మలుపు తిప్పింది.
'నా గతం బయటపడబోతోందా? చింటూ గురించి చెప్పాలా? నా మొదటి పెళ్లి విషయం బయటపెట్టాలా?'అంటూ రోహిణి లోలోపల తల్లడిల్లుతుంది. నిజం చెబితే ప్రభావతి ఎలా స్పందిస్తుందో అన్న భయంతో ఆమె మనసు గందరగోళంలో పడుతుంది. ప్రశ్నల వర్షంలో ఉక్కిరిబిక్కిరైన రోహిణి, ఇక ఏదైతే ఏది అవుతుందని ధైర్యం చేసి సంచలన ప్రకటన చేసింది. 'అవును... మీరు అన్నట్లే నేను హాస్పిటల్‌కి వెళ్లాను. నేను మొదటిసారి గర్భవతి అయ్యాను'అంటూ గట్టిగా అరవడంతో ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ మాటలతో ప్రభావతి మరింత రెచ్చిపోయింది. 'అంత ముందే గర్భవతి అయ్యావా? పెళ్లికి ముందా... పెళ్లి తర్వాతా? నీ కడుపుకు కారణం ఎవరు?' అంటూ నిలదీయగా, రోహిణి భావోద్వేగంగా విరుచుకుపడింది.
'ఇక చాలు... మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే చెబుతాను. వినే ధైర్యం మీకుంటే, తట్టుకునే శక్తి ఉంటే వినండి. ఇక నేను దాచలేను. ఈ రంపపు కోత భరించలేకపోతున్నాను'అంటూ తన మనోవేదనను బయటపెట్టింది. 'నాకు ఇంతకుముందే ప్రెగ్నెన్సీ వచ్చింది... అది మనోజ్‌తో పెళ్లి అయిన తర్వాతే. మనోజ్ వల్లనే నేను గర్భం దాల్చాను' అని చెప్పడంతో, మనోజ్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. దీనిపై మనోజ్, 'నాకే తెలియకుండా ఎప్పుడు జరిగింది? నువ్వు ఎప్పుడు కన్ఫ్యూమ్ అయ్యావు?' అని ప్రశ్నించగా, కొన్ని నెలల క్రితమే తాను గర్భవతినయ్యానని రోహిణి చెప్పింది. అయితే ఇక్కడే మరో మలుపు. 'అయితే ఈ విషయం ఎందుకు దాచావు?' అని ప్రభావతి నిలదీయగా, రోహిణి తన నాటకాన్ని మరింత భావోద్వేగంగా మలిచింది.
'ఆ బిడ్డ కడుపులోనే చనిపోయింది'అంటూ మరో షాకింగ్ కథ అల్లింది. ఈ మాటలతో కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. మనోజ్ కూడా,'అబార్షన్ అయిందా? అయితే నాకెందుకు చెప్పలేదు?' అంటూ ప్రశ్నించాడు. దీనికి రోహిణి చెప్పిన కథ మరింత నమ్మకంగా మారింది.'హాస్పిటల్‌కి వెళ్లి కన్ఫామ్ చేసుకుని, స్వీట్స్ తీసుకుని వచ్చి అందరికీ చెప్పాలని అనుకున్నాను. కానీ ఒక్కరోజు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో హాస్పిటల్‌కి వెళ్లాను. నాకు తెలియకుండానే అబార్షన్ అయింది' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాదు, 'ఆ సమయంలో మా నాన్నగారు జైల్లో పడ్డారు. దెబ్బ మీద దెబ్బ పడింది. ఈ విషయాన్ని మీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక నాలోనే కుమిలిపోయాను'అంటూ ఎమోషనల్ డ్రామా చేసింది.
'నేను ఏ తప్పూ చేయలేదు. మనోజ్ తప్ప నాకు ఇంకెవరూ తెలియరు' అంటూ ప్రభావతి మీద పడి ఏడవడంతో, ప్రభావతి కూడా కొంత కరిగినట్టు కనిపించింది. ఇదే సమయంలో అసలు ఈ విషయం ఎవరి వల్ల బయటపడిందన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. మాట ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ చివరకు మీనా వద్దకు చేరింది. దీంతో మీనా అందరి ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ప్రభావతి మీనాపై తీవ్రంగా విరుచుకుపడింది. 'ఇలాంటి నిందలు వేయడంలో నువ్వే ముందుంటావు' అంటూ దూషించింది. ఒక దశలో చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. ఇదే అవకాశంగా భావించిన రోహిణి, మీనాపై మరింత విషం చిమ్మింది.
'నువ్వు ఇంతకీ మనిషివేనా? నా మీద ఎందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నావు?' అంటూ ముసలి కన్నీరు కార్చడంతో, ప్రభావతి కూడా మీనాను ఇష్టం వచ్చినట్లు తిడింది. ఇలా అందరి ముందు మీనా తప్పు చేసిన వ్యక్తిలా నిలబడిపోయింది.
అప్కమింగ్ ఎపిసోడ్‌లో: వంటగదిలో ఒంటరిగా బాధపడుతున్న మీనా, 'నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నన్ను ఇలా నిందిస్తున్నారు?'అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు బాలు మీనాకు అండగా నిలుస్తాడు. 'రోహిణి పెద్ద కీలాడి అని నాకు తెలుసు. ఆమె చెప్పిన ప్రతి మాటను గమనించాను. ఏదో ఒక రోజు అసలు భాగవతాన్ని బయటపెడతా. అప్పటివరకు నువ్వు భయపడకు. ఇక నుంచి రోహిణి ప్రతి అడుగును నేను గమనిస్తా' అంటూ బాలు చెప్పడంతో, కథ మరింత ఆసక్తికరంగా మారనుంది. రోహిణి చెప్పిన కథ నిజమా? లేక కన్నీళ్ల వెనుక మరో పెద్ద కుట్ర దాగుందా? మీనా తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటుంది? అన్న ఉత్కంఠతో రాబోయే ఎపిసోడ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











